Thursday, 29 September 2022

అందమైన పేరు రాయించిన మాస్టారు మాతో ఉండిపోరు

 





ఆ ఏడాది వేసవి సెలవులు ముగిసాయి, బళ్ళు తెరుచుకున్నాయి. పిల్లకాయలు అందరం ఎండల్లో ఆటలాడి నల్లటి తాటికాయల్లా బడికి వచ్చాం.

హెడ్ మాస్టారు: ఒరేయ్ పిల్లలు రేపు మన బడికి కొత్త మాస్టారు వస్తున్నారు, మీకు ఈ ఏడాదికి కొత్త పుస్తకాలు ఇస్తాం, ఈరోజు రాని వాళ్ళకి అందరూ ఈ విషయం చెప్పండి సరేనా.

పిల్లలు అందరికీ కొత్త పుస్తకాలు అంటే భలే ఇష్టం కొత్త పుస్తకాలు తీసుకున్నప్పుడు అందులో వచ్చే వాసన ఉంది గమనించారా,ఆ వాసన ఆశ్వాదించడం అందులో ఉన్న బొమ్మలు చూడటం భలే మజా కదా,ఎలా మరచిపోగలం అంటారు కదా మీరు కూడా. 

తరువాత రోజు బడిలో అందరూ పూర్తి హాజరు. కొత్త మాస్టారుని చూసాం , యువకుడు ఆ మనిషి ఎత్తు కాదు, పొట్టి కాదు. చామన ఛాయ రంగులో ఉన్న గుండ్రటి ప్రశాంతమైన ముఖం. ఆయన పరిచయ కార్యక్రమాలు అయ్యాయి. పిల్లలు అందరికీ కొత్త పుస్తకాలు అతిథులైన గ్రామ పెద్దలు చేతులు మీదుగా అందిస్తున్నారు.

ఒక్కొక్కరు సంతకం చేసి పుస్తకాలు తీసుకోవాలి. నా పేరు పిలిచారు ,నా సంతకం చూసి అక్కడ ఉన్న ఒక మాష్టారు బిగ్గరగా నవ్వారు, అది చూసి పక్కన ఉన్నాయాన అలాగే నవ్వారు. కొత్త మాస్టారు నా సంతకం చూసారు "చకరవరతి" . నవ్విన మాష్టారు లను ఉద్దేశించి "ఎందుకండీ నవ్వుతారు పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళది కాదండి వాళ్లకు నేర్పిన మనది" అని అన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు అందుకొని "మాష్టారు ఈ పిల్లాడి సంగతి మీకు తెలియదు . ఓసారి స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తే ఆయన రూపాయికి ఎన్ని పావలాలు అంటే 5 అని చెప్పాడు, స్కూల్ ఇన్స్పెక్టర్ ఏంటయ్యా పిల్లలకు మీరు నేర్పుతుంది ఇదేనా అని నాలుగు చివాట్లు పెట్టారు, ఈ పిల్లాడి లాంటోళ్ళు మరో నలుగురు ఉన్నారు, చూస్తారుగా ముందు ముందు మీకే తెలుస్తుంది".

మా పరిస్థితి చూసిన ఆ కొత్త మాస్టారు కళ్ళలో మాపైన జాలి కనిపించింది. మా 3వ తరగతికి కొత్త మాష్టారే తరగతి ఉపాధ్యాయులు అని మా హెడ్ మాస్టారు ప్రకటించారు. ఆయన ఒక 15 రోజులు ట్రైనింగ్ తరువాత తరగతులకు వస్తారు అని చెప్పారు.

15 రోజులు గడిచాయి. నేను ఇంకో నలుగురు మిత్రులు స్కూలు ఆవరణలో పాఠం చెప్పకపోవడం వలన ఒంగుని ఉన్నాము. గంట మోగింది. కొత్త మాస్టారు వచ్చారు, ఇంగ్లీష్ మాష్టారు వెళుతూ రేపు గాని పాఠం అప్పజెప్పలేదో వీపు విమానం మోతే అని వీపు మీద ఒక దెబ్బ వేసి లోపలికి వెళ్ళమన్నారు.

కొత్త మాస్టారు మా వైపు చూస్తూ తరగతిలో ప్రవేశించారు. ఏం చెప్తారో అని అందరం ఎదురు చూస్తున్నాం.పిల్లలు నేను మీకు తెలుగు టీచర్ గా వచ్చాను. మాస్టారు క్షణంలో గొంతు సవరించి అయిన గూర్చి పరిచయం ఒక పాట రూపంలో శ్రావ్యంగా పాడారు. ఆ కమ్మని గానంతో సరికొత్తగా లోకంలో వెళ్ళినట్లు అందరం తన్మయులైపోయాం. తరువాత ఆయన "నాకు మీతో ఎన్నో కథలు,పాటలు,ఆటలు పద్యాలు పంచుకోవాలని ఉంది". ముందుగా మీ ఒక్కొక్కరి పేరు,మీకు ఏమి ఇష్టమో ,మీ తల్లిదండ్రులు ఏమి చేస్తారో చెప్పండి.

అందరి పేర్లు చెబుతున్నారు శ్రీనివాస్ - నాన్న వ్యవసాయం, కిరణ్ - అమ్మ నాన్న చేనేత పని, గోపాల్ - కుమ్మరి .. ఇలా చివరికి నా పక్కన ఉన్న రతన్ వంతు వచ్చింది , పేరు రతన్ మా నాన్న అంటూ ఉండగా ఎవరో ఒకరు వెనుకనుండి "చెత్తోలబ్బాయి" అని అరిచారు. అంతే అందరూ గొల్లున నవ్వారు. వెంటనే మాష్టారు అందుకొని "పిల్లలు ఒక్కసారి ఇలా చూడండి. ఇది మన మానవ దేహం ఇందులో మనకు అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమే.ప్రతి ఒక్కరూ తమ తమ పనులు చేస్తేనే మనం అందరం హాయిగా ఉండగలం. ఈరోజు రతన్ వాళ్ళ నాన్న ఉండటం వలనే కదా చూడండి మన ఇళ్ళు, వీధులు శుభ్రంగా ఉన్నాయి. వాస్తవానికి మనమే వాళ్ళ కుటుంబానికి మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి".ఆ మొదటి రోజు తరగతి కొత్త మార్పు కు నాంది పలుకుతుంది అని మాకు తెలియదు.

మా తండ్రులు వివిధ వృత్తుల్లో ఉన్నారు అని చెప్పాం కదా. మా కొత్త మాష్టారు నెలకు ఒక శనివారం వివిధ రకాల వృత్తులు చేసే వారి దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ వృత్తి నిపుణులతో కలిసి మాట్లాడుతూ మాకు వివరంగా ఆ పని గూర్చి చెప్పేవారు. నాకు ఇప్పటికీ గుర్తు మేము ముందుగా ఒక కుమ్మరి దగ్గరకు వెళ్ళాం. ఆ రోజు మాష్టారు కుమ్మరి చక్రాన్ని చూపుతూ చక్రం ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకొని వచ్చింది అని దాని చరిత్ర వివరంగా చెప్పారు.మమ్మల్ని మన చుట్టూ ఏమేమి చక్రాలు ఉన్నాయో గమనించమన్నారు. నాకు ఆ రోజు ఎక్కడ చూసినా చక్రాలే కనిపించాయి. మా మట్టి రోడ్డు పైన ఎడ్లు లాగే టైరు బండి చక్రం, సెంటర్ లో చెరుకు బండి దగ్గర గిరగిరా తిరుగుతూ రసం తీసే చక్రం.ఇంటికొచ్చే దారిలో బావిలో చాంతాడు వేసి చక్రం మీదుగా తోడుతున్నారు. మా పెదనాన్న వాళ్ళ ఇంటి టేపురికార్డ్ లో గిర్రున తిరుగుతున్న క్యాసెట్ చక్రం. రాత్రి మా బామ్మ ఒరేయ్ హారతి తీసుకుని ప్రసాదం తీసుకుందువు రా అని పిలిస్తే దేవుడు పటంలో విష్ణు మూర్తి చేతిలో చక్రం. ఎక్కడ చూసినా చక్రాలే..చక్రాలు..

మాస్టారు చెప్పినట్లు గా చక్రాలు చక్రం తిప్పేసాయిరో అని ఫ్రెండ్స్ అందరం మేము చూసిన చక్రాలు ముచ్చట్లు చెప్పుకున్నాం.ఇలా మా మాష్టారు అన్ని వృత్తులను మాకు పరిచయం చేస్తూ పరిసరాలను ఒక నిశితమైన దృష్టి తో చూడటం నేర్పారు.మరో వైపు మా తల్లిదండ్రులకు కూడా మరింత దగ్గరయ్యారు.

పిల్లలు రేపు "అందమైన నా పేరు" పోటీ, దీని కోసం మీరు మన స్కూల్ ఆవరణలో మీ పేరుని ఏదైనా ఒక మంచి అలంకారం లో చూపించాలి. బాగా చూపించినవారికి మంచి బహుమతి. మరుసటి రోజు పిల్లలం అందరం రకరకాలుగా మా పేరులను డిజైన్ చేయడానికి సిద్దం అయ్యాం. నేను కూడా వివిధ రకాలుగా ముందుగా చింత గింజలతో, రంగు రంగుల కోక్ సీసా మూతలతో,మా చెరువులో దొరికిన గవ్వలతో ఇలా సాధన చేసి మరి వెళ్ళాను. ముందుగా పాల్గొనే విద్యార్థులు HM ముందు తమ సంతకం చేసి వెళ్ళాలి. ఆడపిల్లలు వివిధ రకాల పూలతో , ఆకులతో తమ పేర్లను రాసారు. నేను ముందే బాగా సాధన చేసి ఉండటం వలన గవ్వలతో క్షణాల్లో నా పేరు అందంగా ముత్యాలు లా పేర్చాను. అన్ని పేర్లను పరిశీలిస్తూ వచ్చిన మా హెడ్ మాస్టారు నా పేరు దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి అద్భుతః అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే తరగతి గదిలో ఉన్న 25 మంది అందరం మా పేర్లను చక్కగా రాశాము. 6 నెలలు క్రితం మా సంతకాలు సరిగ్గా చేయలేకపోయిన మేమేనా ఇలా అందంగా చేసింది అని మా టీచర్లు ఆశ్చర్యపోయారు. 

నేను మా నలుగురు మిత్రులు పాఠాలు చెప్పకుండా, ప్రతి రోజూ దెబ్బలు తినడం లేదా ఆవరణలో ఒంగోవడం. ఇది గమనించిన కొత్త మాష్టారు మేము ఎక్కువగా బట్టి పట్టి చదువుతున్నాం అని గమనించారు. దీని కోసం ఆయన బడిలో కథలు పుస్తకాలతో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అన్నారు, దానికి HM నిధులు లేవంటే ఆయనే తన సొంత ఖర్చులతో రంగు రంగుల బొమ్మలు ఉన్న కథలు పుస్తకాలు తెచ్చారు. అయిన చదువుతూ, బొమ్మలు చూపిస్తూ కథ చెబుతుంటే మేము ఒక లోకంలోకి టైం మిషన్ లో వెళ్ళేవాళ్ళం. మేము కూడా ఆ బొమ్మలు చూస్తూ అక్షరాలు కూడ పలుకుతూ చదవడం నెమ్మదిగా మొదలు పెట్టి అర్థం చేసుకుంటూ ఆ కథలను ఒకరికి ఒకరు చెప్పుకొని ఆశ్వాదిస్తుంటే మా కొత్త మాష్టారు "చూసారా మీరు కథలు ఇష్టంతో అర్థం చేసుకుని చదవడం వలన ఒకసారి చదివిన చక్కగా చెప్పగలుగుతున్నారు" పాఠాలు కూడా ఇంతే అర్థం చేసుకుని ఇష్టంతో చదవండి".కొన్ని రోజులకు మాలో ఎంతో మార్పు వచ్చింది అప్పటి నుంచి బట్టి పట్టడం మాని మంచి ఫలితాలు చూపించాం.

అందరం మంచి దారిలో పడ్డాం . చదువంటే ఆటలు పాటలు లాగా నేర్చుకోవడం అయ్యింది మాకు, ఒకప్పుడు ఆదివారం కోసం ఎదురు చూసే మేము. సోమవారం కోసం ఎదురు చూడసాగం. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. చదువుల్లో ఎన్నో మంచి ఫలితాలతో ఆ మాష్టారు వలన మా బడిలో పిల్లలు సంఖ్య రెట్టింపుగా అయ్యింది. మాస్టారు లో మరింత ఉత్సాహం పెరిగింది. కానీ అనుకోకుండా ఒక చేదు వార్త తెలిసింది. అయినకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని ,దసరా సెలవులకు ముందు రోజు బడిలో వీడ్కోలు సభ అని మా పిల్లలం ఆలస్యంగా తెలుసుకున్నాం. చివరి రోజు చిన్న సన్మానం ఏర్పాటు చేసారు, ఊరంతా ఉద్వేగంతో కదిలి వచ్చింది. పిల్లలం అందరం కళ్ల వెంట నీటి బిందువులను ధరించాం. మా అందరిలో ఒకటే దిగులు వీనుల విందైన ఆ పాటలు వినే గొంతు ఇక తరగతిలో వినబడదని, భుజం తట్టి నువ్వు ఏదైనా చేయగలవు అని ధైర్యాన్ని ఇచ్చే చేయి ఇక తోడు ఉండదని, అన్నీటి కంటే ముఖ్యంగా చల్లని చిరునవ్వుతో తరగతిలో ఒక మంచి వాతావరణం సృష్టించే చిరునవ్వులు ఇక కనుమరుగు కానున్నాయి అని.

సన్మాన సభలో మా మాష్టారు మాట్లాడటానికి లేచారు. అంతకుముందు ఎంతో హుషారుగా ఉండే మాష్టారు ఈ రోజు ఎంతో భారంగా కనిపించారు. పిల్లలు అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మాష్టారు ఏం చెబుతారో అని ..కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీరు తుడుచుకోవడానికి మాష్టారు కళ్ళజోడు తీసారు. చాలా భారంగా రెండే మాటలు "ఈ ఊరు నాకు కన్న తల్లి లాగా మరు జన్మనిచ్చింది,కుసుమాలు లాంటి ఈ చిన్నారుల అల్లరి మాటలు, చెదిరిపోని చిరునవ్వులు గుండెల నిండా ఎన్నో అనుభవాలు నింపుకున్నాను. అడుగు కదపలేని ఈ భారంతో వీడ్కోలు చెప్పలేక మాటలు రావడం లేదు" అని ముగించారు. ఊరి ప్రజలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి సన్మానం చేశారు. ఊరంతా ఏరులా అందరం బస్టాప్ దాకా మాష్టారు తో వెళ్ళాం.పిల్లలు అందరూ మాష్టారు చేయి పట్టుకొని మాతో ఉండిపోరూ మాష్టారు అని. దూరం నుంచి బస్ హార్న్ వినబడింది. మాష్టారు బ్యాగు భుజాన వేసుకున్నారు. మా గుండెల్లో ఉప్పెన చెలరేగింది. కన్నీళ్ళు వరదలా ముంచెత్తాయి. మాష్టారుని చూద్దాం అంటే కంటి నిండా కన్నీటి కాలువలు , రెండు చేతులతో తుడుచుకున్నా ఉబికి ఉబికి తన్నుకు వస్తున్నాయి.మరో వైపు బస్సు వచ్చింది . డ్రైవర్ అందరిని చూసి "ఇంత మంది ఎక్కడానికి మా బస్సు సరిపోదయ్యో"..హెడ్మాస్టర్ "ఎక్కేది ఒకరే ఆయనను పంపడానికి ఊరంతా వచ్చారు".

మాష్టారు భారంగా బస్సు ఎక్కారు. జీవితానికి సరికొత్త దారి చూపిన ఆ చేయి కిటికిలోనుండి ఊపుతుంటే మా కన్నీటి పొరల మధ్య మసక మసకగా కనిపిస్తూ చెట్ల చాటుగా మాయమయ్యింది.


- శ్రీనివాస చక్రవర్తి.

Saturday, 13 March 2021

ఆంధ్రుల తొలి దైవం శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు సందర్శన

 ఒక ప్రదేశానికి చేరుకొని ఆ దృశ్యాలను కనుల నిండా మనసు నిండా నింపుకోవడం ఒక ఎత్తైతే ఆ ప్రదేశానికి చేరుకోవడానికి జరిగే ప్రయాణాన్ని ఆశ్వాదించడం మరో ఎత్తు.. సరిగ్గా మా ప్రయాణం అడుగు అడుగున అధ్బుతంగా సాగింది.


శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఈయన గూర్చి మా అన్నయ్య "ఆంధ్రుల తొలి దైవం" అని చెప్పినప్పుడు జీవితంలో ఓసారైనా సందర్శించాలని 4 సంవత్సరాల క్రిందట అనుకున్నది నేటికి కార్యరూపం దాల్చింది.


ఉదయాన్నే మంగళగిరి నుంచి మా ప్రయాణం మొదలు అయ్యింది. కొల్లూరు నుంచి కృష్ణా ఏరు మధ్యగా నేరుగా శ్రీకాకుళం చేరవచ్చని మా మామయ్య చెప్పారు. కొల్లూరు నుంచి గాజులలంక వైపు మా బండ్లను పరుగులు తీయిచాం, కృష్ణా నది ఒడ్డున ఉన్న  లంక గ్రామాల గుండా మా ప్రయాణం సాగుతోంది. వరదలు వచ్చినప్పుడు  ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారబ్బా, వారి తిండి,బట్ట ,పెంపుడు జంతువుల పరిస్థితుల ఏంటో ఈ ప్రశ్న మనసులో పుట్టింది, ఈ ప్రశ్నను బండి వెనుక ఉన్న శ్రీమతిని అడిగాను. "వరద వచ్చినప్పుడు అందరూ లంకల నుంచి బయిటకు వస్తారు, ఈ విపత్తులను తట్టుకోవడం కష్టమే అంది". ఈలోపుగా బండ్లు ఏటి ఒడ్డున ఆగాయి.కృష్ణా జిల్లా చేరడానికి మార్గం ఎటువైపా అని చేస్తున్నాం.





మమ్మల్ని గమనించిన  ఒక ఆమె "ఇక్కడ నుంచి దారి లేదు, కొంచెం వెనక్కు పోయి కుడి వైపుకు తిరగండి" అంది  తన పాపకు జడ వేస్తూ. ఆమె చెప్పిన ప్రకారం మొత్తానికి నదిలో గుండా కృష్ణా జిల్లా పోయే మార్గం కనిపించగానే మనసు నిండా ఆనందం వేసింది. ఫిబ్రవరి కావడం వలన ఏట్లో నీరు పూర్తిగా ఇంకిపోయింది,  అక్కడ అక్కడ నీటి చలమలు కనిపిస్తున్నాయి. ఏటి మధ్యలో గుండా తాత్కాలిక రహదారి వేశారు, చుట్టు ఇసుక తిన్నెలు ఎండకు వెండి కుప్పలు లా కనిపిస్తున్నాయి.ఏటి మధ్యలో ప్రయాణం భలే అనిపించింది. 10 నిమిషాల్లో ఆవలి తీరానికి శ్రీకాకుళం చేరుకున్నాం. గుడివైపు దారి అడుగుతూ దేవాలయ ప్రాంగణం చేరుకొన్నం.


---------

"గుడి దగ్గర జనం ఎవరు కనిపించడంలేదు , ప్రస్తుతం మూసివేసారేమో బావ" కోటేశ్వర రావు (శ్రీమతి తమ్ముడు) అన్నాడు. అరే స్వామిని దర్శించాలని చాలా ఆతృతగా వచ్చామే, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకున్నా.. గుడి పక్కన ఓ కారు పార్క్ చేసి ఉండటం గమనించి గుడి తెరిచే ఉంటుంది అని గుడి వైపు అడుగులు వేశాం.  లోపలికి ప్రవేశించగానే ప్రశాంతమైన వాతావరణం. మనసు నిండా ఆనందం , ఎన్నాళ్లకి స్వామి దగ్గరకు చేరుకున్నాం అని.



ఆలయ కట్టడాన్ని గమనిస్తూ లోనికి ప్రవేశించి ప్రసన్నంగా ఉన్న ఆంధ్రమహా విష్ణువు దర్శించుకున్నాం.  స్వామిని చూస్తూ అలా ఉండిపోయాం. బయటకు వచ్చి ఆలయప్రాంగణంలో కూర్చొని ఆలయ విశేషాలు చెప్పుకొన్నాం. ఇక్కడే శ్రీకృష్ణదేవరాయులు ఆముక్తమాల్యద రచనకి బీజం పడిందని దాని గుర్తుగా ఆముక్తమాల్యద మండపం నిర్మించారు. పక్కన కాసుల పురుషోత్తమ కవి ఈయన ఈ ఆంధ్రనాయకుని పైన ఆంధ్రనాయక శతకం రచించారు అని విశేషాలు చెప్పుకొని వారి స్మారకాలుగా నిర్మించిన విగ్రహాలు చూసాము. ఆలయ గోడలపైన క్రీ.శ 11 నుంచి 15 శతాబ్దకాలాలు నాటి శాసనాలు ఉన్నాయి. ఇలా గమనిస్తూ ఉండగా పక్కన పురాతన కాలం నాటి మండపం కనిపించింది, అది గమనించి అటు వైపు వెళ్ళాము,  అక్కడ కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన శివాలయం ఉంది, ఎంత నిండుగా ఉందో ఆ ఆలయ కట్టడం. ఈ ఆలయంలో దైవం ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి. ఆలయంలాగా శివలింగం కూడా నిండుగా , చూసే కనులకు కనుల పండుగగా ఉంది. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే పాపాలు తొలిగిపోతాయని అంటున్నారు. దర్శనం ముగించుకుని మనసులో కదిలిన భావాలను స్మరించుకుంటూ, శ్రీమతితో చర్చిస్తూ ఇంటికి చేరుకున్నాం.




ఈ శ్రీకాకుళం గ్రామం(కృష్ణా జిల్లా) ప్రతి తెలుగువారు దర్శించాలి. మన మూలాలను తెలుసుకోవాలి . విజయవాడ నుంచి 45 కి.మీ, మచిలీపట్నం నుంచి 35 దూరాన ఉంది.


- శ్రీనివాస చక్రవర్తి.

Thursday, 12 September 2019

ఒక ఊరు - ఒక గణపతి - 20 వసంతాలు

ఒక ఊరు - ఒక గణపతి - 20 వసంతాలు

గణేష్ నవరాత్రులు..
ఈ పేరు  వింటేనే  గుండెల్లో ఎంతో ఆనందం..

సరిగ్గా 20(1998-1999) సంవత్సరాల క్రితం మా ఊరిలో వినాయక చవితి ముందు రోజు అనుకుంటా తొలిసారి గణపతి విగ్రహం తెచ్చారు. పిల్లలం అందరం ఉరుకులు పరుగులు మీద  గుడి అరుగు దగ్గరకు చేరుకున్నాం. వినాయకుడి విగ్రహాన్ని కింద నుంచి పైవరకు ఎంతో వింతగా కొత్తగా చూసాం..

వినాయక చవితి ఉదయాన్నే ముందుగా నల్లమట్టితో  గణపతి బొమ్మని కొని,పిల్లలు ఊర్లో ఉన్న రకరకాల పువ్వులు, ఆకులు నిధుల వేటకు భయలుదేరేవాళ్ళం. ఎర్రటి కాగితం పూలు, పసుపు పచ్చని గన్నేరు పూలు , చెరువు గట్టుకు చేరుకుని తెల్లని కలువపూలు కొన్ని కోసుకొని, వీలైతే ఒక కలువ పువ్వుని ధండలాగా అల్లుకుని మెడలో వేసుకుని ,మామిడి చెట్లకు చేరుకొని మామిడి ఆకులు కోసుకొని, వచ్చే దారిలో గట్టుపైన గరికను తీసుకుని అరే గరిక అంటే వినాయకుడు ఎంత ఇష్టమో తెలుసా అని అనుకునే వాళ్ళం. నేనైతే ఆయనకు అన్నీటికన్నా కుడుములు అంటే ఎంతో ఇష్టం అనే వాడిని ( మా లాగు మిత్రులు అందరూ నన్ను నీకూ అంతేగా అనేవారు). ఇలా మాటలు చెప్పుకుంటూ రకరకాల పువ్వులు ఆకులు గోతాములో వేసుకుని ఇంటికి చేరుకునే వాళ్ళం.

ఇంట్లో వినాయకుడిని పూజకి సిద్ధం చేసి సంచిలోంచి కొన్ని పుస్తకాలు తీసి, పసుపు కుంకుమ రాసి " శుక్లాంబరధరం " చదివేసి , అమ్మ చేసిన కుడుములు , పాయీసం స్వామికి సమర్పించి‌‌.. తర్వాత మనంకూడా లాగించేసి‌‌. లాగు రెండు జేబుల్లో రెండేసి కుడుములు పెట్టుకుని , పక్కింటి వెళ్లి వాళ్ళకి టీవీ ఉంటే అక్కడి అరుగు మీద కూర్చుని ఒక చేత్తో కొబ్బరి మరో చేత్తో కుడుములు రెండింటినీ కలిపి ఆశ్వాదిస్తూ టీవీలో వేసే వినాయకుడు సినిమా చూస్తుంటే భలే ఉండేది.

సాయింత్రం చీకటి మసకలు కమ్ముకోగానే గుడి దగ్గరకు బయలుదేరుతుంటే అమ్మ " ఈ రోజు చందమామను చూడొదయ్య". అని చెప్పేది. పిల్లలం అందరం గుడి వద్ద గుమ్ముగూడేవాళ్ళం.  ముఖ్యంగా పెద్దవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఒకచోట చేరి ఆత్మీయంగా వరసలతో(అన్నయ్య, బావ) పిలుచుకుంటుంటే అది చూసే పిల్లలమైన మాకు మనది అందరిదీ ఒక ఊరే కాదు, మనది అందరిదీ ఒకటే కుటుంబం , మనస్సులో మనమంతా అన్నదమ్ములం అని కలిగే భావన భలే ఉండేది. ఆ భావం అందరి మనస్సులను ఒక్కటిగా చేసేది.

ఒక వైపు పెద్దలు అందరూ పోటాపోటీగా భజన పాటలు అందుకునేవారు. పిల్లలం అందరం కొంచెం సేపు భజన చేసి తరువాత అందరం కలిసి గుడికి అలంకరించిన రంగు రంగు దీపాల వెలుగులో దొంగా పోలీస్ అటలు ఆడుతూ ఉంటే, ఆ రెండు గంటల సమయం రెండు నిమిషాలులా గడిచేలోపు హారతి పాట మాకు హారన్ లా వినిపించే సరికి ప్రసాదాలు పెట్టే సమయం అయ్యింది అని, లేగదూడలలా అందరం గుడి ఆవరణలోకి ఒక ఉదుటున చేరుకునేవాళ్లం. చలిమిడి, కుడుములు, వడపప్పు, శనగలు రకరకాల ప్రసాదాలు కడుపారా ఆరగించి కాగితాలలో లేదా కొబ్బరి చిప్పలలో కొంత ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళం..

11 రోజులు గడిచిన తరువాత అసలు ఘట్టం వినాయకుడి నిమజ్జనం. ఎడ్లబండి పైన కొబ్బరి మట్టలతో చిన్న పందిరిలా అల్లి వినాయకుడుని పూల దండలతో అలంకరించి , పెట్రోమాక్స్ బల్బుల వెలుగులలో భజనతో ఊరేగింపు మొదలు అయ్యేది, ఇంటింటికి దేవుడిరాక.ఒక వైపు ప్రతి ఇంటి ముందు హారతి తీసుకుని గణపతి ఆశిస్సులు అందిస్తు ఉంటే,  మరోవైపు డప్పు కళాకారులు చేసే వైవిద్యమైన   ప్రదర్శనకు అందరం ఆడిపాడుతూ ఊరంతా ఉత్సవమై ఉత్సాహంగా ప్రదర్శన ముందుకు సాగుతుంది. ఉదయం అయ్యేసరికి ఊరేగింపు పూర్తి చేసుకుని తిరిగి గుడి దగ్గరకు గణపతి చేరుకునేవాడు..
సాయంత్రం అందరం కలిసి ట్రాక్టర్ లలో నిమజ్జనానికి పెనుమూడి కిష్ట(కృష్ణా) దగ్గరకు చేరుకుంటాం.. "ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి" అని మైకులో చెప్పేవాళ్ళు. కొంతసేపటికి "జైబోలో గణేష్ మహరాజ్ కి" అంటూ గణపయ్యను గుడి నుంచి తన తల్లి (గంగమ్మ) ఒడిలోకి చేర్చుతారు.. అందరూ కృష్ణమ్మకు నమస్కరించి స్నానాలు చేసాక,మైకులో నుంచి "ట్రాక్టర్ బయలుదేరుతుంది. అందరూ ఒడ్డుకు రావాలి".
ఎంతో ఉత్సాహంతో బయిలుదేరిన ట్రాక్టర్లు నిశబ్దంగా తిరిగి ఇంటికి చేరతాయి.
తర్వాత రోజు మా బడి పక్కన ఉన్న గుడిని చూసినప్పుడు చాలా బాధ వేసేది. గణపతి లేడు , ఊర్లో సందడి లేదు అని. ఇక మరలా 365 రోజులు లెక్కించే వాళ్ళం.

ఈ రోజుకు కూడా మేము ఆనందించే విషయం మా ఊర్లో ఏంటంటే . 20 సంవత్సరాలు అయ్యింది గణపతి మా ఊరులో అడుగు పెట్టి.
ఇప్పటికీ ఒకటే ఊరు - ఒకటే గణపతి .

ఇలా నవరాత్రులు పెద్దలకు, పిల్లలకు పండుగ తీసుకొని వచ్చేది, ఐక్యమత్యం విల్లివిరిసేది.

-శ్రీనివాస చక్రవర్తి
12/09/2019

Sunday, 11 August 2019

పుస్తక ప్రపంచంలోకి నా తొలి అడుగులు.


నాకు చిన్నప్పుడు ప్రతి చిన్నారి లాగే కథలు , కొత్త కొత్త వింతలు విషయాలు తెలుసుకోవాలని భలే తపన ఉండేది.ఇవన్నీ గ్రంథాలయంలో దొరుకుతాయని మా అన్న వాళ్లు చెప్పేవారు.

నాకు ఇప్పటికీ బాగా గుర్తు నేను  మొదటిసారి మా నిజాంపట్నం గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల కథల పుస్తకాలను చూసినప్పుడు ఎంతో ఆనందం వేసిందో తిరునాళ్ళలో ఆట బొమ్మలను చూసిన పిల్లాడి వలె ఆనందం గుండెల్లో రెండు కళ్ళల్లో నిండిపోయింది.  రకరకాల కథలు పుస్తకాలు ముందుగా బొమ్మలు అన్నీ తిరగేసాను,ముఖ్యంగా చందమామ కథల పుస్తకం అందులోని విక్రమార్కుడు బేతాళుడు బొమ్మ నన్ను అమితంగా ఆకట్టుకుంది.

రోజూ మా స్కూల్ కి సైకిల్ పైన వెళ్తూ ఈ లైబ్రరీ వైపు చూస్తూ వెళ్ళే వాడిని, కిటికీలోంచి లైబ్రరేరియన్ ను చూసిన ప్రతిసారి ఇలా అనుకునే వాడిని
"ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే  ఈ లైబ్రేరియన్ నే కదా అని..
ఆయన చుట్టూ ఎన్నో పుస్తకాలు ఎన్నో కథలు ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎంత చక్కగా చదువుకోవచ్చు.."

నా పఠనాభిలాషను గ్రంథాలయం బాగా పెంచింది. చందమామ కథలు, తెనాలి రామలింగ, అక్బర్ బీర్బల్, మర్యాద రామన్న  ,ఈనాడు హాయ్ బుజ్జి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి రెక్కలు కట్టుకుని నేను వెళ్ళినట్లు నాకు అనిపించేది.

ఇలా చదవడం మొదలు పెట్టగానే నేను బట్టీపట్టి చదవడం ఆపేసాను. అప్పటి నుంచి అర్థం చేసుకుని చదవడం మొదలుపెట్టాను.నా జీవితంలో ఇది నిజంగా తొలిమెట్టు చదువులో,ఏకాగ్రత లో ఎంతో మార్పు వచ్చింది.

నేను పదో తరగతి పాస్ అవ్వగానే మా నాన్న నాకు నగరం లైబ్రరీ లో చేరడానికి సభ్యత్వం ఇప్పించారు, అప్పుడు ఎంత ఆనందం వేసిందో అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ వేసవి సెలవల్లో రోజు సైకిల్ పైన వెళ్లడం పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని చదువుకోవడం.

అప్పటి నుంచి మొదలైన పఠనాభిలాష నేటికీ కొనసాగుతూనే ఉంది రోజూ కనీసం ఒక పేజీ ఐనా చదవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికీ పుస్తకాన్ని నా చేతిలో తీసుకున్న ప్రతిసారి ఒక చిన్ని పసిపాపను చేతిలోకి తీసుకున్నట్లు అనిపిస్తుంది.

నాకు నచ్చిన పుస్తకాలను మిత్రులందరితో పంచుకుంటూ ఉంటాను. వారు చదివిన పుస్తకాలు కూడా తెలుసుకుని  చదువుతూ ఉంటాను, మీకు నచ్చిన పుస్తకాల పేర్లు కూడా నాతో పంచుకుంటారు కదా.

ఈ ఏడాది మా మిత్రులంతా కలిసి శనివారం పూట హైదరాబాద్ గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు కథల పట్ల పుస్తకాల పట్ల ఆసక్తి కలిగించడానికి కొన్ని కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాం. మీకు కథల పట్ల, పుస్తకాల పట్ల ఆసక్తి ఉంటే మాతో జట్టు కట్టవచ్చు, చిన్నారుల చదువుల ప్రయాణంలో భాగస్వామ్యం కావచ్చు.

 శ్రీనివాస చక్రవర్తి
11/08/2019



Saturday, 10 August 2019

కాకతీయుల కాలంలోకీ -My Journey to Warangal




ప్రయాణం అంటే ప్రతి గుండెలో ఏదో తెలియని ఆరాటం ఉదయిస్తుంది.  ఈ ప్రయాణాల్లో విహార యాత్రలది ప్రత్యేక స్థానం,మన మనస్సులు పసిపాపల లాగా తెలుసుకోవాలనే తపనతో నిండిపోతాయి. ఒక కొత్త ప్రదేశంలోకి వెళుతున్నామంటే మనసు అంతా శూన్యంగా చాలా తేలికగా అనిపిస్తుంది బహుశా ఎన్నో జ్ఞాపకాలను మదిలో కాదు జీవన ప్రమాణంలో నింపుకోవడానికి ఏమో..

- చిన్నప్పుడు కాకతీయ సామ్రాజ్య వైభవం గూర్చి పాఠాల్లో విన్నప్పుడు అక్కడ ఊహల్లో సంచరించాం.. నేను MCA కి వచ్చిన తరువాత వరంగల్ వెళ్ళాలి చూడాలని తపన ఉండేది, ఆ కోరిక సుమారు 7 సంవత్సరాల తరువాత ఇప్పుడు తీరింది. మా MCA మిత్రుడు ప్రవీణ్ ది వరంగల్ అవ్వడం వల్లన తన సాయంతో ఇప్పుడు వెళ్ళే మంచి అవకాశం రానే వచ్చింది.
******
12/07/2019 -శుక్రవారం
ఉదయాన్నే సికింద్రాబాద్ స్టేషన్ లో వరంగల్లుకు బయలుదేరాం. ఒక 2 గంటల ప్రయాణం మాటలతో సాగింది, ఖాజీపేట స్టేషన్ లో మేము దిగాము, స్టేషన్ బయిట పాతకాలం నాటి అందమైన బొగ్గు రైలు ఇంజను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లు కనిపించింది, కొంచెం సేపు దానిని గమనించాం.రైలు స్టేషన్ బయిట  కాకతీయ కళాతోరణం లాంటి నిర్మాణం ఆహ్వాన ద్వారం లాగా కొత్తగా నిర్మించారు. మేము అక్కడ నుంచి హన్మకొండ బస్టాండుకు బయలుదేరాం,వెళ్ళేదారిలో NIT వరంగల్ కనిపించింది పచ్చని చెట్లతో ఉద్యానవనం లాగా నిండుగా అలరారుతుంది. హన్మకొండ బస్టాండ్ కు చేరుకొని అక్కడ నుంచి పరకాల(మా మిత్రుడు ఇంటికి) వెళ్ళాం. భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకొన్నాము..

సాయింత్రం ప్రవీణ్  అన్నయ్య వాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ వరంగల్ ప్రాంతంలో ఏ ప్రదేశాలు చూడవచ్చో చర్చించాం.

********
సాయింత్రం పూట బయటకు బయలుదేరాము. పరకాలలోని సాయుధ సమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళాం.
మొదటి సారి ఆ ప్రాంతం బయటినుంచి చూడగానే భలే అనిపించింది. స్థూపం గోడలపైన నిర్మించిన సాయుధ ఉద్యమకారులు ఒకరి వెనుక ఒకరు నడుస్తూ జాతీయ జెండా పుచ్చుకొన్న(నిజాం దొరల పాలనకు వ్యతిరేకంగా సామన్య ప్రజలు,రైతులు కూలీలు) విగ్రహాలు ప్రాణంతో కదులుతున్నట్టు అనిపించింది, ప్రతి విగ్రహంలోను ఉద్యమ కాంతులు కనిపిస్తున్నాయి..
స్థూపం పైన ఆనాటి ఉద్యమకారులు ప్రాణత్యాగాలు ప్రతిబింబుస్తూ కల్లకుకట్టినట్టు చెక్కిన విధానం నాటి కాలంలోకి మనల్ని తీసుకొని వెళుతుంది.
ఇది చూసిన తర్వాత నా మనసులో కలిగిన భావం..
"పోరాట యోధులు త్యాగానికి ప్రతీరూపం..
కోటి కాంతుల కొలువైన ఉధ్యమ దీపం..
సాయుధ సమర వీరుల అమర స్థూపం.."

అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక వేడి టీ అందుకొని తాగుతూ నేను, ప్రవీణ్ ఈ ఉద్యమం, స్థూపం గూర్చి మొట్లాడుకొన్నాం.

ప్రయాణం చేసి ఉండటం వలన రాత్రి త్వరగా నిద్రలోకి జారుకొన్నాం.

******
13/07/2019 - శనివారం
ఉదయం నేను, ప్రవీణ్ తన తమ్ముడు ప్రమోద్, ముగ్గురం కలిసి రామప్ప , లక్నవరం చూడటానికి మోటరు సైకిల్ పైన బయలుదేరాం. అంతకు ముందు తేలికపాటి వర్షం పడటం వలన వాతావరణం ఎంతో చల్లగా , ఆహ్లాదంగా ఉంది. మా ప్రయాణం కూడా హాయిగా సాగింది.
ముందుగా గణపురం కోటగుళ్ళు ప్రాంతానికి వెళ్ళాం,ఇది వరంగల్ నుంచి సుమారు 80 కి.మీ , రామప్ప నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కోటగుళ్ళు లోపలికి వెళ్ళగానే అద్భుతమైన ప్రపంచంలోకీ రెక్కలు కట్టుకుని వాలినట్టు అనిపించింది. ముందుగా వరసగా ఉన్న చిన్న ఆలయ సమూహాలను చూసాం ప్రతి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. వీటిని చూసినప్పుడు ఇంత గొప్ప శిల్పకళా సంపద మన తెలుగునాట ఉందా అని ఎంతో ఆనందం వేసింది, మరోవైపు భాద కూడా వేసింది  దాడులకు , ప్రకృతి వైపరీత్యాలకు శిథిలావస్థకు ఈ నిర్మాణం చేరడం చూసి.. పెద్ద పీఠం మీద కేంద్ర స్థానంలో ఉన్న ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించాం.ఎంతో పెద్ద ఆలయం ఇది గోడలమీద సుందరంగా శిల్పాలు చెక్కారు.గుడిలోపల గణపతేశ్వర స్వామి అద్భుతమైన లింగాకారంలో కొలువు తీరి ఉన్నాడు. గుడి తలుపులు వేసి ఉన్నాయి,పూజారి ఉదయమే పూజ చేసి వెళ్ళిన ఆనవాళ్ళు కనిపించాయి వెళుగుతున్న దీపారాధనక చూస్తే. కొంచెం సేపు అక్కడ కూర్చుని ఈ అందమైన ప్రదేశాన్ని ఆశ్వాదించాం.

ఈ గుడిని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు(రుద్రమదేవి తండ్రి) నిర్మించినట్టు చెబుతున్నారు, ఇది రామప్ప గుడి కన్నా ఎంతో పెద్దది మరియు పురాతనమైనది. సందర్శకులు కూడా ఎవరూ పెద్దగా రావడం లేదు చాలా మందికి తెలియదు ఏమో, కానీ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.
దీనికి ప్రభుత్వం చొరవ తీసుకుని మరలా పూర్వ వైభవం కలిగిస్తే బాగుంటుంది. శివరాత్రి ఇక్కడ బాగా చేస్తారు అని ప్రమోద్ చెప్పాడు. ఈ సుందరమైన సందర్శన జ్ఞాపకాన్ని నింపుకుని అక్కడ నుంచి రామప్పకు బయలుదేరాం.
*******
కోటగుళ్ళు నుంచి రామప్ప దేవాలయమునకు వెళ్ళేదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు  యాత్రికులు ఎండలో అలిసిపోకుండా రహదారిపై పచ్చని గొడుగు పట్టినట్టు  అల్లుకొని ఉన్నాయి.
కదిలే మా మోటరు సైకిల్ లాగానే నా మనస్సు కూడా ఎన్నో ఏళ్ళు వేచిన కల కొన్ని క్షణాలలో తీరబోతోంది అని ఎంతో ఆనందంగా ఆరాటంగా వేగం అందుకుంది.

రామప్ప గుడికి కొంత దూరంలో మా బండిని పార్క్ చేసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము, నడక దారికి ఇరువైపులా పచ్చని తివాచీ పరిచినట్లు మొక్కలను పెంచుతున్నారు.రామప్ప దేవాలయము లోకి ప్రవేశించే ముందు దాని చరిత్ర గూర్చి తెలుసుకుందామని బయిట పెట్టిన బోర్డు పైన చదివాము.
"ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రుడు క్రీ.శ1213 నిర్మించాడు.. ఇక్కడ శివుడుని రామలింగేశ్వరడు అంటారు."

విశేషం ఏంటంటే ఈ గుడి దేవుని పేరుతో కాకుండా దానిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా బాగా వ్యాప్తి చెందింది. కాకతీయుల ప్రత్యేక శైలిలో ఎత్తైన పీఠంపై న గుడిని అమర్చినట్టు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ముందుగా ఆలయం ఎదురుగా ఉన్న నందిని సందర్శించాము, ఈ నందిని ఎటువైపు నుంచి చూసిన మనవైపే చూసినట్లు చూస్తుంది. దానిపైన ఎంతో అందంగా ఆభరణాలులను చెక్కారు.
ఆలయంలోకి మూడు వైపుల నుంచి లోనికి ప్రవేశించవచ్చు.. గర్భాలయంలో నున్నటి నల్లరాతితో ఉన్న పెద్ద శివలింగం భక్తుల నుంచి పూజలు అందుకుంటూ ఉంది. గర్భగుడి పైన ఉన్న ఆలయ మహా మండపం పైన ఎంతో సుందరంగా చెక్కిన శిల్పాలు రామాయణ మహాభారత భాగవత కథలను తెలియజేస్తున్నాయి.

ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు చాలా తేలికగా ఉంటాయంట వీటిని నీటిలో వేసిన తేలుతాయని చెబుతారు. ఆలయ స్థంభాలపైన చెక్కిన చిన్నచిన్న శిల్పాల మధ్యలో మనం దారాన్ని  ఒకవైపు నుంచి మరోవైపుకు పంపవచ్చు అంత సూక్ష్మంగా కూడా అందంగా చెక్కబడింది.గుడి గోడలను నలువైపులా నిశితంగా పరిశీలించాము, ప్రతి అణువు అణువు ను అద్భుతంగా మలిచారు.

ఆ తర్వాత  రామప్ప చెరువుకు వెళ్ళాము. ఎంతో విశాలంగా ఉంది ఆ చెరువు, పర్యాటకులకు బోటింగ్ సదుపాయం కూడా ఉంది.. అక్కడ నుంచి లక్నవరం బయలుదేరాము.
**********
రామప్ప దేవాలయం నుండి లక్నవరం సుమారు 34 కిలోమీటర్లు ఉంది..
లక్నవరం సరస్సులో కట్టిన పసుపు మరియు పచ్చ  రంగు వంతెనలు  ప్రత్యేకమైన నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. అందులో అడుగు పెట్టిన ప్రతీ ఒక్కరికీ ఓ కొత్త లోకంలోనికి ప్రవేశించినట్లు వారి కళ్ళలో మెరుపు కనిపిస్తుంది.

సరస్సులో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అని మా మిత్రులు చెప్పారు.‌ అంటే ఆగష్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో అన్నమాట.శనివారం కావడం వలన లక్నవరానికి పర్యాటకులు తాకిడి బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆ వంతెనల పైన నడుస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆశ్వాదిస్తున్నారు కొందరు రకరకాల ఫోజులతో ఫోటోలు దిగుతూ జ్ణాపకాలను కెమెరాలో భందిస్తున్నారు.
సరస్సు మధ్యలో ఏర్పాటు చేసిన హరితా రెస్టారెంట్లో భోజనం చేసాము. తరువాత ఆ వంతెన మధ్య బాగంలోకి వెళ్లి  గగనతల వీక్షణంలాగా సరస్సును గమనించాం.. అక్కడ కొంత సమయం గడిపి తిరిగి ఇంటికి బయలు దేరి వెళ్ళాము.
సాయంత్రం ప్రవీణ్ ఇంటికి చేరేసరికి సుమారు ఐదున్నర అయ్యింది.
******
14/07/2019 - ఆదివారం
ఉదయం ప్రవీణ్ నేను ఇద్దరం సరదాగా పరకాల మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చాం, ఆ మార్కెట్లో దొరికే మిర్చి కన్నా కూరగాయల రేట్లు చాలా ఘాటుగా ఉన్నాయి.
టీఫిన్ ,టీ ముగించుకుని 10 గంటలకు హనుమకొండ చేరుకున్నాం.

వరంగల్, హనుమకొండ రెండు కూడా జంటనగరాలు మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా.. ఈ రెండు నగరాలు చూడ్డానికి బైక్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ప్రవీణ్ తన ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని ఇద్దరం కలిసి  ముందుగా వేయి స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళాం. గుడి ముందు ఏర్పాటు చేసిన బోర్డులపైన కాకతీయుల రాజులు, వారి పరిపాలన , వారి యొక్క శిల్పకళను గురించి వివరంగా ఇచ్చారు .." కాకతీయుల పరిపాలన క్రీస్తుశకం 12, 13 శతాబ్దాల నాటిది. మొదటి రాజధాని హనుమకొండగా అవతరించింది, రుద్రమదేవి దేవి మరియు ఆమె తండ్రి గణపతి దేవుడు పరిపాలన బాగా సాగినట్లు తెలుస్తోంది. వేయి స్తంభాల గుడి 1163 సంవత్సరములో రుద్రదేవుడు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా అంటారు ఇందులో లో శివుడు, విష్ణువు, సూర్యనారాయణులు పూజలు అందుకుంటారు". మేము ఈ వివరాలు బోర్డులు పైన చదివి లోనికి ప్రవేశించాం.


నిజం చెప్పాలంటే ఈ వేయి స్తంభాల గుడిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు వేయి కళ్ళు అయినా కావాలి, ఎంత అందమైన కట్టడం ఇది,నక్షత్రాకార పీఠంపైన నిర్మించి ఉంది. ఇది నిర్మించిన శిల్పుల కళా నైపుణ్యాన్ని మనం గమనిస్తే నిజంగా వీరు స్వర్గ లోకం నుంచి భూమి పైకి వచ్చి ఈ నిర్మాణం చేశారేమో.. భూమిపైన ఒక అద్భుతమైన కళాఖండాన్ని మలిచారు..  గుడిలో ప్రతి అణువు అణువులో ఒక ప్రత్యేకమైన సుందరమైన కళా నైపుణ్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గుడికి ఎదురుగా ఠీవీగా ఉన్న మహానంది ప్రత్యేకమైన ఆకర్షణ. వచ్చిన పర్యాటకులు అందరూ కూడా ఆ మహానంది తో ఫోటో దిగడానికి ఎగబడుతున్నారు. గుడి పక్కన ఉన్న ఆనాటి కోనేటిని నీటితో మనం చూడవచ్చు. మరో పక్కన ఉన్న విశాలమైన రావిచెట్టు నీడలో పర్యాటకులు కూర్చుని సేద తీరుతున్నారు.
పురాతన కాలం నాటిది అవడంవల్ల ఇక్కడ కూలిపోయిన స్తంభాలకు పునర్నిర్మాణం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అక్కడ నుంచి మా ప్రయాణం వరంగల్ ఖిల్లా వైపు సాగింది.
*******
హనుమకొండ నుంచి సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ వరంగల్ ఖిల్లా ఉంది.వరంగల్ కోటలోకి మనం ప్రవేశించేటప్పుడు అప్పటి  కాకతీయ రక్షణ వలయాన్ని మనం గమనించవచ్చు.
నాలుగు అంచెలలో మట్టి కోట, జలాశయాలు, ముళ్ళ కంచె, రాతి కోట ఇలా అంచెలు అంచెలుగా రక్షణ వలయాన్ని పటిష్టంగా ఏర్పాటు చేశారు,ఈ కోటకు వెళ్ళే దారిలో మనం ఆనవాళ్లను ఈనాటికీ గమనించవచ్చు..
శత్రువులకు ఈ రక్షణ వలయాన్ని దాటి రావడం ఎంతో కష్టంగా ఉండేదట.

ముందుగా శిల్ప కళాతోరణల వద్దకు వెళ్ళాము.  నలుదిక్కుల నాలుగు శిల్ప కళా తోరణాలు  కాకతీయ సామ్రాజ్యానికి అందమైన ఆభరణాలు లాగా 30 అడుగుల ఎత్తులో  ఆకాశాన్ని తాకుతూ కనిపిస్తాయి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వీటిని తమ అధికార చిహ్నంగా పెట్టారు, ఈ నాలుగు తోరణాల మధ్య అద్భుతమైన శిల్పకళాఖండాలు మనకు దర్శనమిస్తాయి. ఈ కోటను రాణి  రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు ప్రారంభించగా ,రుద్రమదేవి  నిర్మాణం పూర్తి చేశారు. ఈ కోట మధ్యలో స్వయంభు శివాలయం లోని శివ లింగం భూమికి అతి తక్కువ ఎత్తులో ఉండి మిగతా శివాలయాల వాటికన్నా ప్రత్యేకంగా నిలుస్తుంది.ఈ కోటలో ఉన్న ప్రతి శిల్పాన్ని గమనిస్తూ చాలాసేపు ఇక్కడ సమయం గడిపాము..

తరువాత ప్రక్కనే ఉన్న ఖుష్ మహల్ వద్దకు వెళ్ళాము. ఇది ముస్లిం రాజులు నిర్మించారు. ఇందులో ఓరుగల్లు కోటలో శిథిలావస్థలో ఉన్న శిల్పాలను భద్రపరిచారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఖుష్ మహల్ పైకి ఎక్కి ఓరుగల్లు పట్టణాన్ని మనం వీక్షించవచ్చు.

ఇక సాయంత్రం అవుతుంటే తిరిగి హైదరాబాద్ బయలుదేరాము. తిరుగు ప్రయాణంలో ఫోటోలు చూస్తూ జరిగిన ప్రయాణాన్ని మరలా గుర్తు చేసుకున్నాం.
మొత్తానికి ఎన్నో ఏళ్ల నుంచి వరంగల్ చూడాలనే కల నెరవేరింది,మా ఫ్రెండ్ ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు వలన..


-10/08/2019





















Thursday, 27 June 2019

పుస్తకాలు -మన ప్రియనేస్తాలు

ఒక్కో రకమైన పుస్తకం ఒక్కో పరిమళాన్ని వెదజల్లుతుంది.. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మన మనస్సు తెరమీద సన్నివేశాలు కదలుతూ ఉంటాయి.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.. ప్రతి పేజీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది..
నాకు నచ్చిన పుస్తకాలు కొన్ని మీతో పంచుకొంటాను.

1.భారత జాతికి నా హితవు- వివేకానంద:
ఈ చిన్ని పుస్తకంలో ప్రతీ అక్షరం చదువుతుంటే ఏదో తెలియని ఉత్సాహం మనలో వచ్చి చేరుతుంది.ఆత్మశక్తిని, దేశభక్తిని పెంపొందించే ఈ పుస్తకం ప్రతీ భారతీయ యువతీయువకులు తప్పక చదివి తీరాలి.

2.అమరావతి కథలు - సత్యం శంకరమంచి:
తియ్యనైన తెలుగు పదాలను తేనెలో ముంచి కథలుగా రాస్తే వాటికి అందమైన బాపు బొమ్మలు జతకలిస్తే అవే అమరావతి కథలు.. తెలుగులో మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఈ కథలు చదివి తీరాల్సిందే.

3.మిథునం -శ్రీరమణ:
భార్యాభర్తలు అనురాగానికి అందమైన వర్ణన.‌. ఏకబిగిన మన చేత చదివించే ఈ కథ మనస్సును హత్తుకుంటుంది,
మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.

4.సత్యశోధన లేదా ఆత్మకథ- గాంధీ:
సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన ఒక వ్యక్తి జీవితం ఇది  ఒక చరిత్ర.
నిజాయితీతో సాగిన ఈ జీవిత కథ వర్ణించిన విధానం అద్భుతం.చదువుతుంటే నిజంగానే గాంధీగారు మన పక్కన కూర్చుని కథని చెబుతున్నట్లు అనిపిస్తుంది..

5.నాకూ ఉంది ఓ కల - వర్గీస్ కురియన్:
పట్టుదలతో సాగే ఓ అధ్బుతమైన విజయగాధ. మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఎలా ఉన్నాం ,ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం అని ఈ ఆత్మకథ చెబుతుంది..మారుమూల గ్రామాన్ని (ఆనంద్) ప్రపంచ ప్రఖ్యాత గావించిన కురియన్ ఆత్మకథ ఎంతో ప్రేరణాత్మకం.

పుస్తకాలు నా జీవితంలో భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. మరి మీకు నచ్చిన పుస్తకాల పేర్లు కూడా నాతో పంచుకుంటారు కదూ.‌

చదవండి - చదివించండి
 శ్రీనివాస చక్రవర్తి
27/06/2019


Sunday, 16 June 2019

నాన్నతో నా బాల్యం ‌..


-ఇంటికి రానీరా చిన్నోడా:
 "హే నాన్న వస్తున్నాడు" అంటూ అప్పుడే ఊరి నుంచి వస్తున్న నాన్న దగ్గరికి ఇంటికి కొంత దూరం ఉందనగానే వాయువేగంతో పరుగులు తీస్తూ ఎదురు వెళ్ళా. చేతిలో ఉన్న సంచిలో ఏం తెస్తున్నాడో చూద్దాం అని, సంచిలోని అరటిపండ్లును, శంఖువు ఆకారంలో కట్టిన బూందీ పొట్లంని చూడగానే నా కళ్ళల్లో రెండు లైట్లు వెలిగేవి,
నోట్లో లాలాజలం గంగలా పొంగేది...
దారిలోనే వాటిని తీసుకుందామని ప్రయత్నిస్తుంటే ఇంటికి రానిరా చిన్నోడా తీసుకుందువు గానీ అని నవ్వుతూ అంటుంటే. దారిలోనే రెండు అరటి పండ్లను తెంచుకొని ఆనందంతో గెంతులు వేసిన చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.

*******

-లాంతరు వెలుగులో నాన్న:
ప్రతి ఒక్కరికీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎన్నో మధుర జ్ఞాపకాలు నింపుతుంది. నాకు అంతే..
నాకు 5 సంవత్సరాల వయస్సులో అనుకుంటా. అప్పుడే మారుమూల గ్రామాల్లోకి విద్యుత్ అడుగుల వేస్తుంది. వీధి దీపాలు ఉండేవి కాదు,అందరూ సాయంత్రం అవ్వగానే కిరోసిన్ లాంతర్లను సిద్దం చేసుకునేవారు.
అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను నేను.
నాన్న మా ఊరినుంచి మమ్మల్ని చూడటానికి సైకిల్ పైన వచ్చాడు.ఆనందంగా గడుస్తున్న ఆ సాయంత్రం మెల్లగా నాకు తెలియకుండానే  మా ఊరు బయలదేరాడు నాన్న. అప్పటికే చీకటి మసకలు కమ్ముకున్నాయి. చుట్టూ చీకటి ఆవరించింది.
 నాన్న వెళ్ళిన విషయం తెలిసి, ఏడుస్తూ "నాన్నోయ్... నాన్నోయ్.. నాన్నోయ్" అంటూ అప్పుడే వెలిగించిన లాంతరు చేత్తో పట్టుకుని కొంతం దూరం బజారు వేపు నాన్నను వెతుకుతూ మసక చీకటిలో పరుగులు తీసాను.
అమ్మమ్మ వాళ్ళు నేను ఇంటి దగ్గర కనిపించక హడావిడి పడితే,కొంతసమయం తరువాత నా జాడ తెలుసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి నాన్న మళ్ళీ వస్తాడు అని ఓదార్చి తాయిలం నా చేతికి అందించారు.
ఆ  చిన్ననాటి జ్ఞాపకాలు మసక మసకగా అప్పుడు అప్పుడు గుండెలపై కదులుతాయి.

**********

- నాన్న చూపిన అధ్బుతమైన విజయ సూత్రం  :
వేసవి సాయంత్రం నాన్న  కల్లుగీయడానికి తాడి ఎక్కే మోకును నడుముకు చుట్టూ చుట్టుకుని, కత్తులు పదును పెట్టే చెక్క బండకు రెండు కుండల తొడిగి నవ్వుతూ భుజంపైన పెట్టుకున్నాడు. నేనుకూడా బయలుదేరాను నాన్నతో ముంజికాయలు తినవచ్చు అని, నేను నాన్న ఇద్దరం పొలం వేపు అడుగులు వేసాం.‌ మా దారిలో జనుము చేను పసుపు పూలు సుగందాన్ని వెదజల్లుతుంటే అటువేపు నుంచి వీచే గాలి ఒక లాలన పాడినట్లు ఉండేది.
జనుము చేను మధ్య బాటలో గుండా అడుగులు వేస్తూ ముందుకు సాగాం.
మొదట ఒక తాటి చెట్టు దగ్గర నాన్న ఆగి ముందుగా తను ఎక్కబోయే తాడికి దణ్ణం పెడుతున్నాడు .
ఇదేంటి నాన్న దేవుడికి దండం పెట్టాలి కానీ తాడిచెట్టుకి , ఈ గీత పనిముట్లుకు పెడుతున్నావు.." అని అడిగాను..
అప్పుడు నాన్న "ఏదైతే మనకు కూడు పెడుతుందో అది దైవంతో సమానం చిన్నోడా.. అందుకే ఈ తాటిచెట్టుకీ, ఈ పనిముట్లుకు మొదటి నమస్కారం" అని చెప్పి నువ్వు గట్టుపైన కూర్చో నేను తాటిచెట్టు ఎక్కి వస్తాను అని చెప్పి భుజం పైన ఉన్న మోకుని తాడికి వేసి పైకి ఎక్కుతూ వెళ్ళాడు.
నాన్న చెప్పిన మాటలు బలంగా తాకాయి.
గట్టుమీద కూర్చుని పైకి చూసాను. ఆకాశంలో మెరుస్తున్న ఒక సూరీడు ఒక వేపు
"పనే దైవం" అని  చెప్పిన మరో సూరీడు తాడిపైన మరోవైపు. ఆ సూరీడు వెలుగు కిరణాలు నేరుగా నా కళ్ళను తాకేసరికి ఆ వెచ్చదనానికి నా కనుపాపలు తాలలేక తలదించుకున్నాను.

ఈ రోజు నేను కంప్యూటర్ ముందు ఉదయాన్నే కూర్చున్నప్పుడు ముందుగా మనస్సులో నమస్కారం చేసుకుంటా.
ఏదో తెలియని అంకితభావం నాలో ప్రవేశిస్తుంది ఆ రోజంతా భలే సాగుతుంది.

*********

- కొండలు ఎలా పుడతాయి నాన్న:
అప్పుడే ప్రపంచంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు లోకం ఎంతో అద్భుతంగా, విచిత్రంగా కనిపిస్తుంది.
వాళ్ళ మదిలో కుతూహలంతో జనించే ఎన్నో ప్రశ్నలు ఈ అద్భుతాలను తెలుసుకోవాలని, అలాగే నేను ఒకరోజు నాన్నతో ప్రయాణం చేస్తున్నా విజయవాడ వెళుతున్నాం. మొదటిసారి చాలా దూరం ప్రయాణం చేస్తున్నా.
బస్సు కిటికీలోంచి చూస్తూ, ఆనందిస్తూ దారి వెంట ఉన్న చెట్లు , కొట్లు వెనక్కి వెళుతుంటే భలే అనిపించేది. అప్పుడు ఓ వింతైన ఆకారం మొదటి సారి చూసాను.
నేను -" నాన్న అదేంటి..."
నాన్న- " అది కొండ"
నేను - " ఎంత ఎత్తు ఉందో.. అది ఎలా పుడుతుంది నాన్న"
నాన్న కొంచెం సేపు ఆలోచించి " అది కూడా నేలపైన ఏర్పడిన ఒక ప్రాంతం.. ఒక పెద్ద దిబ్బ లాంటిది. రాయితో ఏర్పడుతుంది.."
భలే అనిపించింది నాకు.. కంటికి కనిపించినంత సేపు దానినే కిటికీలోంచి వెనుకకు వెళ్ళిందాకా చూస్తూనే ఉన్నా.
ఎంతో ఓపికతో మన ప్రశ్నలకు అప్పట్లో గూగుల్ లేకపోయినా వారికి తెలిసిన మేర ఎన్నో విషయాలు మనతో పంచుకున్నా జ్ణాపకాలు ఇప్పుడు తలుచుకుంటే భలే అనిపిస్తుంది.

********

-నాన్నతో మొదటి సినిమా:
అప్పట్లో దూరదర్శన్, వీధి నాటకాలు ,ఆరుబయట కథలు, కబుర్లే వినోదం అంటే..

"నాన్న నాకు రేపల్లెలో సినిమా చూపించవూ." అన్నాను నేను నాన్నతో.
" ఆదివారం వెళ్దాం,అప్పుడు మీకు సెలవు ఉంటుంది కదా" అని నాన్న చెబితే  ఉత్సాహంతో ఊగిపోయాను. ఆదివారం కోసం ఎదురు చూస్తున్నా. కాలం నెమ్మదిగా గడుస్తుంది.

ఆలస్యం అయినా రేపల్లె వెళితే వచ్చే 3 ఆనందాలు తలుచుకుని మురిసిపోతున్నా.

1.బస్సుల్లో కిటికీ పక్కన కూర్చుని గాలిలో తేలుతూ బయటకు చూస్తూ ఆనందించవచ్చు.

2.మొదటి సారి సినిమా చూస్తున్నాం అనే ఆనందం.
మా ఫ్రెండ్ చెప్పాడు నాకు
"హాలులో సినిమా చూస్తే భలే ఉంటుంది రా
తెరమీద పెద్ద రంగురంగుల బొమ్మ మధ్యలో విరామం ఉంటుంది పాప్కార్న్ , ఉల్లి సమోసాలు తీసుకొని తింటూ ద్రాక్ష లేదా నిమ్మ గోలీసోడా తాగవచ్చురా... " అని

3.సినిమా ఐన తరువాత రేపల్లె హోటల్ లో
ఒక ఉల్లిమినపో లేది పూరీనో లాగించవచ్చు అని..
అప్పట్లో హోటల్ లో టిఫిన్ అంటే ఎందుకో అంత ఇష్టం..

ఆదివారం రానే వచ్చింది ఉదయాన్నే లేచి స్నానం చేస్తే అమ్మ ముఖానికి పౌడరు, తలకు నూనె రాసింది.
అన్నయ్య నేను వస్తాను నాన్న అని మాతో బయలుదేరాడు. అన్నయ్య వస్తే నేను అనుకొన్న సమోసాలు, గోలీసోడాలు, పూరీలు ,మినపట్టులు పూర్తిస్థాయిలో అందవనీ అన్నయ్య  రావద్దంటే రావద్దని నేను మారాం వేసాను. అన్నయ్య కొంత సేపు ప్రయత్నించి సర్లే తమ్ముడినే తీసుకెళ్ళు నాన్న అన్నాడు.
నేను నాన్న ఇద్దరం బస్సు ఎక్కి రేపల్లె వెళ్ళాం.
"నాకు రెండు సినిమాలు చూపించాలని అడిగాను".
సరే అని ముందుగా పెదరాయుడు సినిమా చూశాం. భలే చిత్రంగా అనిపించింది రంగురంగుల బొమ్మలు తెరమీద కనబడటం. విరామంలో తెర మీద నుంచి నా చూపు పక్కకు తిప్పాను, జనాలు అందరు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయాను.
తెర మీద  పెద్దగా ఉండటం వల్ల కింద ఉన్న వాళ్ళు చిన్న గా కనిపిస్తున్నారు అనిపించింది. అలా ఆ రోజు రెండు సినిమాలు చూశాను. హోటల్లో టిఫిన్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం.
ఆ రోజంతా నా కంటికి అందరూ చిన్నగా కనిపిస్తున్నారు. :)

ఇలా నాన్న మాది మధ్య తరగతి కుటుంబం అయినా తన పిల్లలకి ప్రతి తండ్రిలాగా సాధ్యమైనంత ఆనందం ఇవ్వాలని ఎంతో ప్రయత్నించారు..

********

మోకుకు పనిచెప్పిన నాన్న:
అప్పుడు నన్ను మా ఊరి స్కూల్ లో మొదటి సంవత్సరం  చేర్పించారు. నేను ఇంట్లో ఉన్న కల్లు తాగి స్కూల్కి వెళ్తున్నట్లు వెళ్లి దారి మధ్యలో ఉన్న ఒక ఇంటి అరుగు పైన పడుకుని నిద్రపోవడమో లేదా నాలాంటి పిల్లలతో ఆడుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చే వాడిని. ఈ విషయం తెలుసుకున్న నాన్న, ఒకసారి అప్పుడే తాడి చెట్టు ఎక్కి దిగి వస్తున్నాడు. కోపంతో పళ్లు పటపటా నములుతూ వచ్చే సరికి నేను పరుగు అందుకున్నాను నన్ను పట్టుకుని గట్టిగా మందలించి కాళ్ళ బంధం తో నా కాళ్లపైన 2 దెబ్బలు ఇచ్చుకున్నాడు.
ఆ కోపానికి నేను తట్టుకోలేక పోయాను. ఎప్పుడు కోపం రాని వారికి కోపం వస్తే భయంకరం గా ఉంటుందేమో.

  • ఆరోజుతో జీవితంలో కల్లు తాగడం మానివేశాను.

చదువులో నేను సగటు విద్యార్థినే అయినా 90% పైగా నా యొక్క హాజరును ఒకటవ తరగతి నుంచి ఎంసిఎ వరకు చూపించాను. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆ ఏడాది 95 శాతంపైగా హాజరు వచ్చినందుకు నాకు ఉత్తమ విద్యార్థి అవార్డు వస్తే , నాన్నకు అది చూపిస్తే ఎంతో మురిసిపోయాడు. మా పిల్లవాడు నామాలు లేకుండా బడికి వెళ్తాడని చాలా గర్వంగా తన మిత్రులకు చెప్పుకునేవాడు నాన్న.‌

నాన్న నీడలో సాగిన ఈ బాల్యం ఎంతో మధురజ్ఞాపకం...

- శ్రీనివాస చక్రవర్తి
16/06/2019