Monday, 31 August 2026

ఆగష్టు నెలలో చదివిన పుస్తకం మైరావణ

 ఆగష్టు నెలలో చదివిన పుస్తకం మైరావణ



మైరావుడు
కథలో హీరో మాత్రమే కాదు..
ఆడో మలపు .. ఆడో మార్పు
పది బారల సొరచేపను వల ఎయ్యకుండానే ఒడ్డుకు తెచ్చినోడు..
చేపల వాన కురిపించినోడు..
చచ్చిపోయిన కూతురును బతికించి తెచ్చినోడు..
పశు, పక్షులతో మాట్లాడే విద్య తెలిసినోడు..
నీటిలో ఉన్న శివలింగాన్ని పైకి లేపినోడు ..
50 కేజీల చేపలను కాళ్ళకు కట్టుకొని ఒడ్డుకు లాగిన గజ ఈతగాడు .

తరతరాలను గుర్తు చేస్తూ చెప్పిన ప్రథాన కథ
చాలా ఆసక్తికరంగా ఉంది కథ..
1930 వ సంవత్సరం విశాఖపట్నం ఘోరాతి ఘోరమైన కరువు.. కడుపు చేత పట్టుకొని వలసపోతున్న జనం..
అలా ఒక ఓడ వలస జనాలతో కిక్కిరిసి రంగం (బర్మా రంగూన్) వెళ్ళింది. అందులో నూకన్న కూడా ఒకడు.
రంగం చూస్తే ఆశ్చర్యం, అక్కడ ఏ మూల చూసినా భారతీయులే, అందులోనూ తెలుగు వాళ్ళు ఎక్కువ..
అక్కడికి కూలీగా వెళ్ళిన నూకన్న కష్టపడి సంపాదించి యజమానిగా ఎదుగుతాడు ..
అంతా బాగా సాగుతోంది అనే తరుణంలో 1941 జపాన్ బర్మా మీద దాడి చేస్తుంది.. మారణహోమం..
యుద్దంలో చిక్కుకున్న తెలుగు వారికి భారత దేశం రావడం ఒక్కటే మార్గం. కానీ యుద్దం వలన విమాన నౌకా మార్గాలు అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి..
ఇకా కాలినడకే శరణ్యం..
కీకారణ్యాలు, కొండలు, నదులు దాటుకుంటూ రావాలి..
ఐరావతి నది దాటడానికే రెండు వారాలు, మధ్యలో ఎందరో ఆకలితో, అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు.
ఆ యాత్ర గంటలు కాదు, రోజులు కాదు.. ఎన్నాళ్ళు నడిచిన తరగని యాత్ర... గమ్యం చేరతామనే ఆశ లేదు ..
అలా కొంతమంది మాతృభూమికి ప్రాణాలతో చేరుకున్నారు..

పైన కథ చదువుతుంటే మనం కూడా వారితో ప్రయాణం చేసినట్టుగా రాశారు రచయిత

తరువాత కథలో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు మైరావుణి తల్లి జన్మించడం
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు పట్టాలుకెక్కడం అక్కడ కూలీల జీవితాలు,
మనం పైన చెప్పుకున్న మైరావుణి ప్రేమ, సాహసాలతో చాలా ఆసక్తికరంగా చెప్పారు యువ రచయిత ప్రసాద్ సూరి...

కేంద్ర సాహిత్య యువ పురస్కారం పొందిన ఈ
ప్రధాన కథ రెండు మూడు కథలతో సమాంతరంగా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
రచయిత మంచి చిత్రకారుడు కూడా అవడం వలన సన్నివేశాలను దృశ్య రూపంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మైరావణ పుస్తకంలో చర్చకు వచ్చిన పుస్తకాలు

1.చెంఘీజ్ ఖాన్ - తెన్నీటి సూరి
2.స్పార్టకస్ - హోవర్డ్ ఫాస్ట్
ఈ రెండు పుస్తకాలను మైరావడు చాలా ఇష్టంగా చదువుతాడు.. అందులో కథానాయకులలా ఊహించుకుంటాడు
3.War and peace - టాలస్టాయ్
4.బృహత్కథ - గుణాఢ్యుడు
5.బంకోల - సాధు సుబ్రమణ్య శర్మ
6.ప్రాచీనాంధ్ర నౌకా జీవనం - భావరాజు వెంకట కృష్ణారావు
7.గోన గన్నారెడ్డి - బాపిరాజు
8.నరుడు- బాపిరాజు
9.గాథాసప్తశతి - హాలుడు

కరువు, బర్మా వలస జీవితాలు, నాగార్జున సాగర్ డ్యామ్ కొట్టినప్పుడు ఉన్న పరిస్థితులు లాంటివి బాగా అధ్యయనం చేసి రాసిన రచయిత కృషి అభినందనీయం..

మీరు ఎవరైనా మైరావణ‌ పుస్తకం చదివారా ఎలా అనిపించింది..?

Monday, 10 August 2026

జులై 2026 నెలలో చదివిన పుస్తకాలు

జులై నెలలో చదివిన పుస్తకాలు

1.ఎంతెంత దూరం: లక్ష్మీ ప్రియాంక
ఒకవైపు ఉరుకులు, పరుగుల Corporate ఉద్యోగం. మరో వైపు ఇంట్లో చిన్న పిల్లలు బాధ్యతలు..
మనుషులు ఇద్దరూ ఒక ఇంట్లో కానీ మనసులు మధ్య ఎంతో దూరం..
ఎంతెంత దూరం కథ ఓ మంచి కనువిప్పు లాగా ఉంది.
పిల్లల కోసం జీవితం అంకితం చేస్తే వారికి రెక్కలు వచ్చాక వారు జీవితాల్లో బిజీ అయితే..
వాళ్ళు రాక కోసం ఎదురు చూస్తూ
ఒంటరితనంతో ఆవేదన చెందే ఓ తల్లిది మరో కథ..
ఇప్పటి వరకు నేను చదివిన ప్రేమ కథలు చివరకు సుఖాంతంగా కలవడమో లేదా విఫలం అవడంతోనో ముగుస్తాయి..
విచిత్రంగా ఈ పుస్తకంలో కొన్ని(చాలా) కథలు Love BreakUp నుంచి ప్రారంభం అవుతాయి..
అన్ని కథలు కూడా ప్రేమ - అనుబంధాలు చుట్టూ తిరిగే కథలు .
ఒక్కో కథ ఒక్కో జీవితాన్ని చూపుతుంది.
ప్రతి కథ మనని ఆలోచింప చేస్తుంది..
Dating Apps , OTT లు , కార్పోరేట్ ఉద్యోగాలు, పురుష- పురుషులు మధ్య ప్రేమలు, స్త్రీ-స్త్రీల మధ్య ప్రేమలు ఇలా ఎన్నో అంశాలను రచయిత్రి స్పృశించారు.
యువ రచయిత్రి లక్ష్మీ ప్రియాంక గారి రచనా శైలి చాలా బాగుంది.





2. కలవపూడి కథలు: సాంబశివ తడవర్తి

చిన్ని పుస్తకం.. చిన్ని చిన్ని కథలు..
కథలు చెప్పిన విధానం.. విశేషాలు అద్భుతం.
ఏం ఉత్కంఠ.. ప్రతి కథను కూడా ఊపిరి బిగబట్టి చదివించే విధంగా ఎంతో ఆసక్తిగా చాలా అందంగా మలిచారు రచయిత..
ఒక కథకు మరో కథకు అనుబంధం ఉండటం వలన మరోసారి కథ తిరిగి చదివితే ముడి విప్పినట్టుగా భలే అనిపిస్తుంది.
గోదావరి ప్రాంతంలో కలవపూడిలో జరిగిన కథలను ముత్యాలులా పేర్చి ఒక అందమైన దండగా అల్లి మన ముందు ఉంచారు రచయిత..
ఇందులో బాల్యం, అందమైన ప్రేమ, మనసును తాకే మానవత్వం ఉన్న కథలు నాకు బాగా నచ్చాయి.
ప్రతి కథ రెండు వాక్యాలు ఆరంభిస్తే చాలు, రెక్కలు కట్టుకుని ఆ ప్రదేశంలో మనం వాలిపోయే విధంగా రచయిత సాంబశివ గారు రాశారు. ప్రతి కథ ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంది..
నా బాల్యం, మా గ్రామంలోని జ్ఞాపకాలను గుర్తు చేసిన ఈ పుస్తకం ఈ మధ్య నేను చదివిన పుస్తకాలలో నాకు బాగా నచ్చింది.
కొత్తగా పుస్తకాలు చదవటం మొదలు పెట్టే వారికి ఇలాంటి పుస్తకాలు ఇస్తే మరింత చదవాలని ఆసక్తి కూడా పెరుగుతుంది.