జులై నెలలో చదివిన పుస్తకాలు
2. కలవపూడి కథలు: సాంబశివ తడవర్తి
జులై నెలలో చదివిన పుస్తకాలు
కథ: జోడు బిందెల సైకిల్
"ఈ ఊరికి పిల్లని ఇవ్వాలంటే ఆలోచించాల్సిందే.. గుక్కెడు మంచినీళ్లు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో! వాడుకునే నీటి కోసం, తాగునీటి కోసం ఎంత దూరం వెళ్లాలో, అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకి చాకిరి తప్పదు." చిన్నతనంలో మా దూరపు బంధువు అన్నమాట.
ఇప్పుడంటే మా ఊరిలో ఒక్క స్విచ్ వేస్తే మోటర్ ద్వారా నీరు డాబా పైన ట్యాంకర్లలో క్షణాల్లో నిండిపోతుంది. నిమిషాల్లో మినరల్ వాటర్ ఇంటికి వచ్చేస్తుంది.
ఒకప్పుడు నీటి కోసం నిజంగానే ఎన్నో కష్టాలు పడింది మా ఊరు.. అప్పటి మా ఊరి (2000 సంవత్సరం సమయంలో) నీటి సంగతులు. తెల్లవారకముందే మగవాళ్ళు భుజాల మీద కావిళ్ళు వేసుకుని కుర్రాలమ్మ చెరువు వద్ద ఉన్న బావి దగ్గరకు లేదా బేకయ్య బావి దగ్గరకు పరుగులు తీసేవారు. ఆడవాళ్లు తల మీద తళతళలాడే గుండిగ బిందెలను పెట్టుకుని ఎంతో దూరం నుంచి మంచినీరు మోసుకొచ్చేవారు.
సైకిల్ పైన నా చిన్నప్పుడు మొదటిసారి నీళ్లు తెచ్చిన జ్ఞాపకం..
నేను బిందె సైకిల్ మీద గట్టిగా ఉందా లేదా అని కుదుపి చూశాను. "ఇంటికి తిరిగొచ్చేదాకా నీకు ఇంకేం అనుమానం లేదు" అని నాన్న ధైర్యం చెబుతూ.. "చూడు బిందెని నీళ్ళతో నింపుకొని వస్తున్నప్పుడు లారీ లేదా బస్సు లాంటివి ఎదురైతే పక్కన దిగి నుంచో.. కట్టిన బిందెను కిందకు దించకుండా ఒక్కొక్క బకెట్ నీరు బావిలోంచి తీసుకొచ్చి ఇందులో పోయి" అని కొన్ని సూచనలు చెప్పాడు.
నేను సైకిల్ పైన రామాలయం దాకా వచ్చాక, మా స్నేహితుడు సుభాని నాలాగే మంచినీళ్ల కోసం ఒంటి బిందెతో సైకిల్ మీద వస్తూ "ఏం మామ, మొదటిసారి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నావా?" అన్నాడు.నేను అవునని తలూపాను. "సరే పద, ఇద్దరం వెళ్దాం" అన్నాడు.
మనవాడు నాకన్నా ముందే సైకిల్ నేర్చుకుని, రోజూ మంచినీళ్లు తీసుకొస్తున్న అనుభవజ్ఞుడు. ఆ క్షణాన తను మంచినీరు తీసుకురావడంలో డిగ్రీ చేసిన వ్యక్తి లాగా ఆకాశం అంత ఎత్తున నాకు కనిపించాడు, ఓ మంచి తోడు వచ్చాడనే భరోసా దొరికింది నాకు.
మా ఊరి డొంక దాటి ఇద్దరం కలిసి తారు రోడ్డు ఎక్కాము.
"త్వరగా పదరోయ్, అసలే ఎండాకాలం.. నీళ్లు దొరకవు" అని సుభాని గట్టిగా సైకిల్ పెడల్ తొక్కడం మొదలుపెట్టాడు.
నేను మొట్టమొదటిసారి మంచినీళ్ల కోసం వెళుతూ ఉండటం వలన, మంచినీళ్లు తీసుకుని వచ్చే పోయే సైకిళ్లను, వ్యక్తులను చూస్తూ నా సైకిల్ తొక్కుతున్నాను.
ఖాళీ బిందెలతో నీటి కోసం బయలుదేరినవి, బంగారం లా మంచినీటిని నింపుకొని ఏనుగులాగా నిండుగా ఎదురు వస్తున్న సైకిళ్లు.
ఎండాకాలం వీచే గాలికి మా ఖాళీ బిందెల్లో గాలి సవ్వడి చేస్తోంది.. నిండు బిందెలతో వచ్చే సైకిళ్లు చైన్లు కరకర శబ్దం చేస్తున్నాయి.
నీళ్ల కోసం వెళ్లే వారి ముఖాల్లో ఆందోళన.. "అసలే ఎండాకాలం, మంచినీళ్లు ఉంటాయా ఉండవా" అని.. వచ్చేవారి ముఖాల్లో విరిసిన ఆనందం "హమ్మయ్య, ఈ రోజుకి మంచినీళ్లు దొరికాయి" అని.
ముందుగా నీళ్లు తీసుకుని వస్తున్న ఊరు పెద్ద నాగేశ్వరరావు గారి అబ్బాయి సతీష్ మామ ఎదురయ్యారు.. నేను "రేయ్ సుభాని, ఆయన సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న విధానం చూశావా.. ఖాళీ బిందెతో ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుందిరా.. బావిలో నీళ్లు లేవేమో.."
సుభాని నవ్వుతూ "రేయ్.. సతీష్ బాబాయ్ గురించి నీకు తెలియదు.. సైకిల్ తొక్కడంలో అతను నెంబర్ వన్! బరువు ఉన్నా లేకపోయినా, ఆయన తొక్కుడు మాత్రం మారదు రా!."
సతీష్ మామా దగ్గరకు వచ్చాక తెలిసింది ఆయన మంచినీళ్లతో వస్తున్నాడని..
మమ్మల్ని చూసి "ఏంటి కుర్రాళ్లు.. మంచినీళ్లకు వెళ్తున్నట్టున్నారే.. ఆలాపున్నయ్య బావి కాడికా, పుట్టగుంట బావి కాడకా..? పుట్టగుంట బావికే వెళ్ళండి... ఆలాపున్నయ్య బావిలో నీళ్లు మారాయి, పుట్టగుంట అయితే బాగుంటాయి.. నేనూ అక్కడి నుంచే.." అని చెప్పి రయ్యిన వెళ్ళిపోయాడు.
ఇద్దరం కలిసి పుట్టగుంట బావి దగ్గరికి చేరుకున్నాం. రోడ్డుకి దగ్గరలో ఉన్న కాల్వ పక్కన కింద బావి ఉంటుంది.. నేను రోడ్డుపైనే సైకిల్ స్టాండ్ వేసి ఒక్కో బకెట్ తెచ్చి నీళ్లు పోద్దాం అనుకుంటే...
సుభాని "నేరుగా సైకిల్ ని బావి దగ్గరికి పోనిద్దాం, నీళ్లు నింపాక ఇద్దరం సైకిల్ ని పైకి నెడదాం" అని చెప్పాడు.
బావి పక్కన స్టాండ్ వేసి సగం బిందెలు నింపాక "ఇప్పుడు స్టాండ్ తీసి పైకి వెళ్దాం పద" అని తాను అన్నాడు.
నేను: "ఇదేంట్రా సగం బిందెలతో మనం ఇంటికి వెళ్ళడానికా ఇంత దూరం వచ్చింది??"
సుభాని: "పూర్తి బిందెలతో మనం సైకిల్ రోడ్డు పైకి ఎక్కిస్తే సగం నీళ్లు కింద పోతాయిరా.. అందుకే సగం వరకు పోశాను, పైకి వెళ్ళాక మిగతా ఖాళీ నింపుదాం."
తను హ్యాండిల్ పట్టుకుంటే, నేను కింద నుండి రోడ్డు పైకి సైకిల్ తోసాను.. మొత్తానికి ఇద్దరం నీళ్లు నింపుకుని ఇంటికి బయలుదేరాం.
"సుభాని, కొంచెం నా వెనుక నీ సైకిల్ నడపరా.. నా సైకిల్ రోడ్డు గుంటల్లో దిగితే బిందె పక్కకి పడిపోతుందేమో అని సందేహంగా ఉంది" అని నేను అడిగాను.
సుభాని: "ఏం కాదురా, గుంటల్లో నెమ్మదిగా నడుపు, నేను వెనుకనే ఉంటా కదా, నువ్వు ముందు పదా."
నేను ముందు.. తను నా వెనుక.. ఇద్దరం బయలుదేరాం..
రోడ్డు మీద గుంటల్లో సైకిల్ దిగినప్పుడల్లా నేను నా చేయి వెనక పెట్టి బిందెను తడిమి చూస్తున్నాను, ఏమైనా కదిలిందేమోనని..
వెనకనుంచి సుభాని "రేయ్, నువ్వు ముందుకు చూసి సైకిల్ నడపరోయ్.. ఈ మట్టపూడి రోడ్డు గుంటల్లో పడ్డామంటే సైకిలు చేలోకి వెళ్లాల్సిందే, జాగ్రత్త."
మా ఊరి అడ్డరోడ్డు మలుపు దగ్గరికి చేరుకున్నాం.. దూరంగా లారీ హారన్ చప్పుడు వినిపించింది. అంతే, నా గుండెల్లో రైళ్లు పరుగులు తీసినట్టు అనిపించింది. నేను సడెన్ గా సైకిల్ దిగేసాను.
సుభాని: "ఏమైందిరా.."
నేను: "లారీ వస్తుంది మామ.. అది మన పక్కనుంచి వెళితే.. గాలి దాని వైపుకు లాగినట్లుగా అనిపిస్తుంది, బ్యాలెన్స్ తప్పుతుందేమోనని దిగాను."
సుభాని: "మాష్టారు.. లారీ మనకి అర కిలోమీటర్ దూరంలో కామేశ్వరమ్మ గుడి దగ్గర ఉంది రా బాబు.. ఇలా అయితే ఈరోజు మనం ఇంటికి వెళ్లినట్లే.."
లారీ మమ్మల్ని దాటాక ప్రయాణం మొదలుపెట్టాం. మా సైకిల్ ఇప్పుడు మా ఊరి డొంక మీదకి ఎక్కింది.
ఆ క్షణాన, ఒక్కసారిగా మా ఊరి గాలి నా దేహానికి తాకేసరికి.. గుండెల నిండా ఏదో తెలియని ఆనందం. ఎంతో విలువైన వస్తువుని సంపాదించి మా ఊరికి, ఇంటికి తీసుకెళ్తున్నానే గొప్ప సంతోషం పొందాను.
నేను సైకిల్ మీద నీటితో వస్తున్నట్లు తెలిసే విధంగా వెళ్లే దారిలో మా మిత్రులు అందర్నీ పలకరించాను.. ఇంటికి చేరగానే అమ్మానాన్న నన్ను చూసి ఆనందించారు..
కుటుంబానికి ఒకరోజు సరిపడా మంచినీళ్లు తీసుకొచ్చి ఏదో ఘనకార్యం చేసిన వ్యక్తిలా పొంగిపోతూ అమ్మ దగ్గరికి వెళ్లి ఒక రెండు రూపాయలు లంచం అడిగాను. అమ్మ నవ్వుతూ నా చేతిలో పెట్టింది.
డబ్బు తీసుకొని పెద్దోడు కొట్టు వైపు కొబ్బరి బిళ్ళలు, జీడీలు కొనుక్కోవడానికి పరుగులు తీశాను.
రోజులు గడుస్తున్నాయి.. నేను తరగతులు మారుతున్నాను.. కానీ మంచినీళ్ల కష్టాలు అలాగే ఉన్నాయి. నేను ఒంటి బిందె నుంచి ఇప్పుడు జోడి బిందెలకు మారాను.
ఒకప్పుడు ఒంటి బిందె కట్టడానికి కచ్చితంగా నాన్న ఉండాల్సిందే. ఇప్పుడు జోడి బిందెలు కట్టుకుని వెళ్లే అనుభవం నాకు వచ్చింది.
ఈ నీటి కోసం చేసే ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఊరిలో అందరితో పరిచయాలు.. ఊర్లో సంగతులు, బడిలో విశేషాలు, టీవీలో వచ్చే క్రికెట్ ముచ్చట్లు.. కబుర్లు చెప్పుకుంటూ సాగేవి మంచి నీటి కోసం చేసే సైకిల్ ప్రయాణాలు. దూరం వెళ్ళలేక 2 లీటర్ల డబ్బాలో మంచినీళ్ళు తీసుకొని రమ్మని ముసలి వాళ్లు ఇచ్చేవారు.
మంచి నీళ్ల కోసం వెళ్లే దారిలో అడ్డరోడ్డులో సారథి కొట్టు దగ్గర ఆగి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడటం ఓ అద్భుతమైన జ్ఞాపకం. ముందుగా వెనక పేజీలో క్రికెట్ వార్తలతో మొదలుపెట్టి తరువాత సినిమా పేజీ చూడటం.. ఎవరైనా క్రికెట్ పేపర్ చదువుతుంటే వాళ్లు చదవడం పూర్తి అయ్యే వరకు ఎదురు చూడటం.. ఆదివారం అయితే డిస్ట్రిక్ట్ పేపర్ లో ఏ టీవీలో ఏ సినిమా ఎన్ని గంటలకి అన్న విశేషాలు తెలుసుకుని మిత్రులతో పంచుకోవటం.
ఓ రోజు నేను లక్ష్మయ్య అన్నయ్య ఇద్దరం కలిసి మంచినీళ్లకి వెళ్ళాం.
లక్ష్మయ్య అన్నయ్య చెప్తుండేవాడు "బడికి కొత్త సైకిల్, మంచినీళ్లకి పాత సైకిల్" అని..
నేను కూడా నా కొత్త సైకిల్ ఇంటి దగ్గర పెట్టి నాన్న సైకిల్ మీద మంచి నీళ్ళు తీసుకొస్తున్నాను ఆ పూట..
రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ విశేషాలు తను చెబుతున్నాడు.. "ఆహా.. ఏం కొట్టాడు సెహ్వాగ్.. న్యూజిలాండ్ బౌలర్లను చితకొట్టేశాడు అనుకో.."
మరోవైపు నేను తను చెబుతున్న మాటలను మ్యాచ్ హైలెట్స్ దృశ్యం రూపంలో మార్చుకుని సైకిల్ తొక్కుతున్నాను.
బిందెల్లో నీటితో ఉన్న సైకిల్ మా ఊరి కృష్ణుడు గుడి దాటి కొంచెం ముందుకు వెళ్ళింది..
అంతే, వెనుక నుంచి "అరెరే.. సైకిల్ చక్రం ఊడింది, సైకిల్ చక్రం ఊడింది.." అని మాటలు వినిపించాయి.
నా సైకిల్ ముందు ఒక చక్రం జోరుగా పరుగులు తీస్తుంది.. నా సైకిల్ బాగానే నడుస్తుంది కదా..
ఎవరిదిరా ఈ సైకిల్ చక్రం అని చూస్తే.. అది నా సైకిల్ ముందు చక్రమే. ఒక్కసారి నా గుండె జల్లుమంది,
ఒంటి చక్రం మీదే జోడి బిందెలతో నా సైకిల్ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళింది.
హ్యాండిల్ పట్టుకుని నెమ్మదిగా నేను కిందకి దిగాను..
అది మంచి నడి వేసవి కాలం..ఓ రోజు ఉదయం 10:30 గంటల సమయం.
వేసవిలో చెలరేగే సూర్యుడు ఆ రోజు మరింత నిప్పులు చెరుగుతున్నాడు. మరో వైపు మట్టి డొంకలో ఇసుక, వేడి గాలికి సుడులు కొడుతూ పైకి లేస్తోంది.
ఎండను లెక్క చేయకుండా పిల్లలు అందరం శేషు మామయ్య ఇంటి దగ్గర క్రికెట్ ఆటలో మునిగి తేలుతూ ఉన్నాం..
మా ఈడు కుర్రాల్లో చేయి తిరిగిన ఆటగాడు తేజ, గంటనుంచి అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఫీల్డింగ్ చేస్తున్న మేము ఆరోజు ఎండకి తడిసి ముద్ద అయ్యాం.
ఇంతలో రోడ్డుమీద ఓ దృశ్యం కనిపించింది, నడుచుకుంటూ వస్తున్న నాన్న కాళ్ల దగ్గర కొంత రక్తపు మరకలతో గీరుకుపోయి ఉంది.. తన పక్కనే మా సైకిల్ నడిపించుకుంటూ వస్తున్న మా ఊరి బాబాయ్.. సైకిల్ కింద పడినట్లు సొట్టబడిన బిందెలు, వాటికి అయిన మట్టి, భారంగా నడుస్తున్న నాన్న కాళ్లను చూస్తే అర్థం అయ్యింది.ఆ క్షణాన నాన్న దగ్గరికి వెళ్దామా వద్దా అనే సందిగ్ధంలో నేను.. ఎందుకంటే ఆ రోజు ఉదయం మంచినీళ్లు తీసుకురామని అమ్మ నాకు చెప్పింది.
ఉదయాన్నే నాన్న తాడి చెట్లు ఎక్కి, ఒక గొడ్ల చావిడిని తాటాకుతో కప్పడానికి వెళ్ళాడు. పని పూర్తయ్యి ఇంటికి వచ్చిన నాన్న ఇంట్లో మంచినీళ్లు లేవని తెలిసి, అలాగే ఎండలో మంచి నీటి కోసం వెళ్ళాడు. వేసవిలో నాన్న విరామం లేకుండా తాటి చెట్లు మూడు పూటలా ఎక్కడం, తాటి ఆకులతో పూరి ఇళ్లు, చావిడిలు కప్పడం చేస్తూ ఉండేవాడు. పని పూర్తయ్యాక ఆ ఇంటి వారు నాన్నకి మద్యం లేదా కల్లు తమ సంతోషం మేరకు పోసేవారు.. మరి ఆ రోజు ఓ వైపు తీవ్రమైన ఎండ ప్రభావమో, విశ్రాంతి లేకపోవడం, కొంత కల్లు తాగడం వలనో కళ్ళు తిరిగి పడిపోయాడు.
నాన్న నడుచుకుంటూ మా వైపు వచ్చే కొలది నా గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగింది. నాన్న దగ్గరికి వెళ్లి సైకిల్ పట్టుకుందామంటే భయం వేసింది.. "నువ్వు ఎందుకు మంచినీళ్లు తీసుకురాలేదు?" అని తిడతారనే భయం ఒక వైపు. తండ్రి విశ్రాంతి లేకుండా ఇంత కష్టపడుతున్నా, ఆటల్లో పడి ఒక చిన్న పని కూడా చేయలేకపోయాను అనే బాధ మరోవైపు.. నామీద నాకే కోపం.
నడుస్తున్న సైకిల్ పైన సొట్ట పడిన జోడు బిందెల్లో అడుగున ఉన్న కదిలే నీటి లాగే..
నా మనసులో ఆలోచనలు కూడా నన్ను ఆ క్షణాన కుదిపేశాయి..
వేసవి దాటికి మా వీధిలో కాలే ఇసుకలో నా పాదాలు కూరుకుపోయినట్లు, కదలలేక ముందుకు సాగలేక..
నాన్న వెనుకే నా అడుగులు బరువైన గుండెతో ఇంటి వైపు భారంగా కదిలాయి.
సమాప్తం
మీ చిన్నతనంలో నీటి కోసం ఇలా సైకిల్ మీద వెళ్లారా? లేదా ఇంకేదైనా మర్చిపోలేని పల్లెటూరి జ్ఞాపకం ఉందా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.
జిగిరి:
మనిషికి - ఆటవిక జీవికి మధ్య అద్భుతమైన అనుబంధాన్ని చూపించిన కథ జిగిరి.Music & Vocals : Suno AI పల్లవి: నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 1: అమ్మా.. తల్లితనం కోసం తల్లడిల్లి.. ఎన్ని నోములు నోచావో.. ఎన్ని పూజలు చేసావో.. నలుసుగా నీ కడుపున పడితే.. ఎన్ని దీక్షలు చేసావో.. ఎన్ని కష్టాలు కోర్చావో.. పుడమికి నే వచ్చినప్పుడు.. ఎంత మురిసి పోయావో... ఎంత కరిగి పోయావో.. నా తొలి అడుగు పడితే.. ఎంత ఆనందించావో.. ఎంత పరవశించావో.. [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 2: నీ చేతి గోరుముద్దలో.. అమృతం అద్దావు నీ నోట లాలిపాటతో.. నిద్రలో ముంచావు నీ ఒడినే బడిగా మార్చి.. పలుకులు నేర్పావు కంటికి కునుకు లేకనే.. నను కాచుకున్నావు బిడ్డ అడుగు బయట పెడితే.. మనిషి ఇంట్లో.. కనులు వాకిట్లో.. ఆ ఎదురు చూపులకు నే ఎదురైతే.. కోటి కాంతుల తేజాన్ని కళ్ళలో కురిపించావు [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 3: ఆకాశమంత అవధి లేని ప్రేమే నీదమ్మా భూమాతకు సాటి సహనం ఓర్పే నీదమ్మా గంగమ్మలా ఉప్పొంగే అనురాగం నీదమ్మా గాలిలా నను వెన్నంటి ఊపిరి నీవమ్మా అగ్ని తేజస్సుతో నిత్యం యజ్ఞమే నీవమ్మా పంచభూతాలకు ప్రతిరూపమే నీవేనమ్మా ఇలలోన నడయాడే దైవమే నీవేనమ్మా నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నను మోసిన ఓ తల్లి.. నిత్యం నీ మదిలో నను మోస్తావు మళ్ళీమళ్ళీ.. నీ ఋణం తీర్చుటకు ఈ జన్మ సరిపోదు నను కన్న తల్లి.. 07/05/2026
మార్చి నెలలో నేను చదివిన పుస్తకం ఉషశ్రీ భాగవతం. "భాగవతం చదివితే బాగు అవుతాం" అని పెద్దల మాట.
నాకు పురాతన దేవాలయాలు సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. ఆ దేవాలయ గోడలు మీద రామాయణ భారత భాగవత శిల్పాలను చెక్కిన విధానం చూస్తుంటే ఆ శిల్పాల యొక్క అందంతోపాటు , ఆ కథల యొక్క అంతర్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అందులో భాగంగా భాగవతం చదవాలని అనుకున్నాను. ఉషశ్రీ గారి భాగవతం పుస్తకం ఎంచుకున్నాను.
ఎన్నో కథలు.. ఎన్నెన్నో వింతలూ విశేషాలు..
ఉషశ్రీ గారి వచనం అమృతం.
ఈ భాగవత కథల్లో నాకు నచ్చిన కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను.
ముందుగా తండ్రి మాట కోసం, తండ్రి కోసం తపించిన ముగ్గురు కొడుకులు.. అందులో ఒకరు తండ్రి మాటకై రాజ్యం వదిలి అడవికి వెళితే, మరొకరు తండ్రి అజ్ఞను శిరసావహిస్తూ తన తల్లి శిరసునే ఖండించిన వ్యక్తి, మరో వ్యక్తి తన తండ్రి కోసం తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి, తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించిన వ్యక్తి.. ఈ ముగ్గురు కథలు భాగవతంలో చదువుతుంటే అద్భుతంగా ఆదర్శంగా అనిపించాయి.. ఆ ముగ్గురు ఎవరో మీరు గుర్తించగలరా? కామెంట్ బాక్స్ లో జత చేయండి.
మరో కథలో మనవడి ప్రేమ కోసం తాత చేసిన అద్భుతమైన యుద్ధం.. ఈ యుద్ధంలో తాత వెయ్యి చేతుల వ్యక్తిని మరియు శివున్ని ఎదిరించి మనవడి ప్రేమని గెలిపిస్తాడు.. ఆ తాత- ఆ మనవడు ఎవరో చెప్పండి చూద్దాం..?
ఇంకో కథ చూస్తే అందులో ఊర్వశి- పురారవుల ప్రేమ కథ. ఊర్వశి ప్రేమ కోసం పురారవుడు తపించిన విధానం.. ఆ ప్రేమను అంగీకరించడానికి ఊర్వశి విధించిన వింతైన షరతులు(తన రెండు గొర్రెలను బిడ్డలు లాగా చూడాలి, తన ముందు దిగంబరంగా ఉండరాదు) చదువుతుంటే వింతగా అనిపించాయి..
అతిధిని సేవించకుండా ముందే ఆహారం స్వీకరించాడని ఓ ముని కోపగ్రస్తుడైతే ఆ ఋషి జటములోనుంచి ఉద్భవించిన రాక్షసుడు.. తన భక్తుడి కోసం వచ్చిన సుదర్శన చక్రం.. ఆ మునిని ముల్లోకాలు తిప్పి తిరిగి భక్తుని దగ్గరికి వచ్చి శరణు వేడిన విధానం ..అంబరీషుని కథ చదువుతుంటే భగవంతున్ని నమ్మితే ఆయనే నీ తోడు, నీడై ఉంటాడు అనిపించింది.
దక్ష యజ్ఞంలో భాగంగా వీరభద్రుని దాటికి సూర్యుడు దంతాలు కోల్పోవడం.. మెత్తనివే ఆహార పదార్థాలు ఆయనకు ఆహారం అని ఈ భాగవతం చదివాకే నేను తెలుసుకున్నాను.
కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు కదా.. మరి వారందరితో ఆయన ఎంత అనురాగంగా ఉంటున్నాడో చూడాలని నారదమునికి ఓసారి కోరిక కలుగుతుంది. కృష్ణుని అంతఃపురమునకు వెళ్తే ఆయన చూపించని లీలలు అద్భుతంగా అనిపించాయి..
ఓ చోట ఒక భార్య వింజామర విసురుతుంటే కృష్ణుడు కబుర్లు చెబుతూ కనిపిస్తాడు. మరోచోట సింహాసనం అధిష్టించి నారద మహర్షిని చూడగానే దిగివచ్చి నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఇంకోచోట కృష్ణుడు తన భార్య తో కలిసి చదరంగం ఆడుతూ ఉంటాడు. మరోచోట తన ప్రియురాలికి ముత్యాల హారం వేస్తూ ఉంటాడు, మరోచోట తన కుమారులతో ముచ్చట్లు లాడుతూ ఉంటాడు.. ఇలా ఒకే వ్యక్తి అనేక చోట్ల చూపించే శ్రీకృష్ణ లీలలు ఈ భాగవతం కథలో అద్భుతంగా అనిపించాయి.
అంతే కాదు కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు వాటి తత్వాలు ఇలాంటి ఎన్నో విశేషాలను చాలా చక్కగా వివరించారు ఉషశ్రీ గారు ఈ భాగవతం కథలో ఓ చోట.మధ్య మధ్యలో పోతన గారి అందమైన పదాలతో కూడిన భాగవత పద్యాలను కూడా ఈ పుస్తకంలో జత చేశారు.. ఈ పుస్తకం లో ఆ పద్యాలు చదివాక భాగవతం పూర్తి పద్యాలతో చదవాలి అనిపించింది. పద్యాలు పైకి చదువుతుంటే పదాలు, వినసొంపుగా అందంగా ఉన్నాయి.
క్షీరసాగర మథనంలో ఓ పద్యం చూడండి..
హరి సూచిన సిరి సూడదు..
సిరి సూచిన హరియుజూడ సిగ్గును పొందున్..
హరియును సిరియును తమలో..
సరిజూపుల చూడ మరుడు సందడి చేసెన్
పోతన గారి గురించి ఇంటర్నెట్లో చదివాను. ఆయన ఒకపక్క హలం పట్టి వ్యవసాయం చేస్తూనే మరోపక్క ఈ అద్భుతమైన భాగవతాన్ని రచించారని తెలుసుకునే ఆశ్చర్యపోయాను. ఓ చోట ప్రహ్లాదుడు "గృహస్థుడు కి కర్మ ప్రధానం" అని చెబుతారు. అలాగే పోతన తన ప్రధాన జీవనోపాధి అయిన వ్యవసాయం కర్మ చేస్తూ.. మరోవైపు ఈ అద్భుతమైన భాగవతం రచించి ఆచరణలో చూపించారు. నాకు చాలా ప్రేరణగా అనిపించింది. భవిష్యత్తులో పోతన గారు జన్మించిన స్థలాన్ని.. భాగవతాన్ని రాముడు కి అంకితం ఇచ్చిన ప్రదేశాలు సందర్శించాలి అనుకుంటున్నాను.
సులభమైన వచనంలో అందించిన ఉషశ్రీ గారి శైలి అద్భుతం.. ఏకబిగిన చదివించేది ఆయన శైలి. సంక్షిప్త రూపంలో ఉన్న ఉషశ్రీ భాగవతం చదివాక పూర్తి స్థాయిలో ఆ కథలు అన్ని మళ్ళీ చదవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది.
మీరు కూడా భాగవతం చదివి ఉంటే ఏ పుస్తకం చదివారో.. మీ అనుభవాలు చెప్పండి.
తాటి సెట్టు కథనే వినరో పాట వినడానికి: తాటి సెట్టు కథనే వినరో
[పల్లవి]
ఉగాది 2026 పాట వినడానికి: : ఉగాది 2026 Song
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది.. వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది.. [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది.. వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది.. [Charanam 1] ఇంట పచ్చ తోరణములు ఆభరణములై తోచే.. చైత్రాన మధుమాసం దరహాసముతో మెరిసే.. కాలరూపమున జగన్మాతను వసంత నవరాత్రులలో కొలిచే.. ప్రకృతిలో.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. ప్రకృతిలో.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది.. వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది.. [Charanam 2] రైతన్న హలం పట్టి ఏరువాక సాగెను.. పండితుడు గళం ఎత్తి పంచాంగం చదివెను.. భావకవి కలం పట్టి ప్రకృతిని వర్ణించెను.. కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను.. కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను.. [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది [Charanam 3] షడ్రుచులను కలగలిపి.. దైవానికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి.. బ్రతుకున అన్వయించి కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని ముందుకు మున్ముందుకు సాగమని కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని ముందుకు మున్ముందుకు సాగమని సందేశం ఇచ్చెను. ఈ ఉగాది పచ్చడి! [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది
హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది హే హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది!