Sunday, 12 April 2026

ఉషశ్రీ భాగవతం పుస్తక పఠనం

 


మార్చి నెలలో నేను చదివిన పుస్తకం ఉషశ్రీ భాగవతం. "భాగవతం చదివితే బాగు అవుతాం" అని పెద్దల మాట.




నాకు పురాతన దేవాలయాలు సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. ఆ దేవాలయ గోడలు మీద రామాయణ భారత భాగవత శిల్పాలను చెక్కిన విధానం చూస్తుంటే ఆ శిల్పాల యొక్క అందంతోపాటు , ఆ కథల యొక్క అంతర్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అందులో భాగంగా భాగవతం చదవాలని అనుకున్నాను.  ఉషశ్రీ గారి భాగవతం పుస్తకం ఎంచుకున్నాను. 

ఎన్నో కథలు.. ఎన్నెన్నో వింతలూ విశేషాలు..

ఉషశ్రీ గారి వచనం అమృతం. 


ఈ భాగవత కథల్లో నాకు నచ్చిన కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను. 

ముందుగా తండ్రి మాట కోసం, తండ్రి కోసం తపించిన ముగ్గురు కొడుకులు.. అందులో ఒకరు తండ్రి మాటకై రాజ్యం వదిలి అడవికి వెళితే, మరొకరు తండ్రి అజ్ఞను శిరసావహిస్తూ తన తల్లి శిరసునే ఖండించిన వ్యక్తి, మరో వ్యక్తి  తన తండ్రి కోసం తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి, తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించిన వ్యక్తి.. ఈ ముగ్గురు కథలు భాగవతంలో చదువుతుంటే అద్భుతంగా ఆదర్శంగా అనిపించాయి.. ఆ ముగ్గురు ఎవరో మీరు గుర్తించగలరా? కామెంట్ బాక్స్ లో జత చేయండి. 


మరో కథలో మనవడి ప్రేమ కోసం తాత చేసిన అద్భుతమైన యుద్ధం.. ఈ యుద్ధంలో తాత వెయ్యి చేతుల వ్యక్తిని మరియు శివున్ని ఎదిరించి మనవడి ప్రేమని గెలిపిస్తాడు.. ఆ తాత- ఆ మనవడు ఎవరో చెప్పండి చూద్దాం..?



ఇంకో కథ చూస్తే అందులో ఊర్వశి- పురారవుల ప్రేమ కథ. ఊర్వశి ప్రేమ కోసం పురారవుడు తపించిన విధానం.. ఆ ప్రేమను అంగీకరించడానికి ఊర్వశి విధించిన వింతైన షరతులు(తన రెండు గొర్రెలను బిడ్డలు లాగా చూడాలి, తన ముందు దిగంబరంగా ఉండరాదు) చదువుతుంటే వింతగా అనిపించాయి..


అతిధిని సేవించకుండా ముందే ఆహారం స్వీకరించాడని ఓ ముని కోపగ్రస్తుడైతే ఆ ఋషి జటములోనుంచి ఉద్భవించిన రాక్షసుడు.. తన భక్తుడి కోసం వచ్చిన సుదర్శన చక్రం.. ఆ మునిని ముల్లోకాలు తిప్పి తిరిగి భక్తుని దగ్గరికి వచ్చి శరణు వేడిన విధానం ..అంబరీషుని కథ చదువుతుంటే భగవంతున్ని నమ్మితే ఆయనే నీ తోడు, నీడై ఉంటాడు అనిపించింది.


దక్ష యజ్ఞంలో భాగంగా వీరభద్రుని దాటికి సూర్యుడు దంతాలు కోల్పోవడం.. మెత్తనివే ఆహార పదార్థాలు ఆయనకు ఆహారం అని ఈ భాగవతం చదివాకే నేను తెలుసుకున్నాను.


కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు కదా.. మరి వారందరితో ఆయన ఎంత అనురాగంగా ఉంటున్నాడో చూడాలని నారదమునికి ఓసారి కోరిక కలుగుతుంది. కృష్ణుని అంతఃపురమునకు వెళ్తే ఆయన చూపించని లీలలు అద్భుతంగా అనిపించాయి..

ఓ చోట ఒక భార్య వింజామర విసురుతుంటే కృష్ణుడు కబుర్లు చెబుతూ కనిపిస్తాడు. మరోచోట సింహాసనం అధిష్టించి నారద మహర్షిని చూడగానే దిగివచ్చి నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఇంకోచోట కృష్ణుడు తన భార్య తో కలిసి చదరంగం ఆడుతూ ఉంటాడు. మరోచోట తన ప్రియురాలికి ముత్యాల హారం వేస్తూ ఉంటాడు, మరోచోట తన కుమారులతో ముచ్చట్లు లాడుతూ ఉంటాడు.. ఇలా ఒకే వ్యక్తి అనేక చోట్ల చూపించే శ్రీకృష్ణ లీలలు ఈ భాగవతం కథలో అద్భుతంగా అనిపించాయి.


అంతే కాదు కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు వాటి తత్వాలు ఇలాంటి ఎన్నో విశేషాలను చాలా చక్కగా వివరించారు ఉషశ్రీ గారు ఈ భాగవతం కథలో ఓ చోట.మధ్య మధ్యలో పోతన గారి అందమైన పదాలతో కూడిన భాగవత పద్యాలను కూడా ఈ పుస్తకంలో జత చేశారు..  ఈ పుస్తకం లో ఆ పద్యాలు చదివాక భాగవతం పూర్తి పద్యాలతో చదవాలి అనిపించింది. పద్యాలు పైకి చదువుతుంటే పదాలు, వినసొంపుగా అందంగా ఉన్నాయి.


క్షీరసాగర మథనంలో ఓ పద్యం చూడండి..


హరి సూచిన సిరి సూడదు..

సిరి సూచిన హరియుజూడ సిగ్గును పొందున్..

హరియును సిరియును తమలో..

సరిజూపుల చూడ మరుడు సందడి చేసెన్


పోతన గారి గురించి ఇంటర్నెట్లో చదివాను. ఆయన ఒకపక్క హలం పట్టి వ్యవసాయం చేస్తూనే మరోపక్క ఈ అద్భుతమైన భాగవతాన్ని రచించారని తెలుసుకునే ఆశ్చర్యపోయాను. ఓ చోట ప్రహ్లాదుడు "గృహస్థుడు కి కర్మ ప్రధానం" అని చెబుతారు. అలాగే పోతన తన ప్రధాన జీవనోపాధి అయిన వ్యవసాయం కర్మ చేస్తూ.. మరోవైపు ఈ అద్భుతమైన భాగవతం రచించి ఆచరణలో చూపించారు. నాకు చాలా ప్రేరణగా అనిపించింది. భవిష్యత్తులో పోతన గారు జన్మించిన స్థలాన్ని.. భాగవతాన్ని రాముడు కి అంకితం ఇచ్చిన ప్రదేశాలు సందర్శించాలి అనుకుంటున్నాను.


సులభమైన వచనంలో అందించిన ఉషశ్రీ గారి శైలి అద్భుతం.. ఏకబిగిన చదివించేది ఆయన శైలి. సంక్షిప్త రూపంలో ఉన్న ఉషశ్రీ భాగవతం చదివాక పూర్తి స్థాయిలో ఆ కథలు అన్ని మళ్ళీ చదవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది.

మీరు కూడా భాగవతం చదివి ఉంటే ఏ పుస్తకం చదివారో.. మీ అనుభవాలు చెప్పండి.


Friday, 3 April 2026

తాటి సెట్టు కథనే వినరో Song

తాటి సెట్టు కథనే వినరో  పాట వినడానికితాటి సెట్టు కథనే వినరో

[పల్లవి]

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..నిలువెత్తు నిలబడిన రూపం..గ్రామ ప్రజలకు అసలైన నేస్తం!

[చరణం 1] ఎండకు వానకు కాచే నీడయ్యింది..కాలువ దాటగ వంతెన అయ్యింది.. ఎండిన మట్టలు వంట చెరుకైంది..అమృతం సరిసమానమైన కల్లు నిచ్చింది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..

[చరణం 2]బ్రహ్మంగారి కాలజ్ఞానం..తాలపత్ర భాండాగారం..విజ్ఞానానికి తాటి సెట్టే మూలాధారం..గ్రామ దేవత గుడి ముందర..పోతురాజు రూపమై కొలువైంది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..



[చరణం 3]పిల్లల చేతిలో కిరికిరి బండై..తాటి బూరల అల్లరి రాగమై..అట్లతద్దిన ఊయలై మనసును ఊపింది..పేదవాని ఇంటికి నిట్టాడై నిలిచింది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..


[చరణం 4]ముంజలై..  తేగలై.. తాటి బెల్లమై..ఎన్నో రుచులతో విందులు చేసింది..బుట్టలై.. చాపలై.. విసనకర్రలై..ఎన్నో రూపాలై సేవలు చేసింది..కొమ్మల్లేని చెట్టైనా కోటి ఉపయోగాలు..తరతరాల తెలుగువారి తీపి జ్ఞాపకాలు!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..నిలువెత్తు నిలబడిన రూపం..గ్రామ ప్రజలకు అసలైన నేస్తం!

Thursday, 2 April 2026

ఉగాది 2026 Song

ఉగాది  2026  పాట వినడానికి: : ఉగాది 2026 Song 

తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..
[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..

[Charanam 1]
ఇంట పచ్చ తోరణములు ఆభరణములై తోచే..
చైత్రాన మధుమాసం దరహాసముతో మెరిసే..
కాలరూపమున జగన్మాతను వసంత నవరాత్రులలో కొలిచే..
ప్రకృతిలో‌.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే..
ప్రకృతిలో‌.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. 


[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..



[Charanam 2]
రైతన్న హలం పట్టి ఏరువాక సాగెను..
పండితుడు గళం ఎత్తి పంచాంగం చదివెను..
భావకవి కలం పట్టి ప్రకృతిని వర్ణించెను..
కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను..
కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను..

[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది

[Charanam 3]
షడ్రుచులను కలగలిపి.. దైవానికి నివేదించి
ప్రసాదంగా స్వీకరించి.. బ్రతుకున అన్వయించి
కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని
ముందుకు మున్ముందుకు సాగమని
కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని
ముందుకు మున్ముందుకు సాగమని
సందేశం ఇచ్చెను. ఈ ఉగాది పచ్చడి!
[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది
హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది హే హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది!