Sunday, 22 February 2026

పుస్తకం - అభినిర్యాణం

 


ఫిబ్రవరిలో చదివిన ఓ పుస్తకం "అభినిర్యాణం"





"సోలో ట్రిప్స్ అనేవి ఒక వరం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల ఉత్కంఠ ఒకలా ఉంటుంది.. అదే ఇతరులతో ఉన్నప్పుడు వాళ్లకు తగినట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఏదో ఒక తోడు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. నిజానికి ఒక మనిషికి అత్యంత అమూల్యమైన తోడు ఈ ప్రకృతి. ఏంటి నమ్మరా ? అయితే ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసి చూడండి తిరిగి వచ్చాక మీరే చెప్తారు అనుభూతి గురించి" 

పుస్తకంలో ఈ వాక్యాలు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి 


ప్రయాణాలన్నా ,పురాతన దేవాలయాలు- అక్కడ విశేషాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కనపరిచే నాకు "అభినిర్యాణం" అనే పుస్తకం పుస్తకాలు పండుగలో చాలా ఆసక్తికరంగా కనిపించింది.


ఈ పుస్తకంలో కథ సమాంతరంగా రెండు కాలాల్లో సాగుతూ ఉంటుంది..

ప్రస్తుత కాలంలో అభి అనే యువకుడు మరియు రాయల కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి, కళలు తెలుసుకోవాలని ఉత్సాహంతో భారత్ కు వచ్చిన రాయ్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు.. ఇలా ఇద్దరు రెండు వేరు వేరు కాలాల్లో చేసిన ప్రయాణమే అభి నిర్యాణం.. 


అభి తన ప్రాజెక్ట్ వర్క్ కోసం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్తాడు, అక్కడ దేవాలయంలో  అనంతమైన నిధి ఉన్న ఆరో గది విశేషాలు తెలుసుకుంటాడు.  దానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కూడా దొరుకుతాయి, కానీ ఆ తాళపత్ర గ్రంధాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 5 వారాల సమయంలో నాగబంధనం ఉన్న గది తాళం చెవి సంపాదించాలి లేకపోతే ప్రాణగండం ఉంటుంది..

ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయాలి.. చీకటంటే భయపడే అభి ఏ విధంగా తాళం చెవి సంపాదించాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సాహసోపేతమైన సంఘటనలు.. వేరు వేరు కాలాల్లో ప్రయాణించే రాయ్ మరియు అభికి ఉన్న సంబంధం ఏంటి అనేది పుస్తకం చుదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.


ఈ కథలో విశేషం ఏంటంటే కథానాయకులు అభి , రాయ్ ఇద్దరు కూడా కళను ఆరాధించే వారే.. అభి Profesional photographer మరియు రాయ్ కుంచె తో అద్భుతమైన సృష్టి చేసే చిత్రాకారుడు. ఇద్దరు ఈ ప్రయాణంలో తమ కంటితో చూసిన ఘట్టాలను అందమైన దృశ్యాలులాగా రచయిత చదువరులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

తిరువనంతపురంలో అభి చూసిన సంఘటన

"సూర్యుడు నిజంగా చిన్నపిల్లాడిలా గోడను పట్టుకుని మెట్లు దిగుతున్నట్లు మెల్లగా కిందకి దిగుతుంటే గోపురం మధ్యభాగం నుండి కనిపించింది." ఆ దృశ్యాన్ని అందమైన ఫోటో తీసాడు అభి.


హంపీలో రాయ్ చూసిన సంఘటన 

" అది విజయ విఠల దేవాలయం.. ప్రాంగణం నాట్య ప్రదర్శనకు సిద్ధం అయ్యింది, అతిరథమహారధులు అంతా వీక్షిస్తున్నారు.. సంగీతం పలికించే స్థంబాలు దగ్గర సంగీత విద్వాంసులు వెదురు కర్రలతో స్థంభాన్ని తాకుతుంటే ఒక్కో స్థంభం దగ్గర ఒక్కో శృతి, సరిగమలకు అనుగుణంగా అణువుఅణువున యజ్నంలా నాట్యం చేస్తున్న నర్తకి." ఓ అందమైన దృశ్యాన్ని రాయ్ చిత్రీకరించాడు..


నాగబంధనం ఉన్న ఆరవ గది తాళం వెతికే క్రమంలో మనం కూడా వివిధ ప్రదేశాల్లో ప్రయాణం చేస్తాం..

హంపిలో విజయనగర కాలం లోకి..

ద్వారకాలో గోమతి నది సముద్రం సంగమం అయ్యే ప్రదేశానికి..

పురాతన కాశీలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ ల వద్దకు..

బుద్దగయాలో ప్రేతశిల -  యమధర్మరాజు దేవాలయం ఉన్న ఎత్తైన కొండ పర్వతం మీదకు..


ఇలా కథ రెండు వేరు వేరు శతాబ్దాలలో ఆ ప్రాంతం విశేషాలను పాఠకుడు కి చెబుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆరవ గది తాళం చెవి శోధించడంలో ఉత్కంఠను కలిగిస్తుంది.


రచయిత ప్రవర్ష్ మనకు ఈ పుస్తక పఠన ప్రయాణంలోఎన్నో విశేషాలను చాలా బాగా పరిశోధించి చెప్పారు..

1.తిరువనంత పురం అనంత పద్మనాభ స్వామి విగ్రహం వెనుక ఉన్న కథ.

2.హంపీలో దేవాలయంలో రక్షణలా కనిపించే యాళీ.

3.కాశీలో అఘోరాలు జీవన విధానం, బెనారస్ చీరలు ప్రాముఖ్యత.

4.మొఘల్ నవాబుల కాలంలో దేవదాసీలు 

5.బ్రటీష్ రాజ్యంలో భారత్ ను వంశం చేసుకోవాలనే కోరిక కలిగిన విధానం.

6.ఆలయంలో పూజలు అందుకునే దేవతామూర్తి శిల్పం తయారిలో వివిధ రకాల అంచెలు - శిల్ప కళ విశేషాలు..


ఈ పుస్తకం చదివాక మన భారతదేశంలో అనేక ప్రదేశాలను సందర్శించిన అనుభూతి కలిగింది .


- శ్రీనివాస చక్రవర్తి.




Monday, 16 February 2026

శివరాత్రి పాట - 2026

మా అన్నయ్య వాళ్ళు AI సాయంతో పాటలకు tunes కడుతూ మంచి మంచి పాటలు Youtube ఛానల్ లో పెడుతుంటే నేను కూడా ప్రయత్నం చేద్దామని.. శివరాత్రి సందర్భంగా ఓ పాట రాసి Suno AI కి చక్కటి సంగీతం ఇచ్చింది. ఈ పాట రాత్రి పూట 12:00 నుంచి 03:30 వరకు రాసాను.
ఆ రాత్రంతా శివ నామస్మరణ నా మనస్సు , దేహంలో ప్రతి కణం చేస్తున్న భావం కలిగింది. ఉదయం మా ఆవిడ లేచాక వినిపించాను. చాలా బాగుంది అని తను చెప్పింది. వెంటనే తన Youtube Channel లో పాటను Upload చేసాము.

పాట వినడానికి: 


Lyrics:
ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..
శివ శివ శంకర కరుణాసాగర దయాకరా..
హర హర శంకర సాంబ సదాశివ పరమేశ్వరా..

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..

హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 

నే గొప్పంటే నే గొప్పని బ్రహ్మ–విష్ణువుకు అంతరం కలిగి..
ఆ అంతరాన్ని అంతం చేయాలని 
ఆది–అంతం వెదకమని..
కోటి కాంతుల తేజంతో లింగోద్భవ రూపంగా వెలిసిన.. 
ఆది అంతం లేని అనంతమూర్తి నీవే శివయ్య ..
హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

వరాహమై విష్ణువు పాతాళలోతుకు వెళ్లెను.. హంసరూపమై బ్రహ్మ ఆకాశమార్గం ఎగిరెను.. ఎంత వెతికినా అంతు చిక్కని మహిమ నీవే.. అనంతరూప.. పరమశివుడివే
హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..


అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికె..
పుట్టిన గరళంతో లోకాలన్నీ గజగజ వణికె..
ప్రళయకాలమున కాలకూటాన్ని కంఠమున ధరించె..
ఆపదలో నేనున్నానని చాటిన లోకరక్షకా నీలకంఠా..

హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 


గంగకోసమై భగీరథుని కఠిన తపమును మెచ్చి..
అఖండ ప్రవాహ గంగను జటాజూటమున ధరించి..
దివి నుంచి భువికి దింపి పుడమిని పావనం చేసి..
గంగాధరుడిగా మారిన కరుణాసాగరుడివే శంకర..
హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..
శివ శివ శంకర కరుణాసాగర దయాకరా..
హర హర శంకర సాంబ సదాశివ పరమేశ్వరా.. ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..

హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

Sunday, 1 February 2026

నా జీవితం నల్లేరు మీద బండి

 నా జీవితం నల్లేరు మీద బండి - సాకం నాగరాజు. ఒక పుస్తక ప్రేమికుని ఆత్మకథ



"ఒకసారి ఈ పుస్తకం చదవడం మొదలుపెడితే అదే మనల్ని చదివించుకుంటూ ముందుకు తీసుకు పోతుంది, అంత బాగా రాశారు"  అని గల్లా అరుణకుమారి గారు ముందు మాటలో చెప్పినట్లే ఉంది ఈ పుస్తక పఠనం.


పుస్తకాలు అంటే అంతులేని అభిమానం ఉన్న వ్యక్తి . ఒక యజ్ఞం లాగా ఎందరో బడి చిన్నారులకు ,పెద్దలకు పుస్తకాలు అందించి సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడానికి కృషి చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను.


"బాల్యం అనేది మీకైనా నాకైనా అది ఒక చలమ తవ్వే కొద్ది ఊరుతూనే ఉంటుంది" అంటూ నాగరాజు గారు బాల్య జ్ఞాపకాలని మన ముందు పరిచారు. 


ఆహా ఏమి రుచి: 

"ఓ రోజు మా అవ్వతో పాటు మా మిరప తోట దాకా వెళ్లాను. పొలానికి గాని అడవికి గాని వెళ్తే ఆకలి ఎక్కువగా అవుతుంది. అప్పుడు తిన్న అన్నం భలే రుచి. దీన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నో సార్లు పొలానికి/అడవికి వెళ్లాను". 

పుస్తకంలో ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మా అమ్మ నాన్నలకు ఉడత సాయం చేయడానికి నేను కూడా చిన్నప్పుడు మా పొలం వెళుతుండేవాడిని. అప్పుడు పచ్చడితో కలిపిన ముద్దలు తిన్న ఎంతో రుచిగా ఉండేవి. ఇదే విషయం మా నాన్నకు చెప్తే ఇక్కడున్న ప్రదేశంలో చల్లని తాడి చెట్లు నీడ, గాలి, పనిచేసి అలసిపోవడం వలన ఈ వాతావరణంలో నీకు తిన్నది బాగా రుచిగా అనిపిస్తుంది అని చెప్పారు.  నాగరాజు గారు చెప్పిన ఈ సంఘటన నా బాల్యంలోకి తీసుకెళ్ళింది.


డబ్బు అత్యాశ - గుణపాఠం: 

చిన్నప్పుడు నాగరాజు గారి ఇంట్లో డబ్బులు కోసం చిరు దొంగతనాలు చేసేవారట. అప్పుడు ఆ డబ్బులు చూసిన ఇద్దరు మిత్రులు "నీ వద్ద ఉన్న డబ్బును ఇంకా ఎన్నో రెట్లు డబ్బుగా చేస్తాము" అని ఆశ చూపించి పొలం తీసుకుని వెళ్తారు . అక్కడ ఒక గుంత తవ్వి ఆ గొంతులో ఈ ధనాన్ని పూడ్చిపెట్టి ఇలా చెప్తారు "మూడు రోజుల్లో ఈ గుంతలో డబ్బు చెట్టు మొలుస్తుంది. తర్వాత ఆ చెట్టు రోజు డబ్బు కాస్తుంది, కాకపోతే మూడు రోజుల వరకు మనం ఈ చోటికి రాకూడదు అదే నియమం" . ఆరోజు రాత్రి నాగరాజు గారికి నిద్ర పట్టలేదట ఉదయాన్నే లేచి గుంత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే.. ఆశ్చర్యం.. ఆ గుంత తవ్వేసి ఖాళీగా ఉంది. ఈ సంఘటన తనకి ఓ గొప్ప గుణపాఠం అంటారు ఆయన, దీని ద్వారా ఆయన ఎప్పుడు కూడా డబ్బు గూర్చి అత్యాశకు పోయి చీటీలు, స్కీం లాంటివాడి కట్టలేదట.

ఇలా ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉమ్మడి కుటుంబం, తను చేసిన చిరు దొంగతనాలు, అవ్వ చేతి ముద్ద.. ఈ పుస్తకంలో పంచుకున్నారు..


విద్యార్థి దశలోని నాయకుడిగా పనిచేసారు ఒకోసారి చదువులో వెనక పడుతున్నానని ఆలోచన కూడా ఉండేది. చదువు పూర్తికాగానే హైదరాబాద్లో బృందావన్ హోటల్లో ఐదు సంవత్సరాలు పాటు పనిచేశారు,‌తరువాత తెలుగు అధ్యాపకుడిగా ప్రయాణం మొదలు పెడతారు.


అధ్యాపకునిగా మొదటి తరగతి: 

నాగరాజు గారి మాటల్లో"నా మొదటి క్లాసు డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు శ్రీ శ్రీ ప్రతిజ్ఞ పాఠం చెప్పాను, గీతాన్ని లైన్ తర్వాత లైను నాటికియంగా చదివాను, అంతే క్లాస్ అయ్యాక ఒక అమ్మాయి దేవుడా ఇతనా మా తెలుగు లెక్చరర్ కర్మ ..కర్మ.. అంది. ఆరోజు నుంచి క్లాస్ కి భయంగా ప్రిపేర్ అయ్యేవాడిని , ఒకసారి క్లాస్ కి సరిగ్గా ప్రిపేర్ కాలేదు. తరగతికి వెళ్లి అభాసు పాలయ్యే బదులు సెలవు చీటీ తీసుకొని ప్రిన్సిపాల్ గారికి ఇస్తే.. "కాలేజీకి వచ్చి సెలవు చీటీ ఇవ్వడానికి సమయం ఉంది కానీ గంట సేపు పాఠం చెప్పలేవా" అని అన్నారట..

30 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఇలా ఎన్నో విషయాల్ని నిజాయితీగా ఇలా పంచుకున్నారు. 


మిత్రులు చెప్పిన మాటలు: 

1."ఏ పని లేకపోతే అది మిట్ట మధ్యాహ్నం అయినా పడి తిరుగుతూ వుండు, ఖాళీగా మాత్రం ఉండకు పగటిపూట పడుకోకు" ఇది వజ్రం లాంటి మాట అంటారు నాగరాజు గారు. 

ఆయన అలాగే పాటించి కాలికి బంగారం కట్టుకుని తిరిగారట.


2."కాలేజీ ,బజారు, ఫంక్షన్ కి ముస్తాబయి ఎంత నీటుగా ఉంటామో ఇంట్లోనూ మనం ఆ రీతిగా శుభ్రంగా ఉండాలి.. భార్య బిడ్డలు ముందు కూడా" . నిజంగా ఇది ఎంతో అమూల్యమైన మాట కదా..


పాఠాలు ఆసక్తి కలిగించడానికి: 

పాఠాలు చెబుతున్నప్పుడు ఉపోద్ఘాతాలతో తాను చేసిన ప్రయోగాలను వివరంగా చెప్పారు ముఖ్యంగా శాకుంతలోపాఖ్యానం , ద్రౌపదిపరివేదనను ఉదాహరణ ద్వారా బాగా చెప్పారు. సందులు , చందస్సు ,అలంకారాలు లాంటి వాటిని నిజ జీవితాలకి కనెక్ట్ చేసి ఆయన చెప్పిన వివరణ చాలా బాగుంది.  ఇందులో ఆయన చెప్పిన సూచనలు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 


తెలుగు భాషొద్యమ సమితి ద్వారా ఎన్నో పుస్తకాలు, ఎందరికో కవులకు ప్రోత్సాహం: 

"2001వ సంవత్సరం నామినితో పరిచయం ద్వారా నా జీవితాన్ని పుస్తకం వైపు మలుపు తిప్పింది" అని చెబుతారు. 

పెళ్లి, పుట్టినరోజు ,మరణం, గృహప్రవేశం.. సందర్భం ఏదైనా వ్యక్తుల పేరు మీద తీసుకు వచ్చిన పుస్తక సంకలనాలు , కొత్త పాఠకులు కావడానికి సాధనం అయ్యాయట. వేలాది మందికి సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించాయి. "నా చేతుల మీదగా 50 పుస్తకాలు ప్రతీది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ" అంటున్నారు.


పుస్తకాలు అచ్చు వేయడం ఒక ఎత్తైతే వాటిని పాఠకులకు చేర్చడం మరో ఎత్తు "స్కూటర్ బండిమీద పెట్టుకొని స్కూళ్లకు తిరిగి..  చిన్నారులకు , పాఠకులకు పుస్తకం గురించి చెప్పాలి.. ఇదో పుస్తక యజ్ఞం". 


పెళ్లి పత్రిక తో పాటు ఓ కథ : 

నాగరాజు గారి మాటల్లో "నేను పాపా నాయుడు పేట కాలేజ్ లో పనిచేసేటప్పుడు క్లాసులో శంకరంమంచి గారి కథ 'అంపకం' చదివి వినిపించాను ఆ కథ విన్నాక ఆడపిల్లల కంట్లో తడి చూశాను" . ఆ కంటి తడే ఎందరి పెళ్లి పత్రికల్లో అనుబంధం అయింది. పెళ్లి పత్రిక కవర్ లో ఆహ్వాన పత్రిక మరియు 'అంపకం' కథారాజం  రెండు వచ్చాయి.. 


అసలు ఎందుకు నాగరాజు గారు ఎన్నో పుస్తకాలు ప్రచురించీ, ఎందరికో పంచుతున్నారంటే ఆయన మాటల్లో "డిగ్రీలో నేను చదివిన ఆ తొలి పుస్తకాలే నా దొంగ బుద్ధిని మార్చి జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పాయి.. పుస్తకదానం సమాజంలో ఒక వ్యక్తిగా నా కనీస బాధ్యత, అందుకోసమే ఈ తాపత్రయం.."


ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి:

"తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని కథలు చదవమనండి రాయమనండి ఒక పుస్తకం కొనుక్కొని సొంత గ్రంథాలయానికి శ్రీకారం చుట్టుమనండి, ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి" ఇవి పుస్తకంలోని చివరి మాటలు..


127 పేజీల ఈ చిరు పుస్తకంలో సాకం నాగరాజు గారు తన జీవిత అనుభవాలన్నీ మన ముందు ఎంతో నిజాయితీగా కళ్ళ కట్టినట్లుగా చెప్పారు. ముందుమాటలో తాడి ప్రకాష్ గారు అన్నట్లుగా "ఊరుకో నాగరాజు వుంటే బావుణ్ణు"..


పుస్తకాభిమాని నాగరాజు గారు ఈ పుస్తకంలో సందర్భానికి తగ్గట్లుగా పేర్కొన్న కొన్ని పుస్తకాలు.

1. శ్రీశ్రీ మహాప్రస్థానం : విద్యార్థిగా ఉన్నప్పుడు తనకు ఒక కొత్త చూపుని ఈ కవిత్వం ఇచ్చిందని ఆయన చెప్పారు. 

2. దిగంబర కవిత్వం: డిగ్రీ చదువుతున్నప్పుడు లైబ్రరీ నుంచి తీసుకున్న ఈ పుస్తకాన్ని ఓ రాత్రంతా కూర్చుని చదివారట. 

3. తిక్కన భారతం: డిగ్రీ లో చదివిన పుస్తకం ఇందులో ఘట్టాలు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారట.. 

4. స్వీట్ హోమ్:  నాగరాజు గారు పంచిన పుస్తకాలను చదివి ఓ యువతి ఇలా రాశారట. పెళ్లయిన స్త్రీ స్వీట్ హోమ్ చదివితే "అరెరే మనం బుచ్చిబాబు లాంటి భర్తను మిస్సయ్యామే అని నొచ్చుకుంటుంది", పెళ్లి కాని అమ్మాయి చదివితే "మనకు బుచ్చిబాబు లాంటి అబ్బాయి వస్తే బాగుంటుంద"ని ఆశపడుతుంది.

5. కన్యాశుల్కం : రావిశాస్త్రి గారు ఈ పుస్తకాన్ని "మానవమాత్రుల మాత్రం రాసింది కాదు, దేవతలు రాసింది ఈ పుస్తకం" అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని నాగరాజు గారు తమ కూతురికి చదివి వినిపించేవారట.

6. తెలుగు కథకు జేజే: తెలుగు కథల కథా సంకలనం "నిండు పళ్ళబుట్ట" అని అనేక పత్రికలు ప్రశంసలు కురిపించాయి.

7. యేసోపు కథలు: కవితలు లాంటి కథలు పిల్లల పుస్తకం మరియు పెద్దల పుస్తకం. 

8. మిట్టూరోడి పుస్తకం: మాండలికానికి గుడి కట్టిన పుస్తకం. 9.దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఆత్మకథ : చిత్రాకారులు బాపు మెచ్చిన జీవితకథ


నేను నాగరాజు గారికి "నా జీవితం నల్లేరు మీద బండి" పుస్తకం పంపమని మెసేజ్ చేసాను. సార్ నాకు మరిన్ని పుస్తకాలు కూడా పోస్ట్ లో పంపారు. 


పుస్తకం కోసం 94403 31016 సంప్రదించవచ్చు.


- శ్రీనివాస చక్రవర్తి.