Monday, 14 September 2026

చదువు తీర్చిన జీవితం పుస్తక పరిచయం.

 



నా చిన్నప్పుడు 2000-2002 సమయంలో నాన్నతో కలిసి రేడియోలో వచ్చే మహాత్మా గాంధీ ఆత్మకథ వినేవాడిని.. ఆ మాటలు వింటున్నప్పుడు స్వయంగా గాంధీగారే మన పక్కన కూర్చుని చెబుతున్నట్లు.. ఆ ఘట్టాలు ఎంతో ప్రేరణగా అనిపించేవి.. విద్యార్థిగా హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2010 వ సంవత్సరం 100 రూపాయలు తీసుకుని మొదటిసారి పుస్తకాల పండుగకు వెళ్ళాను. అప్పుడు గాంధీ గారి ఆత్మకథ పుస్తకం 35/- రూ తీసుకున్నాను. గాంధీ జీవితంలోని ఘట్టాలు ఆయన నిజాయతీగా చెప్పిన విధానం చదువుతుంటే ఎంతో ప్రేరణగా అనిపించింది.. దాని ప్రభావంతో నా రోజువారీ దినచర్య రాయడం ఆరంభించాను. చదువులో మంచి ఫలితాలు చూశాను.. అప్పటి నుంచి తెలుగులో వచ్చిన ఆత్మకథా సాహిత్యం ప్రతి ఏడాది పుస్తకాల పండుగలో వెతుకుతూ ఉండేవాడిని..

అలా వెతుకుతున్న క్రమంలో పుస్తక ప్రేమికులు దేవినేని మధుసూదనరావు గారు నాకు ఒక అద్భుతమైన పుస్తకం ఇచ్చారు "చదువు తీర్చిన జీవితం". ఈ పుస్తకానికి శీర్షిక ఒక సామాన్య మహిళ ఆత్మకథ అన్నారు కానీ ఆమె చూపిన కార్యదీక్ష, క్రమశిక్షణ అసామాన్యం. కాళ్లకూరి శేషమ్మ గారికి చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం, కానీ చిన్న వయసులోనే వివాహం జరగడం, పిల్లలు పుట్టడం, వాళ్ల పాలన.. తరువాత తిరిగి 40 సంవత్సరాల వయస్సులో విద్యార్థిగా మరలా మారి తనకిష్టమైన చదువుతో ఓ మంచి ఉపాధ్యాయినిగా ఎదిగారు. జీవితం పట్ల తరగని ప్రేమ - ఆశావాహ దృక్పథంతో సాగిన ప్రయాణంలో ఎన్నో విలువైన జీవిత పాఠాలను శేషమ్మ గారి ఆత్మకథ చదివి మనం తెలుసుకోవచ్చు. ఎంతో నిజాయితీగా ఆమె గురించి రాశారు..

పుస్తకంలో కొన్ని విశేషాలు శేషమ్మ గారి మాటల్లో:

"చిన్నతనంలోనే వైవాహిక జీవితం, మాతృత్వం, ఆర్థిక బాధలు చదువుకోవాలనే తపన.. గురువు దగ్గర నేర్చుకునే అవకాశం లేదు- ఏం? అందరూ గురువు దగ్గర నేర్చుకుంటున్నారా? పుస్తకం గురువు కాదా? ప్రపంచం, ప్రకృతి, సాహిత్యం, నా అనుభూతి, వయస్సుతో వచ్చిన నా అనుభవం ఇవన్నీ గురువు కాదా..

ఓ రోజు శ్రీవారు "నాకు ఇంక్రిమెంట్ వచ్చింది ఏం కావాలో అడగమన్నారు". నేను "ది హిందూ నెలసరి చందా రూ 04:14 పైసలు కట్టండి, నెలంతా మంచి పత్రిక చదవవచ్చు, దేశ కాలమాన పరిస్థితులను తెలుసుకోవచ్చు" అని అన్నాను. శ్రీవారు "మంచి చీర అడుగుతావు బహుమతిగా అనుకున్నాను" అన్నారు. "చీర కొన్నాళ్లకు పాతది అవుతుంది, అదే విజ్ఞానం అయితే ఎప్పటికీ తరగనిది, నిత్య నూతనం" అన్నాను.

శేషమ్మ గారు పుస్తకాలంటే ఎంత ప్రేమో చెబుతూ "పట్టు చీరలు ఏనాడూ కొనలేదు, నాకు, పిల్లలకు లెక్కలేని పుస్తకాలు కొన్నాను"..

"విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు నాలో ఆత్మబలాన్ని, పట్టుదలను పెంచి ఆత్మగౌరవాన్ని మేల్కొలిపాయి. ముఖ్యంగా 'చంద్రగుప్తుని స్వప్నం' అనే పుస్తకంలో 'ఆలోచనయే విద్య' అన్న మాట నాలో విశ్వాసాన్ని పెంచింది."

"గాంధీ గారి సత్యశోధన పుస్తకం నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఆయన చెప్పిన 'వాక్కు, ఆలోచనలు, చేతలు ఒకదానికొకటి అనుసంధానం కావాలి' అనే మాట నాకు వేదవాక్కు అయింది."

"ఎన్నో విషయాలు తెలుసుకోవాలని తపన, తృష్ణ.. మంచినంతా చదవాలి. పుస్తక పఠనం వ్యసనంగా మారినా తప్పులేదు, సమయం సద్వినియోగం చేసుకోవాలి. గంగిరెద్దులాగా, నూతిలో కప్పలాగా కాకుండా విశాల దృక్పథం పెంచుకోవాలి.. నా ఇల్లు, నా ఊరు అని కాక నా రాష్ట్రం, నా దేశం, నా విశ్వం అనే దిశగా.."

చివరగా ఈ మాటలు చూడండి... "ప్రముఖుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఎందుకు చదవాలి? పనిలేక కాదు, కాలక్షేపం కోసం కాదు.. జీవితంలో కష్టసుఖాలు తట్టుకునే శక్తి కోసం, మనవి నిజంగా పెద్ద కష్టాలు కావని వారి జీవితాలు చూసి తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ జీవిత కథలను చదవాలి.."

ముందుమాటలో వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారు చెప్పినట్లుగా "ఎన్నో సౌకర్యాల మధ్య పెరుగుతూ కష్టం అనేదే తెలియని ఈనాటి పిల్లలకి.. ఈ పుస్తకం.. ఒక నీతి బోధ.. ఒక మార్గదర్శకం"..

మరి మీకు నచ్చిన ఆత్మకథ/జీవితకథ పుస్తకాల పేర్లు నాతో పంచుకోరా..?


- శ్రీనివాస చక్రవర్తి.