Sunday, 27 September 2026

అంటరాని వసంతం - పుస్తకం

 సెప్టెంబర్ నెలలో చదివిన పుస్తకం 

అంటరాని వసంతం 



ఈ పుస్తక పఠనం హృదయాన్ని కదిలించే అనుభూతి..

దృశ్యం తరువాత దృశ్యం స్పష్టంగా కళ్ళముందు నిలుస్తుంది.ప్రధాన కథలో ఎన్నో ఉప కథలు.ఇది తర తరాల తాత ముత్తాతల జ్ఞాపకాల ప్రవాహం..

నేను ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టాక మొదటి పేజీల్లో రూతు, రూబెన్ పేర్లు అనువాదపు కథ పేర్లు లాగా ఉండి కథలో లీనం కావడానికి 2 పేజీలు పట్టింది .

తరువాత వచ్చిన కామధేనువు - జాంబవంతుడు కథతో దళితులు ఎలా పుట్టారో చెప్పారు, అక్కడ నుంచి తరువాత ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ప్రతి సన్నివేశం దృశ్యం లాగా కవితాత్మకంగా సాగుతుంది.


ఈ కథలో నాకు నచ్చిన కొన్ని ఘట్టాలు 

పల్లెను వరద ముంచెత్తిన్న ఓ ఘట్టం

"నడవండి..

బతకడానికి నడవండి..

మనం బతకాలి.. నడవండి"

వరదలో చిక్కున్న జనంను ఉద్దేశించి నారయ్య మాటలు. 

ఆ జనం కోసం నారిగాడు ఆ వరదలో చేసిన పోరాటం చదువుతుంటే మన మనస్సు వరద అవుతుంది.

నాగన్న నాన్నతో పొలం వెళ్ళి తాటిముంజెకాయ కొట్టే లోపు ముంజలు తినడం, తాటి ఈనకు నత్త గవ్వలు కట్టి పీతలు పట్టడం

ఈ సంఘటన చదువుతుంటే నాకు నా చిన్నప్పుడు మా ఊరి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

 నన్ను బాగా కదిలించిన మరో సందర్భం "తెలుగు నాట - ధాతు కరువు" తినడానికి మెతుకు లేక భారీ వలసలతో ఖాళీ అయిన గ్రామాలు, మరోవైపు కలరా మహమ్మారితో రాలిపోతున్న జనం ..

ఆ సమయంలో జన్మనిచ్చిన ఊరును, కట్టుకున్న భార్యను చూడాలని ఎంతో దూరం నుంచి ఊరి బాట పట్టిన ఎల్లన్న ...

పుస్తకంలో చెప్పిన మాటలు 

"తల్లి.. కొడుకు.. తండ్రి.. కూతురు..

ఏం బంధం ఇది 

అది ఉన్నవాళ్ళకి(ధనికులు) కావచ్చు 

లేనివాళ్ళకి(పేదలు) కావచ్చు..

ఉన్నది ఒకే ఒక్క శాశ్వత బంధం - ఆలుమగల బంధం" .

ఎన్నో ఏళ్ళ తరువాత ఎల్లన్న తన భార్యన కలిసే సంఘటన అది, మన హృదయాన్ని కదిలించి వేస్తుంది ..

ఈ కరువు రోజుల్లో తినడానికి ఆహారం కోసం వెతుకుతుంటే ఓ గుడిసెలో సగం తిని వదిలేసిన పళ్ళెం కనపడుతుంది.. తీరా చూస్తే ఓ ముసలి ఆయన చనిపోతూ సగం తిని వదిలేసిన పళ్ళెం, ఆ మిగిలిన సగం ఆహారాన్ని అదృష్టంగా భావించి ఇతరులు తినబోయారు అంటే ఆనాడు ధాతు కరువు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుంటే మన గుండె జలదరిస్తుంది.

మరో సంఘటన మాలపల్లి ప్రజలు తొలిసారి చెరువులో నీరు తెచ్చుకునే సందర్భం..

మొదటి సారి పాదాలకు చెరువులో నీళ్ళు తాకగానే కళ్ళలో కన్నీరు ఉబికి తిరిగి చెరువులో పడుతుంది.. 

జీవితంలో అందనిది దొరికితే లభిస్తే ఎలా ఉంటుందో చెప్పే సంఘటనను హృద్యంగా వర్ణించారు.

పుస్తకంలో చివర రెండు అధ్యాయాలు చదివే వేగాన్ని తగ్గించాయి.. ఎక్కువగా అంతర్మథనం సాగే ఆ రెండు అధ్యాయాలలో నా పఠనం చాలా నిధానంగా సాగింది. 

మొత్తం మీద ఈ పుస్తకం చదువుతుంటే కొన్ని తరాల వెనుకకు వెళ్ళి మన తెలుగు నేల మీద అప్పటి సామాజిక పరిస్థితులను, ప్రజలు జీవన విధానాన్ని, ఆనాటి మన జానపద కళలను దర్శించి ఓ చక్కటి ప్రయాణం చేసినట్టుగా అనిపించింది..

నేను అంతకు ముందు చదివిన 

ఏడు తరాలు,

మా నాయన బాలయ్య,

వీరయ్య పుస్తకాలు లాగా 

మూలాలను తెలుసుకునే విధంగా పుస్తకం బాగా నచ్చింది.


మరి మీలో ఎవరైనా అంటరాని వసంతం చదివారా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది? 

మన మూలాలను తెలుసుకునే ఇలాంటి ఇంకా ఏమైనా ఉంటే సూచించండి.

No comments:

Post a Comment