Sunday, 11 October 2026

పొట్టేలు పుస్తకం



"సదువుకున్నోన్ని నెత్తిన పెట్టుకునే రోజులొచ్చుండాయి. కూటికి గుడ్డకిబ్బంది పడుతూ కూడా సదువును నమ్ముకుని బాగుపడినోళ్ళు ఎంతో మంది ఉన్నారు" .

ఈ వాక్యంతో చదువు యొక్క విలువను ఈ కథలో చాలా బాగా చెప్పారు..


కట్టుకున్నోడు దూరమైన పైన చెప్పిన మాట మీద నమ్మకంతో బిడ్డలు భవిష్యత్తు కోసం ఓ తల్లి కష్టపడి బిడ్డను దారి చేస్తే , తీరా బిడ్డకు రెక్కలు వచ్చి ఉద్యోగాలకై దేశాలు వెళితే..  వారి రాకకై ఎదురు చూస్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ తల్లి. తన పెంపుడు జంతువు పొట్టోలులో ఆత్మీయ బంధాన్ని చూస్తున్న తరుణంలో అదే జంతువు దేవుడు మొక్కుగా బలి ఇవ్వబోతుంటే తల్లి పడిన ఆరాటమే ఈ కథ.


సంపాదన,  ఇతరులు అంచనాలతో తనను తాను మర్చిపోయిన కొడుకు..

ఆకాశంలో వచ్చేపోయే విమానాలు చూస్తూ  కొడుకు రాక కోసం ఎదురు చూపులు చూసిన తల్లి..

తనను సాకిన యజమానికై ప్రాణం పణం పెట్టి

పోరాటం చేసిన ఓ మూగ జీవి..


కథలోని ఘట్టాలను చాలా బాగా చీత్రీకరించారు రచయిత వివేక్ లంకమల, ముఖ్యంగా చివరి ఘట్టంలో మల్లెంకొండ స్వామి వారి మొక్క కోసం కొండమీదకు చేసిన ప్రయాణం వివరించిన విధానం నాకు బాగా నచ్చింది.. రచయిత తన ప్రధాన బలం యాత్ర కథనాలను స్నేహితుడు మనతో ముచ్చట్ల చెప్పినట్లు చాలా ఆసక్తికరంగా చెబుతారు.. కొండ ఎక్కే క్రమంలో  ఎలుగుబంటి ఎదురైనా ఘట్టాలు, తల్లి - కొడుకు Climax లో వచ్చే సంభాషణలు చదువుతుంటే కచ్చితంగా అందులో మనల్ని మనం ఊహించుకుంటాం‌‌.


ఈ కథలో ఒక వైపు అందమైన ప్రకృతి దృశ్యాలు.

కంటికి కట్టినట్టు సాగే సూర్యాస్తమయాలు - చంద్రోదయాలు ఒక వైపు..


మరోవైపు అదే ప్రకృతి మనిషికి నేర్పే పాఠాలు..

తీతువు పిట్ట గూడు - యానాదులు పిల్లాడు చేపలు పట్టే దృశ్యం చదువుతుంటే చాలా ప్రేరణగా అనిపిస్తుంది .


నేడు డబ్బు సంపాదనలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకు - పరుగులతో యాంత్రిక జీవనంలా సాగిస్తున్న వారికి కథానాయకుడు మల్లేష్ తల్లితో చెప్పిన ఈ మాటలు కనువిప్పు లాగా ఉన్నాయి ఓసారి చూడండి.


"నామీద నాకంటే నా చుట్టూ ఉన్న మనుషులు అంచనాలు ఎక్కువయ్యాయి. ముందు దాని దాటాలని పరుగు మొదలు పెట్టాను. అలా పరుగు తీస్తూ నన్ను నేను కోల్పోతున్నా అని అర్థమయ్యేది కానీ ఎవరికి చెప్పాలో తెలిసేది కాదు.. ఎన్నో వందలసార్లు అనుకున్నా ఇవన్నీ పక్కనపడేసి నీ దగ్గరకు వచ్చేద్దామని కానీ కాలం అలా ఉండనివ్వదే"


బతుకు తెరువుకై నిత్యం పోరాడుతూ పుట్టిన ఊరికి, కన్న తల్లితండ్రులకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను ప్రతిబింబించేది ఈ కథ.. 

యువరచయిత వివేక లంకమల గారు ప్రస్తుతం సమాజంలో ఉన్న ఈ అంశాన్ని ఈ చిన్ని 100 పేజీల నవలలో మన ముందు ఉంచారు.

మంచి రచనను ప్రోత్సాహించిన ఝాన్సీ పబ్లికేషన్స్ వారికి మరియు రచయిత వివేక్ గారికి ధన్యవాదాలు.


- శ్రీనివాస చక్రవర్తి.

1 comment: