Tuesday, 23 August 2016

Story - సంక్రాంతి రైలు

సంక్రాంతి రైలు


సాయంత్రం 05:00 అయ్యింది. ఆఫీసులో కంప్యూటర్ లో నేను నిమగ్న అయ్యిపోయాను. ఎవరో ఒక వ్యక్తీ నా భుజంపైన చేయి వేశారు.. నేను కంప్యూటర్ ప్రపంచంలో నుంచి బయటకు వచ్చాను, నా మిత్రుడు టీ తాగుదాం పదా అన్నాడు.
ఇద్దరం అలా నడుచుకుంటూ బయటకు వెళుతున్నాం. నా పేరు శ్రీను ,నా మిత్రుడు సోమ శేఖర్. వాడ్ని మేము అంతా సోము అని పిలుస్తాం. చాలా తెలివైనవాడు. ఇద్దరం ఒకేసారి మా ఉద్యోగ జీవితాలను ప్రారంభించాము.
టీ అందుకొన్నాము,
వాతావరణం చల్లగా ఉండడం వలన  వేడి వేడిగా టీ ఎంతో బాగా అమృతంలాగా అనిపించింది..
సోము : శ్రీను, రేపు నేను ఊరు వెళుతున్నాను రా, సంక్రాంతి సందర్భంగా ..
నువ్వు కూడా రావచ్చు కదా మా ఊరు.
నేను : లేదురా ఈ మూడు రోజులు ఇక్కడే ఉందాము అనుకుంటున్నాను.. నాకు కొంత విశ్రాంతి కావాలి.. నువ్వు వెళ్లు.
సోము : అరేయ్, ఇంకా ఏమి మాట్లాడకు..ఇక్కడ ఏమి చేస్తావు.. నాతో రారా.. మా ఊరిని చూపిస్తాను.. సంక్రాంతి ఎంత వేడుకగా చేస్తారో చూద్దువుగాని.. నా మాట విని నాతో రా..
నేను : సరేరా..
****
సోము నాకు ఫోన్ చేసి అరే శ్రీను త్వరగా రారా రైలు టైము అవుతుంది నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను స్టేషన్ లో...
నేను హడావుడిగా స్టేషన్ కి వెళ్ళాను... మొత్తానికి రైలుని అందుకొన్నా.. రైలు నెమ్మదిగా మొదలు అయ్యింది.. సూర్యుడు ఈరోజుకి సెలవంటూ భూమికి మరో వైపుకి వెళుతున్నాడు.. ఇద్దరం మాట్లాడుకుంటున్నాము.. రైలు వేగాన్ని అందుకొంది.. రైలు ఇంజన్ దీపాలు  చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది.. సోముకి నిద్ర వస్తుంది అని పడుకున్నాడు.. నేను కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాను.. నా చూపు ఆకాశం వైపు మళ్ళింది. ఆకాశంలో చుక్కలను చూస్తూ అలా ఉన్నాను...  రైలు తన గమ్యం వైపు వెళుతుంటే నా ఆలోచనలు నా బాల్యంలోకి వెళ్ళాయి.. ఆ చుక్కలు చూస్తూంటే, ఈ విధంగా రైలు ప్రయాణం చేస్తుంటే, నా చిన్ననాటి రోజులులోకి నా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి..
*****
మాది కృష్ణవేణి నదీ తీరాన ఒక గ్రామం.. మా తాతయ్య బాగా చదువుకొన్న వ్యక్తి. ఊరిలో ఎంతోమందికి ఆయనంటే మంచి గౌరవం.. అందరూ చదవాలి - అందరూ ఎదగాలి అని ఆయన అంటూ ఉండేవారు.
మా నాన్నగారిని బాగా చదివించారు. నాన్న బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నారు. నాన్న ఉద్యోగం రీత్య మేము పుట్టినపుడే ఈ భాగ్యనగరానికి వచ్చాము.. సంక్రాంతి పండుగకు మేము అంతా మా ఊరు వెళ్లేవాళ్లం.. ఇప్పటికి నాకు మా ఊరు తొలిసారి వెళ్ళిన జ్ఞాపకాలు అలా నా మదిలో మెదులుతూ ఉన్నాయి.. అప్పుడు ఒకరోజు పోష్టుమెన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు.. అది చదవమని అమ్మ నాకు ఇచ్చింది. అది తాతయ్య రాసిన ఉత్తరం అందులో తాతయ్య మమల్నీ అందర్నీ ఊరు రమ్మని తానే వచ్చి తీసుకొని వెళతానని చెప్పారు. ఈ విషయం చదువుతున్నపుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నాకు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం.. సంక్రాతి దగ్గరకు వచ్చింది. మాకు సెలవలు ఇచ్చారు.. తాతయ్య వచ్చారు మమ్నల్ని తీసుకొని వెళ్ళడానికి ,నాన్న బిజీగా ఉండటం వలన మమ్మల్నీ ముందు వెళ్ళమన్నారు.. నేను,చెల్లి మరియు తాతయ్య బయలుదేరాము.. నాన్న మమ్మల్నీ సికింద్రాబాద్ స్టేషన్ వరకు దింపారు.. రైలు వచ్చింది నేను, చెల్లీ ఇద్దరం కిటికి సీటు దగ్గరకు పరుగుతీసి కిటికి సీటు నాది అంటే నాది అంటూ గొడవ ఆడుకోసాగాము. తాతయ్య అల్లరి చేయకండిరా అని మందలించారు.. నేను మొండిగా కిటికి ప్రక్కన సీట్లో కూర్చొన్నా. చెల్లి ఇక ఏడుపు అందుకుంది.. ఒక కంటిలోంచి కృష్ణమ్మ మరొక కంటిలోంచి గోదారమ్మ పొంగినట్లూ ఇంకా ఎక్కువ కన్నీరు  పెట్టింది. అప్పుడు నాకు రాఖీ పండుగ నాడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.. నీవు చెల్లిని బాగా చూసుకోవాలి ..అన్నయ్య అంటే అన్ని వేళలో అండగా ఉండటమే కాదు.. చెల్లి కళ్ళలోంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా దానికి ఆనందం పంచాలి. వెంటనే అమ్మ చెప్పినట్లూ వెంటనే తనకే సీటు ఇచ్చాను.. ఇప్పుడు మా చిట్టి రాక్షసి కుండపోతగా వర్షం కురిసి ఒక్కసారి ఆగిపోతే ఎలా ఉంటుందో అలా  ఏడుపు ఆపింది.. నవ్వుతూ కిటికీలోంచి బయటకు చూస్తూ కేరింతలు కొట్టింది.. మా తాతయ్య మమల్ని చూసి నవ్వుకున్నారు. మంచి కబుర్లతో మా ప్రయాణం సాగింది. మా తాతయ్య ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు.. ఒక సంతోషాల లోకానికి మా రైలు వెళ్తున్నట్లూ నాకు అనిపించింది. సాయంత్రనికి మేము రైలు దిగాము.. రైలు కూతవేస్తూ మాకు వీడ్కోలు చెప్పి తన గమ్యం వైపు పరుగులు తీసింది.
****
స్టేషన్ నుంచి మా ఇంటికి వెళ్ళాలి అంటే నదిని దాటి ఆవలి గట్టు వైపుకి వెళ్ళాలి.. మా తాతయ్య నది దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.. పడవ నడిపే అతను మా దగ్గరకు వచ్చాడు. మా తాతయ్యను నవ్వుతూ పలకరించి తన పడవ ఎక్కమని మాకు ఆహ్వానం పలికాడు.. ముందుగా తన పడవకు నమస్కారం చేసి పడవ ప్రయాణం మొదలుపెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరైనా దేవునికి దణ్ణం పెడతారు లేద గొప్ప వ్యక్తులకు దణ్ణం పెడతారు ఈయన ఏంటీ ఒక చక్కకి పడవకి పెడతున్నాడు అనుకొన్నా వెంటనే తాతయ్యని అడిగాను ఈ నమస్కారం గూర్చి, తాతయ్య చెప్పారు.. పనియే దైవం అన్నారు కదా పెద్దలు అందుకే తను తన జీవనానికి తనకు సాయపడుతున్న ఈ పడవకి నమస్కారం చేసాడు అని.. నా హృదయంలో ఆ మాటలు బలంగా నాటుకొన్నాయి.. చెల్లి   ఈ కృష్ణా నదిని చూస్తూ ఆనందిస్తుంది.. కృష్ణమ్మ ఒడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు ఎన్నో ఉన్నాయి..
అవి మాకు స్వాగతం పలుకుతున్న పచ్చని తోరణాలు లాగా అనిపించాయి.. సాయంత్రం అవడం వలన పక్షులు తమ తమ స్దావరాలకు చేరుకుంటున్నాయి.. వీటి ఐక్యమత్యాన్ని చూస్తే నాకు ఆనందం వేసింది.. అన్నీ కలసికట్టుగా వెళుతున్నాయి.. ఈ విధంగా కృష్ణమ్మ అందాలను చూస్తు ,ఆ నది పైనుండే వీచే గాలి.. చాలా చల్లగా అమ్మ కరుణలాగా అనిపించింది. ఆవలి తీరానికి చేరుకున్నాం. నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళాము.. అందరూ ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని చూస్తూ వీళ్ళు మన కృష్ణాగాడి పిల్లలు అంటూ మమ్మల్ని అప్యాయంగా  పలకరించారు.. మొత్తానికి ఇంటికి చేరుకున్నాం. ఈలకోడి అరుపులతో చీకటి వచ్చేసింది. అమ్మమ్మ మాకోసం గుమ్మం దగ్గర తన కళ్ళలో వత్తులు వేసుకొని చూస్తుంది..  మమ్మల్ని చూడగానే ఆమె కళ్ళలో ప్రేమ ఒక ప్రవాహంలాగా వచ్చి తాకింది మమ్మల్నీ.. ఇద్దరనీ దగ్గరకు తీసుకొని తల నిమురుతూ ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది..
*****
మా స్నానాలు అయ్యాయి, ప్రయాణ బడలిక తీరింది. అమ్మమ్మ మాకు బాగా ఇష్టమని పాయీసం చేసింది.. చెల్లికి, నాకు ,తాతయ్యకి ఇచ్చింది.. చెల్లి నా దగ్గరకు అన్నోయ్ నాకు చాలా కిస్మిస్ ఇంకా జీడిపప్పు వచ్చిందిగా నీకు ఏమి రాలేదు అంటూ ఎగతాళి చేస్తూ అమ్మమ్మ ఒడిలో కూర్చుని పాయీసం తాగుతుంది.. మా అల్లరికి అమ్మమ్మ నవ్వుకుంది.. తాతయ్య రేడియోలో వార్తలు వింటున్నారు.. బోజనాలు చేసి మేము తాతయ్య దగ్గరకు వెళ్ళాము కథ చెప్పమని.. మా తాతయ్య ఒంటి కన్ను రాక్షసుడు కథ చెబుతాను అన్నాడు.. అమ్మమ్మ మధ్యలో తాతయ్యని ఆపి పిల్లలకు దయ్యాలు, రాక్షసులు అని కథలు చెప్పి బయపెట్టకండీ అంది.. అప్పుడు తాతయ్య పిచ్చిదానా .. కథలు అంటే పిల్లలను భయపెట్టేవి కాదే ఎంతో వినోదాన్ని ఇస్తూ ఎన్నో యుక్తులను చెబుతాయి.. అని మాకు కథ చెప్పారు.. సరేరా పడుకోండి రేపు ఉదయం మనం మన ఊరు చూద్దాము.. అంటూ నిద్రపుచ్చారు..
******
ఉదయం ఒకవైపు కోడి అరుపులు మరోవైపు ఏదో ఒక వినసొంపైన పాటతో నాకు మెలుకువ వచ్చింది. నేను బయటకు వచ్చాను.. మా అమ్మమ్మ ,చిన్నమ్మ బయిట అందమైన ముగ్గులు వేస్తున్నారు.. ఆ పాట పాడుతూ వస్తుంది ఎవరబ్బా అని చూస్తున్నా.. ఎవరో నారదుడు లాగా ఉన్నాడు.. నేను అమ్మమ్మ నారదుడు మన ఇంటికి వస్తున్నాడే అన్నాను.. మా చిన్నమ్మ నవ్వుతూ శ్రీను ఆయన నారదుడు కాదురా.. హరిదాసు అని ఆయనకు కొంత బియ్యం వేసింది.. ఆయన శ్రావ్యంగా పాడుకుంటూ వేగంగా వేరే ఇంటి వైపు నడిచాడు.. మా చెల్లి నిద్రలేచి
పరుగులుతీస్తూ చిన్నమ్మ వాళ్ళు వేసే ముగ్గులు దగ్గరకు వెళ్ళింది నేను వెస్తాను అంటూ.. మా వీదిలో అందరూ రంగుల రంగుల ముగ్గులు వేస్తున్నారు.. తాతయ్య మా దగ్గరకు వచ్చీ ఏరా శ్రీనూ ఏమి చేస్తున్నావు అంటూ దగ్గరకు తీసుకొన్నారు.. తాతయ్య ముగ్గు అంటూ చుపాను.. ఆయన చెప్పారు ఈ సంక్రాంతికి మన తెలుగు నేల అంతా రంగులమయం అవుతుంది అని అంతేకాకుండా.. ఈ ముగ్గులు అందాన్నే కాకుండా క్రిమికీటకాదులు ఏవి రాకుండా కాపడతాయి అని.. మరోవైపున కొంతమంది మంటలు వేస్తున్నారు అవి భోగిమంటలు అని చెప్పారు.. సరేరా మీరు త్వరగా సిద్దం కండి మనం మన ఊరు చూద్దాం అని చెప్పారు..
*****
మేము ఊరు చూడటానికి బయలుదేరాము.. ముందుగా మామయ్య వాళ్ళ తోటకి వెళ్ళాము  . మామయ్యా వచ్చి మమ్మల్ని తోట మొత్తం చూపిస్తున్నారు.. తోటలో ఎన్నో రకాల మొక్కలు,వృక్షాలు ఉన్నాయి.. కొన్ని రకాల పుష్పజాతి మొక్కలు సువాసనలు వెదజల్లుతున్నాయి.. చామంతీ,బంతీ,గుళాబీ మొక్కలు ఎంతో అందంగా ఉన్నాయి, మంచు బిందువులు వాటిపైన పడటం వలన ముత్యాల వలె మెరుస్తున్నాయి..  అప్పుడే తీసిన తేనె అని మాకు కొంచం తాగమని ఇచ్చారు.. ఎంత రుచిగా ఉందో. భూలోక అమృతంలాగా అనిపించింది.. తాతయ్య ఒక్కో మొక్క గూర్చి చెబుతూ వీటిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అని చెప్పారు.. మొత్తానికి మామయ్య వాళ్ళతోట చాలా బాగుంది.. మేము బయలుదేరుతుంటే మామయ్య వాళ్ళ అబ్బాయి అర్జున్. నేను మీతో వస్తాను అంటూ మాతో ప్రయాణం అయ్యాడు..
****
అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వెళుతున్నాము. ఊరంతా పండుగ వాతావరణం ఉంది.. నేను తాతయ్యకు చెప్పాను అమ్మమ్మ నైవేద్యానికి ఒక కుండా, పండుగకు కొత్త బట్టలు తీసుకొని రమ్మంది అని.. తాతయ్య కుమ్మరి ఇంటికి తీసుకొని వెళ్ళాడు.. అక్కడ కుమ్మరి        ఒక చక్రం పైన కొంత మట్టి సుద్దను పెట్టి కుండలు చేస్తున్నాడు.. ఒక మట్టి సుద్దను కుండగా మలుస్తుంటే అతనిలో నాకు శిల్పి కనిపించాడు.. తాతయ్య మాకు ఆ చక్రాన్ని చూపిస్తూ మన నాగరికత ఈ చక్రం నుంచే వేగంగా అభివృద్ధి చెందింది అని.. చరిత్రలో చక్రం ఏవిధంగా ప్రముఖ స్ధానం సంపాదించినదో,మానవుడు ఆలోచనను ఏవిధంగా మార్చిందొ చెప్పాడు.. తరువాత మేము బట్టలు నేచే వారి వద్దకు వెళ్ళి పండగకు కావాల్సిన కొత్త బట్టలు తీసుకున్నాము.. ఆయనను చూస్తే నాకు రంగులను అద్దుతున్న ఒక చిత్రకారుడు లాగా అనిపించాడు.. ఆయన పాటలు పాడుతూ చాలా చక్కగా బట్టలు నేత చేస్తున్నారు. మేము వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరాము.. దారిలో కొందరు రైతన్నలు ఇంటికి పొలం నుంచి ధాన్యం చేరుస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఏదో విజయం కనపడుతుంది.. అదే విషయాన్ని  తాతయ్యని అడిగాను.. తాతయ్య చెప్పారు ఈ ఏడాది   వర్షాలు బాగా కురిసి.. నదులు నీటితో కలకలలాడి  పంటలు బాగా పండాయి అని.. పంట చక్కగా చేతికి వచ్చింది అని రైతు ఆనందంగా ఉంటే దేశం అంతా ఆనందంగా ఉన్నట్లే అని.. ఎందుకంటే ఆయన మన దేశానికి అన్నదాత కాబట్టి.. గ్రామాలు దేశానికి ధాన్యాగారములు అని చెప్పాడు.. ఇంటికి చేరుకున్నాము..
****
తాతయ్య మాకు కొత్త బట్టలు ఇస్తూ ఇది మన తెలుగువారికి పెద్ద పండుగ అంటూ ఇందులో మన సాంప్రదాయం ప్రతిబింబిస్తుంది అని చెప్పారు.. తాతయ్య పంచె కడుతుంటే నాకు పంచె కట్టమని అల్లరి చేసాను.. నాకు పంచె కట్టారు ఎంత హుందాగా ఉందో.. అద్దంలో నన్ను నేను పంచెలో చూసుకుంటూ మురిసిపోయాను..
తరువాత ఇంటికి వచ్చిన కొత్త ధాన్యంతో నైవేద్యం చేసి  ,అమ్మమ్మ వాళ్ళు రోట్లో పిండి కొడుతూ అరిసెలు చేసారు.. వాటిని మన దేవునికి మరియు పితృదేవతలకు అర్పించి వారిని పూజించి ప్రసాదం స్వీకరించాము.. అరిసెలు,గారెలు ఎంత రుచిగా ఉన్నాయో మా అమ్మమ్మ చేయి తగిలిందంటే అందులో అమృతం పడినట్లే.. తాతయ్య తన మితృలు అయిన రెహమాన్ ని మరియు రాబర్ట్‌ ని బోజనానికి పిలిచాడు ఆయన వాళ్ళని వరసలతో బావా ,అన్నయ్య అని పిలవడం నాకు భలే అనిపించింది అందరూ కలిసిమెలిసి ఇలా ఉండటం ఎంత బాగుందో ఆనందమైనా, కష్టమైన.. ఇలాంటి వాతావరణం మన గ్రామలలో ఎక్కువ ఉంటుంది...
****
సాయింత్రం మేము అంతా ఊర్లో జరుగుతున్న జాతరకు వెళ్ళాము.. మామయ్య నన్ను,చెల్లిని,అర్జున్ ని రంగుల రాట్నం ఎక్కించాడు.. ఆ రంగుల రాట్నం నాటు బండి చక్రాలతో చేసింది దానికి తాడు కట్టి తిప్పుతున్నారు. మేము అది ఎక్కి అల్లరి చేసాము. అక్కడ నుంచి తోలుబొమ్మలాట జరుగుతుంటే వెళ్ళాము. సీత స్వయంవరం చూసాము.. అది చూసి జనం కేరింతలు కొట్టారు. మామయ్య మాకు తియ్యని చెరుకుగడలు ఇప్పించారు. అవి తింటూ ఇంటికి వచ్చాము. సాయంత్రం భోజనాలు తరువాత తాతయ్యా రాముడు ఎందుకు అంత గొప్పవాడు , ఈ రోజు తోలు బొమ్మలాటలో అందరూ రాముడుని కీర్తించారు. అంతే కాకుండా ప్రతీ ఊరులో రాముడి గుడి కచ్చితంగా ఉంటుంది అంటారు కదా ఏంటి ఆయన గొప్పదనం. తాతయ్య చెప్పారు రాముడు ఆదర్శ పురుషుడు ఒక్కమాట, ఒక్కబాణం,ఒకటే సీత అన్నాడు.. ఆయన జీవతం అందరకీ ఆదర్శనీయం అని కొన్ని కథలు చెప్పాడు అవి వింటూ మేము మెల్లగా నిద్రలోకి జారుకొన్నాం..
***
తెల్లారింది అందరూ పశువులను చక్కగా కడుగుతూ. వాటికి పసుపు కుంకుమ రాస్తూ అందరూ వాటికి నమస్కారాలు పెడుతున్నారు.. తాతయ్య చెప్పాడు ఈ రోజు కనుమ అంటే మన జీవనాదారానికి కారణమైన ఈ పాడిపంటలుకు ఋణపడి ఉన్నాము కదా.. అందుకే వాటిని దైవాలుగా భావించి ఇలా చేస్తున్నాము అని. నిజంగా ఇంత లొతైన భావం ఉందా ఇందులో.. ఇన్ని రోజులు నేను ఏదో అనుకొన్నా..
సాయంత్రం నేను, అర్జున్, చెల్లి మామయ్య మా ఊరి గుడి దగ్గర సరస్సు దగ్గరకు వెళ్ళాము.. అక్కడ ఎన్నో అందమైన కలువపూలు ఉన్నాయి.. ఎంత అందంగా ఉన్నాయో.. అక్కడ సరస్సు ఒడ్డునుంచి మేము బంకమట్టి తెచ్చి వాటితో మేము రకరకాల బొమ్మలు చేసాము.. వాటికి రంగులు అద్దాము.. మామయ్య మాకు గాలిపటాలు  ఇచ్చారు,  యుద్ధంలో గెలిచిన రాజులు విజయ పతాకం ఎగరు వేస్తారు కదా అలా మేము ఈ గాలిపటాలను ఎగరు వేశాము మైదానలలో...
ఈ విధంగా ఆడుతూ సంక్రాంతి పండుగను బాగా గడిపాము. ఆ గ్రామంలో ప్రజల అంకితభావంతో చేసే తత్వానికి, గ్రామం అందాలకు, ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకోవాడాన్ని. గొప్ప అన్నదాతలను,  ప్రకృతిని దైవంగా భావించి కొలిచే ఈ గ్రామీణ వాతావరణం ఎంతో బాగ నచ్చింది.. మా సంక్రాంతి సెలవలు పూర్తి అయ్యాయి. తిరుగు ప్రయాణం మొదలుపట్టాము.. చెల్లి ఇక్కడ నుంచి రానని మారం వేసింది అమ్మమ్మ ఒడిలో... తాతయ్య మరలా వద్దురు అమ్మా అని చెబుతున్నారు. మరలా తిరుగు ప్రయాణం మొదలు అయ్యింది. మామయ్యా,అమ్మమ్మ,అర్జున్ మాకు వీడ్కోలు చెప్పారు. ఈసారి నా హృదయం భారం అయ్యింది. పడవ ఎక్కాము. ఆవలి ఒడ్డుకు చేరాము.. కృష్ణమ్మ ప్రశాంతంగా ఉంది.పడవ తిరిగి వెళుతుంటే ఎవరో ఒక బందువు దూరం అవుతున్న భావం కలుగింది. స్టేషన్‌ చేరుకున్నాం. ట్రైన్ వచ్చింది.. ట్రైన్ ఎక్కాము. రైలు వెళుతుంది. నా మనసులో ట్రైన్ వెనకకు వెళితే బాగుండు అనిపించింది..
ఇంతలో ఏదో గొంతు శ్రీను,శ్రీను అని వినిపించింది. అది సోముగాడిది.. "శ్రీను మా ఊరు వచ్చిందిరా. దిగుదాము రా అని".

 సంక్రాంతి పండుగలో ,పల్లెలో  అప్పటికి ఇప్పటికి ఎంతో  మార్పువచ్చింది, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఎంతో మధురంగా ఉన్నాయి  అనుకుంటూ రైలు దిగాను సోముగాడితో .

--- సమాప్తం --

17 comments:

  1. nice story,...recollecting the olden dayss

    ReplyDelete
  2. Nice chakri ...We are expecting More Good Stories From You

    ReplyDelete
    Replies
    1. అన్నయ్యా చాలా ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు... మీ అందరి ప్రేరణ వలననే నేను రాయగలుగుతున్నాను.😄

      Delete
  3. Future writter...great chakri anna....it's very nice...achamaina telugu padhaalu chadavadaaniki chaala bagunayi...venkora anna cheppinattu..send ur writtings to NEWS paper ...ALL THE BEST chakri Anna....

    ReplyDelete
  4. Future writter...great chakri anna....it's very nice...achamaina telugu padhaalu chadavadaaniki chaala bagunayi...venkora anna cheppinattu..send ur writtings to NEWS paper ...ALL THE BEST chakri Anna....

    ReplyDelete
  5. Tammudu super.good work keep it up
    Jaipalreddy

    ReplyDelete
  6. Good narration chakry. Keep it up.

    ReplyDelete
  7. Good narration chakry. Keep it up.

    ReplyDelete
  8. Superb CHAKRY. Nice Story. Keep it up...

    ReplyDelete
  9. Nice story chakri ...all the best ...

    ReplyDelete
  10. Anna super vundi story keep it up ..

    ReplyDelete