Tuesday, 9 April 2019

మన ఓటు - మన భవిత

"నాన్న నేను మరో రెండు రోజుల్లో మన ఊరు వస్తున్నా" , విజయ్ ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్న రాఘవకు ఫోన్ చేసి చెబుతున్నాడు.

"ఎందుకు నాన్న, మొన్నే కదా నువ్వు హైదరాబాద్ వెళ్ళింది, అప్పుడే వస్తావా" రాఘవ కొడుకుతో.

విజయ్ మరింత ఉత్సాహంతో "నాన్న నాకు మొదటిసారి ఓటు హక్కు వచ్చింది, ఈ ఏడాది నేను కూడా మన  దేశభవితను నిర్దేశించే నా ఓటు వేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది".

రాఘవ కొడుకుతో "నువ్వు అంతా దూరం నుంచి ప్రయాణం చేసి రావాల్సిన అవసరం లేదు, నీ ఒక్క ఓటుతో ఇక్కడ ఒనగూరేది ఏమీ లేదు. రానపోను 1500 రూపాయలు ఖర్చు దండగా".

పాపం విజయ్ ఏదో చెబుదామని అనుకున్నాడు, కానీ తండ్రి మాటను కాదనలేక మరేం మాట్లాడలేదు.

విజయ్ లో గోదారిలా ఉప్పొంగిన ఆనందం మొత్తం నురగ లాగా ఒక్క క్షణంలో కరిగి పోయింది.

రాఘవాది ఒక మధ్యతరగతి కుటుంబం,ఊర్లోనే చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు‌. కొడుకు, కూతురులన బాగా చదివించాలని తన ఆశయం.

ఆ ఏడాది ఎలక్షన్స్ పూర్తి అయ్యాయి, విజయ్ తన మొదటి ఓటు వేయలేదని బాద వెన్నంటుతూ ఉంది..
******
(4 సంవత్సరాలతర్వాత)
రాఘవ MLA ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ తో "MLA గారిని కలవాలి, కొంచెం లోనికి పంపండి".

"ఆయన బిజీగా ఉన్నారు మరలా రావయ్యా పెద్ద మనిషి" అని సెక్యూరిటీ చెప్పాడు.

రాఘవ : "అయ్యా , నేను అత్యవసరంగా కలవాలి, దయచేసి ఒక 5 నిమిషాల సమయం అడగండి".

సెక్యూరిటీ తనలో తాను గొనుగుతూ " ప్రతి ఒక్కరూ అర్జెంటు పని అని వస్తారు, ఆయనేమో నన్ను విసుగు కుంటారు ఇటు వీళ్ళకి చెప్పలేక, ఆయనకి చెప్పలేక చస్తున్నాను మధ్యలో నేను" అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.‌

సెక్యూరిటీ లోపలికి వెళ్ళి వచ్చి "MLA గారు రామంటున్నారు,  వెళ్లి రండి"

MLA రామలింగం, నల్లటి కారుమబ్బులాంటి దేహం కలవాడు, ఎలక్షన్  సమయంలోనే తప్ప మరలా తన ప్రాంతంను సందర్శించిన సందర్భాలు చాలా తక్కువ,ఏపని చేసినా నాకేంటి అని ఆలోచిస్తాడు.

రాఘవ వెళ్ళేసరికి, రామలింగం ఒక చేత్తో చుట్టను పట్టుకొని  ఏవే పేపర్లు చూస్తున్నాడు.

రాఘవ : " నమస్కారం సార్, నా పేరు రాఘవ అండి, మన ఊరి చివరన హైవే పక్కన ఉన్న కొంత స్థలం నాదే అండి, అది మీ అధీనంలోకి తీసుకుంటున్నట్లు విన్నాను. "

MLA రామలింగం చుట్టను పీల్చి గాలిలోకి ఉంగరాలు లాగా పొగను ఊదుతూ "ఎట్టెటా ఆ స్థలం మీదా.. ఐతే ఏంచేద్దాం అంటావ్"

రాఘవ :"దయచేసి మా స్థలం మాకు ఇచ్చేయండి, మధ్యతరగతి వాళ్ళమయ్య, దాని మీదే మేము ఎన్నో ఆశలు ప్రణాళికలు వేసుకున్నాం".

రామలింగం: " నేను ఎట్టా గనిపిస్తున్నానయ్యా నీకు, నీ నోటికాడ కూడు లాక్కునే వాడిని అనుకుంటివా ఏంది, ఇంద లచ్చ రూపాయలు ఇస్తాను, అది నాకు ఇచ్చేయ్".

రాఘవ : " సార్ అది నేను కొన్నప్పుడు రేటు లక్ష, ఇప్పుడు 50 లక్షలు విలువ చేస్తుంది,దయచేసి మాది మాకు ఇప్పించండి.దానిని అమ్మితే వచ్చిన డబ్బుతో మా కూతురు పెళ్లి ఘనంగా  చేద్దాం అనుకుంటున్నా".

ఒక్కసారి రామలింగం కళ్ళు చింతనిప్పలు లాగా ఎర్రబడ్డాయి. ఒక ఉదుటున పైకి లేచి బీరువాలోంచి కొన్ని కాగీతాల కట్టలు తీసి రాఘవ ముందేశాడు "చూడరా చూడు  నువ్వు ఒక ఎకరం పొలం గూర్చి నాకు చెబుతున్నావు మా తాత సంపాదించి మాకు ఇచ్చిన 40 ఎకరాల పొలంలో 30 ఎకరాలు అమ్మి మీ అందరికీ ఓటుకీ ఇంత డబ్బులు అనీ, వెంట తిరిగిన వాడికి బిర్యానీలనీ,తాగేవాడికి సారాలని ఇప్పిస్తే ఎంత ఖర్చు అయ్యిందో చూడు. అందరూ కలిసి కరిగించారు కాదరా, అదృష్టం బాగుండి కేవలం 3 ఓట్లు తేడాతో గెలిచాను, ఇక ఇప్పుడు 5 సంవత్సరాలు సంపాదించించుకోపోతే ఎలా"

రాఘవ  " సార్ అమ్మాయి పెళ్ళి..." అని చెప్పకమందే రామలింగం గద్దించాడు"మర్యాదగా ఈ లచ్చ రూపాయలు తీసుకో, కాదూ కూడదని అన్నావంటే, ఆ పెళ్లి చేయడానికి నిన్ను లేకుండా చేస్తాను" జాగ్రత్త అని బెదిరించాడు.

చేసేదేమీలేక రాఘవ ఇంటి దారి పట్టాడు,
కారుమబ్బులు కమ్మిన సూరీడులా ఇంటికి చేరాడు.

*******
రాత్రి 10:00 గంటలవుతుంది,
రాఘవ ఆలోచనలో మునిగి పోయాడు
"ఏమండీ భోజనం చేయండి" అని రాఘవ భార్య జానకీ చెప్పింది.
రాఘవ :"ఆకలిగా లేదు" .
జానకి : "ఏం ఎందుకండీ మీరు ఆకలిని తట్టుకోలేరు కదా".
రాఘవ : "గుండెలు నిండా బాధల్ని నింపుకున్న మనిషికి, కడుపెలా నిండుతుంది".
జానకి :"ఏమైందండీ?"

రాఘవా కూతురు వేపు చేయి చూపిస్తూ.   " ఒక్కసారి అటుచూడు, నా బంగారు తల్లి ఎంత ఆనందంగా ఉందో, మరో కొన్ని రోజుల్లో తన పెళ్ళి ఉందని ఎన్ని కలలు కంటుందో స్నేహితులు అందర్నీ పిలుస్తూ మురిసిపోతుంది. తండ్రిగా ఆడపిల్ల కన్యాదానం ఘనంగా చేద్దాం అనుకొన్నా.
కానీ ఆ రామలింగం ఎంతపని చేసాడో తెలుసా." అని జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు.

జానకి కట్టలు తెంచుకుని వచ్చిన భాదను అదిమి పెట్టి అయ్యో ఎంతపని జరిగిందండీ, "రామలింగం అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి,
మొన్నే మన పక్కింటి కుర్రాడుకు మంచి కాలేజీలో సీటు వస్తే ఈ రామలింగం రికమండేషన్ అని అది వేరేవాళ్ళకు ఇప్పించాడు.
అప్పుడు ఏముందిలే అనుకొన్నాం, పాపం కుర్రాడు అప్పుడు ఎంత బాధపడ్డాడు కదా. ఇప్పుడు ఆ బాధ మన ఇంటిని కూడా వరదలాగా తాకింది,
ఇప్పుడు మరికొన్ని రోజుల్లో పెళ్లి , ఇక మనకు దేవుడే దిక్కు కదా".

********

రాత్రి 01:00 గంట అయ్యింది రాఘవ ఆలోచనలలో  రామలింగం మాటలే మెదిలుతున్నాయి "ఇంత ఖర్చు పెడితే నేను గెలిచింది 3 ఓట్లు తేడాతోనే..".
సరిగ్గా 4 సంవత్సరాల క్రితం రాఘవ చేసిన తప్పు గుర్తుకు వచ్చింది, అప్పుడు ఎలక్షన్స్ కి తొలిసారి ఓటు వేయడానికి వస్తాను అన్న కొడుకును ఆపడం, ఎలక్షన్ రోజు ఆఫీస్ సెలవు రోజు అని , వారాంతం అవ్వడం వల్ల రాఘవ కుటుంబ సభ్యులు అందరూ బయటకు విహార యాత్రకు 3 రోజులు వెళ్ళారు, మన 3 ఓటులు వేయకపోతే అయ్యేదేమీలేదని  ఓటు వాళ్ళు వేయలేదు, ఇలాగే చాలా మంది ఓటు వేయడానికి రాకపోవడం వల్ల
కేవలం 45% పోలింగ్ నమోదు అయ్యింది.
అందులో 21% వరకు రామలింగం అనుచరులు వలన సాధించాడు.
అందువలన రామలింగం కేవలం 3 ఓట్లతో గట్టెక్కాడు..

రాఘవ నిట్టూరుస్తూ  ఇలా అనుకున్నాడు
"ప్రతి దానిని హా ఏముందిలే అని (లైట్) తీసుకొనే స్వభావం మన రక్తంలో ఇంకిపోయింది, 
ఏదైనా మన దాకా వస్తనే తెలుస్తుంది,
మనం చేసిన ఒక తప్పిదం , ఒక 5 నిమిషాల సమయం ఓటు వేయడానికి కేటాయించి ఉంటే 5 సంవత్సరాలు మనం ప్రాంతం భవిష్యత్తు బాగుండేది,మరలా ఇలాంటి తప్పు చేయకూడదు, నిజాయితీతో పోరాడే వాళ్ళకి మన ఓటు ఊపిరిగా నిలవాలి" అని ధృడంగా నిశ్చయించుకున్నాడు


***-------------------***

ధన్యవాదాలు.
శ్రీనివాస చక్రవర్తి
10/04/2019

Sunday, 31 March 2019

Memories - మంచినీరు అడిగితే మజ్జిగ ఇచ్చే నైజం మనది


"నాన్న బాగా దాహం వేస్తుంది" అని నేను నాన్నతో చెప్పాను.
"దగ్గర్లో బావి ఉంటుందేమో అక్కడ తాగుదాం" నాన్న చెప్పాడు..
మా ప్రయాణం ఎలా మొదలైందంటే
****
ప్రతి రోజూ మేత మేసి నేరుగా ఇంటికి వచ్చే ఆవు, దూడ ఆరోజు సాయంత్రం అయినా రాలేదు.
సూరీడు ఈరోజు కి ఇక్కడ సెలవంటూ మరోవైపు తన డ్యూటీ చేయటానికి పడమరకు వెళుతున్నాడు.
మసక చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి, నాన్న ఆవుదూడల కోసం పొలం వేపు వెళ్ళాడు.
జాడ దొరకలేదు అంటూ తిరిగి వచ్చాడు.
"అవి ఎక్కడకీ వెళ్ళవు రాత్రికైనా తిరిగి వస్తాయని అమ్మ దైర్యం చెబుతూ భోజనం చేద్దాం" అని అమ్మ చెప్పింది.

నేను "అమ్మ చీకట్లో వాటికి కళ్ళు కనిపిస్తాయా, దారి గుర్తు పడతాయా అని  అడిగాను.. "వాటికి కనిపిస్తాయి గానీ ముందు నువ్వు భోజనం చేయి ఈ గాలికి కరెంట్ పోయిందంటే మనకు కళ్ళు కనిపించవు" అంటూ, అమ్మ కిరోసిన్ దీపాన్ని సిద్దం చేస్తుంది ఎందుకైనా మంచిదని.

*****"""
తెల్లారింది అవి ఇంకా రాలేదు,
నాన్న నేను ఇద్దరం తప్పిపోయిన మా ఆవు దూడను వెతకడానికి ఉదయాన్నే బయలుదేరాం.  మా ఊరి దగ్గర ఉన్న రెండు రేవుల మధ్యలో గడ్డి మేస్తూ ఉంటాయేమో అని వెతికాం,
అక్కడ కనిపించలేదు, తాడి చెట్టుల వరుసలో ఉన్నాయేమో అని వెతుకుతూ వెళుతున్నాం. ఎక్కడ ఆవులు మంద కనిపించినా నేను పరుగులు తీస్తూ వెళ్ళి చూసేవాడిని అందులో మన ఆవు, దూడ ఉన్నాయేమో అని కానీ ఎడారిలో ఎండమావిని చూసిన వాడిలాగా నిరాశగా వెనుతిరిగే వాడిని అవి కనిపించక.
నాన్న కనిపించిన వాళ్ళకి ఆవు పోలికలు చెబుతున్నాడు,వాళ్ళు ఏమైనా జాడ చెబుతారేమో అని.
సమయం గడిచేకుందుకు ఎండ తీవ్రత పెరిగింది. సూరీడు నడి నెత్తిన నిప్పులు జల్లుతున్నట్లు ఉంది, ఎండకు చెంపలు మాడుతున్నాయి. నా నాలుక దాహంతో ఈ పిడచగట్టుకు పోయింది. అప్పుడు అడిగాను ఇలా "నాన్న దాహం వేస్తుంది" అని..
******
ఊరి చివర ఉన్న ఒక పూరింటి దగ్గర
అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్న ఒక పెద్దామెను  నేను మోహమాట పడుతూ అమ్మ కొంచెం మంచినీళ్లు ఇవ్వమని అడిగాను, ఆ ఇళ్ళాలు మా గూర్చి అడిగింది, ఏఊరు ఏం పని మీద వెళుతున్నారు బాబు అని. ఆవు దూడ విషయం చెప్పాము.  ఆ కరుణామూర్తి మీరు ఇంత ఎండలో చాలా దూరం తిరిగి నడుచుకుంటూ వచ్చారా ఉండండి అంటూ చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది," కొంచెం సేపు ఉండండి.. భోజనం చేద్దురు బాబు" అని ఆమె అన్నది.
"పర్లేదు అమ్మ మేము సెంటర్ వేపు వెళుతున్నాం అక్కడ టిఫిన్ తింటాం.. " అని నాన్న చెప్పాడు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది మా గూర్చి ముక్కూ మొహం తెలియని  ఆమె కేవలం మంచినీళ్లు అడిగితేనే భోజనం చేయమని అంది అని..
వాళ్ళు పూరింట్లో ఉండే పేదవాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ మంచి మనసున్న ధనవంతులు అంటే వీళ్ళు కదా అనిపించింది, ఆమె చదువుకొని ఉండకపోవచ్చు  కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న సాయం చేద్దామని ఆ మహాతల్లి గొప్ప ఉద్దేశం అయ్యి ఉండొచ్చు..
చిన్ననాటి జ్ఞాపకం అవ్వడం వలన ఆ ఊరిలో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో గుర్తు రావడంలేదు కానీ ఇప్పటికీ ఆ ఊరు వేపు వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకాలు ఆత్మీయులులా వెన్నంటుతూ ఉంటాయి
సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి, నన్ను అడుగుతాయి మరి నువ్వు ఏం చేశావని?

- శ్రీనివాస చక్రవర్తి
31/03/2019




Saturday, 16 February 2019

రాజమండ్రి - పాపికొండలు - భద్రాచలం గోదావరిపైన పయనం

ఆఫీసు మిత్రుడు వినోద్ పెళ్లి రాజమండ్రిలో అంటే  అందరం వెళ్దాం అనుకున్నాం.
శని, ఆదివారాలు సెలవు రావడంతో దగ్గర ఉన్న ప్రదేశాలు తిరిగి చూడటానికి కూడా బాగుంటుంది అనుకున్నాము..
మా MCA ఫ్రెండ్ ప్రవీణ్  కూడా నాతో బయలుదేరాడు..  
రాత్రి హైదరాబాద్ నుంచి  రాజమండ్రికి బస్సులో బయలుదేరాం.. 
ఉదయాన్నే కొవ్వూరు దగ్గర మెలుకువ వచ్చింది.. ఆసియాలోనే అతిపెద్దవి అయిన వాటిలో ఒకటైన రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా బస్సు రాజమండ్రి వేపు పరుగులు తీస్తుంది.. అప్పుడు గోదావరి పైన కురిసే మంచు నీటితో ముచ్చట్లు చెబుతున్నట్లుగా అనిపించిన దృశ్యం చూడముచ్చటగా చాలా బాగుంది..

ఉదయాన్నే రాజమండ్రిలో దిగగానే  వినోద్ మాకు ఒక రూమ్ ఏర్పాటు చేశాడు, స్నానం చేసి తనను కలిసాం. మీరు ఇంత దూరం రావడం చాలా ఆనందంగా ఉంది చక్రి అని చెప్పాడు, మాకు తనని కలవడం అంతే ఆనందంగా అనిపించింది. తనతో కొంతసేపు మాట్లాడి రాజమహేంద్రవరం చూడటానికి బయలుదేరాం.
******
ముందుగా పుష్కరాలు ఘాట్ దగ్గరకు వెళ్ళాం,అక్కడ ప్రశాంతంగా ప్రవహిస్తున్న గోదారి తల్లి ఒడిలో భక్తులు స్నానాలు, పూజలు చేస్తున్నారు,
మేము మెట్లపైన కూర్చుని నీటపైగా వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ రాజమండ్రికి మకుటం లాంటి బ్రిటిష్ కాలంనాటి పాత మరియు  అర్ధ వృత్తాకారం లాంటి కొత్త
 వంతెనల నిర్మాణాలను పరిశీలించాం.

అక్కడ నుంచి బ్రిటిష్ కాలం నాటి(సుమారు 1852) కాటన్ అనే ఇంజనీర్ నిర్మించిన  ధవళేశ్వరం బ్యారేజికీ బయలుదేరాం, అది రాజమండ్రికీ సుమారు 6,7 కిలోమీటర్ల దూరంలో ఉంది..
బ్యారేజి వద్ద  గౌతమ మహర్షి విగ్రహం కనపడగానే, నేను 2003 సంవత్సరంలో ఈ బ్యారేజ్ దగ్గరికి  వచ్చిన జ్ఞాపకాలు ,ఆ రోజులు గుర్తుకొచ్చాయి.. అప్పుడు ఇదే ప్రాంతంలో ఇసుక తిన్నెల పైన మేము ఆడిన అంత్యాక్షరి అటలు , గోదావరిలో వెతికిన రంగు రంగు రాళ్ళు,కళ్ళముందు చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి అలా మెదిలాయి. తరువాత బ్యారేజి పైన ఉన్న కాలిబాట పైన నడుచుకుంటూ గేట్లును చూస్తూ  ముందుకు కదిలాం.. 
గోదావరి నదికి ఇరువైపులా ఉన్న వివిధ రకాల చెట్లను చూస్తే పచ్చని ప్రకృతి మాత తన కురులను (కొమ్మలను) నీటి పైన వాల్చి ఆనందిస్తుందేమో అనిపించింది..
తిరిగి బ్యారేజి క్రిందికి వచ్చి కాటన్ మ్యూజియంకి వెళ్ళాం అప్పుడు దానిని మూసివేశారు, బయట ఫ్లై ఓవర్ పైన ధవళేశ్వరం ఆనకట్టను గూర్చి వివరంగా బొమ్మలు గీశారు..  కాటన్ సుమారు 1500 కిలోమీటర్లు తన గుర్రం పైన గోదావరి గట్టు పైన తిరిగి సరి అయిన ప్రదేశాన్ని ఎంచుకొని నిర్మించాడు అంటా.. దీని వలన ఎంతో మంది గోదావరి ప్రజల కష్టాలు తీరాయి.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మనం తిరుపతి వెళ్లామంటే అక్కడ ఉండే ఏదైనా హోటల్ లేదా షాప్ లపైన  వెంకటేశ్వర అనే పదం వచ్చే విధంగా ఉంటుంది,
శ్రీశైలం వెళితే  మల్లికార్జున అనే  పదం వాడతారు.. ఇక్కడ కూడా కాటన్ పేరు కూడా అలాగే వాడారు కాటన్ టాక్సీ స్టాండ్, కాటన్ ఫుడ్ పాయింట్ ఇలా... శతాబ్దంనర  గడుస్తున్నా ఇంకా ఆయన పేరు ప్రజల గుండెల్లో ఉందంటే ఆయన కృషి అమోఘం కదా అనుకున్నాం...

ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో భోజనం చేసి తిరిగి పుష్కర్ ఘాట్ వద్ద కు వెళ్లాం.. అక్కడ రేపు ఉదయం చేయబోయే పాపికొండలు, భద్రాచలం ప్రయాణానికి టికెట్ తీసుకున్నాము..
********
తిరిగి తిరిగి సాయంత్రం 06:00 గంటలకు పెళ్లి వద్దకు వెళ్ళాము.. ముందుగా అందరం కలిసి వినోద్ ని కలిసాము, తెల్లని పెళ్లి దుస్తులలో నవ్వుతూ పున్నమి చంద్రుడిలా కనిపించాడు వరుడు వినోద్.
సాయంత్రం 7 గంటలు నుంచి 9 గంటల వరకు పెళ్లి బాగా వైభవంగా జరిగింది..
*****
శనివారం ఉదయాన్నే ఐదు గంటలకే మెలకువ వచ్చేసింది,ఉదయం 06:30 కి పాపికొండల ప్రయాణం కోసం నేను ప్రవీణ్ ఇద్దరం కలిసి రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరకు బయలుదేరాం,దగ్గరిలోని మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాం.
తరువాత ఒక వాహనంలో ఉదయం 08:30 గంటలకు మా  పాపికొండలు ప్రయాణం మొదలయ్యింది.. పాపికొండలు గోదావరి అందాలు గూర్చి ఏమేం పాటలు ఉన్నాయా అని నేను ప్రవీణ్ ఇద్దరం గూగుల్లో వెతికాము.. గోదావరిపైన వచ్చే పాటలు మేం వింటూ ఉంటే గోదావరి గట్టు పైన మా వాహనం బయలుదేరింది. ముందుగా మమ్మల్ని పోలవరం ప్రాజెక్టు దగ్గరికి తీసుకుని వెళ్లారు,ఈ పోలవరం ప్రాజెక్టు చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది సందర్శకులు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో అని మా మనసుల్లో ఉత్సాహం బయలుదేరింది సుమారు ఆ ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఎంతోమంది ప్రాజెక్టు సంభందించిన పని చేస్తున్నారు...

మా వాహనం నడిపే డ్రైవర్ అప్రాజెక్టు గూర్చి వివరంగా చెబుతూ దాని దగ్గరికి మా వాహనాన్ని పోనిచ్చాడు, 48 గేట్లతో పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణ స్థాయిలోనే ఉంది, ఇది పూర్తవ్వాలంటే మరో ఐదు సంవత్సరాలు పడుతుంది ఏమో అనుకున్నాం.. చుట్టూ  కొండల మధ్య నీటిని నిలవ ఉంచడానికి అనుకూలమైన ప్రాంతంలో దీని నిర్మాణం జరుగుతుంది...
ప్రస్తుతం ఒకే ఒక గేట్(47 వ గేట్) ఏర్పరచారు. ప్రాజెక్టు పూర్తి ఐతే ఎన్నో వేల గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి, మరికొన్ని గ్రామాల మనుగడ కనుమరుగు కూడా అవుతాయి అని చెబుతున్నారు..
అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణం చేసి పాపికొండలు వెళ్ళే బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళాం.
******
శనివారం కావడం వల్ల చాలామంది పాపికొండల అందాలు చూద్దామని వచ్చారు, మేము మా లాంచ్ పై అంతస్తులో కూర్చున్నాము.. జీవితంలో  ఎప్పుడు  లాంచీ ప్రయాణం చేయని నాకు  ఎంతో ఉత్సాహంగా అనిపించింది ఆ క్షణం, తోటి ప్రయాణికులు అందరి గుండెల్లో పాపికొండల్లో చూడబోతున్న ఆనందం వారి కళ్ళల్లో కనిపిస్తుంది, అందరూ వారు రోజు చేస్తున్న పనులను మర్చిపోయి కొత్త లోకానికి ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు అనిపించింది ఆ వాతావరణం. మా లాంచీ ప్రయాణం మెల్లగా మొదలైంది.. అందరూ  గోదావరి మాతకు జేజేలు పలికారు,"బోటు ప్రయాణిస్తున్న ఎడంవైపు పశ్చిమ గోదావరి కుడి వైపు తూర్పుగోదావరి అని , ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు వస్తాయి కొన్ని గ్రామాలకు రోడ్ల సదుపాయం లేదంటూ వివరంగా మైక్ లో చెబుతున్నారు"
మా లాంచీ ముందుకు సాగుతూ ఉంది
మా ఆలోచనులు కూడా..
"ఇక్కడ పిల్లలు ఎలా చదువుకుంటారు, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి ఎలా వెళ్తారు" అని నేను ప్రవీణ్ అనుకున్నాం..
*****
మా లాంచి పాపి కొండలు వైపు వెళుతుంది..
గోదావరి నది చుట్టూ ఉన్న కొండల పైన మంచు సన్నటి తెరలాగా కురుస్తుంది.. ఆ మంచుకు మునగడ తీసుకుని పడుకున్న ఏనుగులు లాగా ఆ కొండలు కంటికి అనిపిస్తున్నాయి.. కొండలు పైన తాడి చెట్లు అగ్గిపుల్లలు లాగా ఉన్నాయి..
లాంచీలో సందర్శకులకు వినోదం అందించడానికి కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు, ఇందులో సందర్శకుల కూడా పాల్గొనే విధంగా కార్యక్రమాలు సరదాగా ఏర్పాటు చేశారు. 
ఓ వైపు ఆ వినోద కార్యక్రమాలు ఆనందిస్తూ మరోవైపు ప్రకృతి సోయగాలను చూస్తూ మేము పాపికొండలకు చేరుకున్నాం..
పాపికొండలు గురించి వివరంగా మైక్ లో చెబుతున్నారు వీటిని ఒకప్పుడు ఆ పాపిడి కొండలు అనేవారంట...
వాటిని చూసినప్పుడు మాకు అనిపించింది.
*భువిపైన దేవుడు దువ్విన ఈ అందాల పాపిడి.
గోదారమ్మ చల్లని నీటి ప్రవాహపు తాకిడి‌..

పచ్చని ప్రకృతి ఒడిలో గోదావరి పయనం..
కనులారా చూసి పరవశించింది మా నయనం..

అందరూ పాపికొండలు అందాన్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచి పోయారు..
మరికొందరు సెల్ఫీల లో తమతో ప్రకృతిని బంధించడం లో మునిగి పోయారు
*****

మా లాంచి పేరంటాలపల్లి చేరుకుంది. అక్కడ మాకు ఒక బ్రేక్ పాయింట్ ఇచ్చారు, అక్కడ ఆశ్రమం దగ్గర ఉన్న శివుడిని దర్శించుకుని మరలా తిరిగి భద్రాచలం వెళ్ళే లాంచీ ఎక్కాము..

మా ప్రయాణంలో చుట్టుపక్కల ఉన్న ఒక్కో గ్రామం  గురించి మైకులలో చెబుతున్నారు ఏ ఏ సినిమాలు ఏ ఊర్లో తీశారో చెబుతున్నారు..
పక్కన ఉన్న ఇసుక తిన్నెల మీదుగా అక్కడి వాళ్లు నడుస్తూ వెళుతున్నారు,
అక్కడున్న ప్రజలను చూస్తుంటే వీళ్ళ జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ ఎత్తుపల్లాలతో (కష్టాలు సుఖాలు మరియు గోదావరి గట్టు ఎక్కడం దిగడం) సాగుతుందనిపించిది.

ప్రయాణంలో ఇదే చివరి మజిలీ అని మైక్  లో చెప్పారు, ఇంకా కొంచెం సేపు ఈ ప్రయాణం ఉంటే బాగుండేమో అనిపించింది.‌.
చాలా భారంగా బ్యాగ్ లను మోసుకుంటూ ఆటలు ఆడి అలసిపోయిన చిన్న పిల్లలాగా లాంచీ దిగాం....

అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేసి సాయంత్రానికి భద్రాచలం చేరుకున్నాం.. 
భద్రాచల రాముడి పాటలు వింటూ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాం...
*****

ఆదివారం ఉదయాన్నే భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్ళాము. సెలవు కావడం వల్ల భక్తులు బాగానే వచ్చారు సుమారు రెండు గంటల సమయం పడుతుందని చెప్పారు.. నేను , ప్రవీణ్ దర్శనం ఎంత  ఆలస్యం ఐతే అంత మంచిది,  ఎక్కువ సేపు మనం ఈ గొప్ప ప్రదేశంలో ఉండే అవకాశం వస్తుంది కదా అనుకున్నాం.అక్కడ గోడలపై రాసిన రామదాసు కీర్తనలను  చూసాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం.
ఆ తర్వాత ఆ సీతారాముని దివ్య దర్శనం బాగా జరిగింది..
గుడి గోడలపై వివరంగా గీసిన చిత్రాలను చూస్తూ దమ్మక్క ,కంచర్ల గోపన్న మరియు భద్రగిరి గా మారిన భద్రుని కథను చదివాం చర్చించుకున్నాం..

అప్పుడు నా మనసులో అనిపించింది
*నాడు ధమ్మక్క ఇచ్చిన తాటి ఫలాన్ని మొదటి నివేదనగా తీసుకున్న రాముడికి నేడు కోట్లాది తెలుగు ప్రజలు తమ హృదయాలను నివేదనగా సమర్పిస్తున్నారు కదా అని*..
తరువాత రామదాసు రాముడికి చేసిన నగలను మ్యూజియం లో  చూశాము.
గుడి పక్కన ఉన్న చిత్రకూట కళాప్రాంగాణంలో రామదాసు కీర్తనలు ఆలపిస్తున్నారు. ఆ పాటలు పాడే వారిని చూస్తే ఏ పనినైనా ఏదో చేశాములే   అని కాకుండా ఇంత నేర్పుగా , ఆనందిస్తూ చేయాలి అని మాకు ప్రేరణ కలిగింది..
*******
మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మా ప్రయాణం హైదరాబాద్ కు మొదలయ్యింది.. నేను ప్రయాణ వివరాలు రాస్తూ ఉన్నాను, రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాం..

మొత్తానికి ఎప్పటినుంచో అనుకుంటున్న పాపికొండలు యాత్ర  బాగా చేశాము..
చాలా రిఫ్రెష్ అయినా భావన నాకు కలిగింది... ఇక సోమవారం నుంచి పనిలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనవచ్చు అనుకున్నా :)

Tuesday, 15 January 2019

సంక్రాంతి సంబరాలు మన తెలుగింట

చలి తెరలను తొలిగించే భోగిమంట.
ముత్యాల ముగ్గులు ముంగింట.
ఇంటికి చేరే తొలి పంట.
అల్లుడు,కూతురుల కొత్త జంట.
నోరూరించే పిండి వంట.
సంక్రాంతి సంబరాలు మన తెలుగింట.

-శ్రీనివాస చక్రవర్తి.
15/01/2019

Sunday, 12 August 2018

వనిత భువిపైన నడయాడే దేవత.‌

వనిత భువిపైన నడయాడే దేవత.‌.
వీరులకే వీరమాతవైన నీ ఘనత..
సోదరివై అనురాగాలు పంచే నీ మమత...
పతిలో(శివ) సగభాగమై అందరూ సమానమే అని నీవు చూపిన చరిత..
నీవున్న చోట కలలోనైన కానరాదు కలత..

మహిళా దినోత్సవ​ శుభాకాంక్షలు
   - శ్రీనివాస చక్రవర్తి
     08/03/2018

Saturday, 11 August 2018

మైదానం ఆత్మకథ

మైదానం ఆత్మకథ
-----------------------

నా పేరు మైదానం..
వినండి నా మనసులోని అంతర్మధనం...

ఒకప్పుడు..‌

వేకువనే తాకే సూరీడు కిరణాలు కన్నా నా వద్దకు ముందే వచ్చి చేరేవి చిన్నారులు చిరునవ్వులు..

పూలమొక్కలు నుంచి నేలపైన రాలే సుకుమారమైన కుసుమాలు కన్నా వారి లేలేత పాదాలు ఎంతో సుతిమెత్తగా నన్ను తాకేవి...

నాపైన రాలే తొలకరి వాన జల్లు తాకిడికన్నా ఆటలో అలిసిన చిన్నారుల చెమట బిందువులు జల్లు నన్ను తాకినప్పుడు నా మట్టి గుండె పులకరించేది..
ఆటపాటల్లో సాగే చిన్నారుల కేరింతలు...
నాకు పండగలు,తిరునాళ్ళు

గెలిస్తే వాళ్ళు చేసుకునే సంబరాలు..
ఓడితే మరలా గెలవాలని చూపే పట్టుదల..
ఇన్ని భావోద్వేగాలు​కు వేదిక అయినందుకు నాకు ఎంతో ఆనందం కలిగేది...

శనివారం సాయంత్రం వచ్చిందంటే వాళ్ళకన్నా నేనే ఎక్కువ ఆనందించేదానిని..
ఎందుకో ఈ పాటికి మీకు అర్థం అయ్యి ఉంటుంది...

ఎన్నో మలుపులుతో సాగే ఆటల్లో అలుపెరుగని గుండెల్లో గెలుపుకై ప్రతి తలపు....
************
కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు కధా..
పగలు వెనుక చీకటి లాగా... ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి..‌
ఒకప్పుడు 5 సంవత్సరాలకు బడికి వెళ్ళేవారు నేడు  2 సంవత్సరాలకే మోయలేని భారాన్ని మోస్తూ వెళుతున్నారు...
పాపం వారికి కూడా తెలియదు ఆటలు అంటే స్మార్ట్ ఫోన్​తెరపైన ఆడే ఆటలు అనుకుంటున్నారు...
స్మార్ట్ తెరపైన ఉన్న చూపులు.. తీరికలేని చదువులు..
 మైదానం వైపు అడుగులు పడనీయడంలేదు..

వారికి ఎవరు చెబుతారు?
మైదానంలో గెలుపోటములు రుచి చూసిన వారు జీవితంలో ఎలాంటి వెలుగు, చీకట్లను  ఎదుర్కొనేంతగా దృఢంగా​ తయారవతారనీ..

వారికి ఎలా తెలుస్తుంది?
ఇప్పుడు నలుగురు కలిసి ఒకచోట పనిచేయలేకపోతున్నారు... చాలా పనులు ఐక్యమత్యం లోపించే పూర్తి కావడంలేదు
విజయంలో శభాష్ అని చేయి అందించే గుణం.. భాదలో నేను ఉన్నా అని భుజాన్ని తట్టే గుణం మైదానంలో గడిపిన వారికి బాగా​ తెలుసు అని...

మరలా ఆ రోజులు రావాలని​ ఆశిస్తున్నాను..
లేకపోతే కొన్ని రోజులకు మైదానాలు కనుమరుగవుతాయి...

మీరు నా మనసులో మాటను అర్థం చేసుకుంటారు కదూ...
పదండి మైదానాలు వైపు అడుగులు వేయండి... ముందు తరాలను తీసుకుని రండి...

మీ రాకకై ఎదురు చూస్తూ,
ఓ మైదానం..


-శ్రీనివాస చక్రవర్తి
11/08/2018

Sunday, 22 October 2017

Story - పోటీ అనేది పోరాటంలోనే కాని....

డాక్టర్ ICU నుంచి బయటకు వచ్చారు.
శ్రీనివాస్ ఆయన వద్దకు వెళ్ళి ఎలా ఉంది రఘు పరిస్థితి అని అడిగాడు... సినిమాలో చెప్పినట్లు No problem he is alright అని doctor  అంటాడు అనుకుంటే ,కాని
డాక్టర్ "తలకు బలమైన గాయం తగలడం వలన ఎక్కువ రక్తం పోయింది.. రఘు హెల్మెట్ తో మోటార్ సైకిల్ నడిపినట్లైతే ఇంత బలమైన గాయం అయ్యేది కాదు,
ఇప్పుడు తనకు రక్తం ఎక్కించాలి అందుకు O నెగిటవ్ రక్తం కావాలి.. 12 గంటలలోపు ఎక్కించాలి,లేకపోతే చాలా ప్రమాదం " అని చెప్పారు

 ఇప్పటికి ఇప్పుడు O- రక్తం అంటే ఎలా..
ఈ గ్రూప్ చాలా అరుదుగా లభిస్తుంది.శ్రీనివాస్ ,హరి అందరికి ఫోన్లు కలుపుతున్నారు కాని O నెగిటవ్ దొరకడం లేదు..
ఏం చేయాలో అర్థం కావడం లేదు.. మానవుడు ఇన్ని రకాల వస్తువులు చేసాడే రక్తాన్ని ఎందుకు తయారు చేయలేకపోయాడో అర్థం కాలేదు ఆ క్షణాన శ్రీనివాస్ కి...

కొంతసేపటికి వాళ్ళ ఎదురుగా చీకటిలో ఇద్దరు వ్యక్తులు వారి వేపు నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపించింది.. ఆ నడక చూస్తుంటే ఆ వేగాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది...
 దగ్గరకి వచ్చిన తరువాత తెలిసింది ఆ వ్యక్తి విష్ణుతేజ మరియు కాలేజీ PET మోహనరావు అని
తేజా చెప్పాడు అన్నా ఇప్పుడే మన కాలేజీ గ్రూపులో O నెగిటివ్ కావాలని హరి పెట్టిన మెసేజ్ చూసాను..
నాది O నెగిటవ్ రక్తమే నేను ఇస్తాను అన్నా రఘుకూ..

శ్రీనివాస్ ఏమి మాట్లాడలేకపోయాడు
డాక్టర్ తేజాని లోనికి తీసుకొని వెళ్ళారు..

విష్ణు తేజ వచ్చేసరికి శ్రీనివాస్ మనస్సు గతంలోకి జారింది..
కొన్నేళ్ళ క్రితం శ్రీనివాస్, రఘు డిగ్రీ  చదువుతున్న రోజుల్లో ఆటలలో పాటలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు.. ఆ ఏడాది నిర్వహించిన క్రికేట్ పోటీలలో విష్ణుతేజ పేరు మారు మ్రోగిపోయంది..
అ ఏడాది శ్రీనివాస్ జట్టుకు,విష్ణు తేజ జట్టుకి ఫైనల్ జరగబోతుంది .
ముందు రోజు శ్రీనివాస్ కి నిద్రపట్టలేదు.. కాలేజి PET చెప్పిన మాటలు గుర్తు వస్తున్నాయి... "ఈ మ్యాచ్ లలో ప్రదర్శన ఆధారంగా మన కాలేజి నుంచి కొంతమందిని జిల్లా జట్టుకు పంపుతాం" అని,అందుకే రేపు ఉదయం ఫైనల్ గూర్చి ఆలోచనలే.. కప్ గెలవాలని బాగా ఆడిన ఆటగాళ్ళలో నిలవాలని తనకి రఘుకు ఉంది..

ఫైనల్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీనివాస్ జట్టుపై ప్రత్యర్ది జట్టులోని విష్ణుతేజ మెరుపులాగా ప్రదర్శన చెేయడం వలన 15 ఓవర్లకు మాత్రమే 70 పరుగులు మాత్రమే చేయగలిగారు
తరువాత శ్రీనివాస్ కూడా బాగానే బౌలింగ్ చేయడం వలన  ప్రత్యర్థి 14 ఓవర్లలో 61 పరుగులు  చేసారు ,ఇంకా ఒక ఓవర్ లో 10 Runs చేస్తేకాని ప్రత్యర్థి గెలుస్తారు.‌ చివరి ఓవర్ శ్రీనివాస్ వద్దకు వచ్చింది... మొదటి బంతికి Run out,
ఇంకా 5 బంతుల్లో 10 పరుగులు చివరి వికెట్ ఉంది,
తరువాత రెండు వరుస బంతుల్లో పరుగులు ఏమీ రాలేదు.
3 బంతుల్లో 10 పరుగులు .. మ్యాచ్ మనదేనని శ్రీనివాస్ కెప్టెన్ కి చెప్పాడు..
విష్ణుతేజ వరుసగా ఫోర్,సిక్సర్ కొట్టేసరికి మ్యాచ్ ఒక్కసారి వాళ్ళ వైపు తిరిగింది..
ఒక్క సారి రఘు,శ్రీనివాస్ గుండె జారింది...
విష్ణుతేజ ఈ విధంగా కోడిపిల్లను గ్రద్ద తన్నుకొని వెళ్ఖినట్లు ఆటని వాళ్ళవైపు మలుచుకోవడం జీర్ణించుకో లేకపోయారు శ్రీనివాస్ మరియు రఘు..
అందరూ విష్ణుతేజాని పొగడటం శ్రీనివాస్ ,రఘుకూ ఈర్ష్యని పెంచింది.

తరువాత వాళ్ల కాలేజీ నుంచి PET మోహన్ రావు   బాగా ఆడిన శ్రీనివాస్,రఘు,విష్ణుతేజ పేర్లను జిల్లాస్థాయి పోటీలకోసం పంపడం జరిగింది..

******

"పోష్టుమాన్ గారు నా పేరుతో ఏదైనా ఉత్తరం వచ్చిందా" అని శ్రీనివాస్ ,రఘు అడిగేవారు పోస్టుమాన్ ని..జిల్లా క్రికేట్ సంఘం నుంచి పిలుపు వస్తుందేమో అని‌... రాలేదయ్యా అన్నాడు ఆయన బజారు లో టీ తాగుతూ  ఇదిగో అబ్బాయిలు అని మరలా పోష్టమాన్ పిలిచాడు..
మీ కాలేజ్ లో చదివే విష్ణుతేజ కి ఉత్తరం వచ్చింది... ఏదో జిల్లా స్థాయి క్రికేట్ పోటీలకోసం సెలక్షన్ ఉంది అంటా వాళ్ళు ఇచ్చిన ఈ ఉత్తరం జాగ్రత్తగా ఇవ్వండి.
కాని శ్రీనివాస్ ,రఘు ఉత్తరాన్ని ఇవ్వకుండా ఇంకా వాళ్ళకు రాకుండా తేజాకి వచ్చిందని కోపంతో ఎవరూ చూడకుండా ఆ ఉత్తరాన్ని చింపి చెత్తకుప్పలో వేసారు..
తరువాత పోష్టమాన్ ద్వారా ఎప్పుడో తనకు జిల్లా క్రికేట్ బోర్డు నుంచి పిలుపు ఉత్తరం ద్వారా వచ్చిన సంగతి తెలుసుకొన్న తేజ.. ఆలస్యం చేయడం వలన ఆడే అవకాశం కోల్పాయాడు...
తేజ ఎంతో భాదపడ్డాడు, ఇలా కూడా జరుగుతుందా అని ఆవేదన చెందాడు
ఈ విషయం తెలుసుకొన్న PET    శ్రీనివాస్, రఘులను గట్టిగా మందలించాడు... TC ఇచ్చి బయటకు పంపిస్తాను అని చెప్పాడు... చేసిన తప్పు తెలుసుకొన్న శ్రీనివాస్, రఘు క్షమించమని అడిగారు..
"మరలా ఇలాంటివి చేస్తే కాలేజ్ నుంచి బయటకు పంపించివేస్తాను" అని PET గట్టిగా మందలించారు..

******
"రఘు ఇప్పుడు కొంచం కోలుకుంటున్నాడు, రక్తం ఎక్కించడం వలన తిరిగి స్పృహలోకి వచ్చాడు" అని డాక్టర్ చెబుతున్న మాటలు శ్రీనివాస్ కి వినపించాయి..
ఆ మాటలు చెవులను తాకగానే ఒక్కసారి గతంలో నుంచి తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు శ్రీనివాస్ ,ఒక్కసారి ఆనందభాష్పాలు గుండెల్లో నుంచి ఆనకట్టలు తెంచుకుని ఒక ప్రవాహంలా ఉబికి వచ్చాయి.. ఆ వెచ్చని కన్నీరు(ఆనంద భాష్పాలు) చెంపలమీద నుంచి కిందకి జారి అవి మరలా గుండెలమీదకు చేరాయి

తన ప్రాణ స్నేహితుడు ఇంత త్వరగా కోలుకుంటాడని ఊహించలేదు...
డాక్టర్ రఘు తల్లిదండ్రులకు చెబుతున్నాడు
"మీ‌ అబ్బాయి చాలా అదృష్టవంతుడు ఎందుకంటే, తలకు బలమైన గాయం తగలడం తీవ్రమైన రక్తస్రావం జరిగింది, O- రక్తం దొరకడం అంత సులువు కాదు.. పైగా ఇంత అర్ధరాత్రి వేళ తేజ వచ్చి ఇవ్వడం తన ప్రాణలను నిలబెట్టాయి"

"స్నేహితులు ఉంటారు గాని ఇంత అర్ధరాత్రి వేళ స్నేహితుడు చావుబతుకుల్లో పోరడుతున్నాడని తెలిసి తేజ వచ్చాడు చూసావా ఇలాంటి స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు" అని డాక్టర్ , నర్స్ మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వేరే పేషెంట్ వద్దకు వెళ్ళారు...

కొంతసేపటికి శ్రీనివాస్ భుజంపైన చేయిపడింది.. ఆ చేతి స్పర్శతో తేజ ధైర్యాన్ని చెబుతున్నట్లు శ్రీనివాస్ కి అర్థం అయ్యింది.. తేజ శ్రీనివాస్ తో అన్నాడు "నువ్వు,రఘు ఎంత ప్రాణ స్నేహితులో నాకు తెలుసు.. భాదపడకు, తను త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం"..
శ్రీనివాస్ తేజ చేయి పట్టుకొని " క్షమించు తేజ, కాలేజి రోజుల్లో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాము.. ఆటలలో మాకన్నా నువ్వు ముందుటున్నావని.. ఈర్ష్యతో అలా చేసాము... కాని అవేమి‌ మనస్సులో పెట్టుకోకుండా నువ్వు చేసిన సాయం నిజంగా ఎంతో గొప్పది"

తేజ ‌: శ్రీనివాస్ నిజంగా చెప్పాలంటే నేను చేసిన సాయం ఏమిలేదు, తోటి మనిషి భాదలలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన భాద్యత... జిల్లా జట్టులో చోటు దొరకపోతే మరలా సాధించవచ్చు.. కాని ప్రాణం తిరిగి రాదు కదా... రఘు తల్లిదండ్రులను చూడు కన్నకొడుకు కోసం ఎంత భాదపడుతున్నారో.. ఇప్పుడు వాళ్ళ కొడుకు కోలుకుంటున్నాడని వాళ్ళ కళ్ళలో ఆనందం చూసావా అంతకంటే నాకు ఏంకావాలి సోదరా...
సరిగ్గా ఇదే పరిస్థితిలో మా తల్లి ,నేను మరియు మా అన్నయ్యా 3 సంవత్సరాల క్రితం హాస్పిటల్ లో ఎంత రోదించమో ,ఆవేదన చెందేమో ఆ దేవుడుకే తెలుసు...
ఏం జరిగిందంటే

******
తేజ చెబుతున్నాడు " మాది ఒక మధ్య తరగతి కుటుంబం మా తల్లిదండ్రులకు ఇద్దరం పిల్లలం నేను, మా అన్నయ్యా విజయ్..
పేదరికం వలన మా నాన్న పెద్దగా చదవలేదు..‌ ఆరోజుల్లో ఇండియన్ ఆర్మీ సెలక్షన్ కి వెళ్ళడానికి మా నాన్నకి 10 రూపాయలు అప్పు దొరకలేదు అంటా నాన్న చెప్పేవారు, అందుకే ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు... ఆయన వ్వవసాయం చేస్తూ  కుటుంబాన్ని ముందుకు నడిపేవారు..
మేము ఆయన చేసే పనిలో సాయం చేద్దామని వెళితే "మీరు ఈ బురద మట్టి పిసకలేరు, వెళ్ళి బాగా చదువుకోండి అని చెప్పేవారు.. ఎటువంటి కష్టమైన పని కూడా చేయించే వారు కాదు ఆయన మా చేత"
మొత్తానికి ఆయన కలలు ఫలించి అన్నయ్య IIT లో చేరాడు.. నేను కూడా బాగా చదువుతూ ముందుకు సాగాను..
అంతా ఆనందంగా జరుగుతుంది అనుకొన్న తరుణంలో మానాన్నకు యాక్సిడెంట్ అయ్యింది.. అన్నయ్య IIT కాలేజీలో,నేను పై చదువుల కోసం హైదరాబాదు లో ఉండటం వలన మేము వెళ్ళేసరికి ఆయన పరిస్థితి బాగా సీరియస్ అయ్యింది.. సమయానికి రక్తం అందకపోవడం వలన ఆయన మమ్మల్ని విడిచి శాశ్వతంగా దూరమయ్యారు...
అప్పుడు అమ్మ పరిస్థితి ఏమి చెప్పాలి తను ఎంత కుమిలిపోయిందో...  ఆ భాద ఎలా ఉంటుందో నాకు తెలుసు సోదరా..
అందుకే మా ఇంట్లో జరిగినది ఇంకా ఎక్కడ జరగకూడదు అని నా వీలైనంత సాయం చేసాను... ఇక ఆటల విషయానికి వస్తే మన మధ్య పోటీ అంటావా..‌అది ఎప్పుడు నాకు ఆరోగ్యకరమైన పోటీ గానే అనిపించింది "

శ్రీనివాస్ విష్ణుతేజ చేయి పట్టుకొని "తేజ ఈరోజు నిజంగా నువ్వు నిరూపించావు పోటీ అనేది పోరాటంలోనే కానీ వ్యక్తిగతంగా కాదని"..

------------ ******* ------
కొన్నాళ్ళకు రఘు పూర్తిగా కోలుకున్నాడు ..‌ తన ప్రాణం నిలబెట్టిన విష్ణు తేజని కలసి గుండెలకు హత్తుకొని క్షమాపణ చెప్పి ఇక నుంచి కష్టాలలో ఉన్నవారికి వీలైనంత సాయం చేద్దాం ఆ మిత్రులంతా కలసి అనుకొన్నారు, మొదట్లో చదువుకునే పిల్లలకు సాయం చేస్తూ వచ్చారు.. ఇప్పుడు వాళ్ళు గ్రామంలోని పిల్లలు స్మార్ట్ ఫోన్ లలో గడుపుతూ మైదానాలకు దూరమైయ్యారని గమనించి ఆ ఏడాది దసరా పండుగకు ఆ ఊరిలో ఆటల పోటీలు నిర్వహించారు..
బహుమతి ప్రదానోత్సవం రోజు విష్ణుతేజ,శ్రీనివాస్ మాట్లాడుతూ "చూడండి పిల్లలు పోటీ‌ ఆనేది ఆటలలో మరియు చదువులోనే ఉండాలి‌,కాని వ్యక్తిగతంగా ఉండకూడదు ..అందరూ కలసిమెలసి ఉండాలి... కలుపుకుందాం, కలిసి ఉందాం ఇదే మన బలం" ‌అని చెప్పి అందరనీ ప్రోత్సాహించారు. అ ఏడాది నుంచి శ్రీనివాస్, విష్ణు తేజ,రఘు ముగ్గురు కలిసి మిత్రుల సాయంతో ఎన్నో కార్యక్రమాలు దసరా,సంక్రాంతి పండుగలకు నిర్వహిస్తూ అ ఊరిలో పండగలకే గొప్ప పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చి ఎంతోమందిని ప్రోత్సహించారు...

--- సమాప్తం ---
ధన్యవాదాలు
శ్రీనివాస్ చక్రవర్తి