Friday, 3 July 2026

కథ: జోడు బిందెల సైకిల్

 కథ: జోడు బిందెల సైకిల్



"ఈ ఊరికి పిల్లని ఇవ్వాలంటే ఆలోచించాల్సిందే.. గుక్కెడు మంచినీళ్లు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో! వాడుకునే నీటి కోసం, తాగునీటి కోసం ఎంత దూరం వెళ్లాలో, అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకి చాకిరి తప్పదు." చిన్నతనంలో మా దూరపు బంధువు అన్నమాట.

ఇప్పుడంటే మా ఊరిలో ఒక్క స్విచ్ వేస్తే మోటర్ ద్వారా నీరు డాబా పైన ట్యాంకర్లలో క్షణాల్లో నిండిపోతుంది. నిమిషాల్లో మినరల్ వాటర్ ఇంటికి వచ్చేస్తుంది.

ఒకప్పుడు నీటి కోసం నిజంగానే ఎన్నో కష్టాలు పడింది మా ఊరు.. అప్పటి మా ఊరి (2000 సంవత్సరం సమయంలో) నీటి సంగతులు. తెల్లవారకముందే మగవాళ్ళు భుజాల మీద కావిళ్ళు వేసుకుని కుర్రాలమ్మ చెరువు వద్ద ఉన్న బావి దగ్గరకు లేదా బేకయ్య బావి దగ్గరకు పరుగులు తీసేవారు. ఆడవాళ్లు తల మీద తళతళలాడే గుండిగ బిందెలను పెట్టుకుని ఎంతో దూరం నుంచి మంచినీరు మోసుకొచ్చేవారు.





మా ఊర్లో తాగినన్ని పాలు, ఎంతో పాడి ఉండేది.మా ఊరు నుంచి బయటికి పాల క్యాన్లు వెళ్ళేవి.
ఎండాకాలం వచ్చిందంటే పొరుగూరు నుంచి ఎంతోమంది కల్లు తాగడానికి, తాడి చెట్ల వనంలాంటి మా ఊరు వచ్చేవారు. సైకిల్ పైన కల్లు డబ్బాలతో మా ఊరు నుండి బయటికి వెళ్లేది. కానీ మంచినీళ్ల కోసం మేము ఎన్నో కిలోమీటర్లు ఎండనక, వాననక, చలి అనక పక్కనున్న పొరుగూరుకు కాలినడకన లేదా సైకిల్ మీద వెళ్లి నీటిని నింపుకుని వచ్చేవాళ్ళం.

********

సైకిల్ పైన నా చిన్నప్పుడు మొదటిసారి నీళ్లు తెచ్చిన జ్ఞాపకం..



నా జత పిల్లలందరూ సైకిల్ మీద దూరం నుంచి మంచినీళ్లు తెస్తున్నారు. నేను కూడా ఆరోజు ఉదయం సమరోత్సాహంతో గుర్రం పైన సిద్ధమైన సైనికుడు లాగా నా సైకిల్ తీసి ఇంటి ముందర స్టాండ్ వేసాను.
నాన్న "చిన్నోడా.. నువ్వు రెండు బిందెలు లాగలేవు గానీ, నీకు ఒక బిందె కడతాను, ఇంట్లోకి వెళ్లి బిందె తీసుకుని రా" అని చెప్పాడు.
ఇంట్లోంచి బిందెను తీసుకొచ్చిన నన్ను చూసి నాన్న నవ్వుతూ "ఇది గుండిగ బిందె నాన్న, సైకిల్ క్యారేజ్ మీద కూర్చోదు" అని చెప్పి, తను ఒక బిందె తెచ్చి అమ్మ చేతికి ఇచ్చాడు. అమ్మ గడ్డి వాములో నాలుగు గడ్డి పూచలతో శుభ్రంగా ఆ బిందెను తోమి నా చేతికి ఇచ్చింది.
నాన్న ఒక గోనె సంచి తెచ్చి సైకిల్ క్యారేజ్ మీద పరిచి, దాని మీద బిందె మరియు నీళ్లు వడపోసుకోవడానికి ఓ గుడ్డను కప్పి, సైకిల్ ట్యూబ్ తో గట్టిగా కట్టాడు.

నేను బిందె సైకిల్ మీద గట్టిగా ఉందా లేదా అని కుదుపి చూశాను. "ఇంటికి తిరిగొచ్చేదాకా నీకు ఇంకేం అనుమానం లేదు" అని నాన్న ధైర్యం చెబుతూ.. "చూడు బిందెని నీళ్ళతో నింపుకొని వస్తున్నప్పుడు లారీ లేదా బస్సు లాంటివి ఎదురైతే పక్కన దిగి నుంచో.. కట్టిన బిందెను కిందకు దించకుండా ఒక్కొక్క బకెట్ నీరు బావిలోంచి తీసుకొచ్చి ఇందులో పోయి" అని కొన్ని సూచనలు చెప్పాడు.

నేను సైకిల్ పైన రామాలయం దాకా వచ్చాక, మా స్నేహితుడు సుభాని నాలాగే మంచినీళ్ల కోసం ఒంటి బిందెతో సైకిల్ మీద వస్తూ "ఏం మామ, మొదటిసారి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నావా?" అన్నాడు.నేను అవునని తలూపాను. "సరే పద, ఇద్దరం వెళ్దాం" అన్నాడు. మనవాడు నాకన్నా ముందే సైకిల్ నేర్చుకుని, రోజూ మంచినీళ్లు తీసుకొస్తున్న అనుభవజ్ఞుడు. ఆ క్షణాన తను మంచినీరు తీసుకురావడంలో డిగ్రీ చేసిన వ్యక్తి లాగా ఆకాశం అంత ఎత్తున నాకు కనిపించాడు, ఓ మంచి తోడు వచ్చాడనే భరోసా దొరికింది నాకు.

మా ఊరి డొంక దాటి ఇద్దరం కలిసి తారు రోడ్డు ఎక్కాము. "త్వరగా పదరోయ్, అసలే ఎండాకాలం.. నీళ్లు దొరకవు" అని సుభాని గట్టిగా సైకిల్ పెడల్ తొక్కడం మొదలుపెట్టాడు.
నేను మొట్టమొదటిసారి మంచినీళ్ల కోసం వెళుతూ ఉండటం వలన, మంచినీళ్లు తీసుకుని వచ్చే పోయే సైకిళ్లను, వ్యక్తులను చూస్తూ నా సైకిల్ తొక్కుతున్నాను. ఖాళీ బిందెలతో నీటి కోసం బయలుదేరినవి, బంగారం లా మంచినీటిని నింపుకొని ఏనుగులాగా నిండుగా ఎదురు వస్తున్న సైకిళ్లు. ఎండాకాలం వీచే గాలికి మా ఖాళీ బిందెల్లో గాలి సవ్వడి చేస్తోంది.. నిండు బిందెలతో వచ్చే సైకిళ్లు చైన్లు కరకర శబ్దం చేస్తున్నాయి.



నీళ్ల కోసం వెళ్లే వారి ముఖాల్లో ఆందోళన.. "అసలే ఎండాకాలం, మంచినీళ్లు ఉంటాయా ఉండవా" అని.. వచ్చేవారి ముఖాల్లో విరిసిన ఆనందం "హమ్మయ్య, ఈ రోజుకి మంచినీళ్లు దొరికాయి" అని.

ముందుగా నీళ్లు తీసుకుని వస్తున్న ఊరు పెద్ద నాగేశ్వరరావు గారి అబ్బాయి సతీష్ మామ ఎదురయ్యారు.. నేను "రేయ్ సుభాని, ఆయన సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న విధానం చూశావా.. ఖాళీ బిందెతో ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుందిరా.. బావిలో నీళ్లు లేవేమో.."
సుభాని నవ్వుతూ "రేయ్.. సతీష్ బాబాయ్ గురించి నీకు తెలియదు.. సైకిల్ తొక్కడంలో అతను నెంబర్ వన్! బరువు ఉన్నా లేకపోయినా, ఆయన తొక్కుడు మాత్రం మారదు రా!."

సతీష్ మామా దగ్గరకు వచ్చాక తెలిసింది ఆయన మంచినీళ్లతో వస్తున్నాడని..
 మమ్మల్ని చూసి "ఏంటి కుర్రాళ్లు.. మంచినీళ్లకు వెళ్తున్నట్టున్నారే.. ఆలాపున్నయ్య బావి కాడికా, పుట్టగుంట బావి కాడకా..? పుట్టగుంట బావికే వెళ్ళండి... ఆలాపున్నయ్య బావిలో నీళ్లు మారాయి, పుట్టగుంట అయితే బాగుంటాయి.. నేనూ అక్కడి నుంచే.." అని చెప్పి రయ్యిన వెళ్ళిపోయాడు.



ఇద్దరం కలిసి పుట్టగుంట బావి దగ్గరికి చేరుకున్నాం. రోడ్డుకి దగ్గరలో ఉన్న కాల్వ పక్కన కింద బావి ఉంటుంది.. నేను రోడ్డుపైనే సైకిల్ స్టాండ్ వేసి ఒక్కో బకెట్ తెచ్చి నీళ్లు పోద్దాం అనుకుంటే...
సుభాని "నేరుగా సైకిల్ ని బావి దగ్గరికి పోనిద్దాం, నీళ్లు నింపాక ఇద్దరం సైకిల్ ని పైకి నెడదాం" అని చెప్పాడు.

బావి పక్కన స్టాండ్ వేసి సగం బిందెలు నింపాక "ఇప్పుడు స్టాండ్ తీసి పైకి వెళ్దాం పద" అని తాను అన్నాడు. నేను: "ఇదేంట్రా సగం బిందెలతో మనం ఇంటికి వెళ్ళడానికా ఇంత దూరం వచ్చింది??"
సుభాని: "పూర్తి బిందెలతో మనం సైకిల్ రోడ్డు పైకి ఎక్కిస్తే సగం నీళ్లు కింద పోతాయిరా.. అందుకే సగం వరకు పోశాను, పైకి వెళ్ళాక మిగతా ఖాళీ నింపుదాం."
తను హ్యాండిల్ పట్టుకుంటే, నేను కింద నుండి రోడ్డు పైకి సైకిల్ తోసాను.. మొత్తానికి ఇద్దరం నీళ్లు నింపుకుని ఇంటికి బయలుదేరాం.



"సుభాని, కొంచెం నా వెనుక నీ సైకిల్ నడపరా.. నా సైకిల్ రోడ్డు గుంటల్లో దిగితే బిందె పక్కకి పడిపోతుందేమో అని సందేహంగా ఉంది" అని నేను అడిగాను.
సుభాని: "ఏం కాదురా, గుంటల్లో నెమ్మదిగా నడుపు, నేను వెనుకనే ఉంటా కదా, నువ్వు ముందు పదా."

నేను ముందు.. తను నా వెనుక.. ఇద్దరం బయలుదేరాం..
రోడ్డు మీద గుంటల్లో సైకిల్ దిగినప్పుడల్లా నేను నా చేయి వెనక పెట్టి బిందెను తడిమి చూస్తున్నాను, ఏమైనా కదిలిందేమోనని.. వెనకనుంచి సుభాని "రేయ్, నువ్వు ముందుకు చూసి సైకిల్ నడపరోయ్.. ఈ మట్టపూడి రోడ్డు గుంటల్లో పడ్డామంటే సైకిలు చేలోకి వెళ్లాల్సిందే, జాగ్రత్త."

మా ఊరి అడ్డరోడ్డు మలుపు దగ్గరికి చేరుకున్నాం.. దూరంగా లారీ హారన్ చప్పుడు వినిపించింది. అంతే, నా గుండెల్లో రైళ్లు పరుగులు తీసినట్టు అనిపించింది. నేను సడెన్ గా సైకిల్ దిగేసాను.
సుభాని: "ఏమైందిరా.."
నేను: "లారీ వస్తుంది మామ.. అది మన పక్కనుంచి వెళితే.. గాలి దాని వైపుకు లాగినట్లుగా అనిపిస్తుంది, బ్యాలెన్స్ తప్పుతుందేమోనని దిగాను."
సుభాని: "మాష్టారు.. లారీ మనకి అర కిలోమీటర్ దూరంలో కామేశ్వరమ్మ గుడి దగ్గర ఉంది రా బాబు.. ఇలా అయితే ఈరోజు మనం ఇంటికి వెళ్లినట్లే.."



లారీ మమ్మల్ని దాటాక ప్రయాణం మొదలుపెట్టాం. మా సైకిల్ ఇప్పుడు మా ఊరి డొంక మీదకి ఎక్కింది.
ఆ క్షణాన, ఒక్కసారిగా మా ఊరి గాలి నా దేహానికి తాకేసరికి.. గుండెల నిండా ఏదో తెలియని ఆనందం. ఎంతో విలువైన వస్తువుని సంపాదించి మా ఊరికి, ఇంటికి తీసుకెళ్తున్నానే గొప్ప సంతోషం పొందాను.
నేను సైకిల్ మీద నీటితో వస్తున్నట్లు తెలిసే విధంగా వెళ్లే దారిలో మా మిత్రులు అందర్నీ పలకరించాను.. ఇంటికి చేరగానే అమ్మానాన్న నన్ను చూసి ఆనందించారు..

కుటుంబానికి ఒకరోజు సరిపడా మంచినీళ్లు తీసుకొచ్చి ఏదో ఘనకార్యం చేసిన వ్యక్తిలా పొంగిపోతూ అమ్మ దగ్గరికి వెళ్లి ఒక రెండు రూపాయలు లంచం అడిగాను. అమ్మ నవ్వుతూ నా చేతిలో పెట్టింది. డబ్బు తీసుకొని పెద్దోడు కొట్టు వైపు కొబ్బరి బిళ్ళలు, జీడీలు కొనుక్కోవడానికి పరుగులు తీశాను.





**********

రోజులు గడుస్తున్నాయి.. నేను తరగతులు మారుతున్నాను.. కానీ మంచినీళ్ల కష్టాలు అలాగే ఉన్నాయి. నేను ఒంటి బిందె నుంచి ఇప్పుడు జోడి బిందెలకు మారాను. ఒకప్పుడు ఒంటి బిందె కట్టడానికి కచ్చితంగా నాన్న ఉండాల్సిందే. ఇప్పుడు జోడి బిందెలు కట్టుకుని వెళ్లే అనుభవం నాకు వచ్చింది. ఈ నీటి కోసం చేసే ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఊరిలో అందరితో పరిచయాలు.. ఊర్లో సంగతులు, బడిలో విశేషాలు, టీవీలో వచ్చే క్రికెట్ ముచ్చట్లు.. కబుర్లు చెప్పుకుంటూ సాగేవి మంచి నీటి కోసం చేసే సైకిల్ ప్రయాణాలు. దూరం వెళ్ళలేక 2 లీటర్ల డబ్బాలో మంచినీళ్ళు తీసుకొని రమ్మని ముసలి వాళ్లు ఇచ్చేవారు.



మంచి నీళ్ల కోసం వెళ్లే దారిలో అడ్డరోడ్డులో సారథి కొట్టు దగ్గర ఆగి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడటం ఓ అద్భుతమైన జ్ఞాపకం. ముందుగా వెనక పేజీలో క్రికెట్ వార్తలతో మొదలుపెట్టి తరువాత సినిమా పేజీ చూడటం.. ఎవరైనా క్రికెట్ పేపర్ చదువుతుంటే వాళ్లు చదవడం పూర్తి అయ్యే వరకు ఎదురు చూడటం.. ఆదివారం అయితే డిస్ట్రిక్ట్ పేపర్ లో ఏ టీవీలో ఏ సినిమా ఎన్ని గంటలకి అన్న విశేషాలు తెలుసుకుని మిత్రులతో పంచుకోవటం.

ఓ రోజు నేను లక్ష్మయ్య అన్నయ్య ఇద్దరం కలిసి మంచినీళ్లకి వెళ్ళాం.
లక్ష్మయ్య అన్నయ్య చెప్తుండేవాడు "బడికి కొత్త సైకిల్, మంచినీళ్లకి పాత సైకిల్" అని..
నేను కూడా నా కొత్త సైకిల్ ఇంటి దగ్గర పెట్టి నాన్న సైకిల్ మీద మంచి నీళ్ళు తీసుకొస్తున్నాను ఆ పూట..
రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ విశేషాలు తను చెబుతున్నాడు.. "ఆహా.. ఏం కొట్టాడు సెహ్వాగ్.. న్యూజిలాండ్ బౌలర్లను చితకొట్టేశాడు అనుకో.." మరోవైపు నేను తను చెబుతున్న మాటలను మ్యాచ్ హైలెట్స్ దృశ్యం రూపంలో మార్చుకుని సైకిల్ తొక్కుతున్నాను.

బిందెల్లో నీటితో ఉన్న సైకిల్ మా ఊరి కృష్ణుడు గుడి దాటి కొంచెం ముందుకు వెళ్ళింది.. అంతే, వెనుక నుంచి "అరెరే.. సైకిల్ చక్రం ఊడింది, సైకిల్ చక్రం ఊడింది.." అని మాటలు వినిపించాయి.
నా సైకిల్ ముందు ఒక చక్రం జోరుగా పరుగులు తీస్తుంది.. నా సైకిల్ బాగానే నడుస్తుంది కదా..
ఎవరిదిరా ఈ సైకిల్ చక్రం అని చూస్తే.. అది నా సైకిల్ ముందు చక్రమే. ఒక్కసారి నా గుండె జల్లుమంది,
ఒంటి చక్రం మీదే జోడి బిందెలతో నా సైకిల్ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళింది. హ్యాండిల్ పట్టుకుని నెమ్మదిగా నేను కిందకి దిగాను..




వెనకవైపు రెండు బిందెలు నిండా నీళ్లు ఉండటం, సైకిల్ నిదానంగా నడుస్తూ ఉండటంతో బ్యాలెన్స్ అయిందని అనిపించింది. నా సైకిల్ ముందు చక్రం చేసిన ఫీట్ చూసి దగ్గరలో ఉన్నవారు నవ్వులు చిందించారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఊడిన చక్రం తెచ్చి తిరిగి నాకు ఇచ్చారు..
ముందు చక్రాన్ని బిగించి నేను నడుస్తూ నెమ్మదిగా సైకిల్ ను ఇంటికి చేర్చాను.
******

అది మంచి నడి వేసవి కాలం..ఓ రోజు ఉదయం 10:30 గంటల సమయం.
వేసవిలో చెలరేగే సూర్యుడు ఆ రోజు మరింత నిప్పులు చెరుగుతున్నాడు. మరో వైపు మట్టి డొంకలో ఇసుక, వేడి గాలికి సుడులు కొడుతూ పైకి లేస్తోంది. ఎండను లెక్క చేయకుండా పిల్లలు అందరం శేషు మామయ్య ఇంటి దగ్గర క్రికెట్ ఆటలో మునిగి తేలుతూ ఉన్నాం.. మా ఈడు కుర్రాల్లో చేయి తిరిగిన ఆటగాడు తేజ, గంటనుంచి అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఫీల్డింగ్ చేస్తున్న మేము ఆరోజు ఎండకి తడిసి ముద్ద అయ్యాం.



ఇంతలో రోడ్డుమీద ఓ దృశ్యం కనిపించింది, నడుచుకుంటూ వస్తున్న నాన్న కాళ్ల దగ్గర కొంత రక్తపు మరకలతో గీరుకుపోయి ఉంది.. తన పక్కనే మా సైకిల్ నడిపించుకుంటూ వస్తున్న మా ఊరి బాబాయ్.. సైకిల్ కింద పడినట్లు సొట్టబడిన బిందెలు, వాటికి అయిన మట్టి, భారంగా నడుస్తున్న నాన్న కాళ్లను చూస్తే అర్థం అయ్యింది.ఆ క్షణాన నాన్న దగ్గరికి వెళ్దామా వద్దా అనే సందిగ్ధంలో నేను.. ఎందుకంటే ఆ రోజు ఉదయం మంచినీళ్లు తీసుకురామని అమ్మ నాకు చెప్పింది.



ఉదయాన్నే నాన్న తాడి చెట్లు ఎక్కి, ఒక గొడ్ల చావిడిని తాటాకుతో కప్పడానికి వెళ్ళాడు. పని పూర్తయ్యి ఇంటికి వచ్చిన నాన్న ఇంట్లో మంచినీళ్లు లేవని తెలిసి, అలాగే ఎండలో మంచి నీటి కోసం వెళ్ళాడు. వేసవిలో నాన్న విరామం లేకుండా తాటి చెట్లు మూడు పూటలా ఎక్కడం, తాటి ఆకులతో పూరి ఇళ్లు, చావిడిలు కప్పడం చేస్తూ ఉండేవాడు. పని పూర్తయ్యాక ఆ ఇంటి వారు నాన్నకి మద్యం లేదా కల్లు తమ సంతోషం మేరకు పోసేవారు.. మరి ఆ రోజు ఓ వైపు తీవ్రమైన ఎండ ప్రభావమో, విశ్రాంతి లేకపోవడం, కొంత కల్లు తాగడం వలనో కళ్ళు తిరిగి పడిపోయాడు.

నాన్న నడుచుకుంటూ మా వైపు వచ్చే కొలది నా గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగింది. నాన్న దగ్గరికి వెళ్లి సైకిల్ పట్టుకుందామంటే భయం వేసింది.. "నువ్వు ఎందుకు మంచినీళ్లు తీసుకురాలేదు?" అని తిడతారనే భయం ఒక వైపు. తండ్రి విశ్రాంతి లేకుండా ఇంత కష్టపడుతున్నా, ఆటల్లో పడి ఒక చిన్న పని కూడా చేయలేకపోయాను అనే బాధ మరోవైపు.. నామీద నాకే కోపం.

నడుస్తున్న సైకిల్ పైన సొట్ట పడిన జోడు బిందెల్లో అడుగున ఉన్న కదిలే నీటి లాగే..
నా మనసులో ఆలోచనలు కూడా నన్ను ఆ క్షణాన కుదిపేశాయి..
వేసవి దాటికి మా వీధిలో కాలే ఇసుకలో నా పాదాలు కూరుకుపోయినట్లు, కదలలేక ముందుకు సాగలేక.. నాన్న వెనుకే నా అడుగులు బరువైన గుండెతో ఇంటి వైపు భారంగా కదిలాయి.



  • సమాప్తం


    మీ చిన్నతనంలో నీటి కోసం ఇలా సైకిల్ మీద వెళ్లారా? లేదా ఇంకేదైనా మర్చిపోలేని పల్లెటూరి జ్ఞాపకం ఉందా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.

21 comments:

  1. ఇది కధ కాదు జీవితం 😄

    ReplyDelete
  2. చాలా బాగుంది అన్న కథ‌.90s కిడ్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.మీము చిన్నప్పుడు నీటికోసం ఇంటికి దగ్గరలో ఉన్న పొలం దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం.స్నానం పొలంలో ఉన్న బోరు దగ్గర చేసేవాళ్ళం.అవన్నీ మరుపురాని జ్ఞాపకాలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సోదరా..
      మీ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.

      Delete
    2. Old days never forget everyone exllent though Chakri

      Delete
    3. Yes, brother—olden days are truly golden days. Thanks so much for reading!

      Delete
  3. చక్రి,
    ఇంత కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించి మళ్ళీ 90's గుర్తుంచుకోవడం మాములు విషయం కాదు... ఇది నీకు మధుర జ్ఞాపకం

    ReplyDelete
    Replies
    1. అవును.. మధుర జ్ఞాపకం.
      పూర్తి కథ చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

      Delete
  4. సూపర్ చక్రవర్తి బాగా చిన్నప్పుడు జ్ఞాపకం న్ని అందరికీ గుర్తు చేశావు మేము చిన్నప్పుడు ఇలాగే మంచినీళ్ల కోసం పల్లెటూర్లో ప్రతి ఒక్కరు కష్టపడి మంచి రోజులు తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజున ఇప్పుడు నువ్వు ఈ కథ రూపంలో చాలా వి వరంగా చెప్పావు ....
    .

    ReplyDelete
    Replies
    1. పూర్తి కథ చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.. కథ చదివి మీ జ్ఞాపకాలు గుర్తుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.. ఈ కథకు సార్థకత వచ్చింది అనుకుంటున్నాను.

      Delete
  5. చాలా మంచి జ్ణాపకం...పుట్లగుంట బావిలో నీరు ఊరే వరకు వేచి చూసి నీళ్ళు తోసుకొచ్చిన రోజులు...

    ReplyDelete
    Replies
    1. అవును.. నీరు కోసం వేచి చూసిన రోజులు, వేకువజామునే లేచి వెళ్ళిన రోజులు మరపురాని జ్ఞాపకాలు.
      కథ చదివినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

      Delete
  6. చాలా బాగుంది
    Nee writings nannu mana ooriki, inka time travel cheyistaay.
    Always felt good while reading your writings
    Thank you and keep writing.

    ReplyDelete
    Replies
    1. కథ చదివి మన ఊరికి, ఆనాటి సమయానికి తీసుకొని వెళ్ళాయి అని మీరు చెప్పండం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వారి ప్రోత్సాహంతో మరిన్ని విశేషాలు రాయడానికి ప్రయత్నం చేస్తాను. హృదయ పూర్వక ధన్యవాదాలు.

      Delete
  7. Pedananna gurinchi chala baga cheppav brother. anni panulu chesevaru. Emotional ending.

    ReplyDelete
    Replies
    1. మీరు కథ చదివి నాన్నని గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. హృదయ పూర్వక ధన్యవాదాలు సోదరా...

      Delete
  8. P ramesh naidu7 July 2026 at 04:34

    చిన్నప్పటి సంగతులు నువ్వు గుర్తు చేసుకోవడం ఒక ఎత్తైతే వాటికి అంతే అందంగా అక్షర రూపం ఇచ్చి మమ్మల్ని కూడా తిరిగి బాల్యం లోకి తీసుకువెళ్లినందుకు ఆలింగనాలు మిత్రమా

    ReplyDelete
  9. "జోడు బిందెల సైకిల్" కథ చదివాక నాకు కథ చదివిన భావన కంటే నా బాల్యాన్ని మళ్లీ జీవించిన అనుభూతి కలిగింది.

    నీళ్లు తెచ్చుకోవడానికి కథలో జోడు బిందెల సైకిల్ ఉంటే, మా చిన్నప్పుడు నేను కావిడి మోసిన రోజులు గుర్తొచ్చాయి. సొంత ఊరిలో కిలోమీటర్ దూరంలో ఉన్న బోరింగ్ బావి నుంచి నీళ్లు తెచ్చుకోవడం, అది ఎండిపోతే ఇంకా దూరం వెళ్లడం, ఉదయాన్నే మోటార్ ఆన్ అయ్యే సమయానికి క్యాన్లు, బిందెలతో పరుగులు తీయడం... తాతయ్య ఊరికి వెళ్తే అక్కడ పాత బావి నుంచి చిన్న బిందెలతో నీళ్లు మోసుకొచ్చిన రోజులు ఒక్కసారిగా కళ్లముందు నిలిచాయి.

    రోజులు మారాయి. ముందు మా ఇంటికి దగ్గర్లో బోరు వచ్చింది. తర్వాత వాటర్ ట్యాంక్ కట్టారు. చివరికి ఇంటి ముందుకే కుళాయి వచ్చింది. తాతయ్య ఊరిలో కూడా అదే మార్పు జరిగింది. ఆ ప్రయాణమంతా ఈ కథ మళ్లీ గుర్తు చేసింది.

    మీ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, మీరు కేవలం ఒక సైకిల్ గురించి రాయలేదు; ఒక తరం జీవించిన జీవితాన్ని, నీటి విలువను, ఆ కాలపు కష్టాలను ఎంతో సహజంగా గుర్తు చేశారు.

    ఒక మంచి కథ కొత్త ప్రపంచాన్ని చూపించాల్సిన అవసరం లేదు. మనం మరిచిపోయిన ప్రపంచాన్ని మళ్లీ మన ముందుంచగలిగితే చాలు. మీ కథ నాకు అదే చేసింది.

    ఈ అందమైన జ్ఞాపకాలను మళ్లీ జీవించే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ఆలింగనాలు మిత్రమా

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సోదరా..
      ఈ కథ చదివాక మీరు మళ్ళీ మీ బాల్యం లోకి వెళ్ళారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది..

      సమయం కేటాయించి కథ చదవడమే కాకుండా కథ గురించి, మీ అందమైన జ్ఞాపకాలు గురించి తిరిగి పంచుకున్నందుకు ధన్యవాదాలు మిత్రమా..
      Feeling Happy 😍

      Delete
  10. ఈ జ్ఞాపకాలు చాలా మధురంగా ఉంటాయి..
    ఎంతో కష్టమైన జీవితాన్ని అనుభవించినా అది కష్టంగా అనిపించలేదు మనకి ..ఇప్పటికీ ఆ కష్టాన్ని మరిచిపోయి దాంట్లో ఆనందాన్ని చూస్తున్నాం ..
    రచన విషయానికి వస్తే ..కొన్ని సందర్భాలలో వాడిన సైన్స్ ముచ్చటగా అనిపించింది
    1. లారీ పక్కనుంచి వెళ్తే .. గాలికి లాగినట్టు అనిపించడం
    2. ఒక చక్రం ఊడిపోతే బ్యాలెన్సింగ్ గురించి చర్చించడం..

    చాలా బాగా ఆలోచించారు .. మరియు రాశారు ..మిత్రమా..

    ReplyDelete
    Replies
    1. కథ చదివినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు మిత్రమా..

      Delete