జిగిరి:
మనిషికి - ఆటవిక జీవికి మధ్య అద్భుతమైన అనుబంధాన్ని చూపించిన కథ జిగిరి.వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్తూ బ్యాగ్ నిండా బట్టలు , ల్యాప్టాప్ పెట్టుకున్నాను. ప్రయాణం చేస్తూ నా బ్యాగ్ లో ఏదైనా పుస్తకం పెట్టుకోవడం అలవాటు. ఈసారి బ్యాగ్ బాగా నిండిపోయింది. చిన్నదంటే చాలా చిన్నది ఏదైనా పుస్తకం పెట్టుకుందామని నా పుస్తకాల అల్మారా చూశాను. ఎప్పటినుంచో చదువుదామని అనుకుంటున్నా జిగిరి అనే చిన్ని 100 పేజీలు పుస్తకం నా బ్యాగ్ లోకి ప్రయాణంలో తోడుగా చేరింది.
కథ ఏంటంటే : తాత ముత్తాతలు నుంచి ఎలుగుబంటులను ఆడించే కుటుంబం ఇమామ్ ది. తను కూడా ఎలుగుబంటిని (షాదుల్) ఆడిస్తూ జీవనాధారం సాగిస్తూ ఉంటాడు, మన కథ ప్రారంభంలో ప్రభుత్వం ఆటవిక జంతువుల్ని వదులుకోవాలని చెబుతుంది , అందుకు ప్రతిగా రెండు ఎకరాల భూమిని ఇస్తానని మాట ఇస్తుంది . కానీ మన కథానాయకుడు ఇమామ్ కు 20 సంవత్సరాల నుంచి ఎలుగుతో ఉన్న పుత్ర సమానమైన అనుబంధం వలన వదులుకోవడానికి ఇష్టపడడు. ఇందుకు వ్యతిరేకంగా ఇమామ్ కొడుకు చాంద్ రెండు ఎకరాల కోసం ఎలుగు(షాదుల్) ని చంపడానికి కూడా వెనకాడడు. తండ్రి కొడుకులు మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ . కథలో ఒకవైపు మానవత్వాన్ని మరోవైపు స్వార్ధాన్ని రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారూ అద్భుతం ఆవిష్కరించారు.
ఈ చిన్న నవలలో నాకు నచ్చిన విశేషాలు. 1. చిన్న ఎలుగు (షాదుల్)ను సంపాదించడం కోసం అడవికి వెళ్లి ఇమాన్ చేసిన అద్భుతమైన సాహసం కార్యం.2. ఇమాన్ భార్య బీబమ్మ ఎలుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక వైపు చాంద్ కి మరోవైపు ఎలుగు (షాదుల్) కి పాలు ఇస్తూ పొందే మాతృభావన. 3. ఒక ఊరులో పేరు పొందిన కుస్తీ యోదుడితో ఎలుగు కుస్తీ పట్టే ఘట్టం. 4. చాంద్ ఎలుగును చంపడానికి గుంట తీసి అందులో షాదుల్ ను తోస్తుంటే ఆట ఆడిస్తున్నాడు అనుకుని అమాయకంగా గుంటకి అటూ, ఇటూ గెంతడం.5. చివరి ఘట్టంలో షాదుల్ ను తిరిగి అడవిలో వదులుదాం అని వెళ్ళినప్పుడు ఇమామ్ పొందిన మానసిక సంఘర్షణను తారాస్థాయిలో ఆవిష్కరించారు రచయిత.
పెద్దింటి అశోక్ కుమార్ గారు ఎలుగులను ఆడించేవారి జీవితాలను మంచి సునిశిత పరిశీలనతో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఎన్నో భాషల్లోకి అనువాదం అయిన ఈ నవలలోజంతువు నుంచి మానవత్వం పొందిన ఆటవిక మృగాన్ని స్వార్థం వలన మనిషి నుండి మృగంగా మారిన వైనాన్ని ఏకబిగిన చదివించే విధంగా రచించారు.మీరు కూడా చదివారా ఈ పుస్తకం మీకు ఎలా అనిపించింది?
No comments:
Post a Comment