Wednesday, 13 November 2019

బాల్యం - అందాల బృందావనం (Memories)



1) చిన్నప్పుడు పండుగల కోసం ఎదురు చూడటం, ఎందుకంటే అప్పుడు పండుగలు అంటే కొత్త బట్టలు వస్తాయి మరియు నోరూరించే పిండి వంటకాలు, చుట్టాలు  వస్తారు, కొత్త సినిమాలు వస్తాయి అందరూ కలిసి ఓ చోట ఎంత బాగుండేదో. నిజంగా పండుగ అంటే ప్రతీ చోటా కనుల పండుగే.

2) శనివారం సాయంత్రం - శనివారం సాయంత్రం బడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, ఆదివారం నాడు చేయబోయే వాటిని గూర్చి ఆలోచిస్తూ, మిత్రులతో చర్చిస్తూ ఎంతో ఆనందానికి లోనయ్యే వాళ్ళం.

3)తాటిమట్టలను బ్యాటులుగా చేసి క్రికెట్ ఆడుతూ , వాటి మీద MRF అని రాసి సచిన్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. తాటిముంజలు తిన్నాక  కాయలతో కిర్,కిర్ బండి చేయడం.తాటి పండ్లను ఆకుల్లో కాల్చి , పొలం గట్టులపైన కూర్చుని మాట్లాడుకుంటూ తినడం.

4)ఈతపండ్లు, నేరేడు పండ్లు కోసం తెల్లవారుజామున  అందరికన్నా ముందు పరుగులు తీయడం.
రెండు జేబులనిండా వాటిని నింపుకుని విశ్వవిజేత లాగా ఇంటికి తిరిగి వెళ్ళడం.

5)వర్షం పడితే కాగితం పడవలు,కత్తి పడవలు చేయడం. చెరువు గట్టు మీదకు వెళ్ళి నల్లమట్టిని తెచ్చి మట్టి బొమ్మలు చేస్తూ మనలోని శిల్పిని వెలికితీయడం.

6) వేసవి సాయంత్రం ఆరుబయట నక్షత్రాలు చూస్తూ పడుకోవడం. నాన్న,అన్నయ్య వాళ్ళు చెప్పే కథలు వినడం. ఇప్పటిలాగా అప్పుడు ఇన్ని టీవి చానల్స్ లేవు కదా, దానివలన అప్పుడప్పుడు కలర్ టివిని , VCR  మరియు కొన్ని క్యాసెట్లను అద్దెకి తీసుకువచ్చి రాత్రిపూట వేసేవాళ్ళు. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు కదా "అరే సాయంత్రం మా ఇంటి దగ్గర  సినిమాలు వేస్తున్నాం, ఎవరికీ చెప్పకుండా నువ్వొక్కడివే రా అనేవాళ్ళు".
ఒక చాప, దుప్పటి తీసుకుని అక్కడికి వెళ్లేసరికి చాలామంది ఉండేవాళ్ళు😁😁.ఇంట్లో ఖాళీ చాలక ఆ కలర్ టీవీ అరుగు మీద పెట్టి సినిమాలు వేసేవాళ్ళు, అవి చూస్తూ నిద్రలోకి జారుకున్న రోజులు గుర్తుచేసుకుంటే భలే అనిపిస్తుంది.

7)ఇక ఆదివారాలు గూర్చి ఎంత చెప్పినా తక్కువే, మిగతా రోజుల్లో ఆలస్యం లేచే పిల్లలు ఆదివారం మాత్రం ఇంట్లో అందరికంటే ముందు, సూర్యుడి కంటే కూడా ముందు లేవడం, మిత్రులు ఇంటికి పరుగున వెళ్ళి వాళ్ళను నిద్ర లేపి ఆటలకు, పాటలకు రమ్మని చెప్పడం.
ఇలా ఆటలు మొదలు పెట్టగానే  సూర్యుడు కూడా పిల్లలతో జత కూడుతాడు, కొంత సేపటికి ఆయన తన ప్రభావాన్ని పెంచుతాడు. అప్పటికే అలసిపోయిన పిల్లలు ఇంటి దారి పట్టి , టిఫిన్లు చేసి..
ఇక ఇంట్లో టీవీ ఉంటే చూడటమో లేకపోతే పక్కింటి వాళ్ళ అరుగు మీద కూర్చుని బటానిలో, వేరుశనగ కాయలు తింటూ దూరదర్శన్లో వేసే సీరియల్స్ చూడడం.
మరలా సాయంత్రం కాగానే ఆటలకు పరుగులు తీయడం, కొంతసేపటికి సూర్యుడు అస్తమించడం మొదలుపెడతాడు‌‌. అప్పుడు పిల్లల్లో బాధ మొదలవుతుంది అరెరే ఆదివారం అయిపోయిందే అని..

నిజంగా ఒక మాటలో చెప్పాలంటే బాల్యం అందమైన బృందావనం

అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Thursday, 12 September 2019

ఒక ఊరు - ఒక గణపతి - 20 వసంతాలు

ఒక ఊరు - ఒక గణపతి - 20 వసంతాలు

గణేష్ నవరాత్రులు..
ఈ పేరు  వింటేనే  గుండెల్లో ఎంతో ఆనందం..

సరిగ్గా 20(1998-1999) సంవత్సరాల క్రితం మా ఊరిలో వినాయక చవితి ముందు రోజు అనుకుంటా తొలిసారి గణపతి విగ్రహం తెచ్చారు. పిల్లలం అందరం ఉరుకులు పరుగులు మీద  గుడి అరుగు దగ్గరకు చేరుకున్నాం. వినాయకుడి విగ్రహాన్ని కింద నుంచి పైవరకు ఎంతో వింతగా కొత్తగా చూసాం..

వినాయక చవితి ఉదయాన్నే ముందుగా నల్లమట్టితో  గణపతి బొమ్మని కొని,పిల్లలు ఊర్లో ఉన్న రకరకాల పువ్వులు, ఆకులు నిధుల వేటకు భయలుదేరేవాళ్ళం. ఎర్రటి కాగితం పూలు, పసుపు పచ్చని గన్నేరు పూలు , చెరువు గట్టుకు చేరుకుని తెల్లని కలువపూలు కొన్ని కోసుకొని, వీలైతే ఒక కలువ పువ్వుని ధండలాగా అల్లుకుని మెడలో వేసుకుని ,మామిడి చెట్లకు చేరుకొని మామిడి ఆకులు కోసుకొని, వచ్చే దారిలో గట్టుపైన గరికను తీసుకుని అరే గరిక అంటే వినాయకుడు ఎంత ఇష్టమో తెలుసా అని అనుకునే వాళ్ళం. నేనైతే ఆయనకు అన్నీటికన్నా కుడుములు అంటే ఎంతో ఇష్టం అనే వాడిని ( మా లాగు మిత్రులు అందరూ నన్ను నీకూ అంతేగా అనేవారు). ఇలా మాటలు చెప్పుకుంటూ రకరకాల పువ్వులు ఆకులు గోతాములో వేసుకుని ఇంటికి చేరుకునే వాళ్ళం.

ఇంట్లో వినాయకుడిని పూజకి సిద్ధం చేసి సంచిలోంచి కొన్ని పుస్తకాలు తీసి, పసుపు కుంకుమ రాసి " శుక్లాంబరధరం " చదివేసి , అమ్మ చేసిన కుడుములు , పాయీసం స్వామికి సమర్పించి‌‌.. తర్వాత మనంకూడా లాగించేసి‌‌. లాగు రెండు జేబుల్లో రెండేసి కుడుములు పెట్టుకుని , పక్కింటి వెళ్లి వాళ్ళకి టీవీ ఉంటే అక్కడి అరుగు మీద కూర్చుని ఒక చేత్తో కొబ్బరి మరో చేత్తో కుడుములు రెండింటినీ కలిపి ఆశ్వాదిస్తూ టీవీలో వేసే వినాయకుడు సినిమా చూస్తుంటే భలే ఉండేది.

సాయింత్రం చీకటి మసకలు కమ్ముకోగానే గుడి దగ్గరకు బయలుదేరుతుంటే అమ్మ " ఈ రోజు చందమామను చూడొదయ్య". అని చెప్పేది. పిల్లలం అందరం గుడి వద్ద గుమ్ముగూడేవాళ్ళం.  ముఖ్యంగా పెద్దవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఒకచోట చేరి ఆత్మీయంగా వరసలతో(అన్నయ్య, బావ) పిలుచుకుంటుంటే అది చూసే పిల్లలమైన మాకు మనది అందరిదీ ఒక ఊరే కాదు, మనది అందరిదీ ఒకటే కుటుంబం , మనస్సులో మనమంతా అన్నదమ్ములం అని కలిగే భావన భలే ఉండేది. ఆ భావం అందరి మనస్సులను ఒక్కటిగా చేసేది.

ఒక వైపు పెద్దలు అందరూ పోటాపోటీగా భజన పాటలు అందుకునేవారు. పిల్లలం అందరం కొంచెం సేపు భజన చేసి తరువాత అందరం కలిసి గుడికి అలంకరించిన రంగు రంగు దీపాల వెలుగులో దొంగా పోలీస్ అటలు ఆడుతూ ఉంటే, ఆ రెండు గంటల సమయం రెండు నిమిషాలులా గడిచేలోపు హారతి పాట మాకు హారన్ లా వినిపించే సరికి ప్రసాదాలు పెట్టే సమయం అయ్యింది అని, లేగదూడలలా అందరం గుడి ఆవరణలోకి ఒక ఉదుటున చేరుకునేవాళ్లం. చలిమిడి, కుడుములు, వడపప్పు, శనగలు రకరకాల ప్రసాదాలు కడుపారా ఆరగించి కాగితాలలో లేదా కొబ్బరి చిప్పలలో కొంత ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళం..

11 రోజులు గడిచిన తరువాత అసలు ఘట్టం వినాయకుడి నిమజ్జనం. ఎడ్లబండి పైన కొబ్బరి మట్టలతో చిన్న పందిరిలా అల్లి వినాయకుడుని పూల దండలతో అలంకరించి , పెట్రోమాక్స్ బల్బుల వెలుగులలో భజనతో ఊరేగింపు మొదలు అయ్యేది, ఇంటింటికి దేవుడిరాక.ఒక వైపు ప్రతి ఇంటి ముందు హారతి తీసుకుని గణపతి ఆశిస్సులు అందిస్తు ఉంటే,  మరోవైపు డప్పు కళాకారులు చేసే వైవిద్యమైన   ప్రదర్శనకు అందరం ఆడిపాడుతూ ఊరంతా ఉత్సవమై ఉత్సాహంగా ప్రదర్శన ముందుకు సాగుతుంది. ఉదయం అయ్యేసరికి ఊరేగింపు పూర్తి చేసుకుని తిరిగి గుడి దగ్గరకు గణపతి చేరుకునేవాడు..
సాయంత్రం అందరం కలిసి ట్రాక్టర్ లలో నిమజ్జనానికి పెనుమూడి కిష్ట(కృష్ణా) దగ్గరకు చేరుకుంటాం.. "ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి" అని మైకులో చెప్పేవాళ్ళు. కొంతసేపటికి "జైబోలో గణేష్ మహరాజ్ కి" అంటూ గణపయ్యను గుడి నుంచి తన తల్లి (గంగమ్మ) ఒడిలోకి చేర్చుతారు.. అందరూ కృష్ణమ్మకు నమస్కరించి స్నానాలు చేసాక,మైకులో నుంచి "ట్రాక్టర్ బయలుదేరుతుంది. అందరూ ఒడ్డుకు రావాలి".
ఎంతో ఉత్సాహంతో బయిలుదేరిన ట్రాక్టర్లు నిశబ్దంగా తిరిగి ఇంటికి చేరతాయి.
తర్వాత రోజు మా బడి పక్కన ఉన్న గుడిని చూసినప్పుడు చాలా బాధ వేసేది. గణపతి లేడు , ఊర్లో సందడి లేదు అని. ఇక మరలా 365 రోజులు లెక్కించే వాళ్ళం.

ఈ రోజుకు కూడా మేము ఆనందించే విషయం మా ఊర్లో ఏంటంటే . 20 సంవత్సరాలు అయ్యింది గణపతి మా ఊరులో అడుగు పెట్టి.
ఇప్పటికీ ఒకటే ఊరు - ఒకటే గణపతి .

ఇలా నవరాత్రులు పెద్దలకు, పిల్లలకు పండుగ తీసుకొని వచ్చేది, ఐక్యమత్యం విల్లివిరిసేది.

-శ్రీనివాస చక్రవర్తి
12/09/2019

Sunday, 11 August 2019

పుస్తక ప్రపంచంలోకి నా తొలి అడుగులు.


నాకు చిన్నప్పుడు ప్రతి చిన్నారి లాగే కథలు , కొత్త కొత్త వింతలు విషయాలు తెలుసుకోవాలని భలే తపన ఉండేది.ఇవన్నీ గ్రంథాలయంలో దొరుకుతాయని మా అన్న వాళ్లు చెప్పేవారు.

నాకు ఇప్పటికీ బాగా గుర్తు నేను  మొదటిసారి మా నిజాంపట్నం గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల కథల పుస్తకాలను చూసినప్పుడు ఎంతో ఆనందం వేసిందో తిరునాళ్ళలో ఆట బొమ్మలను చూసిన పిల్లాడి వలె ఆనందం గుండెల్లో రెండు కళ్ళల్లో నిండిపోయింది.  రకరకాల కథలు పుస్తకాలు ముందుగా బొమ్మలు అన్నీ తిరగేసాను,ముఖ్యంగా చందమామ కథల పుస్తకం అందులోని విక్రమార్కుడు బేతాళుడు బొమ్మ నన్ను అమితంగా ఆకట్టుకుంది.

రోజూ మా స్కూల్ కి సైకిల్ పైన వెళ్తూ ఈ లైబ్రరీ వైపు చూస్తూ వెళ్ళే వాడిని, కిటికీలోంచి లైబ్రరేరియన్ ను చూసిన ప్రతిసారి ఇలా అనుకునే వాడిని
"ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే  ఈ లైబ్రేరియన్ నే కదా అని..
ఆయన చుట్టూ ఎన్నో పుస్తకాలు ఎన్నో కథలు ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎంత చక్కగా చదువుకోవచ్చు.."

నా పఠనాభిలాషను గ్రంథాలయం బాగా పెంచింది. చందమామ కథలు, తెనాలి రామలింగ, అక్బర్ బీర్బల్, మర్యాద రామన్న  ,ఈనాడు హాయ్ బుజ్జి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి రెక్కలు కట్టుకుని నేను వెళ్ళినట్లు నాకు అనిపించేది.

ఇలా చదవడం మొదలు పెట్టగానే నేను బట్టీపట్టి చదవడం ఆపేసాను. అప్పటి నుంచి అర్థం చేసుకుని చదవడం మొదలుపెట్టాను.నా జీవితంలో ఇది నిజంగా తొలిమెట్టు చదువులో,ఏకాగ్రత లో ఎంతో మార్పు వచ్చింది.

నేను పదో తరగతి పాస్ అవ్వగానే మా నాన్న నాకు నగరం లైబ్రరీ లో చేరడానికి సభ్యత్వం ఇప్పించారు, అప్పుడు ఎంత ఆనందం వేసిందో అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ వేసవి సెలవల్లో రోజు సైకిల్ పైన వెళ్లడం పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని చదువుకోవడం.

అప్పటి నుంచి మొదలైన పఠనాభిలాష నేటికీ కొనసాగుతూనే ఉంది రోజూ కనీసం ఒక పేజీ ఐనా చదవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికీ పుస్తకాన్ని నా చేతిలో తీసుకున్న ప్రతిసారి ఒక చిన్ని పసిపాపను చేతిలోకి తీసుకున్నట్లు అనిపిస్తుంది.

నాకు నచ్చిన పుస్తకాలను మిత్రులందరితో పంచుకుంటూ ఉంటాను. వారు చదివిన పుస్తకాలు కూడా తెలుసుకుని  చదువుతూ ఉంటాను, మీకు నచ్చిన పుస్తకాల పేర్లు కూడా నాతో పంచుకుంటారు కదా.

ఈ ఏడాది మా మిత్రులంతా కలిసి శనివారం పూట హైదరాబాద్ గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు కథల పట్ల పుస్తకాల పట్ల ఆసక్తి కలిగించడానికి కొన్ని కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాం. మీకు కథల పట్ల, పుస్తకాల పట్ల ఆసక్తి ఉంటే మాతో జట్టు కట్టవచ్చు, చిన్నారుల చదువుల ప్రయాణంలో భాగస్వామ్యం కావచ్చు.

 శ్రీనివాస చక్రవర్తి
11/08/2019



Saturday, 10 August 2019

కాకతీయుల కాలంలోకీ -My Journey to Warangal




ప్రయాణం అంటే ప్రతి గుండెలో ఏదో తెలియని ఆరాటం ఉదయిస్తుంది.  ఈ ప్రయాణాల్లో విహార యాత్రలది ప్రత్యేక స్థానం,మన మనస్సులు పసిపాపల లాగా తెలుసుకోవాలనే తపనతో నిండిపోతాయి. ఒక కొత్త ప్రదేశంలోకి వెళుతున్నామంటే మనసు అంతా శూన్యంగా చాలా తేలికగా అనిపిస్తుంది బహుశా ఎన్నో జ్ఞాపకాలను మదిలో కాదు జీవన ప్రమాణంలో నింపుకోవడానికి ఏమో..

- చిన్నప్పుడు కాకతీయ సామ్రాజ్య వైభవం గూర్చి పాఠాల్లో విన్నప్పుడు అక్కడ ఊహల్లో సంచరించాం.. నేను MCA కి వచ్చిన తరువాత వరంగల్ వెళ్ళాలి చూడాలని తపన ఉండేది, ఆ కోరిక సుమారు 7 సంవత్సరాల తరువాత ఇప్పుడు తీరింది. మా MCA మిత్రుడు ప్రవీణ్ ది వరంగల్ అవ్వడం వల్లన తన సాయంతో ఇప్పుడు వెళ్ళే మంచి అవకాశం రానే వచ్చింది.
******
12/07/2019 -శుక్రవారం
ఉదయాన్నే సికింద్రాబాద్ స్టేషన్ లో వరంగల్లుకు బయలుదేరాం. ఒక 2 గంటల ప్రయాణం మాటలతో సాగింది, ఖాజీపేట స్టేషన్ లో మేము దిగాము, స్టేషన్ బయిట పాతకాలం నాటి అందమైన బొగ్గు రైలు ఇంజను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లు కనిపించింది, కొంచెం సేపు దానిని గమనించాం.రైలు స్టేషన్ బయిట  కాకతీయ కళాతోరణం లాంటి నిర్మాణం ఆహ్వాన ద్వారం లాగా కొత్తగా నిర్మించారు. మేము అక్కడ నుంచి హన్మకొండ బస్టాండుకు బయలుదేరాం,వెళ్ళేదారిలో NIT వరంగల్ కనిపించింది పచ్చని చెట్లతో ఉద్యానవనం లాగా నిండుగా అలరారుతుంది. హన్మకొండ బస్టాండ్ కు చేరుకొని అక్కడ నుంచి పరకాల(మా మిత్రుడు ఇంటికి) వెళ్ళాం. భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకొన్నాము..

సాయింత్రం ప్రవీణ్  అన్నయ్య వాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ వరంగల్ ప్రాంతంలో ఏ ప్రదేశాలు చూడవచ్చో చర్చించాం.

********
సాయింత్రం పూట బయటకు బయలుదేరాము. పరకాలలోని సాయుధ సమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళాం.
మొదటి సారి ఆ ప్రాంతం బయటినుంచి చూడగానే భలే అనిపించింది. స్థూపం గోడలపైన నిర్మించిన సాయుధ ఉద్యమకారులు ఒకరి వెనుక ఒకరు నడుస్తూ జాతీయ జెండా పుచ్చుకొన్న(నిజాం దొరల పాలనకు వ్యతిరేకంగా సామన్య ప్రజలు,రైతులు కూలీలు) విగ్రహాలు ప్రాణంతో కదులుతున్నట్టు అనిపించింది, ప్రతి విగ్రహంలోను ఉద్యమ కాంతులు కనిపిస్తున్నాయి..
స్థూపం పైన ఆనాటి ఉద్యమకారులు ప్రాణత్యాగాలు ప్రతిబింబుస్తూ కల్లకుకట్టినట్టు చెక్కిన విధానం నాటి కాలంలోకి మనల్ని తీసుకొని వెళుతుంది.
ఇది చూసిన తర్వాత నా మనసులో కలిగిన భావం..
"పోరాట యోధులు త్యాగానికి ప్రతీరూపం..
కోటి కాంతుల కొలువైన ఉధ్యమ దీపం..
సాయుధ సమర వీరుల అమర స్థూపం.."

అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక వేడి టీ అందుకొని తాగుతూ నేను, ప్రవీణ్ ఈ ఉద్యమం, స్థూపం గూర్చి మొట్లాడుకొన్నాం.

ప్రయాణం చేసి ఉండటం వలన రాత్రి త్వరగా నిద్రలోకి జారుకొన్నాం.

******
13/07/2019 - శనివారం
ఉదయం నేను, ప్రవీణ్ తన తమ్ముడు ప్రమోద్, ముగ్గురం కలిసి రామప్ప , లక్నవరం చూడటానికి మోటరు సైకిల్ పైన బయలుదేరాం. అంతకు ముందు తేలికపాటి వర్షం పడటం వలన వాతావరణం ఎంతో చల్లగా , ఆహ్లాదంగా ఉంది. మా ప్రయాణం కూడా హాయిగా సాగింది.
ముందుగా గణపురం కోటగుళ్ళు ప్రాంతానికి వెళ్ళాం,ఇది వరంగల్ నుంచి సుమారు 80 కి.మీ , రామప్ప నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కోటగుళ్ళు లోపలికి వెళ్ళగానే అద్భుతమైన ప్రపంచంలోకీ రెక్కలు కట్టుకుని వాలినట్టు అనిపించింది. ముందుగా వరసగా ఉన్న చిన్న ఆలయ సమూహాలను చూసాం ప్రతి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. వీటిని చూసినప్పుడు ఇంత గొప్ప శిల్పకళా సంపద మన తెలుగునాట ఉందా అని ఎంతో ఆనందం వేసింది, మరోవైపు భాద కూడా వేసింది  దాడులకు , ప్రకృతి వైపరీత్యాలకు శిథిలావస్థకు ఈ నిర్మాణం చేరడం చూసి.. పెద్ద పీఠం మీద కేంద్ర స్థానంలో ఉన్న ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించాం.ఎంతో పెద్ద ఆలయం ఇది గోడలమీద సుందరంగా శిల్పాలు చెక్కారు.గుడిలోపల గణపతేశ్వర స్వామి అద్భుతమైన లింగాకారంలో కొలువు తీరి ఉన్నాడు. గుడి తలుపులు వేసి ఉన్నాయి,పూజారి ఉదయమే పూజ చేసి వెళ్ళిన ఆనవాళ్ళు కనిపించాయి వెళుగుతున్న దీపారాధనక చూస్తే. కొంచెం సేపు అక్కడ కూర్చుని ఈ అందమైన ప్రదేశాన్ని ఆశ్వాదించాం.

ఈ గుడిని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు(రుద్రమదేవి తండ్రి) నిర్మించినట్టు చెబుతున్నారు, ఇది రామప్ప గుడి కన్నా ఎంతో పెద్దది మరియు పురాతనమైనది. సందర్శకులు కూడా ఎవరూ పెద్దగా రావడం లేదు చాలా మందికి తెలియదు ఏమో, కానీ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.
దీనికి ప్రభుత్వం చొరవ తీసుకుని మరలా పూర్వ వైభవం కలిగిస్తే బాగుంటుంది. శివరాత్రి ఇక్కడ బాగా చేస్తారు అని ప్రమోద్ చెప్పాడు. ఈ సుందరమైన సందర్శన జ్ఞాపకాన్ని నింపుకుని అక్కడ నుంచి రామప్పకు బయలుదేరాం.
*******
కోటగుళ్ళు నుంచి రామప్ప దేవాలయమునకు వెళ్ళేదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు  యాత్రికులు ఎండలో అలిసిపోకుండా రహదారిపై పచ్చని గొడుగు పట్టినట్టు  అల్లుకొని ఉన్నాయి.
కదిలే మా మోటరు సైకిల్ లాగానే నా మనస్సు కూడా ఎన్నో ఏళ్ళు వేచిన కల కొన్ని క్షణాలలో తీరబోతోంది అని ఎంతో ఆనందంగా ఆరాటంగా వేగం అందుకుంది.

రామప్ప గుడికి కొంత దూరంలో మా బండిని పార్క్ చేసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము, నడక దారికి ఇరువైపులా పచ్చని తివాచీ పరిచినట్లు మొక్కలను పెంచుతున్నారు.రామప్ప దేవాలయము లోకి ప్రవేశించే ముందు దాని చరిత్ర గూర్చి తెలుసుకుందామని బయిట పెట్టిన బోర్డు పైన చదివాము.
"ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రుడు క్రీ.శ1213 నిర్మించాడు.. ఇక్కడ శివుడుని రామలింగేశ్వరడు అంటారు."

విశేషం ఏంటంటే ఈ గుడి దేవుని పేరుతో కాకుండా దానిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా బాగా వ్యాప్తి చెందింది. కాకతీయుల ప్రత్యేక శైలిలో ఎత్తైన పీఠంపై న గుడిని అమర్చినట్టు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ముందుగా ఆలయం ఎదురుగా ఉన్న నందిని సందర్శించాము, ఈ నందిని ఎటువైపు నుంచి చూసిన మనవైపే చూసినట్లు చూస్తుంది. దానిపైన ఎంతో అందంగా ఆభరణాలులను చెక్కారు.
ఆలయంలోకి మూడు వైపుల నుంచి లోనికి ప్రవేశించవచ్చు.. గర్భాలయంలో నున్నటి నల్లరాతితో ఉన్న పెద్ద శివలింగం భక్తుల నుంచి పూజలు అందుకుంటూ ఉంది. గర్భగుడి పైన ఉన్న ఆలయ మహా మండపం పైన ఎంతో సుందరంగా చెక్కిన శిల్పాలు రామాయణ మహాభారత భాగవత కథలను తెలియజేస్తున్నాయి.

ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు చాలా తేలికగా ఉంటాయంట వీటిని నీటిలో వేసిన తేలుతాయని చెబుతారు. ఆలయ స్థంభాలపైన చెక్కిన చిన్నచిన్న శిల్పాల మధ్యలో మనం దారాన్ని  ఒకవైపు నుంచి మరోవైపుకు పంపవచ్చు అంత సూక్ష్మంగా కూడా అందంగా చెక్కబడింది.గుడి గోడలను నలువైపులా నిశితంగా పరిశీలించాము, ప్రతి అణువు అణువు ను అద్భుతంగా మలిచారు.

ఆ తర్వాత  రామప్ప చెరువుకు వెళ్ళాము. ఎంతో విశాలంగా ఉంది ఆ చెరువు, పర్యాటకులకు బోటింగ్ సదుపాయం కూడా ఉంది.. అక్కడ నుంచి లక్నవరం బయలుదేరాము.
**********
రామప్ప దేవాలయం నుండి లక్నవరం సుమారు 34 కిలోమీటర్లు ఉంది..
లక్నవరం సరస్సులో కట్టిన పసుపు మరియు పచ్చ  రంగు వంతెనలు  ప్రత్యేకమైన నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. అందులో అడుగు పెట్టిన ప్రతీ ఒక్కరికీ ఓ కొత్త లోకంలోనికి ప్రవేశించినట్లు వారి కళ్ళలో మెరుపు కనిపిస్తుంది.

సరస్సులో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అని మా మిత్రులు చెప్పారు.‌ అంటే ఆగష్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో అన్నమాట.శనివారం కావడం వలన లక్నవరానికి పర్యాటకులు తాకిడి బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆ వంతెనల పైన నడుస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆశ్వాదిస్తున్నారు కొందరు రకరకాల ఫోజులతో ఫోటోలు దిగుతూ జ్ణాపకాలను కెమెరాలో భందిస్తున్నారు.
సరస్సు మధ్యలో ఏర్పాటు చేసిన హరితా రెస్టారెంట్లో భోజనం చేసాము. తరువాత ఆ వంతెన మధ్య బాగంలోకి వెళ్లి  గగనతల వీక్షణంలాగా సరస్సును గమనించాం.. అక్కడ కొంత సమయం గడిపి తిరిగి ఇంటికి బయలు దేరి వెళ్ళాము.
సాయంత్రం ప్రవీణ్ ఇంటికి చేరేసరికి సుమారు ఐదున్నర అయ్యింది.
******
14/07/2019 - ఆదివారం
ఉదయం ప్రవీణ్ నేను ఇద్దరం సరదాగా పరకాల మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చాం, ఆ మార్కెట్లో దొరికే మిర్చి కన్నా కూరగాయల రేట్లు చాలా ఘాటుగా ఉన్నాయి.
టీఫిన్ ,టీ ముగించుకుని 10 గంటలకు హనుమకొండ చేరుకున్నాం.

వరంగల్, హనుమకొండ రెండు కూడా జంటనగరాలు మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా.. ఈ రెండు నగరాలు చూడ్డానికి బైక్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ప్రవీణ్ తన ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని ఇద్దరం కలిసి  ముందుగా వేయి స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళాం. గుడి ముందు ఏర్పాటు చేసిన బోర్డులపైన కాకతీయుల రాజులు, వారి పరిపాలన , వారి యొక్క శిల్పకళను గురించి వివరంగా ఇచ్చారు .." కాకతీయుల పరిపాలన క్రీస్తుశకం 12, 13 శతాబ్దాల నాటిది. మొదటి రాజధాని హనుమకొండగా అవతరించింది, రుద్రమదేవి దేవి మరియు ఆమె తండ్రి గణపతి దేవుడు పరిపాలన బాగా సాగినట్లు తెలుస్తోంది. వేయి స్తంభాల గుడి 1163 సంవత్సరములో రుద్రదేవుడు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా అంటారు ఇందులో లో శివుడు, విష్ణువు, సూర్యనారాయణులు పూజలు అందుకుంటారు". మేము ఈ వివరాలు బోర్డులు పైన చదివి లోనికి ప్రవేశించాం.


నిజం చెప్పాలంటే ఈ వేయి స్తంభాల గుడిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు వేయి కళ్ళు అయినా కావాలి, ఎంత అందమైన కట్టడం ఇది,నక్షత్రాకార పీఠంపైన నిర్మించి ఉంది. ఇది నిర్మించిన శిల్పుల కళా నైపుణ్యాన్ని మనం గమనిస్తే నిజంగా వీరు స్వర్గ లోకం నుంచి భూమి పైకి వచ్చి ఈ నిర్మాణం చేశారేమో.. భూమిపైన ఒక అద్భుతమైన కళాఖండాన్ని మలిచారు..  గుడిలో ప్రతి అణువు అణువులో ఒక ప్రత్యేకమైన సుందరమైన కళా నైపుణ్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గుడికి ఎదురుగా ఠీవీగా ఉన్న మహానంది ప్రత్యేకమైన ఆకర్షణ. వచ్చిన పర్యాటకులు అందరూ కూడా ఆ మహానంది తో ఫోటో దిగడానికి ఎగబడుతున్నారు. గుడి పక్కన ఉన్న ఆనాటి కోనేటిని నీటితో మనం చూడవచ్చు. మరో పక్కన ఉన్న విశాలమైన రావిచెట్టు నీడలో పర్యాటకులు కూర్చుని సేద తీరుతున్నారు.
పురాతన కాలం నాటిది అవడంవల్ల ఇక్కడ కూలిపోయిన స్తంభాలకు పునర్నిర్మాణం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అక్కడ నుంచి మా ప్రయాణం వరంగల్ ఖిల్లా వైపు సాగింది.
*******
హనుమకొండ నుంచి సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ వరంగల్ ఖిల్లా ఉంది.వరంగల్ కోటలోకి మనం ప్రవేశించేటప్పుడు అప్పటి  కాకతీయ రక్షణ వలయాన్ని మనం గమనించవచ్చు.
నాలుగు అంచెలలో మట్టి కోట, జలాశయాలు, ముళ్ళ కంచె, రాతి కోట ఇలా అంచెలు అంచెలుగా రక్షణ వలయాన్ని పటిష్టంగా ఏర్పాటు చేశారు,ఈ కోటకు వెళ్ళే దారిలో మనం ఆనవాళ్లను ఈనాటికీ గమనించవచ్చు..
శత్రువులకు ఈ రక్షణ వలయాన్ని దాటి రావడం ఎంతో కష్టంగా ఉండేదట.

ముందుగా శిల్ప కళాతోరణల వద్దకు వెళ్ళాము.  నలుదిక్కుల నాలుగు శిల్ప కళా తోరణాలు  కాకతీయ సామ్రాజ్యానికి అందమైన ఆభరణాలు లాగా 30 అడుగుల ఎత్తులో  ఆకాశాన్ని తాకుతూ కనిపిస్తాయి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వీటిని తమ అధికార చిహ్నంగా పెట్టారు, ఈ నాలుగు తోరణాల మధ్య అద్భుతమైన శిల్పకళాఖండాలు మనకు దర్శనమిస్తాయి. ఈ కోటను రాణి  రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు ప్రారంభించగా ,రుద్రమదేవి  నిర్మాణం పూర్తి చేశారు. ఈ కోట మధ్యలో స్వయంభు శివాలయం లోని శివ లింగం భూమికి అతి తక్కువ ఎత్తులో ఉండి మిగతా శివాలయాల వాటికన్నా ప్రత్యేకంగా నిలుస్తుంది.ఈ కోటలో ఉన్న ప్రతి శిల్పాన్ని గమనిస్తూ చాలాసేపు ఇక్కడ సమయం గడిపాము..

తరువాత ప్రక్కనే ఉన్న ఖుష్ మహల్ వద్దకు వెళ్ళాము. ఇది ముస్లిం రాజులు నిర్మించారు. ఇందులో ఓరుగల్లు కోటలో శిథిలావస్థలో ఉన్న శిల్పాలను భద్రపరిచారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఖుష్ మహల్ పైకి ఎక్కి ఓరుగల్లు పట్టణాన్ని మనం వీక్షించవచ్చు.

ఇక సాయంత్రం అవుతుంటే తిరిగి హైదరాబాద్ బయలుదేరాము. తిరుగు ప్రయాణంలో ఫోటోలు చూస్తూ జరిగిన ప్రయాణాన్ని మరలా గుర్తు చేసుకున్నాం.
మొత్తానికి ఎన్నో ఏళ్ల నుంచి వరంగల్ చూడాలనే కల నెరవేరింది,మా ఫ్రెండ్ ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు వలన..


-10/08/2019





















Thursday, 27 June 2019

పుస్తకాలు -మన ప్రియనేస్తాలు

ఒక్కో రకమైన పుస్తకం ఒక్కో పరిమళాన్ని వెదజల్లుతుంది.. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మన మనస్సు తెరమీద సన్నివేశాలు కదలుతూ ఉంటాయి.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.. ప్రతి పేజీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది..
నాకు నచ్చిన పుస్తకాలు కొన్ని మీతో పంచుకొంటాను.

1.భారత జాతికి నా హితవు- వివేకానంద:
ఈ చిన్ని పుస్తకంలో ప్రతీ అక్షరం చదువుతుంటే ఏదో తెలియని ఉత్సాహం మనలో వచ్చి చేరుతుంది.ఆత్మశక్తిని, దేశభక్తిని పెంపొందించే ఈ పుస్తకం ప్రతీ భారతీయ యువతీయువకులు తప్పక చదివి తీరాలి.

2.అమరావతి కథలు - సత్యం శంకరమంచి:
తియ్యనైన తెలుగు పదాలను తేనెలో ముంచి కథలుగా రాస్తే వాటికి అందమైన బాపు బొమ్మలు జతకలిస్తే అవే అమరావతి కథలు.. తెలుగులో మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఈ కథలు చదివి తీరాల్సిందే.

3.మిథునం -శ్రీరమణ:
భార్యాభర్తలు అనురాగానికి అందమైన వర్ణన.‌. ఏకబిగిన మన చేత చదివించే ఈ కథ మనస్సును హత్తుకుంటుంది,
మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.

4.సత్యశోధన లేదా ఆత్మకథ- గాంధీ:
సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన ఒక వ్యక్తి జీవితం ఇది  ఒక చరిత్ర.
నిజాయితీతో సాగిన ఈ జీవిత కథ వర్ణించిన విధానం అద్భుతం.చదువుతుంటే నిజంగానే గాంధీగారు మన పక్కన కూర్చుని కథని చెబుతున్నట్లు అనిపిస్తుంది..

5.నాకూ ఉంది ఓ కల - వర్గీస్ కురియన్:
పట్టుదలతో సాగే ఓ అధ్బుతమైన విజయగాధ. మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఎలా ఉన్నాం ,ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం అని ఈ ఆత్మకథ చెబుతుంది..మారుమూల గ్రామాన్ని (ఆనంద్) ప్రపంచ ప్రఖ్యాత గావించిన కురియన్ ఆత్మకథ ఎంతో ప్రేరణాత్మకం.

పుస్తకాలు నా జీవితంలో భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. మరి మీకు నచ్చిన పుస్తకాల పేర్లు కూడా నాతో పంచుకుంటారు కదూ.‌

చదవండి - చదివించండి
 శ్రీనివాస చక్రవర్తి
27/06/2019


Sunday, 16 June 2019

నాన్నతో నా బాల్యం ‌..


-ఇంటికి రానీరా చిన్నోడా:
 "హే నాన్న వస్తున్నాడు" అంటూ అప్పుడే ఊరి నుంచి వస్తున్న నాన్న దగ్గరికి ఇంటికి కొంత దూరం ఉందనగానే వాయువేగంతో పరుగులు తీస్తూ ఎదురు వెళ్ళా. చేతిలో ఉన్న సంచిలో ఏం తెస్తున్నాడో చూద్దాం అని, సంచిలోని అరటిపండ్లును, శంఖువు ఆకారంలో కట్టిన బూందీ పొట్లంని చూడగానే నా కళ్ళల్లో రెండు లైట్లు వెలిగేవి,
నోట్లో లాలాజలం గంగలా పొంగేది...
దారిలోనే వాటిని తీసుకుందామని ప్రయత్నిస్తుంటే ఇంటికి రానిరా చిన్నోడా తీసుకుందువు గానీ అని నవ్వుతూ అంటుంటే. దారిలోనే రెండు అరటి పండ్లను తెంచుకొని ఆనందంతో గెంతులు వేసిన చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.

*******

-లాంతరు వెలుగులో నాన్న:
ప్రతి ఒక్కరికీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎన్నో మధుర జ్ఞాపకాలు నింపుతుంది. నాకు అంతే..
నాకు 5 సంవత్సరాల వయస్సులో అనుకుంటా. అప్పుడే మారుమూల గ్రామాల్లోకి విద్యుత్ అడుగుల వేస్తుంది. వీధి దీపాలు ఉండేవి కాదు,అందరూ సాయంత్రం అవ్వగానే కిరోసిన్ లాంతర్లను సిద్దం చేసుకునేవారు.
అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను నేను.
నాన్న మా ఊరినుంచి మమ్మల్ని చూడటానికి సైకిల్ పైన వచ్చాడు.ఆనందంగా గడుస్తున్న ఆ సాయంత్రం మెల్లగా నాకు తెలియకుండానే  మా ఊరు బయలదేరాడు నాన్న. అప్పటికే చీకటి మసకలు కమ్ముకున్నాయి. చుట్టూ చీకటి ఆవరించింది.
 నాన్న వెళ్ళిన విషయం తెలిసి, ఏడుస్తూ "నాన్నోయ్... నాన్నోయ్.. నాన్నోయ్" అంటూ అప్పుడే వెలిగించిన లాంతరు చేత్తో పట్టుకుని కొంతం దూరం బజారు వేపు నాన్నను వెతుకుతూ మసక చీకటిలో పరుగులు తీసాను.
అమ్మమ్మ వాళ్ళు నేను ఇంటి దగ్గర కనిపించక హడావిడి పడితే,కొంతసమయం తరువాత నా జాడ తెలుసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి నాన్న మళ్ళీ వస్తాడు అని ఓదార్చి తాయిలం నా చేతికి అందించారు.
ఆ  చిన్ననాటి జ్ఞాపకాలు మసక మసకగా అప్పుడు అప్పుడు గుండెలపై కదులుతాయి.

**********

- నాన్న చూపిన అధ్బుతమైన విజయ సూత్రం  :
వేసవి సాయంత్రం నాన్న  కల్లుగీయడానికి తాడి ఎక్కే మోకును నడుముకు చుట్టూ చుట్టుకుని, కత్తులు పదును పెట్టే చెక్క బండకు రెండు కుండల తొడిగి నవ్వుతూ భుజంపైన పెట్టుకున్నాడు. నేనుకూడా బయలుదేరాను నాన్నతో ముంజికాయలు తినవచ్చు అని, నేను నాన్న ఇద్దరం పొలం వేపు అడుగులు వేసాం.‌ మా దారిలో జనుము చేను పసుపు పూలు సుగందాన్ని వెదజల్లుతుంటే అటువేపు నుంచి వీచే గాలి ఒక లాలన పాడినట్లు ఉండేది.
జనుము చేను మధ్య బాటలో గుండా అడుగులు వేస్తూ ముందుకు సాగాం.
మొదట ఒక తాటి చెట్టు దగ్గర నాన్న ఆగి ముందుగా తను ఎక్కబోయే తాడికి దణ్ణం పెడుతున్నాడు .
ఇదేంటి నాన్న దేవుడికి దండం పెట్టాలి కానీ తాడిచెట్టుకి , ఈ గీత పనిముట్లుకు పెడుతున్నావు.." అని అడిగాను..
అప్పుడు నాన్న "ఏదైతే మనకు కూడు పెడుతుందో అది దైవంతో సమానం చిన్నోడా.. అందుకే ఈ తాటిచెట్టుకీ, ఈ పనిముట్లుకు మొదటి నమస్కారం" అని చెప్పి నువ్వు గట్టుపైన కూర్చో నేను తాటిచెట్టు ఎక్కి వస్తాను అని చెప్పి భుజం పైన ఉన్న మోకుని తాడికి వేసి పైకి ఎక్కుతూ వెళ్ళాడు.
నాన్న చెప్పిన మాటలు బలంగా తాకాయి.
గట్టుమీద కూర్చుని పైకి చూసాను. ఆకాశంలో మెరుస్తున్న ఒక సూరీడు ఒక వేపు
"పనే దైవం" అని  చెప్పిన మరో సూరీడు తాడిపైన మరోవైపు. ఆ సూరీడు వెలుగు కిరణాలు నేరుగా నా కళ్ళను తాకేసరికి ఆ వెచ్చదనానికి నా కనుపాపలు తాలలేక తలదించుకున్నాను.

ఈ రోజు నేను కంప్యూటర్ ముందు ఉదయాన్నే కూర్చున్నప్పుడు ముందుగా మనస్సులో నమస్కారం చేసుకుంటా.
ఏదో తెలియని అంకితభావం నాలో ప్రవేశిస్తుంది ఆ రోజంతా భలే సాగుతుంది.

*********

- కొండలు ఎలా పుడతాయి నాన్న:
అప్పుడే ప్రపంచంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు లోకం ఎంతో అద్భుతంగా, విచిత్రంగా కనిపిస్తుంది.
వాళ్ళ మదిలో కుతూహలంతో జనించే ఎన్నో ప్రశ్నలు ఈ అద్భుతాలను తెలుసుకోవాలని, అలాగే నేను ఒకరోజు నాన్నతో ప్రయాణం చేస్తున్నా విజయవాడ వెళుతున్నాం. మొదటిసారి చాలా దూరం ప్రయాణం చేస్తున్నా.
బస్సు కిటికీలోంచి చూస్తూ, ఆనందిస్తూ దారి వెంట ఉన్న చెట్లు , కొట్లు వెనక్కి వెళుతుంటే భలే అనిపించేది. అప్పుడు ఓ వింతైన ఆకారం మొదటి సారి చూసాను.
నేను -" నాన్న అదేంటి..."
నాన్న- " అది కొండ"
నేను - " ఎంత ఎత్తు ఉందో.. అది ఎలా పుడుతుంది నాన్న"
నాన్న కొంచెం సేపు ఆలోచించి " అది కూడా నేలపైన ఏర్పడిన ఒక ప్రాంతం.. ఒక పెద్ద దిబ్బ లాంటిది. రాయితో ఏర్పడుతుంది.."
భలే అనిపించింది నాకు.. కంటికి కనిపించినంత సేపు దానినే కిటికీలోంచి వెనుకకు వెళ్ళిందాకా చూస్తూనే ఉన్నా.
ఎంతో ఓపికతో మన ప్రశ్నలకు అప్పట్లో గూగుల్ లేకపోయినా వారికి తెలిసిన మేర ఎన్నో విషయాలు మనతో పంచుకున్నా జ్ణాపకాలు ఇప్పుడు తలుచుకుంటే భలే అనిపిస్తుంది.

********

-నాన్నతో మొదటి సినిమా:
అప్పట్లో దూరదర్శన్, వీధి నాటకాలు ,ఆరుబయట కథలు, కబుర్లే వినోదం అంటే..

"నాన్న నాకు రేపల్లెలో సినిమా చూపించవూ." అన్నాను నేను నాన్నతో.
" ఆదివారం వెళ్దాం,అప్పుడు మీకు సెలవు ఉంటుంది కదా" అని నాన్న చెబితే  ఉత్సాహంతో ఊగిపోయాను. ఆదివారం కోసం ఎదురు చూస్తున్నా. కాలం నెమ్మదిగా గడుస్తుంది.

ఆలస్యం అయినా రేపల్లె వెళితే వచ్చే 3 ఆనందాలు తలుచుకుని మురిసిపోతున్నా.

1.బస్సుల్లో కిటికీ పక్కన కూర్చుని గాలిలో తేలుతూ బయటకు చూస్తూ ఆనందించవచ్చు.

2.మొదటి సారి సినిమా చూస్తున్నాం అనే ఆనందం.
మా ఫ్రెండ్ చెప్పాడు నాకు
"హాలులో సినిమా చూస్తే భలే ఉంటుంది రా
తెరమీద పెద్ద రంగురంగుల బొమ్మ మధ్యలో విరామం ఉంటుంది పాప్కార్న్ , ఉల్లి సమోసాలు తీసుకొని తింటూ ద్రాక్ష లేదా నిమ్మ గోలీసోడా తాగవచ్చురా... " అని

3.సినిమా ఐన తరువాత రేపల్లె హోటల్ లో
ఒక ఉల్లిమినపో లేది పూరీనో లాగించవచ్చు అని..
అప్పట్లో హోటల్ లో టిఫిన్ అంటే ఎందుకో అంత ఇష్టం..

ఆదివారం రానే వచ్చింది ఉదయాన్నే లేచి స్నానం చేస్తే అమ్మ ముఖానికి పౌడరు, తలకు నూనె రాసింది.
అన్నయ్య నేను వస్తాను నాన్న అని మాతో బయలుదేరాడు. అన్నయ్య వస్తే నేను అనుకొన్న సమోసాలు, గోలీసోడాలు, పూరీలు ,మినపట్టులు పూర్తిస్థాయిలో అందవనీ అన్నయ్య  రావద్దంటే రావద్దని నేను మారాం వేసాను. అన్నయ్య కొంత సేపు ప్రయత్నించి సర్లే తమ్ముడినే తీసుకెళ్ళు నాన్న అన్నాడు.
నేను నాన్న ఇద్దరం బస్సు ఎక్కి రేపల్లె వెళ్ళాం.
"నాకు రెండు సినిమాలు చూపించాలని అడిగాను".
సరే అని ముందుగా పెదరాయుడు సినిమా చూశాం. భలే చిత్రంగా అనిపించింది రంగురంగుల బొమ్మలు తెరమీద కనబడటం. విరామంలో తెర మీద నుంచి నా చూపు పక్కకు తిప్పాను, జనాలు అందరు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయాను.
తెర మీద  పెద్దగా ఉండటం వల్ల కింద ఉన్న వాళ్ళు చిన్న గా కనిపిస్తున్నారు అనిపించింది. అలా ఆ రోజు రెండు సినిమాలు చూశాను. హోటల్లో టిఫిన్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం.
ఆ రోజంతా నా కంటికి అందరూ చిన్నగా కనిపిస్తున్నారు. :)

ఇలా నాన్న మాది మధ్య తరగతి కుటుంబం అయినా తన పిల్లలకి ప్రతి తండ్రిలాగా సాధ్యమైనంత ఆనందం ఇవ్వాలని ఎంతో ప్రయత్నించారు..

********

మోకుకు పనిచెప్పిన నాన్న:
అప్పుడు నన్ను మా ఊరి స్కూల్ లో మొదటి సంవత్సరం  చేర్పించారు. నేను ఇంట్లో ఉన్న కల్లు తాగి స్కూల్కి వెళ్తున్నట్లు వెళ్లి దారి మధ్యలో ఉన్న ఒక ఇంటి అరుగు పైన పడుకుని నిద్రపోవడమో లేదా నాలాంటి పిల్లలతో ఆడుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చే వాడిని. ఈ విషయం తెలుసుకున్న నాన్న, ఒకసారి అప్పుడే తాడి చెట్టు ఎక్కి దిగి వస్తున్నాడు. కోపంతో పళ్లు పటపటా నములుతూ వచ్చే సరికి నేను పరుగు అందుకున్నాను నన్ను పట్టుకుని గట్టిగా మందలించి కాళ్ళ బంధం తో నా కాళ్లపైన 2 దెబ్బలు ఇచ్చుకున్నాడు.
ఆ కోపానికి నేను తట్టుకోలేక పోయాను. ఎప్పుడు కోపం రాని వారికి కోపం వస్తే భయంకరం గా ఉంటుందేమో.

  • ఆరోజుతో జీవితంలో కల్లు తాగడం మానివేశాను.

చదువులో నేను సగటు విద్యార్థినే అయినా 90% పైగా నా యొక్క హాజరును ఒకటవ తరగతి నుంచి ఎంసిఎ వరకు చూపించాను. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆ ఏడాది 95 శాతంపైగా హాజరు వచ్చినందుకు నాకు ఉత్తమ విద్యార్థి అవార్డు వస్తే , నాన్నకు అది చూపిస్తే ఎంతో మురిసిపోయాడు. మా పిల్లవాడు నామాలు లేకుండా బడికి వెళ్తాడని చాలా గర్వంగా తన మిత్రులకు చెప్పుకునేవాడు నాన్న.‌

నాన్న నీడలో సాగిన ఈ బాల్యం ఎంతో మధురజ్ఞాపకం...

- శ్రీనివాస చక్రవర్తి
16/06/2019










Sunday, 26 May 2019

అరకు విహారయాత్ర - August /2017



ద్వారకా తిరుమల నుంచి బయలుదేరాం ఆఫీసు మితృలంతా చాలా హుషారుగా....

ఉదయాన్నే విశాఖపట్నం స్టేషన్లో దిగాం..
మేము వెళ్ళగానే కిరండోల్ పాసెంజర్ అరకు వెళ్ళడానికి సిద్దంగా ఉంది మా కోసమే అన్నట్లు.. అందులో ప్రయాణికుల ముఖాలలో ఒక రకమైన ఉల్లాసం.. పిల్లలు నుంచి పెద్దలవరకు
వీరంతా భూలోక స్వర్గానికి వెళుతున్నట్లు ఆనందంగా కనిపించారు..

1.  విశాఖపట్నం నుంచి బొర్రా గుహలు రైలు ప్రయాణం కొండ గుహలలో గుండా చాలా బాగా సాగింది... ఓ వైపు లోయలు మరోవైపు ఎత్తైన కొండలు.. యాత్రికులు అంతా ఆశ్వాదించాం..

2.బొర్రా గుహలు వద్ద దిగాం.. ఒక్కసారి బొర్రా గుహలు అనే బోర్డు చూడగానే ఎంతో ఆనందం వేసింది‌.. చిన్నప్పుడు పాఠాలలో చదువుకోవడం,సినిమాల్లో చూడటమే కాని. ఇంతవరకు చూడలేదు కదా.‌.మొత్తానికి ఇప్పుడు చేరుకొన్నాం అని ఆ ఆనందం.

 - ముందుగా కటిక జలపాతం వద్దకు మా ప్రయాణం సాగింది. ఇది చాలా ఎత్తైన కొండ మీద నుంచి కిందికి జాలువారుతుంది...
కొండపైకి నడుచుకుంటూ వెళ్ళడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది..
జలపాతం చాలా బాగుంది, కాకపోతే ఇక్కడికి 40 years లోపు వాళ్ళు వెళ్ళడం ఉత్తమం... కొండపైకి నడుచుకొంటూ వెళ్ళడం చాలా కష్టం..

- తరువాత బొర్రా గుహలకు వెళ్ళాము ఇవి సహజ సిద్దంగా ఏర్పడిన ప్రకృతి అద్బుతాలు, సున్నపురాయికి నీటికి జరిగిన రసాయనిక చర్య వలన సుమారుగా  10 లక్షల ఏళ్ళ క్రితం ఏర్పడ్డాయి అని చెబుతున్నారు... మేము మద్యాహ్నం 3 గంటలకు లోనికి వెళ్ళాం.. అందులో వాతావరణం రాత్రి 08:00 గంటలు అయినట్లు అనిపించింది ఎంతో చల్లగా ఉంది.. ఒకప్పుడు వెళుతురు కోసం ఇక్కడ కాగడాలు పెట్టేవారట.. ఇప్పుడు అధునిక విద్యుత్ దీపపు కాంతులతో పర్యాటకులతో కలకల లాడుతుంది .‌. చాలా బాగుంది..

- ఇక బొర్రా గుహలు నుంచి అరకుకు బయిలుదేరాం. మధ్యలో అరకు కాఫీ తోటలు చూసాం.. సాయంత్రం పూట ఇక్కడ చల్లటి వాతావరణంలో కాఫీ తాగాం(ఒకటి కాదు రెండు) అక్కడ వీచే చల్లనైన గాలికి‌.. ఈ వేడివేడి కాఫీ అద్బుతంగా తోచింది ఆ క్షణాన..

- బొర్రా గుహలు నుంచి అరకుకు వెళ్ళే ఘాట్ రోడ్ ప్రయాణం చాలా బాగుంది.. రాత్రికి అరకులో విశ్రాంతి తీసుకున్నాం

- ఉదయాన్నే అరకులో పద్మాపురం బొటానికల్ గార్డెన్ సందర్శించాం, వివిధ రకాలైన మొక్కలు ,పుష్ప జాతులు ఉన్నాయి.. ప్రకృతి ప్రేమికులకు చాలా బాగుంటుంది.
తరువాత ట్రైబల్ మ్యూజియం కి వెళ్లి అక్కడ అద్దెకు సైకిల్ తీసుకుని చిన్న పిల్లల్లాగా చక్కర్లు కొట్టాము..

- అరకు నుంచి విశాఖపట్నం వచ్చాం కైలాసగిరి కొండను ఎక్కి, అక్కడనుంచి ఒకవైపు విశాలమైన విశాఖను మరో వైపు పర్యాటకులకు అలలతో స్వాగతం పలుకుతున్న సముద్రాన్ని వీక్షించాం..
అటునుంచి జగదాంబ సెంటర్లో Dinner చేసి విశాఖపట్నం రైల్వేస్టేషన్ కి చేరుకొన్నాం...

ఇలాంటి విహారయాత్రలు కంటికి,మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా యాత్రకు వెళ్ళిన వారి మధ్య మంచి బంధాన్ని కూడా బలపరుస్తాయి.. మరింత స్నేహాన్ని నింపుతాయి..

- శ్రీనివాస చక్రవర్తి
  August-2017

Tuesday, 9 April 2019

మన ఓటు - మన భవిత

"నాన్న నేను మరో రెండు రోజుల్లో మన ఊరు వస్తున్నా" , విజయ్ ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్న రాఘవకు ఫోన్ చేసి చెబుతున్నాడు.

"ఎందుకు నాన్న, మొన్నే కదా నువ్వు హైదరాబాద్ వెళ్ళింది, అప్పుడే వస్తావా" రాఘవ కొడుకుతో.

విజయ్ మరింత ఉత్సాహంతో "నాన్న నాకు మొదటిసారి ఓటు హక్కు వచ్చింది, ఈ ఏడాది నేను కూడా మన  దేశభవితను నిర్దేశించే నా ఓటు వేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది".

రాఘవ కొడుకుతో "నువ్వు అంతా దూరం నుంచి ప్రయాణం చేసి రావాల్సిన అవసరం లేదు, నీ ఒక్క ఓటుతో ఇక్కడ ఒనగూరేది ఏమీ లేదు. రానపోను 1500 రూపాయలు ఖర్చు దండగా".

పాపం విజయ్ ఏదో చెబుదామని అనుకున్నాడు, కానీ తండ్రి మాటను కాదనలేక మరేం మాట్లాడలేదు.

విజయ్ లో గోదారిలా ఉప్పొంగిన ఆనందం మొత్తం నురగ లాగా ఒక్క క్షణంలో కరిగి పోయింది.

రాఘవాది ఒక మధ్యతరగతి కుటుంబం,ఊర్లోనే చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు‌. కొడుకు, కూతురులన బాగా చదివించాలని తన ఆశయం.

ఆ ఏడాది ఎలక్షన్స్ పూర్తి అయ్యాయి, విజయ్ తన మొదటి ఓటు వేయలేదని బాద వెన్నంటుతూ ఉంది..
******
(4 సంవత్సరాలతర్వాత)
రాఘవ MLA ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ తో "MLA గారిని కలవాలి, కొంచెం లోనికి పంపండి".

"ఆయన బిజీగా ఉన్నారు మరలా రావయ్యా పెద్ద మనిషి" అని సెక్యూరిటీ చెప్పాడు.

రాఘవ : "అయ్యా , నేను అత్యవసరంగా కలవాలి, దయచేసి ఒక 5 నిమిషాల సమయం అడగండి".

సెక్యూరిటీ తనలో తాను గొనుగుతూ " ప్రతి ఒక్కరూ అర్జెంటు పని అని వస్తారు, ఆయనేమో నన్ను విసుగు కుంటారు ఇటు వీళ్ళకి చెప్పలేక, ఆయనకి చెప్పలేక చస్తున్నాను మధ్యలో నేను" అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.‌

సెక్యూరిటీ లోపలికి వెళ్ళి వచ్చి "MLA గారు రామంటున్నారు,  వెళ్లి రండి"

MLA రామలింగం, నల్లటి కారుమబ్బులాంటి దేహం కలవాడు, ఎలక్షన్  సమయంలోనే తప్ప మరలా తన ప్రాంతంను సందర్శించిన సందర్భాలు చాలా తక్కువ,ఏపని చేసినా నాకేంటి అని ఆలోచిస్తాడు.

రాఘవ వెళ్ళేసరికి, రామలింగం ఒక చేత్తో చుట్టను పట్టుకొని  ఏవే పేపర్లు చూస్తున్నాడు.

రాఘవ : " నమస్కారం సార్, నా పేరు రాఘవ అండి, మన ఊరి చివరన హైవే పక్కన ఉన్న కొంత స్థలం నాదే అండి, అది మీ అధీనంలోకి తీసుకుంటున్నట్లు విన్నాను. "

MLA రామలింగం చుట్టను పీల్చి గాలిలోకి ఉంగరాలు లాగా పొగను ఊదుతూ "ఎట్టెటా ఆ స్థలం మీదా.. ఐతే ఏంచేద్దాం అంటావ్"

రాఘవ :"దయచేసి మా స్థలం మాకు ఇచ్చేయండి, మధ్యతరగతి వాళ్ళమయ్య, దాని మీదే మేము ఎన్నో ఆశలు ప్రణాళికలు వేసుకున్నాం".

రామలింగం: " నేను ఎట్టా గనిపిస్తున్నానయ్యా నీకు, నీ నోటికాడ కూడు లాక్కునే వాడిని అనుకుంటివా ఏంది, ఇంద లచ్చ రూపాయలు ఇస్తాను, అది నాకు ఇచ్చేయ్".

రాఘవ : " సార్ అది నేను కొన్నప్పుడు రేటు లక్ష, ఇప్పుడు 50 లక్షలు విలువ చేస్తుంది,దయచేసి మాది మాకు ఇప్పించండి.దానిని అమ్మితే వచ్చిన డబ్బుతో మా కూతురు పెళ్లి ఘనంగా  చేద్దాం అనుకుంటున్నా".

ఒక్కసారి రామలింగం కళ్ళు చింతనిప్పలు లాగా ఎర్రబడ్డాయి. ఒక ఉదుటున పైకి లేచి బీరువాలోంచి కొన్ని కాగీతాల కట్టలు తీసి రాఘవ ముందేశాడు "చూడరా చూడు  నువ్వు ఒక ఎకరం పొలం గూర్చి నాకు చెబుతున్నావు మా తాత సంపాదించి మాకు ఇచ్చిన 40 ఎకరాల పొలంలో 30 ఎకరాలు అమ్మి మీ అందరికీ ఓటుకీ ఇంత డబ్బులు అనీ, వెంట తిరిగిన వాడికి బిర్యానీలనీ,తాగేవాడికి సారాలని ఇప్పిస్తే ఎంత ఖర్చు అయ్యిందో చూడు. అందరూ కలిసి కరిగించారు కాదరా, అదృష్టం బాగుండి కేవలం 3 ఓట్లు తేడాతో గెలిచాను, ఇక ఇప్పుడు 5 సంవత్సరాలు సంపాదించించుకోపోతే ఎలా"

రాఘవ  " సార్ అమ్మాయి పెళ్ళి..." అని చెప్పకమందే రామలింగం గద్దించాడు"మర్యాదగా ఈ లచ్చ రూపాయలు తీసుకో, కాదూ కూడదని అన్నావంటే, ఆ పెళ్లి చేయడానికి నిన్ను లేకుండా చేస్తాను" జాగ్రత్త అని బెదిరించాడు.

చేసేదేమీలేక రాఘవ ఇంటి దారి పట్టాడు,
కారుమబ్బులు కమ్మిన సూరీడులా ఇంటికి చేరాడు.

*******
రాత్రి 10:00 గంటలవుతుంది,
రాఘవ ఆలోచనలో మునిగి పోయాడు
"ఏమండీ భోజనం చేయండి" అని రాఘవ భార్య జానకీ చెప్పింది.
రాఘవ :"ఆకలిగా లేదు" .
జానకి : "ఏం ఎందుకండీ మీరు ఆకలిని తట్టుకోలేరు కదా".
రాఘవ : "గుండెలు నిండా బాధల్ని నింపుకున్న మనిషికి, కడుపెలా నిండుతుంది".
జానకి :"ఏమైందండీ?"

రాఘవా కూతురు వేపు చేయి చూపిస్తూ.   " ఒక్కసారి అటుచూడు, నా బంగారు తల్లి ఎంత ఆనందంగా ఉందో, మరో కొన్ని రోజుల్లో తన పెళ్ళి ఉందని ఎన్ని కలలు కంటుందో స్నేహితులు అందర్నీ పిలుస్తూ మురిసిపోతుంది. తండ్రిగా ఆడపిల్ల కన్యాదానం ఘనంగా చేద్దాం అనుకొన్నా.
కానీ ఆ రామలింగం ఎంతపని చేసాడో తెలుసా." అని జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు.

జానకి కట్టలు తెంచుకుని వచ్చిన భాదను అదిమి పెట్టి అయ్యో ఎంతపని జరిగిందండీ, "రామలింగం అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి,
మొన్నే మన పక్కింటి కుర్రాడుకు మంచి కాలేజీలో సీటు వస్తే ఈ రామలింగం రికమండేషన్ అని అది వేరేవాళ్ళకు ఇప్పించాడు.
అప్పుడు ఏముందిలే అనుకొన్నాం, పాపం కుర్రాడు అప్పుడు ఎంత బాధపడ్డాడు కదా. ఇప్పుడు ఆ బాధ మన ఇంటిని కూడా వరదలాగా తాకింది,
ఇప్పుడు మరికొన్ని రోజుల్లో పెళ్లి , ఇక మనకు దేవుడే దిక్కు కదా".

********

రాత్రి 01:00 గంట అయ్యింది రాఘవ ఆలోచనలలో  రామలింగం మాటలే మెదిలుతున్నాయి "ఇంత ఖర్చు పెడితే నేను గెలిచింది 3 ఓట్లు తేడాతోనే..".
సరిగ్గా 4 సంవత్సరాల క్రితం రాఘవ చేసిన తప్పు గుర్తుకు వచ్చింది, అప్పుడు ఎలక్షన్స్ కి తొలిసారి ఓటు వేయడానికి వస్తాను అన్న కొడుకును ఆపడం, ఎలక్షన్ రోజు ఆఫీస్ సెలవు రోజు అని , వారాంతం అవ్వడం వల్ల రాఘవ కుటుంబ సభ్యులు అందరూ బయటకు విహార యాత్రకు 3 రోజులు వెళ్ళారు, మన 3 ఓటులు వేయకపోతే అయ్యేదేమీలేదని  ఓటు వాళ్ళు వేయలేదు, ఇలాగే చాలా మంది ఓటు వేయడానికి రాకపోవడం వల్ల
కేవలం 45% పోలింగ్ నమోదు అయ్యింది.
అందులో 21% వరకు రామలింగం అనుచరులు వలన సాధించాడు.
అందువలన రామలింగం కేవలం 3 ఓట్లతో గట్టెక్కాడు..

రాఘవ నిట్టూరుస్తూ  ఇలా అనుకున్నాడు
"ప్రతి దానిని హా ఏముందిలే అని (లైట్) తీసుకొనే స్వభావం మన రక్తంలో ఇంకిపోయింది, 
ఏదైనా మన దాకా వస్తనే తెలుస్తుంది,
మనం చేసిన ఒక తప్పిదం , ఒక 5 నిమిషాల సమయం ఓటు వేయడానికి కేటాయించి ఉంటే 5 సంవత్సరాలు మనం ప్రాంతం భవిష్యత్తు బాగుండేది,మరలా ఇలాంటి తప్పు చేయకూడదు, నిజాయితీతో పోరాడే వాళ్ళకి మన ఓటు ఊపిరిగా నిలవాలి" అని ధృడంగా నిశ్చయించుకున్నాడు


***-------------------***

ధన్యవాదాలు.
శ్రీనివాస చక్రవర్తి
10/04/2019

Sunday, 31 March 2019

Memories - మంచినీరు అడిగితే మజ్జిగ ఇచ్చే నైజం మనది


"నాన్న బాగా దాహం వేస్తుంది" అని నేను నాన్నతో చెప్పాను.
"దగ్గర్లో బావి ఉంటుందేమో అక్కడ తాగుదాం" నాన్న చెప్పాడు..
మా ప్రయాణం ఎలా మొదలైందంటే
****
ప్రతి రోజూ మేత మేసి నేరుగా ఇంటికి వచ్చే ఆవు, దూడ ఆరోజు సాయంత్రం అయినా రాలేదు.
సూరీడు ఈరోజు కి ఇక్కడ సెలవంటూ మరోవైపు తన డ్యూటీ చేయటానికి పడమరకు వెళుతున్నాడు.
మసక చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి, నాన్న ఆవుదూడల కోసం పొలం వేపు వెళ్ళాడు.
జాడ దొరకలేదు అంటూ తిరిగి వచ్చాడు.
"అవి ఎక్కడకీ వెళ్ళవు రాత్రికైనా తిరిగి వస్తాయని అమ్మ దైర్యం చెబుతూ భోజనం చేద్దాం" అని అమ్మ చెప్పింది.

నేను "అమ్మ చీకట్లో వాటికి కళ్ళు కనిపిస్తాయా, దారి గుర్తు పడతాయా అని  అడిగాను.. "వాటికి కనిపిస్తాయి గానీ ముందు నువ్వు భోజనం చేయి ఈ గాలికి కరెంట్ పోయిందంటే మనకు కళ్ళు కనిపించవు" అంటూ, అమ్మ కిరోసిన్ దీపాన్ని సిద్దం చేస్తుంది ఎందుకైనా మంచిదని.

*****"""
తెల్లారింది అవి ఇంకా రాలేదు,
నాన్న నేను ఇద్దరం తప్పిపోయిన మా ఆవు దూడను వెతకడానికి ఉదయాన్నే బయలుదేరాం.  మా ఊరి దగ్గర ఉన్న రెండు రేవుల మధ్యలో గడ్డి మేస్తూ ఉంటాయేమో అని వెతికాం,
అక్కడ కనిపించలేదు, తాడి చెట్టుల వరుసలో ఉన్నాయేమో అని వెతుకుతూ వెళుతున్నాం. ఎక్కడ ఆవులు మంద కనిపించినా నేను పరుగులు తీస్తూ వెళ్ళి చూసేవాడిని అందులో మన ఆవు, దూడ ఉన్నాయేమో అని కానీ ఎడారిలో ఎండమావిని చూసిన వాడిలాగా నిరాశగా వెనుతిరిగే వాడిని అవి కనిపించక.
నాన్న కనిపించిన వాళ్ళకి ఆవు పోలికలు చెబుతున్నాడు,వాళ్ళు ఏమైనా జాడ చెబుతారేమో అని.
సమయం గడిచేకుందుకు ఎండ తీవ్రత పెరిగింది. సూరీడు నడి నెత్తిన నిప్పులు జల్లుతున్నట్లు ఉంది, ఎండకు చెంపలు మాడుతున్నాయి. నా నాలుక దాహంతో ఈ పిడచగట్టుకు పోయింది. అప్పుడు అడిగాను ఇలా "నాన్న దాహం వేస్తుంది" అని..
******
ఊరి చివర ఉన్న ఒక పూరింటి దగ్గర
అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్న ఒక పెద్దామెను  నేను మోహమాట పడుతూ అమ్మ కొంచెం మంచినీళ్లు ఇవ్వమని అడిగాను, ఆ ఇళ్ళాలు మా గూర్చి అడిగింది, ఏఊరు ఏం పని మీద వెళుతున్నారు బాబు అని. ఆవు దూడ విషయం చెప్పాము.  ఆ కరుణామూర్తి మీరు ఇంత ఎండలో చాలా దూరం తిరిగి నడుచుకుంటూ వచ్చారా ఉండండి అంటూ చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది," కొంచెం సేపు ఉండండి.. భోజనం చేద్దురు బాబు" అని ఆమె అన్నది.
"పర్లేదు అమ్మ మేము సెంటర్ వేపు వెళుతున్నాం అక్కడ టిఫిన్ తింటాం.. " అని నాన్న చెప్పాడు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది మా గూర్చి ముక్కూ మొహం తెలియని  ఆమె కేవలం మంచినీళ్లు అడిగితేనే భోజనం చేయమని అంది అని..
వాళ్ళు పూరింట్లో ఉండే పేదవాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ మంచి మనసున్న ధనవంతులు అంటే వీళ్ళు కదా అనిపించింది, ఆమె చదువుకొని ఉండకపోవచ్చు  కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న సాయం చేద్దామని ఆ మహాతల్లి గొప్ప ఉద్దేశం అయ్యి ఉండొచ్చు..
చిన్ననాటి జ్ఞాపకం అవ్వడం వలన ఆ ఊరిలో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో గుర్తు రావడంలేదు కానీ ఇప్పటికీ ఆ ఊరు వేపు వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకాలు ఆత్మీయులులా వెన్నంటుతూ ఉంటాయి
సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి, నన్ను అడుగుతాయి మరి నువ్వు ఏం చేశావని?

- శ్రీనివాస చక్రవర్తి
31/03/2019




Saturday, 16 February 2019

రాజమండ్రి - పాపికొండలు - భద్రాచలం గోదావరిపైన పయనం

ఆఫీసు మిత్రుడు వినోద్ పెళ్లి రాజమండ్రిలో అంటే  అందరం వెళ్దాం అనుకున్నాం.
శని, ఆదివారాలు సెలవు రావడంతో దగ్గర ఉన్న ప్రదేశాలు తిరిగి చూడటానికి కూడా బాగుంటుంది అనుకున్నాము..
మా MCA ఫ్రెండ్ ప్రవీణ్  కూడా నాతో బయలుదేరాడు..  
రాత్రి హైదరాబాద్ నుంచి  రాజమండ్రికి బస్సులో బయలుదేరాం.. 
ఉదయాన్నే కొవ్వూరు దగ్గర మెలుకువ వచ్చింది.. ఆసియాలోనే అతిపెద్దవి అయిన వాటిలో ఒకటైన రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా బస్సు రాజమండ్రి వేపు పరుగులు తీస్తుంది.. అప్పుడు గోదావరి పైన కురిసే మంచు నీటితో ముచ్చట్లు చెబుతున్నట్లుగా అనిపించిన దృశ్యం చూడముచ్చటగా చాలా బాగుంది..

ఉదయాన్నే రాజమండ్రిలో దిగగానే  వినోద్ మాకు ఒక రూమ్ ఏర్పాటు చేశాడు, స్నానం చేసి తనను కలిసాం. మీరు ఇంత దూరం రావడం చాలా ఆనందంగా ఉంది చక్రి అని చెప్పాడు, మాకు తనని కలవడం అంతే ఆనందంగా అనిపించింది. తనతో కొంతసేపు మాట్లాడి రాజమహేంద్రవరం చూడటానికి బయలుదేరాం.
******
ముందుగా పుష్కరాలు ఘాట్ దగ్గరకు వెళ్ళాం,అక్కడ ప్రశాంతంగా ప్రవహిస్తున్న గోదారి తల్లి ఒడిలో భక్తులు స్నానాలు, పూజలు చేస్తున్నారు,
మేము మెట్లపైన కూర్చుని నీటపైగా వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ రాజమండ్రికి మకుటం లాంటి బ్రిటిష్ కాలంనాటి పాత మరియు  అర్ధ వృత్తాకారం లాంటి కొత్త
 వంతెనల నిర్మాణాలను పరిశీలించాం.

అక్కడ నుంచి బ్రిటిష్ కాలం నాటి(సుమారు 1852) కాటన్ అనే ఇంజనీర్ నిర్మించిన  ధవళేశ్వరం బ్యారేజికీ బయలుదేరాం, అది రాజమండ్రికీ సుమారు 6,7 కిలోమీటర్ల దూరంలో ఉంది..
బ్యారేజి వద్ద  గౌతమ మహర్షి విగ్రహం కనపడగానే, నేను 2003 సంవత్సరంలో ఈ బ్యారేజ్ దగ్గరికి  వచ్చిన జ్ఞాపకాలు ,ఆ రోజులు గుర్తుకొచ్చాయి.. అప్పుడు ఇదే ప్రాంతంలో ఇసుక తిన్నెల పైన మేము ఆడిన అంత్యాక్షరి అటలు , గోదావరిలో వెతికిన రంగు రంగు రాళ్ళు,కళ్ళముందు చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి అలా మెదిలాయి. తరువాత బ్యారేజి పైన ఉన్న కాలిబాట పైన నడుచుకుంటూ గేట్లును చూస్తూ  ముందుకు కదిలాం.. 
గోదావరి నదికి ఇరువైపులా ఉన్న వివిధ రకాల చెట్లను చూస్తే పచ్చని ప్రకృతి మాత తన కురులను (కొమ్మలను) నీటి పైన వాల్చి ఆనందిస్తుందేమో అనిపించింది..
తిరిగి బ్యారేజి క్రిందికి వచ్చి కాటన్ మ్యూజియంకి వెళ్ళాం అప్పుడు దానిని మూసివేశారు, బయట ఫ్లై ఓవర్ పైన ధవళేశ్వరం ఆనకట్టను గూర్చి వివరంగా బొమ్మలు గీశారు..  కాటన్ సుమారు 1500 కిలోమీటర్లు తన గుర్రం పైన గోదావరి గట్టు పైన తిరిగి సరి అయిన ప్రదేశాన్ని ఎంచుకొని నిర్మించాడు అంటా.. దీని వలన ఎంతో మంది గోదావరి ప్రజల కష్టాలు తీరాయి.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మనం తిరుపతి వెళ్లామంటే అక్కడ ఉండే ఏదైనా హోటల్ లేదా షాప్ లపైన  వెంకటేశ్వర అనే పదం వచ్చే విధంగా ఉంటుంది,
శ్రీశైలం వెళితే  మల్లికార్జున అనే  పదం వాడతారు.. ఇక్కడ కూడా కాటన్ పేరు కూడా అలాగే వాడారు కాటన్ టాక్సీ స్టాండ్, కాటన్ ఫుడ్ పాయింట్ ఇలా... శతాబ్దంనర  గడుస్తున్నా ఇంకా ఆయన పేరు ప్రజల గుండెల్లో ఉందంటే ఆయన కృషి అమోఘం కదా అనుకున్నాం...

ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో భోజనం చేసి తిరిగి పుష్కర్ ఘాట్ వద్ద కు వెళ్లాం.. అక్కడ రేపు ఉదయం చేయబోయే పాపికొండలు, భద్రాచలం ప్రయాణానికి టికెట్ తీసుకున్నాము..
********
తిరిగి తిరిగి సాయంత్రం 06:00 గంటలకు పెళ్లి వద్దకు వెళ్ళాము.. ముందుగా అందరం కలిసి వినోద్ ని కలిసాము, తెల్లని పెళ్లి దుస్తులలో నవ్వుతూ పున్నమి చంద్రుడిలా కనిపించాడు వరుడు వినోద్.
సాయంత్రం 7 గంటలు నుంచి 9 గంటల వరకు పెళ్లి బాగా వైభవంగా జరిగింది..
*****
శనివారం ఉదయాన్నే ఐదు గంటలకే మెలకువ వచ్చేసింది,ఉదయం 06:30 కి పాపికొండల ప్రయాణం కోసం నేను ప్రవీణ్ ఇద్దరం కలిసి రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరకు బయలుదేరాం,దగ్గరిలోని మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాం.
తరువాత ఒక వాహనంలో ఉదయం 08:30 గంటలకు మా  పాపికొండలు ప్రయాణం మొదలయ్యింది.. పాపికొండలు గోదావరి అందాలు గూర్చి ఏమేం పాటలు ఉన్నాయా అని నేను ప్రవీణ్ ఇద్దరం గూగుల్లో వెతికాము.. గోదావరిపైన వచ్చే పాటలు మేం వింటూ ఉంటే గోదావరి గట్టు పైన మా వాహనం బయలుదేరింది. ముందుగా మమ్మల్ని పోలవరం ప్రాజెక్టు దగ్గరికి తీసుకుని వెళ్లారు,ఈ పోలవరం ప్రాజెక్టు చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలా మంది సందర్శకులు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో అని మా మనసుల్లో ఉత్సాహం బయలుదేరింది సుమారు ఆ ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఎంతోమంది ప్రాజెక్టు సంభందించిన పని చేస్తున్నారు...

మా వాహనం నడిపే డ్రైవర్ అప్రాజెక్టు గూర్చి వివరంగా చెబుతూ దాని దగ్గరికి మా వాహనాన్ని పోనిచ్చాడు, 48 గేట్లతో పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణ స్థాయిలోనే ఉంది, ఇది పూర్తవ్వాలంటే మరో ఐదు సంవత్సరాలు పడుతుంది ఏమో అనుకున్నాం.. చుట్టూ  కొండల మధ్య నీటిని నిలవ ఉంచడానికి అనుకూలమైన ప్రాంతంలో దీని నిర్మాణం జరుగుతుంది...
ప్రస్తుతం ఒకే ఒక గేట్(47 వ గేట్) ఏర్పరచారు. ప్రాజెక్టు పూర్తి ఐతే ఎన్నో వేల గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి, మరికొన్ని గ్రామాల మనుగడ కనుమరుగు కూడా అవుతాయి అని చెబుతున్నారు..
అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణం చేసి పాపికొండలు వెళ్ళే బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళాం.
******
శనివారం కావడం వల్ల చాలామంది పాపికొండల అందాలు చూద్దామని వచ్చారు, మేము మా లాంచ్ పై అంతస్తులో కూర్చున్నాము.. జీవితంలో  ఎప్పుడు  లాంచీ ప్రయాణం చేయని నాకు  ఎంతో ఉత్సాహంగా అనిపించింది ఆ క్షణం, తోటి ప్రయాణికులు అందరి గుండెల్లో పాపికొండల్లో చూడబోతున్న ఆనందం వారి కళ్ళల్లో కనిపిస్తుంది, అందరూ వారు రోజు చేస్తున్న పనులను మర్చిపోయి కొత్త లోకానికి ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు అనిపించింది ఆ వాతావరణం. మా లాంచీ ప్రయాణం మెల్లగా మొదలైంది.. అందరూ  గోదావరి మాతకు జేజేలు పలికారు,"బోటు ప్రయాణిస్తున్న ఎడంవైపు పశ్చిమ గోదావరి కుడి వైపు తూర్పుగోదావరి అని , ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు వస్తాయి కొన్ని గ్రామాలకు రోడ్ల సదుపాయం లేదంటూ వివరంగా మైక్ లో చెబుతున్నారు"
మా లాంచీ ముందుకు సాగుతూ ఉంది
మా ఆలోచనులు కూడా..
"ఇక్కడ పిల్లలు ఎలా చదువుకుంటారు, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి ఎలా వెళ్తారు" అని నేను ప్రవీణ్ అనుకున్నాం..
*****
మా లాంచి పాపి కొండలు వైపు వెళుతుంది..
గోదావరి నది చుట్టూ ఉన్న కొండల పైన మంచు సన్నటి తెరలాగా కురుస్తుంది.. ఆ మంచుకు మునగడ తీసుకుని పడుకున్న ఏనుగులు లాగా ఆ కొండలు కంటికి అనిపిస్తున్నాయి.. కొండలు పైన తాడి చెట్లు అగ్గిపుల్లలు లాగా ఉన్నాయి..
లాంచీలో సందర్శకులకు వినోదం అందించడానికి కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు, ఇందులో సందర్శకుల కూడా పాల్గొనే విధంగా కార్యక్రమాలు సరదాగా ఏర్పాటు చేశారు. 
ఓ వైపు ఆ వినోద కార్యక్రమాలు ఆనందిస్తూ మరోవైపు ప్రకృతి సోయగాలను చూస్తూ మేము పాపికొండలకు చేరుకున్నాం..
పాపికొండలు గురించి వివరంగా మైక్ లో చెబుతున్నారు వీటిని ఒకప్పుడు ఆ పాపిడి కొండలు అనేవారంట...
వాటిని చూసినప్పుడు మాకు అనిపించింది.
*భువిపైన దేవుడు దువ్విన ఈ అందాల పాపిడి.
గోదారమ్మ చల్లని నీటి ప్రవాహపు తాకిడి‌..

పచ్చని ప్రకృతి ఒడిలో గోదావరి పయనం..
కనులారా చూసి పరవశించింది మా నయనం..

అందరూ పాపికొండలు అందాన్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచి పోయారు..
మరికొందరు సెల్ఫీల లో తమతో ప్రకృతిని బంధించడం లో మునిగి పోయారు
*****

మా లాంచి పేరంటాలపల్లి చేరుకుంది. అక్కడ మాకు ఒక బ్రేక్ పాయింట్ ఇచ్చారు, అక్కడ ఆశ్రమం దగ్గర ఉన్న శివుడిని దర్శించుకుని మరలా తిరిగి భద్రాచలం వెళ్ళే లాంచీ ఎక్కాము..

మా ప్రయాణంలో చుట్టుపక్కల ఉన్న ఒక్కో గ్రామం  గురించి మైకులలో చెబుతున్నారు ఏ ఏ సినిమాలు ఏ ఊర్లో తీశారో చెబుతున్నారు..
పక్కన ఉన్న ఇసుక తిన్నెల మీదుగా అక్కడి వాళ్లు నడుస్తూ వెళుతున్నారు,
అక్కడున్న ప్రజలను చూస్తుంటే వీళ్ళ జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ ఎత్తుపల్లాలతో (కష్టాలు సుఖాలు మరియు గోదావరి గట్టు ఎక్కడం దిగడం) సాగుతుందనిపించిది.

ప్రయాణంలో ఇదే చివరి మజిలీ అని మైక్  లో చెప్పారు, ఇంకా కొంచెం సేపు ఈ ప్రయాణం ఉంటే బాగుండేమో అనిపించింది.‌.
చాలా భారంగా బ్యాగ్ లను మోసుకుంటూ ఆటలు ఆడి అలసిపోయిన చిన్న పిల్లలాగా లాంచీ దిగాం....

అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేసి సాయంత్రానికి భద్రాచలం చేరుకున్నాం.. 
భద్రాచల రాముడి పాటలు వింటూ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాం...
*****

ఆదివారం ఉదయాన్నే భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్ళాము. సెలవు కావడం వల్ల భక్తులు బాగానే వచ్చారు సుమారు రెండు గంటల సమయం పడుతుందని చెప్పారు.. నేను , ప్రవీణ్ దర్శనం ఎంత  ఆలస్యం ఐతే అంత మంచిది,  ఎక్కువ సేపు మనం ఈ గొప్ప ప్రదేశంలో ఉండే అవకాశం వస్తుంది కదా అనుకున్నాం.అక్కడ గోడలపై రాసిన రామదాసు కీర్తనలను  చూసాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం.
ఆ తర్వాత ఆ సీతారాముని దివ్య దర్శనం బాగా జరిగింది..
గుడి గోడలపై వివరంగా గీసిన చిత్రాలను చూస్తూ దమ్మక్క ,కంచర్ల గోపన్న మరియు భద్రగిరి గా మారిన భద్రుని కథను చదివాం చర్చించుకున్నాం..

అప్పుడు నా మనసులో అనిపించింది
*నాడు ధమ్మక్క ఇచ్చిన తాటి ఫలాన్ని మొదటి నివేదనగా తీసుకున్న రాముడికి నేడు కోట్లాది తెలుగు ప్రజలు తమ హృదయాలను నివేదనగా సమర్పిస్తున్నారు కదా అని*..
తరువాత రామదాసు రాముడికి చేసిన నగలను మ్యూజియం లో  చూశాము.
గుడి పక్కన ఉన్న చిత్రకూట కళాప్రాంగాణంలో రామదాసు కీర్తనలు ఆలపిస్తున్నారు. ఆ పాటలు పాడే వారిని చూస్తే ఏ పనినైనా ఏదో చేశాములే   అని కాకుండా ఇంత నేర్పుగా , ఆనందిస్తూ చేయాలి అని మాకు ప్రేరణ కలిగింది..
*******
మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మా ప్రయాణం హైదరాబాద్ కు మొదలయ్యింది.. నేను ప్రయాణ వివరాలు రాస్తూ ఉన్నాను, రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాం..

మొత్తానికి ఎప్పటినుంచో అనుకుంటున్న పాపికొండలు యాత్ర  బాగా చేశాము..
చాలా రిఫ్రెష్ అయినా భావన నాకు కలిగింది... ఇక సోమవారం నుంచి పనిలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనవచ్చు అనుకున్నా :)

Tuesday, 15 January 2019

సంక్రాంతి సంబరాలు మన తెలుగింట

చలి తెరలను తొలిగించే భోగిమంట.
ముత్యాల ముగ్గులు ముంగింట.
ఇంటికి చేరే తొలి పంట.
అల్లుడు,కూతురుల కొత్త జంట.
నోరూరించే పిండి వంట.
సంక్రాంతి సంబరాలు మన తెలుగింట.

-శ్రీనివాస చక్రవర్తి.
15/01/2019