1) చిన్నప్పుడు పండుగల కోసం ఎదురు చూడటం, ఎందుకంటే అప్పుడు పండుగలు అంటే కొత్త బట్టలు వస్తాయి మరియు నోరూరించే పిండి వంటకాలు, చుట్టాలు వస్తారు, కొత్త సినిమాలు వస్తాయి అందరూ కలిసి ఓ చోట ఎంత బాగుండేదో. నిజంగా పండుగ అంటే ప్రతీ చోటా కనుల పండుగే.
2) శనివారం సాయంత్రం - శనివారం సాయంత్రం బడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, ఆదివారం నాడు చేయబోయే వాటిని గూర్చి ఆలోచిస్తూ, మిత్రులతో చర్చిస్తూ ఎంతో ఆనందానికి లోనయ్యే వాళ్ళం.
3)తాటిమట్టలను బ్యాటులుగా చేసి క్రికెట్ ఆడుతూ , వాటి మీద MRF అని రాసి సచిన్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. తాటిముంజలు తిన్నాక కాయలతో కిర్,కిర్ బండి చేయడం.తాటి పండ్లను ఆకుల్లో కాల్చి , పొలం గట్టులపైన కూర్చుని మాట్లాడుకుంటూ తినడం.
4)ఈతపండ్లు, నేరేడు పండ్లు కోసం తెల్లవారుజామున అందరికన్నా ముందు పరుగులు తీయడం.
రెండు జేబులనిండా వాటిని నింపుకుని విశ్వవిజేత లాగా ఇంటికి తిరిగి వెళ్ళడం.
5)వర్షం పడితే కాగితం పడవలు,కత్తి పడవలు చేయడం. చెరువు గట్టు మీదకు వెళ్ళి నల్లమట్టిని తెచ్చి మట్టి బొమ్మలు చేస్తూ మనలోని శిల్పిని వెలికితీయడం.
6) వేసవి సాయంత్రం ఆరుబయట నక్షత్రాలు చూస్తూ పడుకోవడం. నాన్న,అన్నయ్య వాళ్ళు చెప్పే కథలు వినడం. ఇప్పటిలాగా అప్పుడు ఇన్ని టీవి చానల్స్ లేవు కదా, దానివలన అప్పుడప్పుడు కలర్ టివిని , VCR మరియు కొన్ని క్యాసెట్లను అద్దెకి తీసుకువచ్చి రాత్రిపూట వేసేవాళ్ళు. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు కదా "అరే సాయంత్రం మా ఇంటి దగ్గర సినిమాలు వేస్తున్నాం, ఎవరికీ చెప్పకుండా నువ్వొక్కడివే రా అనేవాళ్ళు".
ఒక చాప, దుప్పటి తీసుకుని అక్కడికి వెళ్లేసరికి చాలామంది ఉండేవాళ్ళు😁😁.ఇంట్లో ఖాళీ చాలక ఆ కలర్ టీవీ అరుగు మీద పెట్టి సినిమాలు వేసేవాళ్ళు, అవి చూస్తూ నిద్రలోకి జారుకున్న రోజులు గుర్తుచేసుకుంటే భలే అనిపిస్తుంది.
7)ఇక ఆదివారాలు గూర్చి ఎంత చెప్పినా తక్కువే, మిగతా రోజుల్లో ఆలస్యం లేచే పిల్లలు ఆదివారం మాత్రం ఇంట్లో అందరికంటే ముందు, సూర్యుడి కంటే కూడా ముందు లేవడం, మిత్రులు ఇంటికి పరుగున వెళ్ళి వాళ్ళను నిద్ర లేపి ఆటలకు, పాటలకు రమ్మని చెప్పడం.
ఇలా ఆటలు మొదలు పెట్టగానే సూర్యుడు కూడా పిల్లలతో జత కూడుతాడు, కొంత సేపటికి ఆయన తన ప్రభావాన్ని పెంచుతాడు. అప్పటికే అలసిపోయిన పిల్లలు ఇంటి దారి పట్టి , టిఫిన్లు చేసి..
ఇక ఇంట్లో టీవీ ఉంటే చూడటమో లేకపోతే పక్కింటి వాళ్ళ అరుగు మీద కూర్చుని బటానిలో, వేరుశనగ కాయలు తింటూ దూరదర్శన్లో వేసే సీరియల్స్ చూడడం.
మరలా సాయంత్రం కాగానే ఆటలకు పరుగులు తీయడం, కొంతసేపటికి సూర్యుడు అస్తమించడం మొదలుపెడతాడు. అప్పుడు పిల్లల్లో బాధ మొదలవుతుంది అరెరే ఆదివారం అయిపోయిందే అని..
నిజంగా ఒక మాటలో చెప్పాలంటే బాల్యం అందమైన బృందావనం
అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
No comments:
Post a Comment