Saturday, 8 November 2025

పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..

 అక్టోబరులో చదివిన పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..


ఓ చారిత్రక ప్రేమికుని ప్రయాణమే ఈ పుస్తకం.రచయిత అడవాల శేషగిరి రాయుడు(అశేరా)మన చరిత్రని, మన మూలాలను భావితరాలు తెలుసుకునే విధంగా ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచన చేశారు.ఓ రోజు అశేరా గారు కంబగిరిలో నరసింహ స్వామి దేవాలయానికి వెళ్తారు, అక్కడ నీటి కుండంలో ఒక రాగి నాణెం దొరుకుతుంది. ఆ రాగి నాణెం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో దగ్గరలో ఉన్న అనంతపురం మ్యూజియం కి వెళ్తారు .ఆ మ్యూజియం అధికారి అయిన విజయ్ కుమార్ జాదవ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే తర్వాత చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్న సభ్యులు అందరూ కలిసి విజయకుమార్ గారి మార్గదర్శకంలో ఓ గ్రూప్ గా ఏర్పడి ఎన్నో అనేక ప్రదేశాలు, కట్టడాలు సందర్శనం వైపుకు దారితీస్తుంది. ఆ ప్రదేశాలు వెనుక ఉన్న వింతలు విశేషాలు తెలుసుకొని మనం కూడా సందర్శించిన అనుభూతి కలుగుతుంది.ఈ పుస్తకంలో కొన్ని విశేషాలు.- నేడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెలూం గుహలు యొక్క కథ. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులకు అపోహలు భయాలతో, మూఢనమ్మకాల గల ప్రదేశంగా ఉండేదట. ఈ గుహలు ప్రదేశంలో ఉన్న చలపతి రెడ్డి గారు జర్మనీ నుంచి ఒక బృందాన్ని పిలిచి సర్వే చేయించి మ్యాప్ గీయించారు, గుహలు పైన ఒక దొంగ స్వామి కళ్ళు పడి, ఆయన చేసే జిమ్ముక్కులతో ఆ ప్రదేశాన్ని ఆనవాళంగా చేసుకుని ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూశారు, అడ్డు వచ్చిన వాళ్ల మీద నాటు బాంబులు కూడా ప్రయోగం జరుగుతుంది, కానీ చలపతి రెడ్డి సంకల్పం, విజయ్ కుమార్ జాదవ్ గారి ప్రయత్నం వలన బేలుం గుహలు పురాతన ప్రదేశాలు జాబితాలోకి చేరి ఆసియాలోనే పెద్దదయిన గుహల్లో ఒకటిగా బయటికి వచ్చిందని కథను ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు.-  అభివృద్ధి పేరుతో కదరి నరసింహ స్వామి ఆలయం మార్పులు చేయడం, అదే అభివృద్ధి పేరుతో తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించడం. నిధులు నిక్షేపాల కోసం పురాతన కట్టడాలన్నీ కోటలని తవ్విన ఉదంతాలని ఈ పుస్తకంలో చదివాక ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న తమిళనాడు, కర్ణాటక లాగా మన తెలుగు రాష్ట్రాల్లో పురాతన కట్టడాలు ఎందుకు తక్కువగా ఉన్నాయో నా ప్రశ్నకి జవాబు అర్థమైంది.-మన తెలుగు నాట జరిగిన లైలా మజ్ను లాంటి అమర ప్రేమ కథను ఈ పుస్తకంలో అశేరా గారు అద్భుతంగా చెప్పారు.  అదే మన కదిరి నరసింహ స్వామి సాక్షిగా జరిగిన చంద్రవదన - మొహియర్ చారిత్రక ప్రేమగాథ‌.- ఆంజనేయ స్వామికి కుమారుడు ఉన్నాడు. ఆయన శక్తిలోను ,స్వామి భక్తిలోనూ తండ్రికి సమానుడు కానీ రావణాసురుడు వద్ద పనిచేయాల్సి వస్తుంది అనే విషయం ఈ పుస్తకంలో రాసిన కథ చదివి ఆశ్చర్యపోయాను.ఆయన విగ్రహం కొలనపాకలో ఉందట. అంతకుముందు ఆ విగ్రహాన్ని ఆంజనేయస్వామి అనుకునేవారుట కానీ విజయ్ కుమార్ గారు దానిని ఆధారాలతో ఆంజనేయస్వామి కుమారుడిని రుజువు చేసిన విధానం చదివాక అద్భుతం అనిపిస్తుంది.- ఓసారి ఓ పెద్దాయన వచ్చి మా ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి సార్ వాటిని తవ్వి తీసి మా గ్రామానికి, మన దేశానికి ఉపయోగపడే పని చేయండి సార్ అని అంటారు, మరొకాయిన నా దగ్గర జింక చర్మం మీద నిధి గురించిన మ్యాప్ ఉంది అంటూ చూడమంటారు ఈ విశేషాలు అన్ని కూడా చదువుతుంటే చాలా ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉన్నాయి .- ఇంకా మరెన్నో  తిమ్మమ్మ మర్రిమాను కథ, దక్షిణ భారత జలియన్ వాలా బాగ్, శ్రీకృష్ణదేవరాయని కుమారుని గురించిన శాసనాలు. మరెన్నో అద్భుతమైన పురాతన దేవాలయాల విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.-ఈ చారిత్రక ప్రయాణానికి మార్గదర్శకత్వం వహించిన విజయకుమార్ గారి జీవితం చాలా ఆదర్శవంతంగా అనిపించింది‌, ముఖ్యంగా ఆయన ఎన్నో పల్లెలు తిరిగి స్థానికులతో పోరాడి వారికి ఎంతో నచ్చచెప్పి అనేక విలువైన విగ్రహాలను మ్యూజియాలకు తరలించి భావితరాల కోసం చేసిన కృషి అభినందనీయం.చివరిగా ఓ మాట రచయిత అశేరా గారు చాలా సంఘటనలు ముక్కుసూటిగా రాశారు. చరిత్రని దాయకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఆయన కథనం వైవిధ్య భరితంగా చాలా బాగుంది. ఎన్నెల పిట్ట ప్రచూరణ వారు ఈ పుస్తకాన్ని చాలా బాగా ముద్రించారు. చరిత్ర పట్ల, చారిత్రక కట్టడాలు అంటే ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం.- శ్రీనివాస చక్రవర్తి.

Monday, 13 October 2025

పుస్తకం: పాటలు పుట్టిన తావులు


 

ఈ మధ్య కాలంలో చదివిన ఓ అద్భుతమైన పుస్తకం: పాటలు పుట్టిన తావులు.

ఆహా.. ఏమి పుస్తకం.. ఏమి సందర్శనం.. ఏమి కథనం..ఈ పుస్తకం చదువుతుంటే మనం కూడా రచయిత చిన వీరభద్రుడు గారితో కలిసి పాటలు పుట్టిన తావుల్లో స్వయంగా సందర్శించిన అనుభూతిని పొందుతాం. ఎన్నో పురాతన క్షేత్రాలను ఎందరో గొప్ప వ్యక్తులను కలుసుకుంటాం, ఏ సందర్భంలో కవి హృదయం ఎలా స్పందించిందో.. ఆ హృదయం నుంచి జాలువారిన పాటలను/ పదాలను తెలుసుకొని మనం కూడా పరవశించిపోతాం.ఒక సంఘటన చూద్దాం..తమిళ దేశంలో ప్రముఖులైన జ్ఞానసంబంధర్, అప్పర్ ఇద్దరూ కలిసి ఓనాడు తిరుమలైకాడు దేవాలయానికి వెళ్తారు. అక్కడ ప్రధాన ద్వారం మూసి ఉండటం సంబంధర్ చూసి అప్పర్ ని మీరు స్వామిని స్తోత్రం చేస్తూ ఒక పాట పాడండి అంటారు.. మొదటి పాట పాడగానే తలుపులు కిర్రుమంటాయి కానీ అవి తెరుచుకోవు, అప్పుడు వెంటనే అప్పర్ మరో పాట పాడగానే తలుపులు పూర్తిగా తెరుచుకుంటాయి. లోపలికి అడుగుపెట్టగానే తలుపులు మూసుకుపోతాయి. స్వామిని పూజించి తిరిగి వస్తుంటే మూసిన తలుపులు తెరుసుకోవడం కోసం సంబందర్ ను పాట పాడమని ఈసారి అప్పర్ అడుగుతారు, సంబంధర్ పాట ఎత్తుకొని మొదట వాక్యం పలికాడో లేదో వెంటనే తలుపులు బార్ల తెరుచుకుంటాయి. అక్కడ చేరిన జనం ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ సంఘటన గురించి రచయిత చెబుతూ ఇది ఒక కవిని ఎక్కువ , మరో కవిని తక్కువ చేయడం కాదు ఇది కేవలం రూపాలంకారం మాత్రమే అని చెబుతారు .. మరో సంఘటనలో అప్పర్, సంబంధర్ కరువు సంభవించిన ప్రాంతం ప్రజలు కోసం పాటలతో దేవుణ్ణి ప్రార్థించి బంగారుకాసుల్ని తెప్పించిన ఘటన చాలా అద్భుతంగా ఉంది.కొన్ని జీవితాలకి అభిమానులుగా మారుతాం..ఈ పుస్తకం లో సుబ్రహ్మణ్య భారతి గారి గురించి రచయిత చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, భారతి గారు 12 భాషల్లో పండితుడు కత్తి సామూ ,మల్ల యుద్ధం, భరతనాట్యం, సంగీతంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా పత్రికలు కూడా నడిపారట, గొప్ప సామాజిక సంస్కర్త ,తమిళ గద్య పితామహుడు అని ఒక మంచి పరిచయం చేశారు. ఆయన జీవితంలో ఈ సంఘటన చూడండి.ఓ రోజు భారతి గారు కొంతమంది బీద పిల్లలు తినడానికి తిండి లేక వేప పండ్లు ఏరుకొని తినడం చూశారట, ఆ రోజు నుంచి తనకి తిండి రుచి తెలియకుండా పోయిందని సుబ్రమణ్య భారతి గారు ఒక చోట రాసుకున్నారట.. నిజంగా ఆయనది ఎంత ద్రవించే హృదయం.ప్రతి స్త్రీలో తల్లిని చూసిన వ్యక్తి భారతి గారు, ఆయన పసిప్రాయంలోనే ఆమె తల్లి ఆయనను వదిలి దివికేగారట, తరువాత భారతి గారు ప్రతి స్త్రీలో కూడా తన మాతృవదనాన్నే దర్శించారట.చిన వీరభద్రుడు గారు ఇక్కడ ఒక మాట చెప్పారు " ప్రతి ఒక్క స్త్రీలో తల్లిని దర్శించడం అంటే ఏమిటి? నువ్వు సదా బాలకుడిగా ఉండటమే కదా..ఈ మాటలు నా చిన్నతనంలో నా హృదయంలో సూది మందు ఎక్కించినట్లుగా నా తల్లిదండ్రులు చెబితే ఎంత బాగుండేది"సుబ్రహ్మణ్య భారతి గారి గురించి చదివాక ఆయనకి అభిమానిని అయిపోయాను నేను.ఇలాంటి ఆదర్శనీయమైన వ్యక్తి మరొకరు అమ్మైయారు, తనను తాను ఒక భూతంగా భావించుకొని భగవంతుని కోసం స్మశానంలో వెతికిందంట,  తిరువాలంగాడు అనేది పరమ పవిత్రమైన ప్రదేశంగా భావించి పాదాలతో తాకరాదని, పాదాలు పైకెత్తి అరచేతుల మీద నడిచే ఘట్టం చదివి ఆశ్చర్యపోయాను ‌.ఈ పుస్తకంలో ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకొన్నాను.- రమణ మహర్షి తను పుట్టిన ప్రదేశం నుండి అరుణాచలం చేరిన విధానం.- ఎక్కడ గంగైకొండ చోళాపురం ఎక్కడ రాజేంద్ర మహేంద్రవరం. రాజ రాజేంద్ర చోళుడు కుమార్తె మన రాజ రాజ నరేంద్రుని (రాజమహేంద్రవరం) అర్థాంగిగా వచ్చారట.- శ్రీరంగ నాథుడు పూల మాలలు కట్టేవారితో తన భక్తుల గురించి సంభాషించిన సంఘటన‌- చలంగారు - రమణ మహర్షి - అరుణాచలం జీవితాదర్శం ఘట్టాలు- తన భక్తురాలిను గణపతి తొండంతో నేరుగా కైలాసానికి తీసుకొని వెళ్ళిన సంఘటన.- కావేరి నది అందాలు - త్యాగ రాజ ఆరాధన మండపంలో చినవీరభద్రుడు గారు పొందిన అనుభవం.. చిన వీరభద్రుడు గారు ఈ పుస్తకంలో ఓచోట ఓ మాట చెబుతారు."ఎందరో మహానుభావులు చేతిలో చిల్లిగవ్వ లేని జీవితాన్ని అనుభవిస్తూ కూడా తోటి మనుషుల కోసం, భాష కోసం వారు పడ్డ తపన, చేసిన సేవ తెలిసిన కొద్ది.. జీవితం మనకెంతో అవకాశం ఇచ్చిన మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న పదేపదే గుచ్చుకుంటుంది"..  ఈ పుస్తకం చదివాక వారి అందరి జీవితాల నుంచి గొప్ప ప్రేరణ పొందుతాం.ఈ నేల మీద, మన వారసత్వపు సంపద మీద మన ప్రేమ రెట్టింపు అవుతుంది.పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించిన కవులు గురించి, వారు నడయాడిన ప్రదేశాలు గూర్చి తెలుసుకోవాలనే తపన నాలో పెరిగింది. ఇంత గొప్ప రచనను  మన ముందు తీసుకొని వచ్చిన చిన వీరభద్రుడు గారికి , ఈ పుస్తకం అందించి చదవమని ప్రోత్సహించిన కొప్పరపు లక్ష్మి నరసింహరావు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.- శ్రీనివాస చక్రవర్తి.

Monday, 22 September 2025

కథ 2023 సంకలనం : నాకు నచ్చిన కథలు






ప్రతి ఏడాది అన్ని పత్రికల్లో వచ్చే కథలను పరిశీలించి, మంచి మంచి కథలను తీసుకొని ఓ మంచి కథా సంకలనంగా తీసుకొని రావడం అంటే మాటలు కాదు. 2023 వ సంవత్సరంలో వివిధ మాధ్యమాల్లో వచ్చిన 2500 కథలను చదివి వాటిలో ఒక 15 కథలను ఏరి మన ముందు ఉంచారు కథా సాహితి సభ్యులు. ఇలా 35 సంవత్సరాల నుండి అంతరాయం లేకుండా కథా సంకలనాలు వస్తున్నాయి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓ రోజు హర్షణీయం పాడ్ క్యాస్ట్ వింటుంటే ఈ కథ సంకలనాలు గురించి వాటి వెనుక ఉన్న విశేషాలు గురించి తెలుసుకున్నాను. ఆ ప్రేరణతో ఈ ఏడాది ఒక కథ సంకలనం చదివి చూద్దాం అని "కథ 2023" పుస్తకం విజయవాడ పుస్తకాల పండుగలో తీసుకొన్నాను. 2025లో నేను మొట్టమొదటిగా చదవడం పూర్తి చేసిన పుస్తకం కూడా ఇదే‌, పూర్తి చేసాక మనసుకు ఓ మంచి సంతృప్తిని కలిగిన అనుభూతి కలిగింది. ఇన్ని సంవత్సరాలు కథా సంకలనాలు ఎలా మిస్ చేసానా అనిపించింది.కొన్ని కథలు చాలా బాగా నచ్చాయి, కొన్ని కథలను అర్థం చేసుకోలేక పోయాను. నాకు బాగా నచ్చిన ఓ 4 కథలు నాకు అర్థం అయిన మేర మీతో పంచుకుంటాను.


1‌.మనసు - మర్మం: అమెరికాలో ఓ గొప్ప యంత్రం వస్తుంది. ఆ యంత్రం ఉన్న గదిలోకి వెళితే మన మనసును Scan చేసి మనసులో ఉన్న విషయాలు అన్నీ చెప్పేస్తుంది. దీనిని పరిక్షించడానికి అన్ని దేశాల ప్రజలు నుంచి లాటరీ విధానంలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, అనుకోకుండా ఆ వ్యక్తి మన భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అవుతాడు. యంత్రంతో పరీక్షకు వెళ్ళేముందు ఆ వ్యక్తి చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు మనసులో దాచుకుని బయటకు చెప్పలేని సంఘటనలు అన్నీ ఓసారి రీల్ లాగా గిర్రున తిరుగుతాయి , అవన్నీ ఆ యంత్రం బయట పెడుతుంది ఏమోనని తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు మన కథా నాయకుడు. ఆ సంఘటనలు చదువుతుంటే అందులో మనల్ని మనం చూసుకుంటున్నట్లు ఉంటుంది. పరిక్ష జరిగే ముందు రోజు ఓ ప్రముఖ ఛానల్ నుంచి మీరు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటో రికార్డు చేసి పంపమని ఒక మెయిల్ వస్తుంది అందులో చెప్పిన ఈ మాటలు చాలా స్పూర్తివంతంగా ఉన్నాయి ..

"ఎంతకాలం పరదాలు వెనుక దాక్కుంటాం , ఎంతకాలం మంచివాళ్ళలా చెలామణి అవుతాం ఆత్మవంచనతో కాదు, ఆత్మ సంతృప్తితో బతకాలి. బతుకు.. బతకనివ్వు అనే భావన మధురంగా ఉండదూ..?" ఇలా అద్భుతంగా సాగుతాయి ఆయన చెప్పిన మాటలు.

మరి ఇంతకీ మనసులో మర్మాన్ని తెలిపే ఆ యంత్రం కథ చివరిగా ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చదవాల్సిందే. రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు ఓ మంచి సందేశాన్ని ఈ కథ ద్వారా ఇచ్చారు.

******

2. పులస : భూమితో స్నేహం చేసిన ఓ స్త్రీ కథ. ఒక ఊరిలో రవణమ్మ అనే ఆవిడ ఉంటుంది. చిన్నతనం నుండి పొలం పనులు చేయడం అంటే ఆమెకు సరదా మరియు ఎంతో ఇష్టం , రోజులు తెలిసేవి కావు చేను అంటే ప్రాణంగా ఉంటుంది . ప్రక్కనే ఉన్న ఊరులో ఒకాయన తో ఆమెకు వివాహం జరుగుతుంది. భూమి మీద ఉన్న ఇష్టం వలన ఓరోజు తమ పొలం చూపించమని అత్త, భర్తలను అడుగుతుంది ..

"భూమి గురించి నీకెందుకు, తిని ఇంటికాడ కూర్చోవచ్చు కదా" అని అంటారు. భూమితో రుణం తీరిపోయిందా అని బాధపడుతుంది తాను. అదే సమయంలో రవణమ్మ అన్నదమ్ములకు పొలం వాటాలు వేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, రవణమ్మ పంచాయతీకి వెళ్ళి భూమిలో తన వాటా సంపాదిస్తుంది . ఆ భూమిని బంగారంగా మారుస్తుంది.. కొంతకాలానికి ఆ భూమి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిబోతుంటే ఆ భూమిని తిరిగి సంపాదించాలని రవణమ్మ చేసిన పోరాటం మరియు భూమిని దైవంగా ఆరాదించడమే ఈ కథ.

ఈ కథలో నాకు బాగా నచ్చిన లైన్స్ చేసే పని ఏదైనా ప్రాణం పెట్టాలి అనే విధంగా ఉన్నాయి...

ఓసారి మీరు చదవండి 

" సేనంటే ఏటి? బూవితో సేయితం సెయ్యాల, ఆయమ్మని ముద్దాడలా, ఒడుపుగా ఆయమ్మ సేతిలో సెయ్యెయాలా, అన్నింటికన్నా ముక్కెం మన సెమట సుక్కల్తో ఆ తల్లి సానవాడాల"  

రచయిత్రి కత్తి పద్మ గారు రాసిన విధానం చాలా బాగుంది . ఈ కథ చదివిన చాలా రోజుల వరకు నన్ను వెంటాడుతూనే ఉంది.

*******

3.చప్పుడు చేసే నిశబ్దాలు : ఈ కథను నేను రైలు ప్రయాణంలో చదివాను‌. రచయిత ఛాయా మోహన్ గారు ఈ కథను అద్భుతంగా రాశారు. 

ఉరుకుల పరుగుల జీవితం మన మనుషులు మన పక్కనే ఉన్నారు కదా అనుకుంటాం.. సంవత్సరాలు గడిచిపోతాయి.. పిల్లలు పెద్దలుగా మారతారు చదువులు, ఉద్యోగాలు అని ఎక్కడో స్థిరపడి పోతారు. తల్లి దండ్రులు, భాగస్వామి కాలం ఎవరిని ఎక్కడికి తీసుకొని వెళుతుందో తెలియదు ...

సమయం చేసుకుని మన వాళ్ళతో గడపాలి అదేవిధంగా కనువిప్పు కలిగించే ఈ కథలో సందర్భానుసారంగా మధ్యలో మంచి పాటలు జత చేసారు రచయిత ఛాయా మోహన్ గారు.

*******

4.ముసురు : ఇప్పటి తరం యువత కులవృత్తి పట్ల చూపిస్తున్న నిరాసక్తత . కులవృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ముసురు కథలో రచయిత్రి స్పూర్తి గారు దృశ్య రూపంలాగా చిత్రీకరించారు, ముఖ్యంగా కురుమయ్య తాతయ్య పాత్ర చాలా బాగా నచ్చింది నాకు.

 కథ-2023 సంకలనం చాలా బాగుంది. ఈ ఏడాది రాబోయో కథ 2024 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా కథా సంకలనాలతో మరియు కథలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు కదూ..

- శ్రీనివాస చక్రవర్తి.



 

Monday, 15 September 2025

పుస్తకం: జీవనయానం

 ఆత్మకథ సాహిత్యంలో నాకు బాగా నచ్చిన ఓ పుస్తకం : జీవనయానం 



ఈ పుస్తకం లోని రంగాచార్యులు వారి నాలుగు మాటలు "నది జీవితం వంటిది. బిందువుగా మొదలవుతుంది, ఉపనదులు కలుస్తాయి విశాలమవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి అది విశాలమవుతుంది. నదికి కొండలు కోనలు ఎదురవుతాయి అప్పుడు జలపాతం అవుతుంది, హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి అప్పుడే జీవితనాథం వినిపిస్తుంది. జీవితం వికస్తుంది.చిక్కుల్లో మనిషి ఎదుగుతాడు ,ఆపదల్లో ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే." ఈ వాక్యాలు చదివినప్పుడు ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది.

నేను పుస్తకాల పండుగకు వెళ్ళే మొదటి దశలో ఈ పుస్తకం నాకు చాలా స్టాల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది , కాని కవర్ పేజీని మరియు టైటిల్ ని చూసి ఇదే ఏదో ఆధ్యాత్మికానికి సంబంధించినది అని మనకు అర్థం అయ్యే పుస్తకం కాదు అని మొదట్లో అనుకునేవాడిని.కానీ ఒక్కసారి మన తెలుగులో వచ్చిన అత్యుత్తమ ఆత్మకథలు ఏవి అని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అందులో ఇది కూడా ఒకటని తెలిసింది.అప్పుడు చదవడం మొదలుపెట్టాను. ఇంత గొప్ప పుస్తకాన్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదా అనిపించింది. ఈ పుస్తకం పూర్తి అయ్యేంతవరకు మరో పుస్తకం వైపు చూడలేదు అంత ఆసక్తిగా, అంత అద్భుతంగా అనిపించింది రంగాచార్యులు వారి రచనా శైలి , దృశ్యాలను కళ్ళముందు పరిచారు .


- ఇది రంగాచార్యులు ఆత్మకథే కాదు, మన తెలుగు జాతి ఆత్మకథలాగా నాకు అనిపించింది. నాటి మన తెలుగు రాష్ట్రాల (స్వాతంత్ర్య ఉద్యమ పూర్వ కాలంలో, తరువాత కాలంలో) పరిస్థితులు ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు రాశారు.

- నాకు వింతగా అనిపించింది ఆనాటి కరెన్సీ , అప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ రావాలంటే కరెన్సీ మార్చుకోవాలి అంటా నిజాం కరెన్సీ ను బ్రిటిష్ ఇండియా కరెన్సీగా మార్చుకొంటేనే ఆయా ప్రాంతాల్లో లావేదేవీలు జరపగలం అంటా.

- హుస్సేన్ సాగర్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కుతుబ్ షాహీల కాలంలో ఇబ్రహీం కూలీ కుతుబ్షాకి జబ్బు చేయడం వలన హుస్సేన్ షావలి అనే ఫకీర్ దగ్గరికి వెళ్ళారట , ఆయన జబ్బు నయం చేయటం వలన కృతజ్ఞత పూర్వకంగా ఆయన పేరు మీద హుస్సేన్ సాగర్ ని 1562 వ సంవత్సరంలో నిర్మించారు అట.

-అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్ వీటికి అప్పట్లో వేరే పేర్లు ఉండేవట , వాటిని నిజాం కాలంలో ఎలా మారాయో కూడా చెప్పారు.

- అప్పట్లో తెలుగు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ముఖ్యంగా నిజాం పాలనలో ఉర్దూ మీడియంలో చదవాల్సి వచ్చేది , ఉద్యోగాలు కూడా ఆ భాష నేర్చిన వారికే ప్రాముఖ్యత ఉండేది.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాశారు. ముఖ్యంగా సాయుధ పోరాటం నాటి విషయాలు ,ఆ వీరులు త్యాగాలు చదువుతుంటే మనకు ఈ నేల మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది.స్వత్వాహాగ ఆయన గొప్ప రచయిత అయి ఉండటం వలన హృదయాలను కదిలించే గొప్ప రచనగా మలిచారు. ప్రతి తెలుగువాడు చదవాల్సిన పుస్తకం జీవనయానం.ఫ్రెండ్స్ మీరు కూడా మీకు బాగా నచ్చిన ఆత్మకథ పుస్తకాలను తెలియజేయండి. మేము వాటిని చదివి ప్రేరణ పొందుతాం.

- శ్రీనివాస చక్రవర్తి 

Thursday, 11 September 2025

పుస్తకం : వీరయ్య

ఆగష్టు నెలలో చదివిన ఓ మంచి పుస్తకం : వీరయ్య



 ఈ పుస్తకం చదువుతుంటే నాకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ తో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మని అడుగుతూ ఉండేవాడిని "అమ్మమ్మ నువ్వు గాంధీగారిని చూసావా, బ్రిటిష్ వారిని చూసావా అని . మా అమ్మమ్మ అప్పటి విశేషాలు చెప్పేది.

సరిగ్గా అలాంటి విశేషాలనే ఈ వీరయ్య పుస్తకంలో మనం చూడవచ్చు. బ్రిటిష్ కాలం నాటి మన భారత ప్రజల జీవన విధానం. కొంతమంది భారతీయులు పొట్టకూటికోసం ఆఫ్రికా చెరుకు తోటలో కూలీలుగా చేరి అక్కడ బానిసల్లా పడిన కష్టాలు, అప్పటి వాతావరణం, మానవ బంధాలు కళ్ళకు కట్టినట్లు రాశారు రచయిత కృష్ణ.

పుస్తకం చదువుతుంటే మనం కూడా వీరయ్యతో విజయవాడ నుంచి మద్రాసు వరకు రైలులో ప్రయాణం చేసి అక్కడ నుంచి దక్షిణ ఆఫ్రికాకు ఓడలో ప్రయాణం అవుతాం. అక్కడి చెరుకు తోటల్లో, పంచదార కర్మాగారాల్లో విహరిస్తాం . మన భారతీయ కూలీలు పడిన కష్టాలు చూసి చలించిపోతాం. దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల కోసం గాంధీ గారి చేసిన ఉద్యమం చూస్తాం.వీరయ్య బతుకు తెరువు కోసం దక్షిణాఫ్రికా లో సాధారణ కూలీగా మొదలై సర్దార్ గా మారిన విధానం చదివి ప్రేరణ పొందుతాం.వీరయ్య గారు 30 సంవత్సరాల తరువాత తమ కుటుంబ సభ్యులను భారత్ లో కలవాలని పడే ఆరాటంలో మనం కూడా భాగం అవుతాం.

కొన్ని సంఘటనలు వింతగా అనిపించాయి.

1. అప్పట్లో రైలులో 4 వ తరగతి ఉండేది, కూలీలు కోసం. అందులో కింద కూర్చుని ప్రయాణం చేసేవారు. వీరయ్య తోటి కూలీలతో కలిసి రైలులో ఇలా విజయవాడ నుంచి మద్రాసు వరకు ప్రయాణం చేసారు.

2.చెరుకు నుంచి పంచదార తయారు చేసే క్రమంలో , పొరపాటున కూలీల చేతులు మిషన్ లో పడితే పక్కనే మధ్యం , పెద్ద కత్తులు ఉండేవి . చేతులు పడిన వారికి బాగా మధ్యం తాగించి వెంటనే చేతులు నరికేసేవారు. యంత్రాలు ఆగకుండా పని చేయాలని ఇలా చేసేవారట.

3. ఆ రోజుల్లో భారతీయులు ఎవరైనా సముద్ర ప్రయాణం చేసినట్లు అయితే వారి మీద నిషేధం ఉండేదట, కాశీ నుంచి పవిత్ర గంగా జలం తెచ్చి ఏవో పూజలు చేస్తే గాని సమాజంలో కలవనిచ్చే వారు కాదు అంట.

ఈ పుస్తకం ముందుమాటలో తనికెళ్ల భరణి గారు ఇలా అన్నారు

"మన ముత్తాత ఫోటో సంపాదించడమే కష్టం, అలాంటిది‌ రచయిత కృష్ణ తన మూలాల్ని వెతుక్కుంటూ చరిత్ర పుటల్లోకి వెళ్లి ఆఫ్రికాలో తన పాత తరాల గాథను వజ్రాలు మూట కట్టి వీరయ్యగా మలిచారు" . ఈ మాటలు అక్షర సత్యం.ఏడు తరాలు, మా నాయన బాలయ్య పుస్తకాలు తరువాత అలాంటి ఓ మంచి పుస్తకం చదివిన గొప్ప అనుభూతి కలిగింది. ఇలాంటి పుస్తకాలు చదివితే మన తాత ముత్తాతలు ఎలా బతికారో, ఏం చేసారో తెలుసుకోవాలనే తపన మనలో కూడా జనిస్తుంది. 

ఈ పుస్తకం నేను చదువు App లో చదివాను.

- శ్రీనివాస చక్రవర్తి.



Saturday, 21 June 2025

కథ: చెక్క బ్యాట్

 కథ: చెక్క బ్యాట్ 



ఆ రోజు ఉదయం సూర్యుడు ఎప్పటిలాగే మా ఇంటి ఎదురుగా ఉన్న తాటి చెట్లు మీదుగా ఆకాశంలోకి లేచాడు. మా అమ్మ పొయ్యి దగ్గర నిప్పు రాజేయడానికి గొట్టంలో ఊదుతున్నట్లు చప్పుడు వినిపిస్తోంది, పొయ్యి లోంచి పొగ ఇంటి ఆవరణ చుట్టూ నెమ్మదిగా ఆవరించింది. తాటి చెట్టు ఆకుల్లో గుండా సూర్యుని కిరణాలు పొగను చీల్చుకుంటూ నా దేహానికి గోరు వెచ్చగా తాకుతున్నాయి. మరో వైపు రైస్ మిల్లు సూరయ్య బాబాయ్ ఎద్దుల బండి గంటల చప్పుడు మా ఇళ్ళకు చేరువ అవుతున్నట్లు వినిపిస్తోంది. ఆకాశంలో సూర్యుడు, రైస్ మిల్లు సూరయ్య బాబాయ్ ఇద్దరూ మా ఊరి ఉదయానికి స్వాగతం పలుకుతారు. మా ఊరి ప్రత్యేకత గూర్చి మీకో మాట చెప్పాలి. మా ఊరి పొలాలు అంటే తాటి చెట్లు వనమే, ఎటు చూసినా తాటి చెట్లే కనిపిస్తాయి. ఆ గుబురైన తాటి చెట్లు మధ్య మనుషులు కనిపించక నోటితో వేసే పెద్ద ఈలలతో సంభాషణ జరుపుకునే వారు. 

ఆ ఉదయం నా చూపంతా మా ఇంటికి 100 అడుగుల దూరంలో ఉన్న తాటి చెట్లు మధ్య ఉన్న దారి మీదే ఉంది. ఎందరో వస్తున్నారు ఆ తాళ్ళ గుబురు దారిలోంచి , నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తి ఇంకా రావడంలేదు. కొంత సేపటికి నా ఎదురు చూపులకు తెరదించుతూ ఒక రూపం ఆ తాళ్ళ మధ్యలో ఒక చిన్న చుక్కలా ప్రత్యక్షమైంది, కుడి చేయిని నేస్తం భుజం మీద వేసినట్టుగా తన భుజం పైన ఉన్న కర్రబండ మీద వేసి ముందుకు నడుస్తూ వస్తున్నాడా వ్యక్తి. గోధుమ రంగు మందపాటి హాఫ్ బనియన్ తాటి చెట్లు ఎక్కడం వలన అక్కడ అక్కడ చిల్లులు పడి ఉన్నాయి, ఒక నల్లని నిక్కర్ వేసుకుని తాడి చెట్టు ఎక్కే మోకుతో నాన్న ఇంటి వైపు రావడం చూడగానే ఆ క్షణాన నాకు మెడలో నాగరాజును వేసుకున్న సాంబశివుడే ప్రత్యక్షమైనంత ఆనందం కలిగింది .


"నాన్నకు చెప్పు అమ్మా.. నాన్నకు చెప్పు అమ్మ" అని అమ్మ ను అడుగుతున్నాను. అప్పుడే తాడి చెట్ల నుండి కళ్ళు తీసుకొని వచ్చిన నాన్న భుజం మీద ఉన్న చెక్క బండకు తగిలించిన కుండలను నిదానంగా కిందికి దించుతున్నాడు. మోకు విప్పి మోకాళ్ళు, చేతులు కడుగుతూ "ఏంటి అంటా వాడి గోల?" అని అమ్మని అడిగాడు.

"కిటికీలు చేయించడానికి కంసాలి వద్దకు వెళుతున్నారు కదా, ఓసారి వాడిని తీసుకొని వెళ్ళండి" అని అమ్మ చెప్పింది.

"ఎందుకు ?" అని నాన్న నా వైపు చూసి అడిగాడు.

"కిటికీలు చేయగా మిగిలిన చెక్కతో నాకు ఓ బ్యాట్ చేయించు నాన్న" అని అడిగాను.

"సరే చూద్దాం" అని నాన్న చెప్పగానే ఆనందం గుండెల్లో నుంచి తన్నుకుని వచ్చింది.


*****


నాన్న నేను ఇద్దరం సైకిల్ మీద కంసాలి ఇంటికి చేరుకున్నాం..

తెల్లటి బనియన్ , గల్ల లుంగీ వేసుకున్న ఆయన ఒక చేత్తో చక్రాన్ని తిప్పుతూ కొలిమిలో కత్తులను ఎర్రగా కాలుస్తున్నాడు. నాన్నను చూసి ఆయన "ఏం బావా తండ్రి కొడుకులు ఇద్దరూ దారి తప్పి ఇటొచ్చారు ?"

"నీతో పని బడింది బావా" అని నాన్న చెప్పాడు.

"ఏంటి బావా ?" అంటూ ఓ చేతిలో తెల్లని అల్యూమినియం భరణి లోనుంచి ముక్కు పొడుం తీసి పీలుస్తూ ముక్కు మీద జారిపోయిన కళ్ళ అద్దాలను పైకి జరుపుకుంటూ నాన్న వైపు చూసాడు.

"రెండు కిటికీలు చేయాలి బావా, దాని కోసం వేపాకు చెక్కలు తీసుకొని వచ్చాం" అని నాన్న అంటుంటే "దానిదేముంది బావా, రెండు రోజుల్లో చేసేయను" అంటూ పక్కనే పెట్టుకున్న టీ గ్లాసులో టీని అమృతం లాగా ఆస్వాదిస్తూ అన్నాడు. 

"నీ గురించి తెలిసిందేగా బావా, నువ్వు రెండు రోజులు అంటే రెండు నెలలు అనమాట" అని నవ్వుతూ అన్నాడు.

"సర్లే కాని మావోడికి మిగిలిన చెక్కతో ఒక బ్యాట్ అంటా చేసి పెట్టు" అని నా భుజం మీద నాన్న చేయి వేయగానే ఎంతో సంతోష పడిపోయాను‌.

"చేద్దాం బావా.‌. చేద్దాం బావా" అంటూ టీ గ్లాసులో చివరి గుక్కను తాగి "ఏమయ్యా అల్లుడు నీకు ఎంత బ్యాట్ కావాలోయ్ ?, నేను చేస్తానుగా" అంటూ నవ్వుతూ నా వైపు చూసాడు.


*****

నాన్న చెప్పినట్లుగానే రెండు రోజుల్లో కిటికీ తలుపులు పని పూర్తి కాలేదు, రెండు వారాలు పట్టింది. పని పూర్తి కాగానే నాన్న తో నేను కూడా వెళ్ళాను బ్యాట్ ను తెచ్చుకుందాం అని. 

"బావా చూసావా కిటికీలు ఎలా వచ్చాయో ?" చేతిలోని అల్యూమినియం డబ్బాలోని ముక్కు పొడుం తీసి పీలుస్తూ అన్నాడు. 

"మామయ్య మరి నా బ్యాట్ ఎక్కడ ఉంది ?" అంటూ ఆ పరిసర ప్రాంతాల్లో అణువు అణువును శోదిస్తూ అడిగాను.

"అయ్యో అల్లుడు , కిటికీలు చేయగా చెక్క సరిపోలేదే, ఈసారి మంచి చెక్క రాగానే చేసి పెడతాను సరేనా" అంటూ తన చెవిలో ఉన్న పెన్సిల్ తీసి కళ్ళ అద్దాల్లో నుండి తీక్షణంగా చూస్తూ, రెండు పెదాలను చక్రంలా చేసి తను పనిచేస్తున్న చెక్క మీద గుర్తు పెట్టి తిరిగి పెన్సిల్ ను చెవిలో పెడుతూ ఓ చిరు నవ్వు నవ్వాడు. 

నేను: "ఎన్ని రోజులకు మామయ్య ?" 

"ఉగాది పండుగ అయ్యాక అల్లుడు" అని చెప్పాడు.

ప్రతి ఏడాది ఉగాది పండుగ నాడు చేసే పిండి వంటలు, కొత్త బట్టలు కి ఎదురు చూసే నేను ఆ ఏడాది కొత్త బ్యాట్ కోసం ఎదురు చూసాను, కలలు కన్నాను. ఉగాది పండుగ వచ్చింది - వెళ్ళింది. ఓరోజు పొద్దున్నే నేను వెళ్ళాను "మామయ్య బ్యాట్ ?" 

"చేస్తున్నా అల్లుడు.. చేస్తున్నా మొన్ననే మంచి చెక్క వచ్చింది రెండు రోజుల్లో పని అయిపోతుంది." అని సమాధానం ఇచ్చాడు టీ గ్లాసులో వేడి వేడి గా పొగలు చిమ్మే టీ తాగుతూ.


******


ఆ ఏడాది బడికి వేసవి సెలవులు ఇచ్చారు. ఓరోజు సాయంత్రం పిల్లలు అందరం హుషారుగా చేలో‌ చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. నేను గుట్టును దిండులా చేసుకుని నా తలను ఆనించి మాటలు వింటున్నాను, సన్నగా వీచే గాలులకు ఎరుపు, పసుపు పచ్చ రంగులో ఉండే గడ్డి పూలు పరిమళం నా దేహం అంతా ఆవరించింది , ఆకాశంలోకి చూస్తూ కదులుతున్న మేఘాలను ఏనుగులా, కొండల్లా ఊహించుకుంటున్నాను.

"అల్లుడు.. అల్లుడు బ్యాట్ సిద్ధం అయ్యా.." అని దూరం నుంచి పిలుపు వినిపించింది. పరుగెత్తుకుంటూ వెళ్ళి రెండు నిమిషాల్లో ఆయన ముందు వాలాను . " ఏమోయ్, ఆ బల్ల వెనకాల ఓ చెక్క పెట్టాను గానీ ఇటు తీసుకొని రా" అని భార్య కి చెప్పాడు. ఆమె తెచ్చి ముందు పెట్టగానే అది నాకు బ్యాట్ లా కాకుండా చాకులా కనిపించింది. హ్యాండిల్ ను చాకు అంచులా చేసాడు.

"ఎలా ఉంది అల్లుడు బ్యాట్.. చాకు లాంటి బ్యాట్.. కొడితే బంతి తొంబై అడుగుల దూరంలో పడాలి.. ఏమంటారు దాన్ని ఆ.. చిచ్చర్ (Sixer) అంతే" . ఆ బ్యాట్ ను చూసి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయాను, మరలా తేరుకుని ఆయన వైపు చూసి నవ్వుతూ కృతజ్ఞతలు తెలియజేశాను. బ్యాట్ ను తీసుకుని పరుగెత్తుకుంటూ ఇంటి దగ్గర అన్నయ్య వాళ్లు క్రికెట్ ఆడుతుంటే చూపించాను. ఈ చాకు లాంటి బ్యాట్ చూసి అందరూ నవ్వారు. 

"భలే చాకు లాంటి బ్యాట్ రా" అన్నారు . అన్నయ్య నా చేతికి ఓ పది రూపాయలు ఇచ్చి అందరికీ తినడానికి కారం చెక్కలు తీసుకొని రమ్మంటే ఆనందంగా ఆంజనేయులు కొట్టులో తెచ్చి అందరికీ ఇచ్చాను. ఈ బ్యాట్ చేసే performance చూడాలి అనుకున్నాను. ముందుగా ఒకాయన తీసుకొని ఒక షార్ట్ కొట్టాడు బంతి గాల్లోకి లేచింది నేను సిక్సర్ అనుకున్నాను. కానీ అక్కడ అక్కడే పైకి లేచి చేతిలోకి క్యాచ్ వెళ్ళింది, "అబ్బే బ్యాట్ సరిగ్గా లేదు" అంటూ ఆయన నిట్టూర్పు విడిచాడు. ఇద్దరు ముగ్గురు కొట్టడానికి ప్రయత్నించారు కానీ బంతి మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. 

నేను నిరాశ పడ్డాను. చివరికి ముజీబ్ అనే అన్నయ్య వాళ్ల ఫ్రెండ్ ఈ బ్యాట్ ను చూసి "నేను ఆడిచూస్తాను" అని చెప్పి బ్యాటింగ్ కి దిగాడు.

ఆ బ్యాట్ తో లెగ్ సైడ్ లాగి పెట్టి ఒక్క షాట్ కొట్టాడు అంతే బంతి రివ్వున రాకెట్ లాగా రెండు స్టెప్స్ లో బౌండరీ దాటింది. నా బ్యాట్ ను చూసుకున్న నాకు ఆనందం అంబరం అంటింది.

ఆట ముగిసాక బ్యాట్ ను భుజాన వేసుకుని ఇంటికి వస్తుంటే ఆంజనేయ స్వామి చేతిలోకి గద చేరినంత బలం వచ్చింది నాకు ఆపూట.

ఆరోజు రాత్రి బ్యాట్ ను అమ్మ, నాన్నలకు చూపించి ఆనంద పడ్డాను. ఇంట్లో ఉన్న తాటి మట్టతో చేసిన పాత బ్యాట్ లు అన్నీ తీసి బయట పడేశాను, ఇంకా వాటితో అవసరం లేదు అని వాటి ప్లేస్ లో నా కొత్త చెక్క బ్యాట్ వచ్చి చేరింది. 

ఆ రోజు ఆకలి వేయలేదు, నిద్ర రాలేదు ఆ ఆనందానుభూతి కడుపులో ఆకలిని, కంటికి నిద్రను లేకుండా చేసింది.


*****

తెల్లవారుజామున లేచి నా దగ్గర ఉన్న స్కెచ్ పెన్నులతో బ్యాట్ పైన MRF అని రాసి చూసుకొని మురిసిపోయాను. బ్యాట్ చేతిలోకి తీసుకుని సచిన్ టెండూల్కర్ లా ఫీల్ అయ్యాను. అన్నయ్య వాళ్ళు ఈ బ్యాట్ ఆడి చూసారు కానీ బంతి మాత్రం సరిగ్గా వెళ్ళేది కాదు. ఇంకా లాభంలేదు అనుకొని Non Striker వైపు ఉన్న ఆటగాళ్ళు పరుగు తీయడం కోసం, టాస్ వేసుకోవడానికి ఆ బ్యాట్ ను ఉపయోగించే వాళ్ళు. 

నేను ఈ బ్యాట్ ను మా పిల్లలు అందరం కలిసి ఆడేటప్పుడు ఉపయేగించడం మొదలు పెట్టాను. ప్రారంభంలో పెద్దగా బంతిని కొడితే వెళ్ళేది కాదు, మరోవైపు చాకు లాంటి హ్యాండిల్ లాంటి మొన పొట్టలో పొడుచుకుంటుందేమో అని భయం వేసేది. రాయి తీసుకొని ఆ హ్యాండిల్ మొనను అరగదీసాం.

మా ఊరులో DV రావ్ అనే మిత్రుడు ఓ సలహా ఇచ్చాడు "బ్యాట్ బరువుగా ఉండాలి , నీళ్ళలో నాన బెట్టి చూడు.. బరువు తేలుతుంది.. తగిలితే చాలు బంతి బౌండరీలు వైపు పరుగు తీస్తుంది" . తన మాట ప్రకారం మా ఇంటి దగ్గర ఉన్న నీటి తొట్టిలో బ్యాట్ ను వేసాను, అప్పట్లో దూరంగా ఉన్న బేకయ్య బావికాడ నుంచి వాడుకోవడానికి నీళ్లు మోసుకుంటూ తెచ్చే వాళ్ళు అందరూ . మా అమ్మ నేను చేసిన పనికి "ఏరా ఊరంతా ఆ బ్యాట్ ను తిప్పి ఆ దుమ్మంతా తీసుకొచ్చి నీళ్ళలో వేస్తావా.. నీళ్ళ కోసం ఎంత భాద పడుతున్నామో ఒక పక్క చూస్తున్నావు కదా.. నీ పని చెబుతూ ఉండూ.." అంటూ ఏడుపు ముఖం పెట్టి చీపురు కట్ట అందుకో బోయింది. క్షణంలో నీటి తొట్టిలో ఉన్న బ్యాట్ ను తీసి కాళ్ళకు పని చెబుతూ మట్టి రోడ్డు మీద పడ్డాను. అలా మొదలైన ఆ బ్యాట్ ప్రయాణం నాతో ఓ నేస్తంలా సాగింది. వేరే వాళ్ళు ఎవరూ ఆ బ్యాట్ తో పెద్దగా ఆడేవాళ్ళు కాదు. నేను దానితో ఒక పరుగు తీసినా , ఫోర్ కొట్టినా ఎంతో సంతృప్తి పడేవాడిని. 


ఈ బ్యాట్ తో ఓ చేదు సంఘటన కూడా జరిగింది. పగలు రాత్రి తేడా లేకుండా ఆటల్లో మునిగి తేలే వాళ్ళం నేను మా మిత్రులు‌. అలా ఓ రోజు సాయంత్రం మా ఆటను వీధిలో పెట్టాం కరెంట్ స్తంభం మాకు స్టంప్స్, ప్లాస్టిక్ బంతితో ఆట.. బంతి ఎటు వేసినా ఆఫ్ సైడ్ కొట్టాలి , దృష్టి అంతా అటు వైపే.. అనుకోకుండా వెనుక నుంచి మా పెదనాన్న అప్పుడే సరుకులు తీసుకొని ఊరి నుంచి వస్తున్నారు. ఎదురుగా లక్ష్మయ్య అన్నయ్య బంతి వేసాడు, నేను రెచ్చిపోయి రాహుల్ ద్రావిడ్ లా డిప్పకాయ్ షార్ట్ కొడదామని లాగి పెట్టి ఆఫ్ సైడ్ బంతిని బలంగా కొట్టి అంతే వేగంతో బ్యాట్ ను కండువా లా నా ఎడం భుజం వైపు లాగాను..

అంతే "ధన్ మని పెద్ద శబ్దం, అబ్బా.. అని అరుపు" క్షణాల్లో జరిగిపోయింది, పెదనాన్న భుజంకు నా బ్యాట్ తగిలింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ వాళ్ళం అక్కడ కొయ్య బారిపోయాం. ఆ సంఘటన తర్వాత వీధుల్లో ఆడటం తగ్గించాం. ఎక్కడ ఆడినా జాగ్రత్తగా అన్ని వైపులా చూసుకుని ఆడటం మొదలు పెట్టాం...

 

*****

చెక్క బ్యాట్ తో ప్రయాణం అలా సాగుతూ ఉండగా.. కొన్ని రోజులకు మా ఊరుకి నిజాంపట్నం, రేపల్లె నుంచి Ready made బ్యాట్ లు ప్రవేశించాయి. చెక్క బ్యాట్ లు కనుమరుగు అయ్యాయి. నా బ్యాట్ కూడా మూలాన పడింది.

మా నాన్న అన్నయ్య పెళ్ళికి మా పూరి ఇంటిని సరి చేయిస్తూ ఒక తాటి దూలానికి సపోర్ట్ గా ఆ చాకు బ్యాట్ ను రెండు ముక్కలు చేయించి వేశాడు. ఒకప్పుడు ఎన్నో కలలు, పరుగులు, జ్ఞాపకాలు ఇచ్చిన ఆ బ్యాట్, నేడు మా ఇంటి బరువును మోస్తూ ఉంది.


- సమాప్తం 



Saturday, 1 March 2025

పానగల్ పురాతన దేవాలయాల సందర్శన - part1



1.పురాతన కట్టడాలు - విజ్ఞాన భాండాగారాలు:

పురాతన కట్టడాలు మన పూర్వీకులు మనకోసం ఏర్పాటుచేసిన విజ్ఞాన భాండాగారాలు. కొన్ని వందల ఏళ్ళనాడు నిర్మించిన కట్టడాలను చూడబోతున్నామంటే నా మనస్సు ఉత్సాహంగా ఉవ్విళ్ళారుతూ ఉంటుంది. ఎన్నో ప్రకృతి విపత్తులను, ఎన్నో దాడులను తట్టుకొని ఈ రోజు కూడా తన ప్రత్యేకతను చాటుతూ మన ముందు ఇలా నిలబడ్డాయంటే ఆ ఆర్కిటెక్చర్ నిర్మించిన ఆ వ్యక్తులను అక్కడి విశేషాలు పొదిగిన శిల్పులను తలుచుకుంటే ఎంతో ప్రేరణగా అనిపిస్తుంది.


2.హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం:

నల్గొండ వద్ద పురాతన ఆలయాలను సందర్శించడానికి శనివారం ఉదయం ఎంతో ఉత్సాహంగా నేను మా మిత్రులు వీరు, వినయ్ మోహన్ మరియు వాళ్ళ మిత్రుడు దుర్గాప్రసాద్ బేగంపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. శనివారం కావడం వలన చాలామంది స్వస్థలాలు వెళ్లడానికి బేగంపేట స్టేషన్ ఆవరణకు చేరుకుని ఉన్నారు. మా అందరి ఎదురు చూపులుకు తెర దించుతూ రైలు పరుగులు తీసుకుంటూ వచ్చి మా ప్లాట్ఫారం మీద ఆగింది . రైలు కన్నా వేగంగా ప్రయాణికులందరూ సీట్ల కోసం భోగిల్లోకి పరుగులు తీశారు. రైలు బండి కిక్కిరిసిపోయింది. మేము నలుగురం ఓ భోగిలోకి చేరి మాటల్లోకి జారుకున్నాం, అంతకు ముందు సందర్శించిన ప్రదేశాలను, భవిష్యత్తులో సందర్శించబోయే ప్రదేశాలను గూర్చి మాట్లాడుకుంటూ ఉండగా మా రైలు నల్గొండకు 9 గంటల సమయంలో చేరుకుంది . రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు విశాలంగా ఉంది,  అది ఈ మధ్యే కొత్తగా వేసినట్లు తారు వాసన సూచిస్తుంది.  రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వెళ్లే దారిలో ఎక్కడైనా ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని నిర్ణయించుకున్నాం‌. అలా వెళ్లేదారిలో ఒకచోట జనం అందరూ తింటుంటే మేము కూడా ఆ జనంలో కలిసిపోయి మా టిఫిన్ లు మొదలుపెట్టాం. నేను ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూ దుర్గా ప్రసాద్ ని "అసలు మంత్రాలయం యాత్ర ఎలా రెగ్యులర్ గా చేస్తావు , ఆ ప్రయాణం వివరాలు ఏంటి" అని అడిగాను.  తను మంత్రాలయంలో సేవ చేయడానికి  వెళ్తానని. హైదరాబాదులో రాత్రి ట్రైన్ ఎక్కి ఉదయాన్నే మంత్రాలయంలో దిగి ఒక తెప్ప పడవని మాట్లాడుకుని తుంగభద్రా నదిలో స్నానం చేసి, స్వామి వారి దర్శనం చేసుకుని సేవ చేస్తానని తాను చెప్పే విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా అనిపించాయి.


ఈ లోపు మా మిత్రుడు వీరాంజనేయులు ఒక ఆటోని పానగల్లు వెళ్లడానికి సన్నద్ధం చేశాడు. ఆటో నడిపే వ్యక్తి మాతో మాట్లాడుతూ "పానగల్ లో ఊర్లో గుడా  లేదా బయట గుడా ? " అన్నాడు మాకు ఏం అర్థం కాలేదు. "ఛాయా సోమేశ్వరాలయం" అని చెప్పాం "ఓహో బయట గుడా ఎక్కండి " అని మమ్మల్ని తన ఆటోలో ఐదు నిమిషాల్లో అక్కడ దింపాడు. పచ్చని పొలాల మధ్య ఒక ప్రాకారంలో మూడు దేవాలయాలు నిర్మాణం కనిపిస్తుంది .


3. దేవాలయ చరిత్ర - అందమైన కోనేరు: 

పెద్దగా సందర్శకులు తాకిడి లేదు బయట ఏర్పాటు చేసిన బోర్డులో ఆ గుడి యొక్క వివరాలు చదివాము "900 ఏళ్ల క్రితం పానగల్ రాజధానిగా చేసుకుని నల్గొండ ,మహబూబ్ నగర్ పరిపాలించిన కుందూరు చోళులు ఈ దేవాలయం నిర్మించారు" రాసి ఉంది . ఆలయం ఎదురుగా ఓ విశాలమైన కోనేరు అందర్నీ ఆకర్షిస్తుంది. కోనేరు చుట్టూ ఉన్న పచ్చని చెట్లు వరుసగా బారులు తీరు ఆ కోనేరు అందాలను చూస్తున్నట్లుగా ఉన్నాయి. రెండు పాదాలను నీటి లో ఉంచి మెట్లపైన కూర్చున్నాం. కోనేరులో చిన్న చిన్న చేపలు మన కాళ్ల దగ్గరగా వచ్చినట్లు వచ్చి వెళ్తున్నాయి , కొంచెం సేపు అలా కూర్చుని ఆ చేపలను ,కోనేటి నీటిని , చుట్టూ ఉన్న చెట్లను గమనిస్తూ ఆ ప్రశాంత వాతావరణంలో మనసులో మునకలేశాము.

 "ఇప్పుడు ఎండ బాగా ఉంది సాయంత్రం పూట అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అనుకుంటా" అని వీరు అన్నాడు.  


4.దేవాలయ సందర్శన - కనిపించన వింత నీడ :


కొంచెం సేపటికి దేవాలయం వైపు మా అడుగులు పడ్డాయి ప్రాకారం లోనికి ప్రవేశించాము. అక్కడ ఉన్న ఉపాలయాలు మీద పేర్లు రాసి ఉన్నాయి. "వీరభద్ర స్వామి",  "నటరాజ్ స్వామి" అని ఒక్కొక్క పేరు దుర్గాప్రసాద్, వినయ్ చదువుతున్నారు. ఆ గుళ్ళు లోపలికి వెళ్లి చూస్తే దేవత మూర్తులు లేరు . శివరాత్రి పండుగ దగ్గరగా ఉండటం వలన అక్కడ గుడి దగ్గర లైటింగ్ మరియు ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నారు దేవాలయం వారు.


మేము ఆలయంలోకి ప్రవేశించాం. దర్శనంకు వచ్చిన వారు చాలా తక్కువ ఉన్నారు. ఎంతో ఉత్కంఠంగా గర్భాలయంలోకి చూసాము. ముందుగా స్వామి వారిని చక్కగా చూసాము.

తరువాత స్థల విశేషం గుర్తు వచ్చింది. ఆశ్చర్యం!!  నీడ జాడ ఎక్కడ కనిపించడం లేదు.

ఛాయా సోమేశ్వర నీడ ఎక్కడ?

లోపల గర్భ గుడిలో నలుగురు అభిషేకం చేస్తున్నారు గర్భాలయంలో లింగం కిందికి ఉన్నట్లుగా కనిపించింది.  నేను గర్భగుడిలో గోడలను తీక్షణంగా చూస్తున్నాను నీడ ఎక్కడని.

వినయ్ "ఛాయ ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

నాకు కొంచం నిరాశ అనిపించింది, వీళ్ళని ఇంత దూరం ఈ గుడికి ప్రత్యేకత ఉందని తీసుకొచ్చాను,  తీరా చూస్తే ఆ ఛాయ కనిపించడం లేదు ఏమైందబ్బా, అంతకుముందు నా జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటి సినిమా రిల్ లాగా కళ్ళ ముందు క్షణాల్లో మెదిలాయి. 

1. బీదర్లో ఓ గుహలో నీటిలో నడుచుకుంటా వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చని మిత్రులను తీసుకెళ్లి అలాంటి దర్శనం ఆ సమయంలో లేదంటే ఎంతో నిరాశ చెందిన ఘటన.


2. హంపి వెళ్ళినప్పుడు "సంగీతం పలికించే స్తంభాలు ఇప్పుడు తాకనివ్వడం లేదు ,కేవలం దూరం నుంచి చూడడం వరకే , వినే భాగ్యం లేదు ‌. భావితరాల కోసం వాటిని ఇప్పుడు తాకనివ్వడం లేదు" అని గైడ్ చెప్పిన సందర్భం..

ఇలాంటి ఘటనలు గుర్తొచ్చి మరోసారి అలాంటిదేదో పునరావృతం కాబోతుందని మనసులో  నిరాశగా అనిపించింది .


5.చివరికి కనిపించిన నీడ - ఆనందానుభూతి:

అప్పుడు మనసులో ఒక ఆలోచన ఒక లైట్ లాగా వెలిగింది అదే గర్భగుడిలో లైట్ తీసేస్తే మనం నీడ చూడొచ్చు ఏమో అన్న చిన్న ఆశ. అభిషేకం అయ్యాక పూజ చేసే పూజారి గారిని అడుగుదాం అనుకున్నాము. ఆయన రాగానే అడిగాను చాయను చూడగలమా అని , ఆయన క్షణాల్లో గర్భాలయంలోని లైట్ ని ఆఫ్ చేశారు. అప్పుడు చూసాము ఆ అద్భుతాన్ని సరిగ్గా స్కేల్ తో కొలిసి మరీ కొట్టినట్లుగా ఉన్న నల్లటి స్తంభం నీడ స్థిరంగా శివలింగం మీద కనిపించింది . ఆ దృశ్యం చూడగానే మా కళ్ళల్లో ఆకాశంలో మెరుపు మెరిసినట్లుగా ఆనంద ఆశ్చర్యాలతో కాంతి వచ్చి చేరింది. 1000 సంవత్సరాలైనా నీడలో మార్పు లేదు ఇది ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనం అని అనుకుని ఆ శిల్పులకు మనసులో నమస్సులు అందించాము.


6.అందమైన సూక్ష్మ శిల్పాలు - విశేషాలు:



గర్భాలయం ఎదురుగా ఉన దర్వాజా మీద అందమైన శిల్పాలను చెక్కారు, ముఖ్యంగా లతా శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి . ఒక్కసారి తలపైకెత్తి చూశాను అక్కడ ఒక పుష్పం అందంగా వికసించినట్లుగా రేకులను సుకుమారంగా ఉన్నట్లు సీలింగ్ పైన చెక్కారు.


భక్తులు తక్కువగా ఉన్నారని మా మిత్రులు వినయ్ ,దుర్గాప్రసాద్ బయటికి వెళ్లి అభిషేకం సామాగ్రి తెచ్చారు . మేము కూడా మా చేతులతో ఆ స్వామిని అభిషేకించి విభూదిని నుదుటన ధరించి ఆయన ఆశీస్సులు పొందాము. 


గర్భాలయం ఎదురుగా ఉన్న ఒక మండపం మీద స్థంభాలు నల్లటి రాతి మీద చిన్న చిన్న శిల్పాలను చాలా చక్కగా చెక్కారు శిల్పులు. అందులో కొన్ని ఘట్టాలు సీతమ్మవారు అశోకవనంలో కూర్చుని ఉన్నట్లుగా, మరొక ఘట్టంలో రామయ్య మాయ లేడికి బాణం వేస్తున్నట్లుగా ఆ బాణం తగిలి అందులోంచి మరీచుడు బయటికి వస్తున్నట్లుగా చెక్కిన శిల్పాలు నన్ను విశేషంగా ఆకర్షించాయి. ఆలయంలో నెమ్మదిగా సందర్శకులు పెరిగారు దేవాలయ పూజారి ఆలయ విశిష్టతను చూడండి అని లైట్ ఆఫ్ చేసి సరిగ్గా లింగం వెనుక మీద పడుతున్న నీడని చూపిస్తున్నారు. ఒకప్పుడు అసలు ఈ నీడ ఏ స్తంభం నీడ అని చాలా ప్రయోగాలు జరిగాయి అట. సూర్యుని గమనం మారుతున్న ఈ నీడ స్థానం మాత్రం మారదు , సరిగ్గా లింగం పైనే స్థిరంగా నీడ ఉంటుంది అదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అందుకని ఈయన ఛాయా సోమేశ్వరుడు అయ్యారు. కొంచెం సేపు శిల్పాలని మరికొంత సేపు ఆ విశిష్టమైన నీడని చూస్తూ అలా ఒక ప్రపంచంలో ఉండగా. వీరు మాటలు వినపడ్డాయి "మనం ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి" అని. తేరుకుని ఈ లోకంలోకి వచ్చాను. 


7.ఆలయం బయిట - హృదయ విదారక దృశ్యం:

ఆలయం చుట్టూ గమనిద్దామని బయటకు వెళ్లాము. అక్కడ ఉన్న ఆత్మలింగానికి మరియు పక్కనే ఉన్న పుట్టకి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్తుంటే ఒక బాధాకరమైన దృశ్యం కనిపించింది, అవే పూర్తిగా శిథిలమై ధ్వంసం కావించబడినట్లుగా ఉన్న కొన్ని నందులు . "ఇవి దాడి గురి అయిన నందులు అనుకుంటా" అని నేను అన్నాను. మా మిత్రుడు వీరు "అవి శిల్పులు చెక్కేటప్పుడు కొన్ని అనుకున్న విధంగా రావు కదా ఆ నందులు"  అయ్యి ఉండొచ్చని చెప్పాడు. ఏమైనాప్పటికీ వాటిని ఆ స్థితిలో చూసినప్పుడు మనసు తరుక్కుపోయింది. 


8.ఆకర్షించే రెండు అంతస్తుల మండపం , బుజ్జి శివలింగం :



ముందుకు కదిలాము స్వాగత ద్వారాలు గాలిగోపురం బదులుగా ఇక్కడ మండపాలు లాంటి వాటిని ఏర్పాటు చేశారు. గుడి వెనుక ఏర్పాటు చేసిన రెండంతస్తుల మండప ప్రవేశ ద్వారం ప్రత్యేకంగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక బుజ్జి శివలింగం పచ్చని గడ్డి మధ్యలో అందరిని ఆకర్షిస్తూ కనిపించింది. ఓ పసిపాప లాగా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది ఆ చిన్ని శివలింగం.


మేము నలుగురం అ శివలింగం దగ్గర ధ్యానం చేస్తునట్లుగా కొన్ని ఫోటోలు దిగాము. అక్కడ పచ్చికలో కూర్చుని వినయ్ అందిస్తున్న కొబ్బరి ముక్కలు తింటూ దేవాలయం పైకప్పులను గమనించాము.  మూడు గోపుర శిఖరాలు పిరమిడ్ ఆకారాలలో ప్రత్యేకంగా మల్చినట్లు కనిపిస్తున్నాయి . గుడి చుట్టూ గోడల్ని గమనించాము ఏనుగులు బార్లు తీరినట్లుగా శిల్పాలను చెక్కారు. 


9.దేవలయ సందర్శన పూర్తి: 

మరోసారి ఛాయా సోమేశ్వర స్వామికి మనసులో నమస్కరించుకుని దేవాలయం బయట కోనేరు దగ్గరకు తిరిగి చేరుకున్నాం. ఒక వైపు ఎండ వేడిమికి బాతులు కోనేరులో చేరి ఈత కొడుతున్నాయి. మరోవైపు అప్పుడే పెళ్లి కాబోతున్న కొత్తజంట అనుకుంటా డ్రోన్ కెమెరాకి ఫోజులిస్తూ కోనేరు దగ్గర ఫోటోలు దిగుతున్నారు. దేవాలయం వారు ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయి వద్ద నీరు తాగి మరో దేవాలయం వైపు బయలుదేరాము. దుర్గాప్రసాద్ అన్నాడు "పచ్చని చేల మధ్య ఎంతో అందంగా ఉంది ఈ గుడి అని" వెను తిరిగి చూసాను మూడు తెల్లని ముద్దు కర్పూరాలు ఆ ఎండలో పచ్చని చేల మధ్య ప్రకాశిస్తున్నట్లుగా వాటి మీద ఓ కాషాయం రంగు జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ కనిపించింది.


ఇప్పుడు మా అడుగులు పచ్చల సోమేశ్వర దేవాలయం వైపు వేగంగా పడుతున్నాయి. 


ఆ ఛాయా సోమేశ్వర నీడని ఈ వీడియోలో చూడవచ్చు:


(ఇంకా ఉంది)