గత 15 సంవత్సరాల నుండి హైదరాబాద్ పుస్తకాలు పండుగ సందర్శిస్తున్నాను , ప్రతి సారి ఏదో కొత్త లోకంలోనికి అడుగు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆదివారం మధ్యాహ్నం 02:30 గంటలకు పుస్తకాలు పండుగ జరిగే ప్రదేశం చేరుకున్నాను, పుస్తక పరిమళాలతో ఆహ్వానం పలుకుతున్న ప్రాంగణానికి పుస్తక ప్రియులు అందరూ జ్ఞానకాంక్షతో వరుసగా బారులు తీరారు.నేను నేరుగా తెలుగు కలెక్టివ్ స్టాల్ కి వెళ్ళాను, ఈ జుట్టు సభ్యులు యువతకు తెలుగు సాహిత్యం పరిచయం చేయడానికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వీరు సూచించే పుస్తకాలు ఎంతో బాగుంటాయి. ఈ స్టాల్ లో వీరు చదివి బాగా నచ్చిన పుస్తకాలు పెడతారు. ఎవరైనా తెలుగు సాహిత్యంలో ముందుగా ఎలాంటి పుస్తకాలతో మొదలు పెట్టాలి అంటే వీరు మనకు మంచి పుస్తకాలు సూచిస్తారు. అందుకే ముందుగా ఈ స్టాల్ సందర్శనతో మొదలు పెట్టాను నా ప్రయాణం 5 పాటు గంటలు సాగింది.. వివిధ స్టాల్స్ లో తిరిగి ఈ క్రింది పుస్తకాలు సేకరించాను.
1.కథ 2024 : కథా సాహితీ వారు 2024 సంవత్సరంలో అనేక వార, మాస అంతర్జాల పత్రికలు, పుస్తకాలులో వచ్చిన సుమారు 3000 కథలు చదివి అత్యుత్తమ కథలను కూర్చిన సంకలనం ఈ పుస్తకం . వీరు గత 35 సంవత్సరాలుగా ప్రతి ఏడాది నిరంతరయంగా ఇలా పుస్తకాలను తీసుకుని వస్తున్నారు. ప్రస్తుత సమాజం,మనిషి జీవితాలు సృజించే విధంగా ఉంటాయి కథలు. ప్రస్తుతం కథ 2034 అందుబాటులో ఉంది- విశాలాంధ్ర, నవోదయ స్టాల్స్ లో దొరుకుతుంది.2.ఈస్తటిక్ కథలు 2025: మానవ జీవితాన్ని స్పృశించే ఆలోచన రేకెత్తించే కథలు , ఖమ్మం ఈస్తటిక్ వారు ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు . నేను మొట్ట మొదటి సారి ఈ కథ సంకలనం చదవబోతున్నాను.- బాల పబ్లిషర్స్ స్టాల్ లో అందుబాటులో ఉంది3.గ్రామ దేవత : మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామ దేవతలు ఎవరు, వారి వెనుక ఉన్న కథలు ఏంటి అని పరిశోధన చేసి రాసిన గ్రంథం స్త్రీని స్వయం శక్తి అంటాం. భారతదేశంలో స్త్రీ పూజింపబడుతుంది. ఆ పూజింపబడడానికి కారణాలని వెతుకుతూ గ్రామ దేవతల యొక్క ప్రాముఖ్యతను వారికి ఉన్న ప్రాచుర్యాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణమే ఈ గ్రామదేవత పుస్తకం.- అజు పబ్లికేషన్ స్టాల్*4.తెలుగు కథ 1998* : పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు 1998 సంవత్సరంలో ఎన్నో కథలను పరిశీలించి ఆ ఏడాది వచ్చిన అత్యుత్తమ కథలును ఈ పుస్తకం గా తీసుకుని వచ్చారు.. ఎందరో ప్రముఖ రచయితల కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో, ముఖ్యంగా గోపిని కరుణాకర్ గారి "దుత్తలో చందమామ" కథ చదువుదాం అని ఈ పుస్తకం ఎంచుకున్నాను.- సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్*5.తరతరాల తెలుగు జాతి చరిత్ర:* ఈ పుస్తకంలో మన తెలుగు జాతి చరిత్ర - సంస్కృతి విశేషాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ,అందమైన బొమ్మలు రూపంలో పొందుపరిచారు .చూడంగానే చాలా నచ్చింది నాకు.- సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్ లో ఉంది*6.మల్లాది రామకృష్ణశాస్త్రి నవలలు:* ప్రతి ఏడాది పుస్తకాలు చదివే వ్యక్తులను ఓ మంచి పుస్తకం సూచించమని అడుగుతుంటాను, ఈ ఏడాది పుస్తక ప్రియులు, FB వాడ్రేవు కుటుంబ గ్రూప్ నిర్వాహకులు, పుస్తకాలు చదవాలని ప్రోత్సాహించే కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారు సూచించిన పుస్తకం మల్లాది వారి "కృష్ణాతీరం" పుస్తకం ఎంచుకున్నాను, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని వచనంలో మేస్త్రి అంటారు అంటా చదివి చూడాలి.- గోదావరి ప్రచురణలు ,నవోదయBook House స్టాల్స్.7.కలవపూడి కథలు : అజు పబ్లికేషన్ వారి బాల్య జ్ఞాపకాలను, పుట్టి పెరిగిన ఊరు సంగతులు గుర్తు చేసే "గాజులు సంచి" పుస్తకం చాలా బాగా నచ్చింది, అలాంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే ఆ స్టాల్ లో పుస్తకాలను పరిచయం చేసే వ్యక్తి ఈ పుస్తకం నా చేతిలో పెట్టారు.- అజు పబ్లికేషన్ స్టాల్8.చలం - బిడ్డల శిక్షణ: అశ్వ శ్రీనివాస్ అన్నయ్య, పిల్లలు పెంపకం గురించి పుస్తకాలు లిస్ట్ ఒకసారి సూచించారు, అందులో ఈ పుస్తకం ఉంది.. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల తండ్రిని అయిన నేను పిల్లలు పెంపకం గూర్చి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.- నవోదయ book house stall9.నల్లమల - ఎర్రమల దారుల్లో: యాత్ర ప్రేమికులు, చరిత్రను అధ్యయనం చేసి చక్కగా చెప్పే పరవస్తు లోకేశ్వర్ గారి యాత్ర పుస్తకం, అనేక చారిత్రక మరియు ప్రముఖ దేవాలయ విశేషాలు ఇందులో ఉన్నాయి. లోకేశ్వర్ గారు స్టాల్ ఉన్నారు, పుస్తకం పైన సంతకం చేసారు.10. అభినిర్యాణం : కాల్పనిక సాహిత్యం - అడ్వెంచర్ థ్రిల్లర్ఒక కాలేజి విద్యార్థి తమిళనాడు లోని అనంత పద్మనాభస్వామి దేవాలయం సందర్శించడానికి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న నేలమాళిగను తెరిచే తాళం చెవి దొరికే మార్గం తెలుసుకుంటాడు.. అతను చేసిన సాహస ప్రయాణమే ఈ పుస్తకం. పురాతన దేవాలయాలు అంటే ఆసక్తి ఉన్న నాకు ఈ పుస్తకం గురించి తెలుగు కలెక్టివ్ టీం చెప్పిన రివ్యూ ఆధారంగా ఈ పుస్తకం గురించి తెలిసింది.-పుస్తకం తెలుగు కలెక్టివ్ మరియు గోదావరి ప్రచురణలు స్టాల్స్ అందుబాటులో ఉంది.11.మైరావణ: ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన పుస్తకం. రచయిత ఈ పుస్తకంలో జానపద కథానాయకుడు మైరావణుడు ఆధారంగా బెస్త జీవితాలు, తరాల చరిత్రని రాశారంట.. ఏడు తరాలు, వీరయ్య లాంటి పుస్తకాలు చదివాక తరాల్లో వచ్చిన జీవన విధానం గురించి తెలుసుకోవాలని ఈ పుస్తకం ఎంచుకున్నాను.- తెలుగు కలెక్టివ్, ఛాయా పబ్లిషర్స్ స్టాల్స్..12. తెలుగు ప్రపంచ మహాసభలు - లఘు గ్రంథాలు : 2012 లో జరిగిన తెలుగు మహాసభలు భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మన తెలుగు వారికి ముఖ్యంగా యువత కోసం అనేక చిన్న పుస్తకాలు మన దేవాలయాలు, మన కథలు, మన ఆహారం, పర్యాటకం, జానపదం ఇలా అనేక అంశాలు తో చిరు పుస్తకాలు తెచ్చారు. ఒక్కో పుస్తకం 20 రూపాయలు- సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్ లో ఉన్నాయి.పుస్తకాలు అన్నీ తీసుకున్నాక సమావేశాలు జరిగే వేదిక వద్దకు వెళ్ళాను "పుస్తక స్పూర్తి" అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి రోజూ రాత్రి 07:00 నుంచి 09:00 వరకు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు ప్రముఖులు తమకు స్పూర్తిని నింపిన పుస్తకాలు రైలు బడి, కన్యాశుల్కం, ఓల్గా రచనలు మరియు ఆంధ్రులు సాంఘీక చరిత్ర ఏవిధంగా ప్రభావితం చేసాయో అద్భుతంగా చెప్పారు. పుస్తక స్పూర్తి నేరుగా వినడం చాలా బాగా అనిపించింది.రాత్రి 09:00 గంటలకు షాపులు అన్నీ మూసివేశారు. బయిటకు వచ్చాను. చలికి వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది. రెండు బజ్జీలు తిని ఇంటికి మాడుగుల(ధర చాలా ఎక్కువ)హల్వా పట్టుకొని బయిలుదేరాను,
పుస్తకాలు తో ఇంటికి మనసు నిండిన ఆనందం.- శ్రీనివాస చక్రవర్తి.
No comments:
Post a Comment