నవంబర్ నేను చదివిన ఓ పుస్తకం: కథ 2020
ఈ ఏడాది నేను మొదటిసారి కథా సాహితీ వారి కథ - 2023 పుస్తకం చదివాను.. 2023 అన్ని పత్రికల్లో వచ్చిన సుమారు 2000 కథలు నుంచి ఏరి కూర్చిన మంచి కథలు సంకలనం ఆ పుస్తకం. ఈ పుస్తకం చదివాక పాత సంచికలు ఏమైనా దొరుకుతాయని నెట్లో వెతికాను. అప్పుడు నాకు కథ - 2020 పుస్తకం కనపడింది. 2020 అంటే కోవిడ్ మహామ్మారితోప్రపంచం సంక్షోభం ఎదుర్కొన్న సంవత్సరం. ఆ సంవత్సరంలో కథలు ఎలా ఉంటాయో చదువుదామనిపించింది వెంటనే ఆర్డర్ చేశాను.ఈ పుస్తకంలో నాకు నచ్చిన కథలు :1.ఊరికే పోవాలి - అద్దేపల్లి ప్రభు: కరోనా లాక్ డౌన్ వలన ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి . పొట్టకూటి కోసం వలస వచ్చిన ఎంతోమంది వలస కార్మికులు జీవితాలు చేయడానికి పని లేక తింటానికి తిండి లేక అతలాకుతలం అవుతాయి. పోనీ సొంత ఊరికి వెళ్దామంటే అన్ని మార్గాలు బంద్ అయిపోతాయి. అలాంటి సమయంలో కొంతమంది కాలినడకని నమ్ముకొని కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి బయలుదేరుతారు. అలా బయలుదేరిన కొంతమంది వలస కార్మికుల కథే "ఊరికే పోవాలి". నడిచి వెళ్లే దారిలో తినటానికి తిండి లేక తాగడానికి నీరు లేక ఎన్ని అవస్థలు పడ్డారో తీసుకోవాలంటే మనం ఈ కథ చదవాలి.2.మళ్ళీ తేయాకు తోటల్లో కి: కుప్పిలి పద్మ గారు ఈ కథని ఎంతో బాగా రాశారు. అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి. అక్కడ కూలీలకు 5 నెలలు తేయాకు తెంపే పని ఉంటుంది. మిగతా సమయంలో పనికోసం ఇతర రాష్ట్రాలకు వలస వస్తారు, అలా గోవింద్ అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ కు పని కోసం వస్తారు. గోవింద్ భార్య కమ్లినీ చిన్న పాపతో అస్సాం కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. దేశం అంతా లాక్ డౌన్.. కోవిడ్ లక్షణాలు వలన గోవింద్ ను క్వారంటైన్ కి తరలిస్తారు, అదే సమయంలో వీరి పాపను ఒక విషపురగు కుడుతుంది.. కొన ఊపిరితో పాప, వేల మైళ్ళ దూరంలో భర్త.. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పద్మగారి రచన శైలి చాలా బాగుంది.3.అప్పగింతలు - కె వి రమణారావు : ముగ్గురు అన్నదమ్ములు చిన్నకారు రైతులు వారికి ఓ ప్రియమైన చిన్న చెల్లి .. వర్షాధారం పంటలు వలన వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆస్తులు పంపకాలు తరువాత ఎవరి జీవనం వారిది అవుతుంది.. చెల్లి పెళ్ళి చేయడం, చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ భారం అయినట్టు వారికి అనిపించిడం వలన పరిష్కారం కోసం ఓ పెద్దాయన దగ్గరకు వెళతారు, కథలో చివరి ఘట్టం మనల్ని కదిలించి వేస్తుంది..4.సెకండ్ ఛాన్స్ - మృణాళిని:అమెరికా లో ఓ రెస్టారెంట్. అందులో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఆప్యాయంగా పలకరిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా పని చేసే స్టాఫ్.. విశేషం ఏంటంటే అక్కడ స్టాఫ్ అందరూ నేర చరిత్ర ఉన్నవారే.. జీవితంలో సెకండ్ ఛాన్స్ ఉందని ఆశాభావంతో పని చేస్తున్నవారు.. వీరిని చూసాక కథానాయిక కి తన చిన్నప్పుడు జీవితంలో జరిగిన సంఘటన గుర్తు వస్తుంది. తన అన్న ఓ తప్పు వలన ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు.. అతను ఎన్నో సార్లు కుటుంబంతో కలవాలని ప్రయత్నిస్తాడు కానీ అవకాశం ఇవ్వరు.. ఈ రెస్టారెంట్ లో జీవితం లో దొరికిన మరో అవకాశంలో అద్భుతంగా జీవిస్తున్న వారి ప్రభావం వలన కథానాయికకు ఓసారి మళ్ళీ అన్నయ్యతో మాట్లాడాలని, కలవాలని తపించి పోతుంది.. వేకువ ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.అనుబంధంగా ఇచ్చిన తమిళ తెలుగు రచయిత కి. రాజనారయణ్ గారి "తలుపు" కథ - చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకొని వెళుతునే , చివరి ఘట్టం హృదయాన్ని కదిలిస్తుంది.స.వెం రమేష్ గారు పరిచయం చేసిన తెన్నాడు తెలుగు చాలా బాగుంది.పాత కథా సాహితీ పుస్తకాలు చదవాలని ఎదురు చూస్తున్నా.. మొన్న విజయవాడలో ప్రాచిన గ్రంథమాల కి వెళ్ళాను కానీ దొరికలేదు.హైదరాబాద్ పుస్తకాల పండుగలో ఈ ఏడాది రాబోయే కథ - 2024 మరియు పాత సంకలనాల కోసం ఎదురు చూస్తున్నాను.- శ్రీనివాస చక్రవర్తి.

No comments:
Post a Comment