Monday, 16 February 2026

శివరాత్రి పాట - 2026

మా అన్నయ్య వాళ్ళు AI సాయంతో పాటలకు tunes కడుతూ మంచి మంచి పాటలు Youtube ఛానల్ లో పెడుతుంటే నేను కూడా ప్రయత్నం చేద్దామని.. శివరాత్రి సందర్భంగా ఓ పాట రాసి Suno AI కి చక్కటి సంగీతం ఇచ్చింది. ఈ పాట రాత్రి పూట 12:00 నుంచి 03:30 వరకు రాసాను.
ఆ రాత్రంతా శివ నామస్మరణ నా మనస్సు , దేహంలో ప్రతి కణం చేస్తున్న భావం కలిగింది. ఉదయం మా ఆవిడ లేచాక వినిపించాను. చాలా బాగుంది అని తను చెప్పింది. వెంటనే తన Youtube Channel లో పాటను Upload చేసాము.

పాట వినడానికి: 


Lyrics:
ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..
శివ శివ శంకర కరుణాసాగర దయాకరా..
హర హర శంకర సాంబ సదాశివ పరమేశ్వరా..

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..

హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 

నే గొప్పంటే నే గొప్పని బ్రహ్మ–విష్ణువుకు అంతరం కలిగి..
ఆ అంతరాన్ని అంతం చేయాలని 
ఆది–అంతం వెదకమని..
కోటి కాంతుల తేజంతో లింగోద్భవ రూపంగా వెలిసిన.. 
ఆది అంతం లేని అనంతమూర్తి నీవే శివయ్య ..
హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

వరాహమై విష్ణువు పాతాళలోతుకు వెళ్లెను.. హంసరూపమై బ్రహ్మ ఆకాశమార్గం ఎగిరెను.. ఎంత వెతికినా అంతు చిక్కని మహిమ నీవే.. అనంతరూప.. పరమశివుడివే
హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..


అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికె..
పుట్టిన గరళంతో లోకాలన్నీ గజగజ వణికె..
ప్రళయకాలమున కాలకూటాన్ని కంఠమున ధరించె..
ఆపదలో నేనున్నానని చాటిన లోకరక్షకా నీలకంఠా..

హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 


గంగకోసమై భగీరథుని కఠిన తపమును మెచ్చి..
అఖండ ప్రవాహ గంగను జటాజూటమున ధరించి..
దివి నుంచి భువికి దింపి పుడమిని పావనం చేసి..
గంగాధరుడిగా మారిన కరుణాసాగరుడివే శంకర..
హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..
శివ శివ శంకర కరుణాసాగర దయాకరా..
హర హర శంకర సాంబ సదాశివ పరమేశ్వరా.. ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..

హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

Sunday, 1 February 2026

నా జీవితం నల్లేరు మీద బండి

 నా జీవితం నల్లేరు మీద బండి - సాకం నాగరాజు. ఒక పుస్తక ప్రేమికుని ఆత్మకథ



"ఒకసారి ఈ పుస్తకం చదవడం మొదలుపెడితే అదే మనల్ని చదివించుకుంటూ ముందుకు తీసుకు పోతుంది, అంత బాగా రాశారు"  అని గల్లా అరుణకుమారి గారు ముందు మాటలో చెప్పినట్లే ఉంది ఈ పుస్తక పఠనం.


పుస్తకాలు అంటే అంతులేని అభిమానం ఉన్న వ్యక్తి . ఒక యజ్ఞం లాగా ఎందరో బడి చిన్నారులకు ,పెద్దలకు పుస్తకాలు అందించి సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడానికి కృషి చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను.


"బాల్యం అనేది మీకైనా నాకైనా అది ఒక చలమ తవ్వే కొద్ది ఊరుతూనే ఉంటుంది" అంటూ నాగరాజు గారు బాల్య జ్ఞాపకాలని మన ముందు పరిచారు. 


ఆహా ఏమి రుచి: 

"ఓ రోజు మా అవ్వతో పాటు మా మిరప తోట దాకా వెళ్లాను. పొలానికి గాని అడవికి గాని వెళ్తే ఆకలి ఎక్కువగా అవుతుంది. అప్పుడు తిన్న అన్నం భలే రుచి. దీన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నో సార్లు పొలానికి/అడవికి వెళ్లాను". 

పుస్తకంలో ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మా అమ్మ నాన్నలకు ఉడత సాయం చేయడానికి నేను కూడా చిన్నప్పుడు మా పొలం వెళుతుండేవాడిని. అప్పుడు పచ్చడితో కలిపిన ముద్దలు తిన్న ఎంతో రుచిగా ఉండేవి. ఇదే విషయం మా నాన్నకు చెప్తే ఇక్కడున్న ప్రదేశంలో చల్లని తాడి చెట్లు నీడ, గాలి, పనిచేసి అలసిపోవడం వలన ఈ వాతావరణంలో నీకు తిన్నది బాగా రుచిగా అనిపిస్తుంది అని చెప్పారు.  నాగరాజు గారు చెప్పిన ఈ సంఘటన నా బాల్యంలోకి తీసుకెళ్ళింది.


డబ్బు అత్యాశ - గుణపాఠం: 

చిన్నప్పుడు నాగరాజు గారి ఇంట్లో డబ్బులు కోసం చిరు దొంగతనాలు చేసేవారట. అప్పుడు ఆ డబ్బులు చూసిన ఇద్దరు మిత్రులు "నీ వద్ద ఉన్న డబ్బును ఇంకా ఎన్నో రెట్లు డబ్బుగా చేస్తాము" అని ఆశ చూపించి పొలం తీసుకుని వెళ్తారు . అక్కడ ఒక గుంత తవ్వి ఆ గొంతులో ఈ ధనాన్ని పూడ్చిపెట్టి ఇలా చెప్తారు "మూడు రోజుల్లో ఈ గుంతలో డబ్బు చెట్టు మొలుస్తుంది. తర్వాత ఆ చెట్టు రోజు డబ్బు కాస్తుంది, కాకపోతే మూడు రోజుల వరకు మనం ఈ చోటికి రాకూడదు అదే నియమం" . ఆరోజు రాత్రి నాగరాజు గారికి నిద్ర పట్టలేదట ఉదయాన్నే లేచి గుంత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే.. ఆశ్చర్యం.. ఆ గుంత తవ్వేసి ఖాళీగా ఉంది. ఈ సంఘటన తనకి ఓ గొప్ప గుణపాఠం అంటారు ఆయన, దీని ద్వారా ఆయన ఎప్పుడు కూడా డబ్బు గూర్చి అత్యాశకు పోయి చీటీలు, స్కీం లాంటివాడి కట్టలేదట.

ఇలా ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉమ్మడి కుటుంబం, తను చేసిన చిరు దొంగతనాలు, అవ్వ చేతి ముద్ద.. ఈ పుస్తకంలో పంచుకున్నారు..


విద్యార్థి దశలోని నాయకుడిగా పనిచేసారు ఒకోసారి చదువులో వెనక పడుతున్నానని ఆలోచన కూడా ఉండేది. చదువు పూర్తికాగానే హైదరాబాద్లో బృందావన్ హోటల్లో ఐదు సంవత్సరాలు పాటు పనిచేశారు,‌తరువాత తెలుగు అధ్యాపకుడిగా ప్రయాణం మొదలు పెడతారు.


అధ్యాపకునిగా మొదటి తరగతి: 

నాగరాజు గారి మాటల్లో"నా మొదటి క్లాసు డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు శ్రీ శ్రీ ప్రతిజ్ఞ పాఠం చెప్పాను, గీతాన్ని లైన్ తర్వాత లైను నాటికియంగా చదివాను, అంతే క్లాస్ అయ్యాక ఒక అమ్మాయి దేవుడా ఇతనా మా తెలుగు లెక్చరర్ కర్మ ..కర్మ.. అంది. ఆరోజు నుంచి క్లాస్ కి భయంగా ప్రిపేర్ అయ్యేవాడిని , ఒకసారి క్లాస్ కి సరిగ్గా ప్రిపేర్ కాలేదు. తరగతికి వెళ్లి అభాసు పాలయ్యే బదులు సెలవు చీటీ తీసుకొని ప్రిన్సిపాల్ గారికి ఇస్తే.. "కాలేజీకి వచ్చి సెలవు చీటీ ఇవ్వడానికి సమయం ఉంది కానీ గంట సేపు పాఠం చెప్పలేవా" అని అన్నారట..

30 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఇలా ఎన్నో విషయాల్ని నిజాయితీగా ఇలా పంచుకున్నారు. 


మిత్రులు చెప్పిన మాటలు: 

1."ఏ పని లేకపోతే అది మిట్ట మధ్యాహ్నం అయినా పడి తిరుగుతూ వుండు, ఖాళీగా మాత్రం ఉండకు పగటిపూట పడుకోకు" ఇది వజ్రం లాంటి మాట అంటారు నాగరాజు గారు. 

ఆయన అలాగే పాటించి కాలికి బంగారం కట్టుకుని తిరిగారట.


2."కాలేజీ ,బజారు, ఫంక్షన్ కి ముస్తాబయి ఎంత నీటుగా ఉంటామో ఇంట్లోనూ మనం ఆ రీతిగా శుభ్రంగా ఉండాలి.. భార్య బిడ్డలు ముందు కూడా" . నిజంగా ఇది ఎంతో అమూల్యమైన మాట కదా..


పాఠాలు ఆసక్తి కలిగించడానికి: 

పాఠాలు చెబుతున్నప్పుడు ఉపోద్ఘాతాలతో తాను చేసిన ప్రయోగాలను వివరంగా చెప్పారు ముఖ్యంగా శాకుంతలోపాఖ్యానం , ద్రౌపదిపరివేదనను ఉదాహరణ ద్వారా బాగా చెప్పారు. సందులు , చందస్సు ,అలంకారాలు లాంటి వాటిని నిజ జీవితాలకి కనెక్ట్ చేసి ఆయన చెప్పిన వివరణ చాలా బాగుంది.  ఇందులో ఆయన చెప్పిన సూచనలు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 


తెలుగు భాషొద్యమ సమితి ద్వారా ఎన్నో పుస్తకాలు, ఎందరికో కవులకు ప్రోత్సాహం: 

"2001వ సంవత్సరం నామినితో పరిచయం ద్వారా నా జీవితాన్ని పుస్తకం వైపు మలుపు తిప్పింది" అని చెబుతారు. 

పెళ్లి, పుట్టినరోజు ,మరణం, గృహప్రవేశం.. సందర్భం ఏదైనా వ్యక్తుల పేరు మీద తీసుకు వచ్చిన పుస్తక సంకలనాలు , కొత్త పాఠకులు కావడానికి సాధనం అయ్యాయట. వేలాది మందికి సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించాయి. "నా చేతుల మీదగా 50 పుస్తకాలు ప్రతీది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ" అంటున్నారు.


పుస్తకాలు అచ్చు వేయడం ఒక ఎత్తైతే వాటిని పాఠకులకు చేర్చడం మరో ఎత్తు "స్కూటర్ బండిమీద పెట్టుకొని స్కూళ్లకు తిరిగి..  చిన్నారులకు , పాఠకులకు పుస్తకం గురించి చెప్పాలి.. ఇదో పుస్తక యజ్ఞం". 


పెళ్లి పత్రిక తో పాటు ఓ కథ : 

నాగరాజు గారి మాటల్లో "నేను పాపా నాయుడు పేట కాలేజ్ లో పనిచేసేటప్పుడు క్లాసులో శంకరంమంచి గారి కథ 'అంపకం' చదివి వినిపించాను ఆ కథ విన్నాక ఆడపిల్లల కంట్లో తడి చూశాను" . ఆ కంటి తడే ఎందరి పెళ్లి పత్రికల్లో అనుబంధం అయింది. పెళ్లి పత్రిక కవర్ లో ఆహ్వాన పత్రిక మరియు 'అంపకం' కథారాజం  రెండు వచ్చాయి.. 


అసలు ఎందుకు నాగరాజు గారు ఎన్నో పుస్తకాలు ప్రచురించీ, ఎందరికో పంచుతున్నారంటే ఆయన మాటల్లో "డిగ్రీలో నేను చదివిన ఆ తొలి పుస్తకాలే నా దొంగ బుద్ధిని మార్చి జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పాయి.. పుస్తకదానం సమాజంలో ఒక వ్యక్తిగా నా కనీస బాధ్యత, అందుకోసమే ఈ తాపత్రయం.."


ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి:

"తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని కథలు చదవమనండి రాయమనండి ఒక పుస్తకం కొనుక్కొని సొంత గ్రంథాలయానికి శ్రీకారం చుట్టుమనండి, ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి" ఇవి పుస్తకంలోని చివరి మాటలు..


127 పేజీల ఈ చిరు పుస్తకంలో సాకం నాగరాజు గారు తన జీవిత అనుభవాలన్నీ మన ముందు ఎంతో నిజాయితీగా కళ్ళ కట్టినట్లుగా చెప్పారు. ముందుమాటలో తాడి ప్రకాష్ గారు అన్నట్లుగా "ఊరుకో నాగరాజు వుంటే బావుణ్ణు"..


పుస్తకాభిమాని నాగరాజు గారు ఈ పుస్తకంలో సందర్భానికి తగ్గట్లుగా పేర్కొన్న కొన్ని పుస్తకాలు.

1. శ్రీశ్రీ మహాప్రస్థానం : విద్యార్థిగా ఉన్నప్పుడు తనకు ఒక కొత్త చూపుని ఈ కవిత్వం ఇచ్చిందని ఆయన చెప్పారు. 

2. దిగంబర కవిత్వం: డిగ్రీ చదువుతున్నప్పుడు లైబ్రరీ నుంచి తీసుకున్న ఈ పుస్తకాన్ని ఓ రాత్రంతా కూర్చుని చదివారట. 

3. తిక్కన భారతం: డిగ్రీ లో చదివిన పుస్తకం ఇందులో ఘట్టాలు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారట.. 

4. స్వీట్ హోమ్:  నాగరాజు గారు పంచిన పుస్తకాలను చదివి ఓ యువతి ఇలా రాశారట. పెళ్లయిన స్త్రీ స్వీట్ హోమ్ చదివితే "అరెరే మనం బుచ్చిబాబు లాంటి భర్తను మిస్సయ్యామే అని నొచ్చుకుంటుంది", పెళ్లి కాని అమ్మాయి చదివితే "మనకు బుచ్చిబాబు లాంటి అబ్బాయి వస్తే బాగుంటుంద"ని ఆశపడుతుంది.

5. కన్యాశుల్కం : రావిశాస్త్రి గారు ఈ పుస్తకాన్ని "మానవమాత్రుల మాత్రం రాసింది కాదు, దేవతలు రాసింది ఈ పుస్తకం" అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని నాగరాజు గారు తమ కూతురికి చదివి వినిపించేవారట.

6. తెలుగు కథకు జేజే: తెలుగు కథల కథా సంకలనం "నిండు పళ్ళబుట్ట" అని అనేక పత్రికలు ప్రశంసలు కురిపించాయి.

7. యేసోపు కథలు: కవితలు లాంటి కథలు పిల్లల పుస్తకం మరియు పెద్దల పుస్తకం. 

8. మిట్టూరోడి పుస్తకం: మాండలికానికి గుడి కట్టిన పుస్తకం. 9.దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఆత్మకథ : చిత్రాకారులు బాపు మెచ్చిన జీవితకథ


నేను నాగరాజు గారికి "నా జీవితం నల్లేరు మీద బండి" పుస్తకం పంపమని మెసేజ్ చేసాను. సార్ నాకు మరిన్ని పుస్తకాలు కూడా పోస్ట్ లో పంపారు. 


పుస్తకం కోసం 94403 31016 సంప్రదించవచ్చు.


- శ్రీనివాస చక్రవర్తి.

Monday, 26 January 2026

వలస పుస్తకం

 వలస - ఈ ఏడాది నేను చదివిన తొలి నవల



"పిల్ల జాగ్రత్తమ్మ.. పిల్లల తరువాతే ఏదైనా .."

ఓ తండ్రి చెప్పిన మాట..

"తల్లిదండ్రులు కొంతవరకే వస్తారు, పిల్లలు కొంత దూరం మనతో నడిచి వేరే దారి పడతారు. కలిసి ఉండేది భార్యాభర్తలిద్దరే.. ఆ అమ్మాయి నీకోసం ఇంత దూరం వస్తుంది, జాగ్రత్తగా చూసుకో" ఓ తల్లి పెళ్లి కాబోతున్న తన కొడుకుతో అన్న మాటలు ఇవి..

తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం విధంగా తపిస్తారో ఈ పుస్తకం ద్వారా రచయిత సుస్మితా గారు చాలా బాగా చెప్పారు. 

జీవితంలో ఓ మంచి స్థాయికి ఎదగాలని ఎన్నో కలలు కని అమెరికా వలస వెళ్ళిన NRI ల జీవిత కథలు ఇవి. ఏకబిగిన చదివించే విధంగా ఉంది పుస్తకం..

ఈ పుస్తకం నేను FB group వాడ్రేవు సాహిత్య కుటుంబం సభ్యులు కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారి ద్వారా అందుకోవడం జరిగింది. మా ఇంటికి బుక్ పోస్ట్ రాగానే ఆసక్తిగా కవర్ తెరిచి చూసాను. నా సతీమణి ఈ పుస్తకం కవర్ పేజ్ మరియు టైటిల్ చూసి ఆపకుండా రెండు గంటలు ఏకధాటిగా చదివించింది. రాత్రి భోజనం సమయంలో కథ ఏంటి అని తనను అడిగాను. "ఇందులో ఒక కథ కాదు నాలుగైదు కథలు ఒకేసారి నడుస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది రచన శైలి " అని తను చెప్పింది. గత 5 రోజులు ప్రతి రోజూ ఉదయం ఓ రెండు గంటలు పాటు పుస్తకం చదివాను. అద్భుతమైన రచనా శైలి. చదవడం పూర్తి అయ్యాక మనసు భారం అయ్యింది.

చివర్లో ఈ లైన్ చదువుతుంటే మనసు ఏదో లాగా అయిపోయింది. 

"ఇల్లు ఖాళీ అయిపోయింది. అనుభవిస్తామని ఒక్కో వస్తువు తెచ్చి పేర్చుకున్న ఇల్లు, ఒక్కో సదుపాయంగా తీర్చుకున్న ఇల్లు, ఒక్కో అనుభవం.. నువ్వు, ఏడుపూ.. అన్నిటికీ సాక్ష్యమైన ఇల్లు ఖాళీ అయిపోయింది.." 

ఈ పుస్తకంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సవాళ్ళను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా అమ్మలు పిల్లలు గురించి పడే తపన చిన్న పిల్లలు తిండి విషయం నుంచి యుక్త వయస్సు, పెళ్ళి , వారి పిల్లలకు కాన్పులు చేసి చూసుకోవడం... పిల్లల పెంపకంలో ఒక్కో భాగంలో ఒక్కో సవాల్.. అన్నీటిని తల్లిదండ్రులు ఎంత ఓర్పుగా నిర్వహిస్తారో చక్కగా వివరించారు. పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తల్లితండ్రులుకి మనం ఎంత ఋణపడి ఉన్నామో కదా అనిపిస్తుంది.

ఈ పుస్తకం చదివాక హర్షణీయం Podcast లో సుస్మితా గారి Interview విన్నాను. ఆమె గత 30 సంవత్సరాలు తన చుట్టూ జరిగిన అనేక విశేషాలను పరిశీలించి ఈ పుస్తక రూపంలో రాశారు అంటా. ముఖ్యంగా ఈ పుస్తకంలో సంభాషణలు చాలా బాగున్నాయి. సుస్మితా గారు సంభాషణలు గురించి మాట్లాడుతూ "పుస్తకం రాసే క్రమంలో సంభాషణలు రాసాక ఒక గదిలో కూర్చుని వాటిని పైకి చదివి చూసేవారట.. నోరు తిరగకపోయిన, గొంతులో ఆయాసం లాంటిది అనిపించినా ఆ సంభాషణలను సవరించారట"

వలస పుస్తకం గురించి Interview link https://open.spotify.com/episode/5PGKeH5YdpqHbNACpoJR0E?si=nHrm2o3fQ02tbkKDPEYxlQ&t=2852&ct=2852

ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి చదవమని  ప్రోత్సహించిన కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారికి మరోసారి ధన్యవాదాలు.


- శ్రీనివాస చక్రవర్తి.

Saturday, 3 January 2026

ఈస్తటిక్స్ కథలు - 2025

 ఈస్తటిక్స్ కథలు - 2025 



ఈ ఏడాది నా పుస్తక పఠనం ఖమ్మం ఈస్తటిక్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు సంకలనంతో ప్రారంభించాను. ప్రతి కథ కూడా ఒక మంచి ఆలోచన నుంచి పుట్టిన అద్భుతమైన సృజన. ప్రకృతి పట్ల, స్త్రీలు , మూఢాచారాలు, విపత్తులు, శ్రమ జీవనం, మానవుని అత్యాశ ఇలా అనేక అంశాలను ఈ కథల్లో చాలా బాగా సృజించారు రచయితలు. 

ఇందులో నాకు బాగా నచ్చిన కొన్ని కథలు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.

1.కావలి : అనగనగా భీమప్ప అనే రైతు ఆయనకు సుమారు 60-70 ఏళ్ళ వయసు.ఓ రోజు రాత్రి భీమప్ప శెనగ చేనుకు కాపలా కాయడానికి వరుసకి అల్లుడు అయిన వ్యక్తితో వెళ్తారు.. రాత్రి వంతుల వారీగా చేనుకు కాపలా కాయడానికి ఇద్దరూ సిద్ధం అవుతారు. ఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో మెరుపులు ఆ వెలుతురులో దూరాన పది మంది యువకులు మద్యం మత్తులో ఓ స్త్రీని బలాత్కారం చేయబోతుంటారు వారిని ఎదుర్కొనేందుకు భీమప్ప చేసిన అద్భుతమైన పోరాటమే ఈ కథ. కథలో సంభాషణలు చాలా అద్భుతంగా రాశారు రచయిత.

2.శివుడాజ్ఞ: అది ప్రసిద్ధి చెందిన పాలేశ్వర దేవాలయం ఒక పక్క పారే ఏరు, దాని చుట్టు పక్కల అనేక గ్రామాలు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి జనసందోహంతో నిండిపోయి ఉంటుంది ఆ గుడి.కానీ ఈ ఏడాది అలా లేదు కారణం మానవుడు చేసిన ఓ తప్పిదం వలన ఏరు పొంగి వరద ముంపునకు గురి అవుతుంది. ఆ ఉధృతికి పశువులు కట్టేసిన కట్టుకొయ్యల వద్దే చనిపోతాయి. వరద నుంచి బయట పడిన ఒకామె చివరి క్షణంలో ఇంటిలో ఉన్న బంగారం విషయం గుర్తుకు వచ్చి బీరువా వద్దకు వెళ్ళేసరికి వరద క్షణాల్లో ముంచెత్తడం వలన బీరువా గడి పట్టుకొనే ప్రాణాలు కోల్పోతుంది. అనేకమంది ఆ వరద ధాటికి మృత్యువాత పడతారు.. గుడిలో శివలింగం కూడా ఆ వరదలో కొట్టుకు పోతుంది. ఆ ప్రాంతం నుంచి సౌదీలో చెక్క పనికి వెళ్ళిన ఒక హిందూ- ఒక ముస్లిం మిత్రులు వరద మరియు కొట్టుకుపోయిన శివ లింగం విషయం తెలుసుకొని దేవాలయం కోసం అక్కడ నుంచి వారు ఒక భారీ చెక్క శివలింగాన్ని దీక్షతో తయారు చేసి తీసుకొని వస్తారు.  అక్కడ కొంతమంది ప్రజలు ఒక ముస్లిం చేసిన శివ లింగాన్ని అంగీకరించరు. తరువాత ఏం జరిగింది ? ఇంతకీ మానవుడు చేసిన ఏ తప్పిదం వలన వరద వచ్చింది ? కథకు కీలకమైన "శివుడు ఆజ్ఞ" ఏంటో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే..

3.అంజమ్మ : ఈరోజుల్లో మానవుడు అత్యాశతో అడవులను ఆక్రమించడం వలన అడువుల్లో ఉండే జంతు జాలానికి నివాస యోగ్యమైన చోటు దొరకడం లేదు‌, ఫలితంగా అవి ఊరులు మీదకు వస్తున్నాయి. అత్యాశతో అడవులను నాశనం చేయడంతో ప్రకృతి లో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి అంశాన్ని తీసుకుని రచయిత అంజమ్మ అనే కోతితో ఓ మంచి కథ రాశారు. అంజమ్మకి కూడా తన తోటి వారిలాగా పిల్లలు కనాలని ఉంటుంది కానీ మానవుడు చేసిన ఓ పని వలన తనకు పిల్లలు పుట్టే యోగ్యం ఉండదు. ఇంతకీ మనిషి ఏం చేసాడు, ఆ విషయం అంజమ్మ కి ఎలా తెలిసింది? ప్రకృతి జీవజాలం సమతుల్యత యెక్క ప్రాముఖ్యత ఏంటి  అనే విషయాలు ఈ కథ చదివితే మనకు బాగా తెలుస్తాయి.

4.భాగ్యలక్ష్మి : అనగనగా ఒక అడవి ప్రాంతం అక్కడ తరతరాలుగా వస్తున్న ఓ ఆచారం బాలింతలు, నెలసరి వచ్చిన స్త్రీలు ఇంటిలో ఉండరాదు.. ఊరికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన కుటీరం (క్వారంటైన్) లో ఉండాలి. దాని వలన స్త్రీలు ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు.. దానికి తోడు ఊరు పెద్ద అండతో ఆడవారిని లైంగిక హింస చేసే మానవ మృగాలు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన చూసి భాగ్యలక్ష్మి అనే వనిత కదిలిపోతుంది.. ఇంతకీ ఆ సంఘటన ఏంటి.. తరతరాలుగా వస్తున్న మూఢాచారాలు రూపుమాపలనే భాగ్యలక్ష్మి ప్రయత్నం ఫలించిందా అనేది అసలు కథ.

5.ఓ నల్ల హంస కథ : ప్రకృతిని, చుట్టు పక్కల ఉండే వాతావరణాన్ని ఆరాధించే స్త్రీ "సహజ". తనకు ప్రతీదీ ప్రకృతి సిద్ధంగా జరగాలి అని ఆకాంక్ష. తన కూతురుని కూడా అలాగే ప్రకృతిలో పెంచుతుంది. Good touch - Bad touch.. ఇతరులతో ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఓరోజు యుక్త వయసు వచ్చిన కూతురు తో మాట్లాడుతూ ఉండగా "నీకు ఎవరైనా ఇష్టమా" అని అడుగుతుంది. అప్పుడు కూతురు తన క్లాస్మేట్ గాయత్రి అంటే ఆకర్షణ కలుగుతుంది అని చెబుతుంది.. ప్రతీదీ ప్రకృతికి అనుగుణంగా జరగాలని కోరుకునే సహజ కూతురు చెప్పిన విషయాన్ని స్వీకరిస్తుందా.. ఇంతకీ హంస ఎవరూ అనేది మనం తెలుసుకోవాల్సిన అసలు కథ‌.

6.మూడో నేత్రం : కొత్తగా పెళ్ళి అయిన జంట తొలి మూడు నెలలు సరదాగా ఆనందంగా గడిచిపోతాయి. పెళ్లి సెలవులు తరువాత భర్త కువైట్ వెళతాడు ‌. ప్రతి రోజూ ప్రతి క్షణం భార్యను చూడాలని ఇంట్లో ఒక CC కెమెరా ఏర్పాటు చేస్తాడు.. అక్కడి నుంచి జరిగే పరిణామాలే ఈ కథ..

ఇలా సాగే ఈస్తటిక్స్ కథలు అన్ని కూడా చాలా బాగున్నాయి. సాహిత్యం అంటే కేవలం కాలక్షేపానికి కాదు మనిషిని ఆలోచింపజేసేది, సమాజాన్ని చెతన్యవంతం చేసేది అనే విధంగా ఈ కథ సంకలనాన్ని  సంపాదకులు తీర్చిదిద్దారు. 

- శ్రీనివాస చక్రవర్తి.