ఈస్తటిక్స్ కథలు - 2025
ఈ ఏడాది నా పుస్తక పఠనం ఖమ్మం ఈస్తటిక్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు సంకలనంతో ప్రారంభించాను. ప్రతి కథ కూడా ఒక మంచి ఆలోచన నుంచి పుట్టిన అద్భుతమైన సృజన. ప్రకృతి పట్ల, స్త్రీలు , మూఢాచారాలు, విపత్తులు, శ్రమ జీవనం, మానవుని అత్యాశ ఇలా అనేక అంశాలను ఈ కథల్లో చాలా బాగా సృజించారు రచయితలు.
ఇందులో నాకు బాగా నచ్చిన కొన్ని కథలు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1.కావలి : అనగనగా భీమప్ప అనే రైతు ఆయనకు సుమారు 60-70 ఏళ్ళ వయసు.ఓ రోజు రాత్రి భీమప్ప శెనగ చేనుకు కాపలా కాయడానికి వరుసకి అల్లుడు అయిన వ్యక్తితో వెళ్తారు.. రాత్రి వంతుల వారీగా చేనుకు కాపలా కాయడానికి ఇద్దరూ సిద్ధం అవుతారు. ఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో మెరుపులు ఆ వెలుతురులో దూరాన పది మంది యువకులు మద్యం మత్తులో ఓ స్త్రీని బలాత్కారం చేయబోతుంటారు వారిని ఎదుర్కొనేందుకు భీమప్ప చేసిన అద్భుతమైన పోరాటమే ఈ కథ. కథలో సంభాషణలు చాలా అద్భుతంగా రాశారు రచయిత.
2.శివుడాజ్ఞ: అది ప్రసిద్ధి చెందిన పాలేశ్వర దేవాలయం ఒక పక్క పారే ఏరు, దాని చుట్టు పక్కల అనేక గ్రామాలు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి జనసందోహంతో నిండిపోయి ఉంటుంది ఆ గుడి.కానీ ఈ ఏడాది అలా లేదు కారణం మానవుడు చేసిన ఓ తప్పిదం వలన ఏరు పొంగి వరద ముంపునకు గురి అవుతుంది. ఆ ఉధృతికి పశువులు కట్టేసిన కట్టుకొయ్యల వద్దే చనిపోతాయి. వరద నుంచి బయట పడిన ఒకామె చివరి క్షణంలో ఇంటిలో ఉన్న బంగారం విషయం గుర్తుకు వచ్చి బీరువా వద్దకు వెళ్ళేసరికి వరద క్షణాల్లో ముంచెత్తడం వలన బీరువా గడి పట్టుకొనే ప్రాణాలు కోల్పోతుంది. అనేకమంది ఆ వరద ధాటికి మృత్యువాత పడతారు.. గుడిలో శివలింగం కూడా ఆ వరదలో కొట్టుకు పోతుంది. ఆ ప్రాంతం నుంచి సౌదీలో చెక్క పనికి వెళ్ళిన ఒక హిందూ- ఒక ముస్లిం మిత్రులు వరద మరియు కొట్టుకుపోయిన శివ లింగం విషయం తెలుసుకొని దేవాలయం కోసం అక్కడ నుంచి వారు ఒక భారీ చెక్క శివలింగాన్ని దీక్షతో తయారు చేసి తీసుకొని వస్తారు. అక్కడ కొంతమంది ప్రజలు ఒక ముస్లిం చేసిన శివ లింగాన్ని అంగీకరించరు. తరువాత ఏం జరిగింది ? ఇంతకీ మానవుడు చేసిన ఏ తప్పిదం వలన వరద వచ్చింది ? కథకు కీలకమైన "శివుడు ఆజ్ఞ" ఏంటో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే..
3.అంజమ్మ : ఈరోజుల్లో మానవుడు అత్యాశతో అడవులను ఆక్రమించడం వలన అడువుల్లో ఉండే జంతు జాలానికి నివాస యోగ్యమైన చోటు దొరకడం లేదు, ఫలితంగా అవి ఊరులు మీదకు వస్తున్నాయి. అత్యాశతో అడవులను నాశనం చేయడంతో ప్రకృతి లో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి అంశాన్ని తీసుకుని రచయిత అంజమ్మ అనే కోతితో ఓ మంచి కథ రాశారు. అంజమ్మకి కూడా తన తోటి వారిలాగా పిల్లలు కనాలని ఉంటుంది కానీ మానవుడు చేసిన ఓ పని వలన తనకు పిల్లలు పుట్టే యోగ్యం ఉండదు. ఇంతకీ మనిషి ఏం చేసాడు, ఆ విషయం అంజమ్మ కి ఎలా తెలిసింది? ప్రకృతి జీవజాలం సమతుల్యత యెక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కథ చదివితే మనకు బాగా తెలుస్తాయి.
4.భాగ్యలక్ష్మి : అనగనగా ఒక అడవి ప్రాంతం అక్కడ తరతరాలుగా వస్తున్న ఓ ఆచారం బాలింతలు, నెలసరి వచ్చిన స్త్రీలు ఇంటిలో ఉండరాదు.. ఊరికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన కుటీరం (క్వారంటైన్) లో ఉండాలి. దాని వలన స్త్రీలు ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు.. దానికి తోడు ఊరు పెద్ద అండతో ఆడవారిని లైంగిక హింస చేసే మానవ మృగాలు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన చూసి భాగ్యలక్ష్మి అనే వనిత కదిలిపోతుంది.. ఇంతకీ ఆ సంఘటన ఏంటి.. తరతరాలుగా వస్తున్న మూఢాచారాలు రూపుమాపలనే భాగ్యలక్ష్మి ప్రయత్నం ఫలించిందా అనేది అసలు కథ.
5.ఓ నల్ల హంస కథ : ప్రకృతిని, చుట్టు పక్కల ఉండే వాతావరణాన్ని ఆరాధించే స్త్రీ "సహజ". తనకు ప్రతీదీ ప్రకృతి సిద్ధంగా జరగాలి అని ఆకాంక్ష. తన కూతురుని కూడా అలాగే ప్రకృతిలో పెంచుతుంది. Good touch - Bad touch.. ఇతరులతో ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఓరోజు యుక్త వయసు వచ్చిన కూతురు తో మాట్లాడుతూ ఉండగా "నీకు ఎవరైనా ఇష్టమా" అని అడుగుతుంది. అప్పుడు కూతురు తన క్లాస్మేట్ గాయత్రి అంటే ఆకర్షణ కలుగుతుంది అని చెబుతుంది.. ప్రతీదీ ప్రకృతికి అనుగుణంగా జరగాలని కోరుకునే సహజ కూతురు చెప్పిన విషయాన్ని స్వీకరిస్తుందా.. ఇంతకీ హంస ఎవరూ అనేది మనం తెలుసుకోవాల్సిన అసలు కథ.
6.మూడో నేత్రం : కొత్తగా పెళ్ళి అయిన జంట తొలి మూడు నెలలు సరదాగా ఆనందంగా గడిచిపోతాయి. పెళ్లి సెలవులు తరువాత భర్త కువైట్ వెళతాడు . ప్రతి రోజూ ప్రతి క్షణం భార్యను చూడాలని ఇంట్లో ఒక CC కెమెరా ఏర్పాటు చేస్తాడు.. అక్కడి నుంచి జరిగే పరిణామాలే ఈ కథ..
ఇలా సాగే ఈస్తటిక్స్ కథలు అన్ని కూడా చాలా బాగున్నాయి. సాహిత్యం అంటే కేవలం కాలక్షేపానికి కాదు మనిషిని ఆలోచింపజేసేది, సమాజాన్ని చెతన్యవంతం చేసేది అనే విధంగా ఈ కథ సంకలనాన్ని సంపాదకులు తీర్చిదిద్దారు.
- శ్రీనివాస చక్రవర్తి.

No comments:
Post a Comment