Thursday, 11 September 2025

పుస్తకం : వీరయ్య

 ఆగష్టు నెలలో చదివిన ఓ మంచి పుస్తకం : వీరయ్య





 ఈ పుస్తకం చదువుతుంటే నాకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ తో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మని అడుగుతూ ఉండేవాడిని  "అమ్మమ్మ నువ్వు గాంధీగారిని చూసావా, బ్రిటిష్ వారిని చూసావా అని . మా అమ్మమ్మ అప్పటి విశేషాలు చెప్పేది.సరిగ్గా అలాంటి విశేషాలనే ఈ వీరయ్య పుస్తకంలో మనం చూడవచ్చు. బ్రిటిష్ కాలం నాటి మన భారత ప్రజల జీవన విధానం. కొంతమంది భారతీయులు పొట్టకూటికోసం ఆఫ్రికా చెరుకు తోటలో కూలీలుగా చేరి అక్కడ బానిసల్లా పడిన కష్టాలు, అప్పటి వాతావరణం, మానవ బంధాలు కళ్ళకు కట్టినట్లు రాశారు రచయిత కృష్ణ.పుస్తకం చదువుతుంటే మనం కూడా వీరయ్యతో  విజయవాడ నుంచి మద్రాసు వరకు రైలులో ప్రయాణం చేసి అక్కడ నుంచి దక్షిణ ఆఫ్రికాకు ఓడలో ప్రయాణం అవుతాం. అక్కడి చెరుకు తోటల్లో, పంచదార కర్మాగారాల్లో విహరిస్తాం . మన భారతీయ కూలీలు పడిన కష్టాలు చూసి చలించిపోతాం. దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల కోసం గాంధీ గారి చేసిన ఉద్యమం చూస్తాం.వీరయ్య బతుకు తెరువు కోసం దక్షిణాఫ్రికా లో సాధారణ కూలీగా మొదలై సర్దార్ గా మారిన విధానం చదివి ప్రేరణ పొందుతాం.వీరయ్య గారు 30 సంవత్సరాల తరువాత తమ కుటుంబ సభ్యులను భారత్ లో కలవాలని పడే ఆరాటంలో మనం కూడా భాగం అవుతాం.కొన్ని సంఘటనలు వింతగా అనిపించాయి.1. అప్పట్లో రైలులో 4 వ తరగతి ఉండేది, కూలీలు కోసం. అందులో కింద కూర్చుని ప్రయాణం చేసేవారు. వీరయ్య తోటి కూలీలతో కలిసి రైలులో ఇలా విజయవాడ నుంచి మద్రాసు వరకు ప్రయాణం చేసారు.2.చెరుకు నుంచి పంచదార తయారు చేసే క్రమంలో , పొరపాటున కూలీల చేతులు మిషన్ లో పడితే పక్కనే మధ్యం , పెద్ద కత్తులు ఉండేవి . చేతులు పడిన వారికి బాగా మధ్యం తాగించి వెంటనే చేతులు నరికేసేవారు. యంత్రాలు ఆగకుండా పని చేయాలని ఇలా చేసేవారట.3. ఆ రోజుల్లో భారతీయులు ఎవరైనా సముద్ర ప్రయాణం చేసినట్లు అయితే వారి మీద నిషేధం ఉండేదట, కాశీ నుంచి పవిత్ర గంగా జలం తెచ్చి ఏవో పూజలు చేస్తే గాని సమాజంలో కలవనిచ్చే వారు కాదు అంట.ఈ పుస్తకం ముందుమాటలో తనికెళ్ల భరణి గారు ఇలా అన్నారు"మన ముత్తాత ఫోటో సంపాదించడమే కష్టం, అలాంటిది‌ రచయిత కృష్ణ తన మూలాల్ని వెతుక్కుంటూ చరిత్ర పుటల్లోకి వెళ్లి ఆఫ్రికాలో  తన పాత తరాల గాథను వజ్రాలు మూట కట్టి వీరయ్యగా మలిచారు" . ఈ మాటలు అక్షర సత్యం.ఏడు తరాలు, మా నాయన బాలయ్య పుస్తకాలు తరువాత అలాంటి ఓ మంచి పుస్తకం చదివిన గొప్ప అనుభూతి కలిగింది. ఇలాంటి పుస్తకాలు చదివితే మన తాత ముత్తాతలు ఎలా బతికారో,  ఏం చేసారో తెలుసుకోవాలనే తపన మనలో కూడా జనిస్తుంది.ఈ పుస్తకం నేను చదువు App లో చదివాను.- శ్రీనివాస చక్రవర్తి.

No comments:

Post a Comment