వలస - ఈ ఏడాది నేను చదివిన తొలి నవల
"పిల్ల జాగ్రత్తమ్మ.. పిల్లల తరువాతే ఏదైనా .."
ఓ తండ్రి చెప్పిన మాట..
"తల్లిదండ్రులు కొంతవరకే వస్తారు, పిల్లలు కొంత దూరం మనతో నడిచి వేరే దారి పడతారు. కలిసి ఉండేది భార్యాభర్తలిద్దరే.. ఆ అమ్మాయి నీకోసం ఇంత దూరం వస్తుంది, జాగ్రత్తగా చూసుకో" ఓ తల్లి పెళ్లి కాబోతున్న తన కొడుకుతో అన్న మాటలు ఇవి..
తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం విధంగా తపిస్తారో ఈ పుస్తకం ద్వారా రచయిత సుస్మితా గారు చాలా బాగా చెప్పారు.
జీవితంలో ఓ మంచి స్థాయికి ఎదగాలని ఎన్నో కలలు కని అమెరికా వలస వెళ్ళిన NRI ల జీవిత కథలు ఇవి. ఏకబిగిన చదివించే విధంగా ఉంది పుస్తకం..
ఈ పుస్తకం నేను FB group వాడ్రేవు సాహిత్య కుటుంబం సభ్యులు కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారి ద్వారా అందుకోవడం జరిగింది. మా ఇంటికి బుక్ పోస్ట్ రాగానే ఆసక్తిగా కవర్ తెరిచి చూసాను. నా సతీమణి ఈ పుస్తకం కవర్ పేజ్ మరియు టైటిల్ చూసి ఆపకుండా రెండు గంటలు ఏకధాటిగా చదివించింది. రాత్రి భోజనం సమయంలో కథ ఏంటి అని తనను అడిగాను. "ఇందులో ఒక కథ కాదు నాలుగైదు కథలు ఒకేసారి నడుస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది రచన శైలి " అని తను చెప్పింది. గత 5 రోజులు ప్రతి రోజూ ఉదయం ఓ రెండు గంటలు పాటు పుస్తకం చదివాను. అద్భుతమైన రచనా శైలి. చదవడం పూర్తి అయ్యాక మనసు భారం అయ్యింది.
చివర్లో ఈ లైన్ చదువుతుంటే మనసు ఏదో లాగా అయిపోయింది.
"ఇల్లు ఖాళీ అయిపోయింది. అనుభవిస్తామని ఒక్కో వస్తువు తెచ్చి పేర్చుకున్న ఇల్లు, ఒక్కో సదుపాయంగా తీర్చుకున్న ఇల్లు, ఒక్కో అనుభవం.. నువ్వు, ఏడుపూ.. అన్నిటికీ సాక్ష్యమైన ఇల్లు ఖాళీ అయిపోయింది.."
ఈ పుస్తకంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సవాళ్ళను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా అమ్మలు పిల్లలు గురించి పడే తపన చిన్న పిల్లలు తిండి విషయం నుంచి యుక్త వయస్సు, పెళ్ళి , వారి పిల్లలకు కాన్పులు చేసి చూసుకోవడం... పిల్లల పెంపకంలో ఒక్కో భాగంలో ఒక్కో సవాల్.. అన్నీటిని తల్లిదండ్రులు ఎంత ఓర్పుగా నిర్వహిస్తారో చక్కగా వివరించారు. పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తల్లితండ్రులుకి మనం ఎంత ఋణపడి ఉన్నామో కదా అనిపిస్తుంది.
ఈ పుస్తకం చదివాక హర్షణీయం Podcast లో సుస్మితా గారి Interview విన్నాను. ఆమె గత 30 సంవత్సరాలు తన చుట్టూ జరిగిన అనేక విశేషాలను పరిశీలించి ఈ పుస్తక రూపంలో రాశారు అంటా. ముఖ్యంగా ఈ పుస్తకంలో సంభాషణలు చాలా బాగున్నాయి. సుస్మితా గారు సంభాషణలు గురించి మాట్లాడుతూ "పుస్తకం రాసే క్రమంలో సంభాషణలు రాసాక ఒక గదిలో కూర్చుని వాటిని పైకి చదివి చూసేవారట.. నోరు తిరగకపోయిన, గొంతులో ఆయాసం లాంటిది అనిపించినా ఆ సంభాషణలను సవరించారట"
వలస పుస్తకం గురించి Interview link https://open.spotify.com/episode/5PGKeH5YdpqHbNACpoJR0E?si=nHrm2o3fQ02tbkKDPEYxlQ&t=2852&ct=2852
ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి చదవమని ప్రోత్సహించిన కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారికి మరోసారి ధన్యవాదాలు.
- శ్రీనివాస చక్రవర్తి.

