Wednesday, 31 December 2025

2025 నా పుస్తక పఠనం

ఏడాది జీవితంలో మొదటిసారి ఒక ఏడాది 10 పైగా పుస్తకాలు పూర్తి చేసాను. ముఖ్యంగా కథలు పుస్తకాలు బాగా చదివాను, ప్రతి కథ కూడా ఎన్నో జీవితాలను , సమాజ స్థితి గతులను ప్రతి బింబించాయి. మానవత్వం పరిమళించే కథలు, సవాళ్ళను అధిగమించి ముందుకు వెళ్ళిన కథలు.. హృదయాన్ని ద్రవింప చేసే కథలు ఎన్నో ఈ ఏడాది చదివాను. వాటితో పాటుగా నాకు ఎంతో ఇష్టమైన యాత్ర చరిత్రలు మరియు జీవిత కథలు కూడా చదివాను.

ఆ పుస్తకాల చిరు పరిచయం నాకు అర్ధం అయిన విధానంలో మీతో పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ‌
1.మా తిరుపతి కొండ కథలు: జనవరిలో నేను తిరుపతి వెళ్ళి వచ్చాక ఓ రోజు ప్రయాణం చేస్తూ చదువు App చూస్తుంటే ఆడియో పుస్తకం గమనించి ప్రయాణంలో విన్నాను . కథలు వింటుంటే తిరుపతిలో సంచరిస్తునట్లు అనిపించింది గోపినీ కరుణాకర్ గారి రచన శైలి..అన్ని కథలు బాగున్నాయి. ముఖ్యంగా అమ్మ-నాన్నలను ఆంజనేయ స్వామిలా కలిపిన కోతి "ముత్యాల ముగ్గు" కథ.
తన కంటి చూపు తగ్గడం మూలాన ఉద్యోగం నుంచి తీసివేస్తే దీక్షతో భావి తవ్వి ఎందరో దాహాన్ని తీర్చిన "వాటర్ మాన్ శంకర రెడ్డి" అద్భుతమైన కథ.
స్నేహం కూడా మాగిన కొద్ది పరిమళిస్తుంది అంటూ చెప్పిన "పనస కాయ దొంగలు" కథలు చాలా బాగా నచ్చాయి. కొత్తగా పుస్తకాలు చదవాలి అనుకునేవారికి ఇలాంటి పుస్తకం ఇస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చదువు App లో Audioలో చాలా బాగా వినిపించారు ఈ కథలను.
2.కథ 2023 : విజయవాడ పుస్తకాలు పండుగలో తీసుకున్న తొలి పుస్తకం. వివిధ పత్రికల్లో వచ్చే కథలు అన్నీటిని ఏరి కూర్చి ప్రతి ఏడాది అత్యుత్తమ కథలుగా కథ సిరీస్ వేస్తున్నారని ఈ ఏడాది తొలి సారి తెలిసింది వెంటనే ఈ పుస్తకం తీసుకొన్నాను.
ఇందులో "ఆత్మవంచన తో కాదు, ఆత్మసంతృప్తితో బతకాలి.. బతుకు బతకనివ్వు" అని చెప్పే "మనసు - మర్మం" కథ.
ఉరుకులు పరుగులు జీవితాలు మన మనుషులు మన పక్కనే ఉంటారులే అని భావించి యాంత్రిక జీవనంలో పడిపోయాక రోజులు , సంవత్సరాలు ఈ పరుగులో గడిచిపోతే చివరి దశలో ఎంతో కోల్పాయం అని కనువిప్పు కలిగించే "చప్పుడు చేసే నిశబ్దాలు" కథలు చాలా బాగా నచ్చాయి. ఇక ప్రతి ఏడాది కథ సిరీస్ చదవాలి.
3. దీపావళి కథలు - 2024 :ఖదీర్ బాబు గారు కూర్చిన కథల సంకలనం ఈ పుస్తకంలో ఎన్నో మంచి కథలు ఉన్నాయి..ముఖ్యంగా నిజాయితీ- మంచితనం చక్కగా ప్రతిబింబించిన "కోడెల రెడ్లు" కథ ఎంతో బాగా నచ్చింది.. ముఖ్యంగా కథలో చివరి మలుపు అద్భుతంగా రాశారు రచయిత. యువరచయితలు బూదూరి సుదర్శన్ - చారిత్రాత్మక కథ, శ్రీ ఊహ- మహోన్నతుడు మరియు సురేంద్ర శీలం గారి కథలు అద్భుతంగా అనిపించాయి.
4.మిళింద కథలు: చదువు App లో పుస్తకాలు చూస్తుంటే ఈ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ యువ రచయిత పురస్కారం అందుకున్నట్లు చూసాను. మొదటి కథ "అవిటి పెనిమిటి" కథ చదివాక అన్ని కథలు పూర్తి అయ్యేదాకా మరో పుస్తకం ముట్టుకోలేదు. ముఖ్యంగా "అవిటి పెనిమిటి" కథ కనువిప్పు కలిగించే కథ రెండు కోణాల్లో బాగా చిత్రీకరించారు.. ఒకరు భర్త దివ్యాంగులైనా తన భార్యకు సాయపడటం , మరొకరు నేను సంపాదిస్తున్నా కదా అన్ని పనులు భార్యే చూసుకోవాలి అనుకునే వ్యక్తి ఎవరు "అవిటి పెనిమిటి" అనేది తప్పకుండా చదవాల్సిన కథ. ఈ పుస్తకంలో చాలా కథలు ఇలాగే ఉన్నాయి, మానస ఎండ్లూరి గారి రచన శైలి విలక్షణంగా ఉంది.
5.బహుదా కథలు: దీపావళి కథలు 2024 లో సుదర్శన్ గారి శైలి చూసాక బహుదా కథలు చదువుదాం అని చదువు App లో చదవడం మొదలు పెట్టాను. ఇది కూడా ఆపకుండా చదివించే లక్షణం ఉన్న పుస్తకమే. ముఖ్యంగా ఆకర్షణీయమైన కవర్ పేజి నదీ తీరం..ఒక బాలుడు అందమైన రాతి బండ పైన కూర్చుని కనుచూపు మేరలో ఉన్న గ్రామాన్ని చూస్తున్నట్లు చూడముచ్చటగా ఉంది.
"అమ్మంటే ప్రేమ - నాన్నంటే నమ్మకం" అని ఓ‌కథలో చెబుతారు.
ఊహకందని ముగింపు 'చిన్న శేటు - పెద్ద శేటు' ల ప్రేమ కథ
"మనింటి ఆడపిల్లను మరో ఇంటికి పంపడమేరా జీవితంలో మనం తీసుకునే పెద్ద రిస్క్" అని ఓ కథలో కూతురు మీద ప్రేమను పెళ్ళి సమయంలో చెప్పే మాట. బాల్యంలో తీసుకొని వెళ్ళే 'నటరాజ్ పెన్సిల్' , 'జ్ఞాపకాలే ఓదార్పు' హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. పుస్తకం చాలా బాగా నచ్చింది.
6.జోనథన్ లీవింగ్ స్టన్ సీగల్: ఓ రోజు మా ఊరు నుండి వేరు ఊరు వెళుతూ బస్సు ప్రయాణం చేస్తూ చదువు App లో Audio రూపంలో విన్నాను ఈ ప్రేరణాత్మకమైన పుస్తకం. చుట్టు పక్కల వాతావరణం సృష్టించే పరిమితులకు లోబడి లోనున్న ఎంతో గొప్పశక్తి మరుగున పడుతుంది. ప్రయత్నంతో.. దీక్షతో ఆ శక్తిని ఎలా జాగృతం చేయవచ్చో ఈ చిరు పుస్తకంలో పక్షి కథలో చాలా బాగా చూపించారు.
7.వీరయ్య : ఏడు తరాలు, మా నాయన బాలయ్య పుస్తకాలు చదివాక అలాంటి మంచి పుస్తకం చదివిన భావం కలిగింది వీరయ్య పుస్తకం చదివాక .. ఓ వ్యక్తి తన ముత్తాత మూలాలు వెతుక్కుంటూ రాసిన కథ వీరయ్య..దక్షిణాఫ్రికాలో చెరుకు తోటల్లో కూలీగా వెళ్ళి సర్దార్ గా మారిన వీరయ్య , ఓ మంచి స్థాయిలో తిరిగి తన కుటుంబం కలుసుకోవాలని భారత్ వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు చదువరులను కదిలిస్తాయి.ముఖ్యంగా ఆనాడు దక్షిణాఫ్రికాలో భారతీయ కూలీలు పడిన కష్టాలు.. బ్రిటిష్ కాలం నాటి మన తెలుగు ప్రజల జీవన విధానం ఈ పుస్తకంలో చదివి తెలుసుకోవచ్చు.
8.పాటలు పుట్టిన తావులు : కొన్ని పుస్తకాలు చదువుతుంటే మనల్ని ఓ లోకంలో తీసుకొని వెళ్తాయి. చిన్నప్పుడు నేను చదివిన "గలివర్ ట్రావెల్స్" పుస్తకం అలా అనిపించింది. మరలా అలాంటి భావన ఈ "పాటలు పుట్టిన తావులు" చదివాక నేను కూడా వాడ్రేవు వీరభద్రుడు గారితో కలిసి పాటలు పుట్టిన తావులు లో సంచరిస్తున్న భావం కలిగింది. ఈ పుస్తకం చదివితే మనం దక్షిణ భారతదేశం యాత్ర చేసినట్టే. ఈ పుస్తకంలో ఎందరో గొప్ప వ్యక్తులను పరిచయం చేసింది. ముఖ్యంగా నాకు ప్రతి స్త్రీలో మాతృమూర్తిని సందర్శించిన వ్యక్తి మరియు బీద బాలురు ఆకలిని చూసి చలించి పోయి రుచిని కోల్పోయిన సుబ్రహ్మణ్య భారతి గారు కథ ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. ఈ పుస్తకం పూర్తి చేసిన చాలా రోజుల వరకు ఓ రకమైన Trance భావం వెంటాడుతూనే ఉంది.
9.నెమ్మినీలం : ఈ పుస్తకం చదవడం అంటే మానవత్వం పరిమళించిన గొప్ప వ్యక్తులను దర్శించడమే. "ఏనుగు డాక్టర్" కథలో పురుగులను కూడా పసి పాపలుగా భావించి చెప్పిన విధానం. "కూటి ఋణం" కథలో ఎందరో ఆకలిని తీర్చే కెతేల్ సాయిబ్బు గారు తిన్న ఆహారానికి డబ్బులు ఇచ్చిన, ఇవ్వక పోయినా అందరి పట్ల సమదృష్టి చూపిన విధానం.
"తాటాకు శిలువ" కథలో కలరా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఓ వ్యక్తి రాత్రి దీపాలతో ఇంటి ఇంటికి తిరిగి నివారణ సూచనలు చెబుతూ ధీరుడిలా పోరాడి ధైర్యం చెప్పిన విధానం.
"పిచ్చిమాలోకం" ఓ స్వాతంత్ర్య సమర యోధుడు చేసిన పోరోటం, జీవన విధానం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయి కథలు. ప్రతి కథ చదివి కొంత గ్యాప్ ఇచ్చి అనుభూతి చెందాలి. ఈ పుస్తకంలో కొన్ని కథలు నేను నా జీవిత భాగస్వామి చదివి ఆ వ్యక్తిత్వాలకి - హృదయాన్ని ద్రవించి కన్నీటి భాష్పాలు గా మారాం.
10.కొన్ని కలలు - ఓ స్వప్నం: దాసరి అమరేంద్ర గారు కలలను సాకారం చేసుకుంటూ స్కూటర్ పైన సాగే ఓ సాహస యాత్ర.10 రోజుల ప్రయాణం.. ఎన్నో జ్ఞాపకాలు.. భాషతో సంబంధం లేకుండా అందరితో పరిచయాలు..
పుస్తకంలో దాసరి అమరేంద్ర గారి మాటలు
- 'ఒంటరి ప్రయాణం మనతో మనం గడపడానికి ఉత్తమ మార్గం అంటారు'
- 'ప్రతి అడుగు ఓ ఆవిష్కరణ, ప్రతి ఊరు ఓ కొత్త ఊరు'
- 'ఈ ప్రయాణంలో నాలోకి నేను ప్రయాణం చేయగలిగాను. నన్ను నేను మరికాస్త అర్థం చేసుకున్నాను. నేను లేదనుకున్న సహనం నాలో ఉందన్న ఎరుక కలిగింది. నేను ఉందనుకున్న సర్వమానవ సమభావం పరిపూర్ణ దశలో లేదన్న అనుమానం కలిగింది.'
11.కథ 2020 :నేను మొదటిసారి కథా సాహితీ వారి కథ - 2023 పుస్తకం చదివాను.
. 2023 అన్ని పత్రికల్లో వచ్చిన సుమారు 2000 కథలు నుంచి ఏరి కూర్చిన మంచి కథలు సంకలనం ఆ పుస్తకం. ఈ పుస్తకం చదివాక పాత సంచికలు ఏమైనా దొరుకుతాయని నెట్లో వెతికాను. అప్పుడు నాకు కథ - 2020 పుస్తకం కనపడింది. 2020 అంటే కోవిడ్ మహామ్మారితో
ప్రపంచం సంక్షోభం ఎదుర్కొన్న సంవత్సరం. ఆ సంవత్సరంలో కథలు ఎలా ఉంటాయో చదువుదామనిపించింది..కోవిడ్ కాలంలో జన జీవితాలు ఎలా ప్రభావితం అయ్యిందో కథల్లో చూపించారు.మరోవైపు మానవత్వం స్పృశించే విధంగా కొన్ని కథలు ఆకట్టుకున్నాయి.
12.బుట్టబొమ్మ : చదువు యాప్ నిర్వహించిన ఉగాది పోటీల్లో బహుమతి పొందిన ఓ నవల, పుస్తకం కవర్ పేజీని చూసి హారర్ స్టోరీ అనుకుని చదవడం మొదలుపెట్టాను..
కథ ఏంటంటే:
శారీరక లోపం ఉన్న వ్యక్తి పడే వ్యదని కథలో చెప్పారు.. గ్రహణం మొర్రి ఉన్న వ్యక్తిని చూసి సమాజం చీదరించుకుంటూ ఉంటుంది. చదువును ఆసరాగా చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్నాక , తనలో ఉన్న ప్రేమని పంచుకోవడానికి ,జీవిత ప్రయాణంలో చేతిలో చేయి వేసి నడవడానికి ఒక తోడు కావాలనే తపన, కానీ అడ్డు వస్తున్న వైకల్యం.. అనుకోని పరిస్థితుల్లో హంతకుడి గా మారిన వైనం..
రచయిత కథ చాలా ఉత్కంఠంగా రాసారు.ఏకబిగిన చదివించే విధంగా ఉంది ఈ పుస్తకం.
13.కంబగిరి నుంచి శేషగిరి దాక:ఓ చారిత్రక ప్రేమికుని ప్రయాణమే ఈ పుస్తకం.రచయిత అడవాల శేషగిరి రాయుడు(అశేరా) మన చరిత్రని, మన మూలాలను భావితరాలు తెలుసుకునే విధంగా ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచన చేశారు. ఓ రోజు అశేరా గారు కంబగిరిలో నరసింహ స్వామి దేవాలయానికి వెళ్తారు, అక్కడ నీటి కుండంలో ఒక రాగి నాణెం దొరుకుతుంది. ఆ రాగి నాణెం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో దగ్గరలో ఉన్న అనంతపురం మ్యూజియం కి వెళ్తారు .ఆ మ్యూజియం అధికారి అయిన విజయ్ కుమార్ జాదవ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే తర్వాత చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్న సభ్యులు అందరూ కలిసి విజయకుమార్ గారి మార్గదర్శకంలో ఓ గ్రూప్ గా ఏర్పడి ఎన్నో అనేక ప్రదేశాలు, కట్టడాలు సందర్శనం వైపుకు దారితీస్తుంది. ఆ ప్రదేశాలు వెనుక ఉన్న వింతలు విశేషాలు తెలుసుకొని మనం కూడా సందర్శించిన అనుభూతి కలుగుతుంది.
14.పి. సత్యవతి కథలు: ఇన్ని రోజులు ఇలాంటి కథలు ఎందుకు చదవలేదా అనిపించింది. ప్రతి కథ చదివాక కొంత విరామం తీసుకుని ఆలోచించాల్సి ఉంటుంది‌, అందుకే అన్ని కథలు ఓ సారి కాకుండా రోజుకు ఒక కథ చొప్పున చదివాను‌‌."ఇల్లు అలకగానే" గృహిణి తన పేరే మర్చిపోవడం, "సూపర్ మామ్ సిండ్రోం" ఒక తల్లి తన కుటుంబం, పిల్లలు కోసం జీవితం ధార పోయడం లాంటి కథలు సత్యవతమ్మ గారి రచన శైలి ఎంతో బాగుంటుంది. ఎన్నో విశేషాలు చెబుతారు.
ఓ కథలో "రామకోటి" బియ్యం గురించి చదివాను.. ఆ రోజుల్లో మహిళలు తమ ఖాళీ సమయంలో ఒక్కో బియ్యం గింజ ఏరుతూ శ్రీరామ అంటూ ఒక డబ్బాలో వేస్తారు..వాటినే రామకోటి బియ్యంలాగా దానం చేస్తారు అంటా.. ఈ పుస్తకంలో 10 కథలు దాకా చదివాను మిగతా కథలు కూడా చదవాలి.
ఈ ఏడాది నా పుస్తక పఠనం చాలా బాగా జరిగింది.జీవితంలో మొదటి సారి డజన్ పైన పుస్తకాలు చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో జీవితాలను, ఎన్నో ప్రదేశాలను , ఎన్నో విశేషాలను సందర్శించిన గొప్ప అనుభూతి కలిగింది.తెలుగు కలెక్టివ్ ఆదిత్య మరియు కొప్పరపు లక్ష్మి నరసింహ రావు గారు లాంటి వారి నుంచి ఎంతో ప్రేరణ పొందాను.
శ్రీనివాస చక్రవర్తి.

2 comments:

  1. Nice review and information, keep it up, and wishing that you should write few stories.. All the Best... Veeranjaneyulu

    ReplyDelete
  2. Thank you so much chakri for your review and narration.
    Your narration always inspires us to read books.
    Wish you and your family a healthy , happy and prosperous new year

    ReplyDelete