Tuesday, 9 April 2024

పార్వేట కథలు పుస్తకం పరిచయం


 

హైదరాబాద్ పుస్తకాల పండుగలో ఒక స్టాల్ ముందు ఆసక్తికరంగా ఉన్న ఒక పుస్తకం కవర్ పేజీ చూస్తూ ఉన్నాను నేను. ఇంతలో ఒక వ్యక్తి ఈ కథల రాసింది నేనే అండి అని పరిచయం చేసుకున్నారు. ఇందులో ఏ అంశంపైన కథలు రాశారు అని అడిగాను. రచయిత చెబుతూ "ఇవి రాయలసీమ ప్రజలు యొక్క జీవన చిత్రాలు , నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ కథలు మిమ్మల్ని నిరాశపరచవు, ప్రతి కథ బాగుంటుంది" అని వివరించారు. మీరు ఏం చేస్తుంటారు బ్రదర్ అని నేను అడిగాను, తను సినిమా రంగంలో పనిచేస్తున్నట్లు, పలాస సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినట్లు చెప్పారు.ఆరోజు ఆ సంభాషణ చాలా ఆత్మీయంగా అనిపించింది కచ్చితంగా ఈ పుస్తకాన్ని ముందు చదవాలి అని అనుకున్నాను. 

ఇందులో కొన్ని కథలు నేను అర్థం చేసుకున్న విధానంలో పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 

సూరిగాడు - నల్లకోడి : ఈ కథలో సూరిగాడు అంటే ఒక పెంపుడు కుక్క , మన కథలో కథానాయకుని మిత్రుడు ఇద్దరు కలిసి చేపలు పట్టడానికి వేటకు వెళుతూ ఉంటారు. సూరిగాడిని ఇంట్లో ఒక సభ్యుడిలా భావిస్తారు . అనుకోని కారణాలవల్ల ఒకరోజు సూరిగాన్ని కథానాయకుడి అమ్మ కొడుతుంది. సూరిగాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. మరోవైపు కథానాయకుడు తండ్రికి మృగశిర కార్తె రోజు నల్లకోడి మాంసం తినాలని అలా తింటే స్వర్గానికి పోతారని ఆశ. పూటకి కూటికి గడవడం కష్టమైన ఇంట్లో నల్లకోడిని సంపాదించడం అంటే మాటలు కాదు, చాలా కష్టమే. ఇప్పుడు కథానాయకుడి భుజం పైన రెండు బాధ్యతలు పడతాయి, ఒకటి సూరిగాన్ని వెతకడం రెండవది నాన్న కోసం నల్ల కోడిని సంపాదించడం. క్లైమాక్స్ లో సూరిగాడు కథానాయకుడు మధ్య వచ్చే సంఘటనలు గుండెల్ని హత్తుకుంటాయి. ఇంతకీ సూరిగాడు ఇంటికి వచ్చాడా , మరి మృగశిర కార్తె రోజు నల్లకోడి తినాలన్న తండ్రి కోరిక నెరవేరిందా అనేది కథ చదివి తెలుసుకోవాల్సిందే.

పార్వేట: ఈ పుస్తకం కవర్ పేజీ పైన మనం ఈ పార్వేట కథలో గొర్రెని, వెనుక కథలో దృశ్యాన్ని చూడవచ్చు. పార్వేట పందెం అంటే ఒక గొర్రె తోక కోసి దానికి సున్నం రాసి వదులుతారు, ఆ గొర్రె మంట భరించలేక రంకెలు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది. దాన్ని ఎవరైతే పట్టుకొని తెస్తారో వారే విజేత. ఇందులో ఉడుకు రక్తం ఉరకలేస్తున్న దిగువ వర్గానికి చెందిన ఒక యువకుడు ఒకవైపు, ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో దిగిన బలమైన వర్గం వాళ్ళు మరోవైపు. కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది, కథ పూర్తి అయ్యేసరికి మన హృదయం భారం అవుతుంది. 

మాసిన మబ్బులు: ఒక రెవిన్యూ అధికారి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ముంపునకు గురికానున్న గ్రామాలను ఖాళీ చేయించాల్సి వస్తుంది. మనసుకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయడానికి పూనుకొని మదన పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో తన చిన్నప్పుడు జరిగిన ఇలాంటి సంఘటన గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వలన పక్కనున్న వంక పొంగడం తన ఇల్లు మునిగిపోతూ ఉంటే తండ్రి కుటుంబ రక్షణకై పడిన ఆరాట పడుతూ జోరు వానలో చేసే ప్రయాణం, ఇల్లు వదిలి వెళ్లాల్సిన సందర్భంలో మూగజీవాలైన కోళ్లు , గేదలు గూర్చి తల్లి మరియు బంధువులు పడే ఆవేదన చదువుతుంటే ఆ సంఘటనలన్నీ మన కళ్ళ ముందు గిర్రును తిరుగుతాయి. వాగులు వంకలు పొంగినప్పుడు అక్కడ ప్రజల మనస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చెప్పారు రచయిత ఈ కథలో..

ఓడిపోయిన వాన: ఈ కథలో జోరున వర్షంలో ఒక పాతకాలపు సత్రంలో స్త్రీ ప్రసవిస్తుంది, పక్కనే 10 సంవత్సరాల కొడుకు. కాన్పు చేసిన ముసలామె పిల్లాడితో మీ అమ్మ కప్పుకోవడానికి పొడి బట్టలు కావాలి. ఊరిలో ఎవరైనా ఇస్తారేమో అడిగిరా బాబు అని పంపుతుంది. ఆ జోరు వానలో ఆ పిల్లాడు ప్రతి ఇల్లు తిరుగుతూ పాత చీరల కోసం విశ్వ ప్రయత్నం చేస్తాడు. మరోవైపు ఈ వర్షానికి పంట నష్టం గురించి ఒక రైతు ఘర్షణ పడుతూ ఉంటాడు. ఆ రైతుకి పిల్లాడికి సాయం చేయాలనిపిస్తుంది కానీ, పెళ్లి అయిన దగ్గర్నుంచి ఈరోజు వరకు తన భార్యకి కొత్త చీర కొనిచ్చి ఎరుగడు ,ఇంకా తానేం సాయం చేయగలను అని అనుకుంటాడు. పిల్లాడు చీరలు దొరక్క ప్రతి ఇల్లు తిరుగుతున్నప్పుడు రైతు వర్షంలో అడుగు బయట పెడతాడు. ఇంతకీ ఆ పిల్లాడు పాత చీర సంపాదించాడా, రైతు ఏం చేశాడు అని తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. 

ఇంకా మరి కొన్ని కథలు మాయన్నగాడు కథలో చిన్నప్పుడు ఇంట్లో అన్నదమ్ములు వంతులు ప్రకారం పనిలో పెద్దలకు సాయం చేస్తూ ఆటలు ఆడుకోవడం, కొన్ని సార్లు దెబ్బలు తినడం.

మరో కథ కొత్త బట్టలు లో చిన్నపిల్లలు పండుగకు కొత్త బట్టలు వేసుకోవాలని, అందరికీ చూపించాలని కుతూహలం చెందటం. ఇంట్లో తల్లిదండ్రులను కొత్త బట్టలిప్పించమని పదేపదే ప్రాదేయపడటం లాంటివి మన అందమైన బాల్య జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. ఈ పుస్తకంలోని రెండు ప్రేమ కథలు విజయకుమారి మరియు నల్లమోడాల ఆకాశం ఎంతో అందంగా ఆసక్తికరంగా చిత్రీకరించారు రచయిత. కథలు చివరిలో విషాదంతో హృదయాన్ని కుదిపివేస్తాయి. 

ప్రతి కథలో సీమ ప్రజల జీవన విధానాన్ని రచయిత సురేంద్ర శీలం గారు తన కళ్లతో చూసి మనసుతో ఆవేదన చెంది రాశారేమో అనిపిస్తుంది. అక్కడ ప్రజల మాండలికంలో కథలు చెప్పటం వలన చాలా సహజంగా ఉన్నాయి కథలు. ఈ పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది. పుస్తకం ఎక్కడ దొరుకుతుందో ఈ కింది లింకులో కొనవచ్చు.

Amazon: https://amzn.in/d/ab2HOaI


No comments:

Post a Comment