Saturday, 10 December 2022

Part 3 :హైదరాబాద్ నుంచి హంపి వరకు:మా విజయనగర విహార యాత్ర



ప్రఖ్యాత ఏకశిలా రథం, సంగీత మండపం సందర్శన:

మా ప్రయాణం ఇప్పుడు హంపి అనగానే కళ్ళముందు మెదిలే ఏకశిలా రథం ఉన్న దేవాలయం వైపు సాగింది. మా ఆటో డ్రైవర్ వినయ్ మిమ్మల్ని ఓ ప్రాంతం లో దింపి సార్ ఇక్కడ నుండి ఒక కిలోమీటరు దూరంలో విఠల ఆలయం ఉంది, బ్యాటరీ తో నడిచే వాహనాల్లో మీరు అక్కడ చేరుకోవచ్చు మనం సాయంత్రం విరూపాక్ష దేవాలయం దగ్గర కలుద్దాం.. అని శెలవు తీసుకున్నాడు. బ్యాటరీ వాహనాలు దగ్గర క్యూ ఎక్కువగా ఉండటం వలన నేను , మోహన్ నడుచుకుంటూ ప్రకృతిని చూస్తూ వెళ్దాం అనుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళగానే  కుడి చేతి వైపు కొబ్బరి చెట్లు మధ్య కొలువుతీరిన అందమైన ఒక మండపం కనిపించింది. అదే గజ్జల మండపం, పచ్చని పరిసరాల మధ్య ఓ చారిత్రాత్మ కట్టడం ఎంత బాగుందో, ఇలాంటి ప్రదేశాల్లో కూర్చుని కొంత సమయం గడిపితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ సమయం తక్కువగా ఉండటం వలన మండపం నాలుగు వైపులా పరిశీలించి మా నడక ప్రారంభించాము.బ్యాటరీ వాహనాలు ఒకదాని వెనుక ఒకటి జోరుగా బాగానే నడుస్తున్నాయి. నడక కంటే ఈ వాహనాల ద్వారా త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చని ఇద్దరం వెనుతిరిగి మరల క్యూలోకి వెళ్ళాము. ఈ లోగా ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఒక బ్యాటరీ వాహనం దగ్గర నుంచి డ్రైవర్ "ఇద్దరు కూర్చునే స్థలం ఉంది మీలో ఎవరైనా ఇద్దరు ఉంటే రావచ్చు" అని  అన్నారు. మేమున్నాం అంటూ మా చేతులు క్యూలోంచి పైకి లేచాయి.బ్యాటరీ వాహనంలో మా ప్రయాణం నెమ్మదిగా ఆలయం వైపు సాగుతుంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కొండలను చూస్తూ యాత్రికులు ఆనంద లోకంలో విహరిస్తున్నట్లు కనిపించారు. ఇక్కడ బ్యాటరీ వాహనాలు నడిపేది టికెట్లు ఇచ్చేది అందరూ స్త్రీలే, వెళ్ళే దారి మధ్యలో కుడి చేతి వైపు ఓ పెద్దకోనేరు వచ్చింది. అరే నడిచి వస్తే బాగుండేది దీన్ని చూడలేకపోతున్నాం అనిపించింది . మోహన్ "సమయం ఉంటే మరల వద్దాం తమ్ముడు" అన్నాడు. మా ఎదురుగా బ్యాటరీ వాహనాలు ఒకదాని వెనుక ఒకటి రైలు బోగీల్లా ప్రయాణికులను తీసుకుని వస్తున్నాయి. నేను ఆ ప్రయాణికుల ముఖాలను గమనిస్తున్నాను ఒక గొప్ప ప్రదేశాన్ని చూసి వస్తున్న వాళ్ళ ముఖాల్లో ఎలాంటి భావాలు ఉన్నాయా అని. ఈ బ్యాటరీ వాహనం నడిపే స్త్రీలను చూస్తే అరె ఎండలో,వానలో ఈ వాహనాలు నడుపుతూ ఎంత కష్టపడుతున్నారు కదా అనిపించింది. అదే సమయంలో వారిని చూసి కొంత ప్రేరణ పొందాను, తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా నిజంగా వీళ్లు చాలా గ్రేట్ అనుకున్నాను. ఈ ఆలోచనలో ఉండగా మా వాహనం ఆలయం దగ్గరికి చేరుకుంది. విజయ విఠల ఆలయం దగ్గర  తెలుగు గైడ్ ని తీసుకుందాం అని అనుకున్నాం. ఇక్కడ గైడ్స్ అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు.  ఒక గైడు ను కలిసాం, తను తెలుగులో వివరంగా చెప్తానని చెప్పారు. గైడ్ మాకు ఎదురుగా ఉన్న మార్కెట్ ని చూపిస్తూ ఇక్కడే అప్పట్లో విదేశాల నుంచి గుర్రాలను తీసుకుని వచ్చి అమ్మేవారు. విజయనగర సామ్రాజ్యం చరిత్రను చెబుతూ గైడ్ మమ్మల్ని ఆలయం ఆవరణ లోనికి ఆహ్వానించారు. లోనికి ప్రవేశించగానే మా ఎదురుగా ఏకశిలా రథం నేను నా కళ్ళను నమ్మలేకపోయాను, ఎప్పటినుంచో హంపి కలగంటున్న నాకు ఈరోజు అది సాకారమైంది . ఆ ఏక శిలా రథాన్ని దానికి ఎదురుగా స్వర్గాన్ని తలపిస్తూ దివి నుంచి భువికి దింపినట్లుగా ఎంత చూసినా తనివి తీరని అద్భుతమైన శిల్పకళతో ఉలి తాకిడికి అందాలు అలలై పొంగుతున్న విఠల దేవాలయం, కన్నార్పకుండా చూస్తుంటే ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. గైడు మమ్మల్ని ఏకశిలా రథం దగ్గరికి తీసుకెళ్లి "ఇదే ఎంతో ప్రాముఖ్యం పొందిన ఏకశిలా రథం. అప్పట్లో పూజారి గారు పూజ అయ్యాక ఈ ఏకశిలా రథం దగ్గరకు వచ్చి చక్రాన్ని ముందుకు తిప్పేవారట , అప్పుడు స్వామి వారు రథం మీద ఊరేగినట్లు గుర్తు.ఈ రథం ముందు ఏనుగులు ఉన్నాయి చూశారా నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండాల్సింది గుర్రాలు, కానీ బహమనీ సుల్తాను దాడిలో అవి పోయాయి వాటి స్థానంలో పురాతన శాఖ వారు తవ్వకాల్లో దొరికిన ఏనుగులను ఈ రథం ముందు ఇలా పెట్టారు". చాలా మంది యాత్రికులు ఆ రథం చుట్టూ గుమ్మిగూడారు, కొంతమంది యువత 50 రూపాయల నోట్లు తీసుకుని , కరెన్సీ నోటు పైన ఉన్న ఏకశిలా రథాన్ని ఎదురుగా ఉన్న ప్రత్యక్ష రథాన్ని  చూపిస్తూ గర్వంగా ఫోటోలు దిగుతున్నారు. మరి కొంతమంది తమ పర్సులో 50 రూపాయల నోటు లేదే అని బాధపడుతూ కనిపిస్తున్నారు. గైడు మాకు ఎదురుగా ఉన్న సంగీతం పలికించే స్తంభాలు చూపిస్తూ "ఇవి మొత్తం 56 స్తంభాలు ఉన్నాయి, సప్తస్వరాల  సంగీతం ఒక్కో స్థంభం పైన ఒక వాయిద్యం మృదంగం,మద్దెలు,గంట,ఢమరుకం లాంటి శబ్దాలు పలికించగలవు . వీటిని నిష్ణాతులైన కళాకారులు గంధపు చెక్కతో మీటుతూ ఉంటే శ్రీకృష్ణదేవరాయలు భార్య చిన్న దేవి గారు అనుగుణంగా నృత్యం చేసేవారట.అప్పట్లో ఎంతో దూరం ఈ సంగీతం వినిపించేదట". ఈ సంగీతాన్ని ఈ స్థంబాలు ఎలా పలికిస్తాయి అని మేము గైడును అడిగాము. గైడు"ఈ స్తంభాన్ని మీరు చూసినట్లయితే అన్నీ కూడా ఏకశిల పైన చెక్కిన రాతి స్తంభాలు వీటి మందం, నిర్మాణ ఆకృతి వాటిపైన ఉన్న రాయి బరువు ఆధారంగా అవి వివిధ రకాల సంగీతాన్ని పలికించగలవు. అప్పటి ఆర్కిటెక్ట్ యొక్క అద్భుత సృష్టి ఇది అని చెప్పారు. ఈ సంగీతం ఎలా వస్తుందా అని బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒక స్థంభాన్ని కోసి చూశారట కానీ అందులో ఉన్న మర్మాన్ని వాళ్ళు కనుగొనలేకపోయారట.మాకు మీరు ఆ సంగీతాన్ని వినిపించి చూపించగలరా అని గైడు ని అడిగాము. గైడు "ప్రస్తుతం వీటిని మనం చూడగలం కానీ వాటి దగ్గరికి వెళ్లి మోగించలేం ఎందుకంటే చాలామంది యాత్రికులు వీటిని రాళ్లతో కొట్టి స్తంభాలను పాడు చేస్తున్నారు, దీనివలన భావితరాలకి ఈ స్థంభాలు కూడా మిగలవని మన పురాతత్వ శాఖ వారు ఇప్పుడు వాటి దగ్గరికి అనుమతించడం లేదు" అని చెప్పారు. పోనీలే మనం వినకపోతే ఏం.. ముందు తరాలు ఇలాంటివి చూడాలి మంచి పనే చేశారు అని మనసులో అనుకున్నాను. మా గైడు మమ్మల్ని గుడికి కుడి  వైపు ఉన్న కల్యాణ మండపంలోకి తీసుకెళ్లారు . ముందుగా మెట్ల దగ్గర ఉన్న ఓ శిల్పాన్ని చూపిస్తూ "ఇక్కడ మీరు గమనిస్తే ఒక విచిత్రమైన జంతువును శిల్పులు మలిచారు  సింహం పాదాలు, ఏనుగు తొండం, ముసలి నోరు, గుర్రం తల కలగలిసి ఎలా ఉందో చూడండి".  అదే మండపంలో ఓ స్థంభం పైన దశావతారాలను చూయించారు, మరొకచోట శ్రీకృష్ణుడు గోపికలు చీరలు తీసుకెళ్లి చెట్టు మీద కూర్చున్నట్లుగా కింద గోపికలు కృష్ణుని బతిమాలుతున్నట్లుగా చక్కటి దృశ్య రూపాన్ని ఇచ్చారు. అక్కడ నుంచి మమ్మల్ని గైడు విఠలాలయం దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న కొన్ని అద్భుతాలు చూపించారు ఒక శిల్పాన్ని చూపిస్తూ ఇది ఒక కోణంలో పాము పడగలాగా మరో కోణంలో  తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్ల కోతిలా, మరోకోణంలో ఆకాశంలో ఎగురుతున్న ఆంజనేయ స్వామిలా వివిధ కోణాల్లో చూపిస్తుంటే అప్పటి శిల్ప కళాకారుల అద్భుత సృష్టికి ఆశ్చర్య పోవడం మా వంతు అయింది. గైడు ఆలయ పీఠం పైన ఉన్న రంధ్రాలను చూపిస్తూ తన బాటిల్ లో ఉన్న కొంత నీరుని వాటిపైన పోసి ధారగా జారుతున్న నీటిని చూపిస్తూ... "ఇక్కడ వర్షం పడితే చూరు అంచుపైన  రంద్రాల ద్వారా జాలువారే వర్షపు నీరు ఈ పీఠం పైన పడి  ముత్యాల ధార లాగా కనువిందుగా కనిపిస్తుంది" అన్నాడు. మమ్మల్ని ఆలయం లోపలికి తీసుకువెళ్లి ఇక్కడ అప్పట్లో విజయ విఠలుడి విగ్రహం ఉండేది. ఇప్పుడు ఆ విగ్రహాలను పండరీపురం తరలించారు. గర్భగుడికి ప్రదిక్షణ చేయడానికి ఒక పక్కగా కిందకు దిగడానికి మెట్లు ఉన్నాయి ఈ మెట్ల ద్వారా ఆలయానికి ఓ ప్రదక్షిణ చేసి రండి అని గైడ్ మమ్మల్ని కిందికి పంపారు అంతా చీకటి మయం .  

ఆలయం బయటకు తీసుకుని వచ్చి అక్కడ ఉన్న ఓ చెట్టును చూపిస్తూ ఇది ఎంతో పురాతనమైనది, 1856 సంవత్సరంలో అలెగ్జాండర్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో ఈ చెట్టును మనం చూడొచ్చు. మమ్మల్ని  మెట్ల దగ్గర కూర్చోబెట్టి ఏనుగు శిల్పాల తొండాల మధ్యలో గుండా చెట్టు పడేటట్లు ఒక ఫోటో తీసి, ఏకశిలా రథం దగ్గర  మరో ఫొటో తీసి ఇచ్చారు. అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చిన గైడ్ కి ధన్యవాదాలు చెప్పుకొన్నాం . కొంతసేపు ఏకశిలా రథాన్ని గమనించి పక్కనే ఉన్న మండపాల వైపు వెళ్లి అక్కడ స్థంభాలు పైన చెక్కిన అపురూపమైన శిల్పాలను గమనిస్తూ మరో గంట సమయం గడిపాం. సాయంత్రం నాలుగున్నర గంటలు అయ్యింది,భారంగా విజయ విఠలాలయానికి వీడ్కోలు చెబుతూ మా ప్రయాణం ప్రాచీన మార్గం గుండా విరూపాక్ష దేవాలయం వైపు కొనసాగించాం.


******************


ప్రాచీన మార్గం ద్వారా ప్రకృతిలో మా నడక:

 ఈ ప్రాంతాన్ని రామాయణ కాలంలో కిష్కింద అనేవారు . ఇక్కడ రామాయణానికి సంబంధించిన కొన్ని ప్రదేశాలు ఆనవాలుగా ఉండటం , పురాతనమైన గుడులు కూడా ఉండటం వలన దీన్ని ప్రాచీన మార్గం అంటున్నారు. తుంగభద్ర నది తీరం వెంట నడుచుకుంటూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విరూపాక్ష దేవాలయానికి మనం ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు. విఠల ఆలయం వెనకవైపు నుంచి మా ప్రయాణం సాగింది. దారిలో ఓ చోట ఎత్తుగా ఉన్న రెండు స్థంభాలు పైన  ఒక స్థంభం ఉంది, ఇదే రాయలవారి తులాభారం. దేవరాయులు వారు ఈ తులాభారంలో కూర్చుంటే ఆ భారానికి సమానమైన వజ్రాలు, బంగారాన్ని ప్రజలకు పంచేవారట. మా మార్గంలో  ఎన్నో పురాతన చిన్న చిన్న ఆలయాలు వస్తున్నాయి అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఓ పక్కన సుగ్రీవుని గుహ కనిపించింది ,ఆ గుహ వద్దనే ఆంజనేయుడు సీతమ్మ వారి నగలను దాచి  శ్రీరామునికి  ఆనవాళ్లు చెప్పారని తెలుస్తోంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక ప్రాంతంలో కోటిలింగాలకు దారి అని రాసి ఉంది.కోటి శివలింగాలే  ఎలా ఉంటాయో అని మేము ఎంతో ఆశగా ఆ ప్రాంతంలోనికి వెళ్ళాం. వాటి జాడ ఎక్కడా కనబడలేదు. పక్కనే ఉన్న నదీ తీరం వద్దకు వెళ్లాం అక్కడ నల్లటి, ఎర్రటి రంగులో నునుపైన బండరాళ్లు ఒకదాని పై ఒకటి పేర్చి పెట్టినట్లు గా సహజసిద్ధంగా ఉన్నాయి. నది మీదుగా వచ్చే గాలిని , ఆ ప్రకృతి సోయగాలు చూస్తూ కొంతసేపు అలా ఉండిపోయాం. తిరిగి  మేము కోదండ రామాలయం చేరుకున్నాం,ఈ పురాతన ఆలయంలో విశేషం ఏంటంటే ఎత్తైన ఏకశిలపైన రాములవారు సీతా లక్ష్మణ సమేతంగా  హనుమంతునితో కాకుండా సుగ్రీవునితో  కొలువై ఉన్నారు. ఆ పక్కనే ఉన్న ప్రాంతం చక్రతీర్థం అక్కడ నుంచి పర్యాటకులు తెప్ప పడవల పైన రెండు కొండల మధ్య నదిలో విహారయాత్ర చేస్తూ సాయం సంధ్యని ఆశ్వాదిస్తున్నారు. చీకటి పడే సమయం అవుతుంటే వేగంగా హంపి బజారు మీదుగా విరూపాక్ష దేవాలయం వైపు మా అడుగులు వేశాము. రూమ్ కి వెళ్లి స్నానాలు ముగించుకుని విరూపాక్ష దేవాలయంలో అభిషేకం చేయించడానికి నేను, మోహన్ వెళ్ళాము . కార్తీక మాసం అవడం వల్ల గుడి వరండా దీపపు కాంతులతో ప్రజ్వరిళ్ళుతున్నది. అభిషేకం టికెట్ తీసుకొని గుడిలో ఒక 30 నిమిషాలు స్వామి అభిషేకాన్ని కనులారా చూస్తూ స్వామి ధ్యానంలో ఉండిపోయాం.  ప్రసాదం స్వీకరించి బయిట ఆవరణలోకి వచ్చాము. అక్కడ చాలా మంది యాత్రికులు విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోవడానికి తమ పడకలను సిద్ధం చేస్తున్నారు .మేము సంతృప్తిగా భోజనాలు చేసి హంపి బజారు కి వెళ్ళాము. అక్కడ మా మూడు నెలల పాపకి కొన్ని చెక్క ఆట బొమ్మలు తీసుకున్నాను. 


*********************

ఆంజనేయుడు జన్మించిన అంజనాద్రి:

మూడవ రోజు ఉదయం మా ప్రయాణం ఆనెగొంది వైపు సాగింది. ముందుగా ఆనెగొంది ప్యాలస్ వద్దకు వెళ్ళాము. ప్యాలస్ లోపలికి వెళ్ళడానికి ప్రస్తుతం ప్రవేశం లేదు. ఉదయం కావడం వలన తూర్పు నుండి భానుని లేత కిరణాలు ప్యాలస్ గోడలపైన పడుతూ ప్యాలెస్ మల్లెలా తెల్లగా కనిపించింది . కాసేపు ఆ నిర్మాణాన్ని పరిశీలించి తిరిగి ఆంజనేయుని జన్మస్థలం అయిన అంజనాద్రి వద్దకు చేరుకున్నాం. తిరునాళ్ళు కి వచ్చినట్లుగా పార్కింగ్ లో చాలా వాహనాలు ఉన్నాయి. దర్శనం ఎక్కువ సమయం పడుతుందేమో అనుకొన్నాము.కొండపైన ఆలయం పైకి మెట్ల మార్గంలో చేరుకోవాలి. మెట్లు ఎక్కుతూ అక్కడ అక్కడ ఆగి చుట్టు పక్కల మంచుతో కప్పబడిన పరిసరాలను చూస్తూ కొండ పైకి చేరుకొన్నాం .పర్యాటక శాఖ వారు యాత్రికులు కోసం కొండపైన వ్యూ పాయింట్ లను చక్కగా ఏర్పాటు చేసారు . అంజనాద్రి ఎత్తైన కొండ ఎటు వైపు చూసిన కొండలపైన గుట్టలు గుట్టలుగా పోసిన బండరాళ్లు. మోహన్ "తమ్ముడు ఈ రాళ్ళను చూస్తుంటే రామసేతు  కట్టిన రాళ్ళలా లేవు, వారధి కట్టగా మిగిలిన బండరాళ్లు ఇక్కడ పోసారేమో లేకపోతే ఇక్కడ తయారు చేసిన బండి రాళ్ళను అక్కడికి తీసుకొని వెళ్ళడమో చేసినట్లు ఉన్నారు కదా" అన్నాడు.నిజంగానే కొండలపైన బండరాళ్లు ఎర్రటి రాతి గుండ్లు పేర్చినట్లే ఉన్నాయి. మేము ఆంజనేయుని దర్శనం చేసుకుని విహంగ వీక్షణం కోసం గుడి వెనుక వైపు ఒక కొండ నుండి మరో కొండకి  నిర్మించిన మార్గం మీదుగా నడుస్తూ  వెళ్ళాము. యాత్రికులు కోసం నిర్మించిన ఈ దారులు చాలా బాగున్నాయి. అందరూ గుంపులు గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒక వైపు పారుతున్న తుంగభద్ర నదిని, ఆవలి తీరంలో ఉన్న హంపీని ఇటువైపు ఉన్న కొండ గుట్టలను చూస్తూ వినోదిస్తున్నారు. మేము కొంచెం సేపు అక్కడ గడిపి కొండ కింద కి చేరుకున్నాం. కొబ్బరి బోండాలు తాగి కొంత ఉత్సాహాన్ని  తెచ్చుకొని ఆటో ఎక్కి తుంగభద్రలో పడవ ప్రయాణానికి బయిలుదేరాం.





******************


తుంగభద్రమ్మ ఒడిలో తెప్ప పడవలో విహారయాత్ర:

మా ఆటో నేరుగా తెప్ప పడవలు ఉన్న ప్రాంతంలో ఆగింది. ఇక్కడ తెప్ప పడవలో ప్రయాణం మంచి  అనుభూతి అట. మాకు ఎదురుగా ఒకామె నిరాశగా వెనుతిరిగి వస్తూ "ఇక్కడ తెప్ప విహారానికి రేట్లు ఎక్కువ చెబుతున్నారు అండి మనిషికి 500/- , 800/- అంటా అనవసరం " అంటూ ఆమె వాహనంలో ఎక్కింది. 

మేము నిర్వాహకుల వద్ద వివరాలు కనుక్కుని మాకు తెలుగు వచ్చిన పడవ నడిపే రైడర్ ని ఇవ్వమని అడిగాం. మా తెప్ప నడపడానికి  నాగరాజు అనే తెలుగు వ్యక్తి వచ్చారు. మోహన్ "నది లోతుగా ఉన్నట్లుంది, మాకు లైఫ్ జాకెట్లు ఇవ్వండి" అంటే ఇచ్చారు. ఇద్దరం బోర్లించిన బుట్ట పళ్ళెం ఆకారంలో ఉన్న తెప్ప ఎక్కాము. ప్రయాణం నెమ్మదిగా మొదలు అయ్యింది. నేను రైడర్ తో "మేము మంచి ఎండలో వచ్చామే, ఎలా ఉంటుందో మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఈ ప్రయాణం". రైడర్ "ఎండగూర్చి మీరు అంతగా ఆలోచించ వద్దు. కింద చల్లటి నీరు మన ప్రయాణం కూడా అడవి చెట్ల నీడలో ఉంటుంది. మీరు ఆశ్వాదించండి". 

మోహన్ రైడర్ తో "ఈ నది ఎంత లోతు ఉంటుంది,మీకు ఈత వచ్చా" 

రైడర్ పడవ నడుపుతూ నదిలో కొంత నీటిని నోటి లో వేసుకుంటూ"బాగానే లోతు ఉంటుంది, నాకు ఈత బాగా వచ్చు, మరి మీకు"

మేము ఇద్దరం రాదని చెప్పాము.

రైడర్ " మేము ఈ తెప్ప నడుపుతున్నామంటే మాకు ఎంతో సాధన ఉంటుంది, పొరపాటున పడవ మునిగితే ఇద్దరు మనుష్యులు అయినా ఏటి ఒడ్డుకు లాక్కెళ్ళే విధంగా మేము  తయారై ఉంటాం సార్ " అని మాకు ధైర్యం చెప్పారు.

పడవ  అడవి వైపుకు  సాగుతోంది. రైడర్ నాగరాజు  కళ్ళలో ఏదో ఒక ఆప్యాయత కనిపించింది. 

నేను "అన్న మీ పేరు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ పుట్టి పెరిగారు"

రైడర్ "మాది మెహబూబ్ నగర్ సార్ , మా నాన్న వాళ్ళు ఇక్కడికి అప్పట్లో వచ్చి స్థిరపడ్డారు" . నది రెండుగా చీలి ఒక పాయ అడవిలోకి వెళుతుంటే అటు వైపు మా పడవ సాగింది. నదికి ఇరువైపులా పచ్చని చెట్లు.రైడర్ "అటు చూడండి సార్ ఈ అడవిలో ఎన్ని రకాల చెట్లో, ఇక్కడి చెట్లలో ఔషధ గుణాలు ఎక్కువట. కొంతమంది ఆయుర్వేదం కోసం ఇక్కడ నుండి తీసుకుని వెళతారు. 

నేను "ఐతే ,అటు నుంచి ఇటుగా సాగే ఈ గాలి పీల్చడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట"

రైడర్ "అవును సార్".

మాటల్లో ఉండగా మాకు ఎదురుగా నీటిలో ఓ బండరాయి పడవను ఢీకొట్టబోతుంటే.. 

మోహన్ "అన్న నీటిలో బండరాయిని తాకబోతోంది మన పడవ" అన్నాడు.

రైడర్ చాకచక్యంగా సెకన్లలో పడవని నేర్పుగా  పక్కనుంచి తప్పించాడు. కొంత సేపు నిశబ్దం ఆవరించింది. ఆహా ఎంతటి నిశబ్దం , నదిలో పడవ ముందుకు సాగడానికి వేసే తెడ్డు చేసే సన్నటి నీటి చప్పుడు మాత్రమే వినపడుతోంది . అదో ప్రశాంతమైన ప్రదేశం. ఈ నిశబ్దంలో ఆనందం ఉంది, మాటల్లో చెప్పలేని హాయి ఉంది. మనస్సును కడిగేసే నిశబ్దం అది.  

మా పడవ నది ప్రవాహం వాలుకి సాగిపోతుంది. పైన అడవి నేరేడు చెట్లు మాకు గొడుగుల్లా  నీడపట్టాయి, ఎండ తెలియడంలేదు. ఒక వైపు పిట్టలు చేపల వేటలో నది మధ్య కొండ రాళ్ళు మీద గొప్ప ఏకాగ్రతతో తమ కార్యంలో నిమగ్నం అయ్యాయి. ఆ పక్షులను చూపిస్తూ రైడర్ నాగరాజు అన్న "సాయింత్రం ఇక్కడ పక్షులను చూడాలి సార్,ఎన్నో బారులుగా గుంపులుగా గుంపులుగా అడవిలో తమ గూళ్ళకు చేరుకునేటప్పుడు భలే ఉంటుంది". 

రైడర్ "అటు చూడండి కనిపించే ఆ పాలరాతి పైన ఫోటోలు బాగా వస్తాయి అక్కడ కాసేపు గడిపి ఫోటోలు దిగండి" అంటూ అటుగా మా తెప్పను నడపసాగాడు. ఆ పాల రాయి నది నీటి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఎండ తాకిడికి పసిడి ఛాయలో మెరుస్తూ మాకు స్వాగతం పలికింది .మా లైఫ్ జాకెట్లు తీసి కొంచెం సేపు ఆ పాలరాతి బండ మీద కూర్చొని 4 ఫోటోలు దిగి పడవలో తిరుగు ప్రయాణం ప్రారంభించాము . రైడర్ అక్కడ ప్రజల జీవన విధానం చెబుతూ కన్నడిగులు అందర్నీ కలుపుకుంటారు సార్ . ఇంతలో మరో తెప్ప పడవ మాకు ఎదురొచ్చింది. అందులో రైడర్ కేకవేస్తూ  "నాగరాజు చాలా మంది కస్టమర్స్ ఎదురుచూస్తున్నారు కొంచెం త్వరగా వెళ్ళండి" అన్నారు. ఇక మా రైడర్ పడవ నడపడంలో గేరు మార్చాడు . మోకాళ్ళ మీద కూర్చుని అటువైపు, ఇటువైపు తెడ్డు తో నీటిని నెడుతూ వేగం పెంచాడు. ఇప్పుడు మా ప్రయాణం నీటి ప్రవాహానికి ఎదురుగా సాగుతోంది. ఇలా ఒక గంటపాటు తుంగభద్రమ్మ ఒడిలో సాగిన మా ప్రయాణం నాకు, మోహన్ కి ఎంతో నచ్చింది, ఒడ్డుకు చేరాము. నాగరాజు అన్నకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పి పడవ ప్రయాణం టికెట్ ధర చెల్లించి ఆటోలో కూర్చుని ప్రయాణం మొదలు పెట్టాము. ఇంతలో రైడర్ నాగరాజు అన్న మా ఆటో దగ్గరకు వచ్చి "వెళ్ళిరండి సార్,జాగ్రత్త " అంటూ వీడ్కోలు చెప్పాడు. ఆటో నడక ప్రారంభం అయ్యింది. నా మనసులో ఆలోచన "కొంత సేపటి క్రితం మా ప్రయాణం ,నాగరాజు అన్నతో పడవలో.. మరి ఇప్పుడు ఇద్దరవి వేరు, వేరు ప్రయాణాలు.. ఎంత చిత్రం కదా మనిషి చేసే ప్రయాణాలు.." .



**************


పంప సరోవరం, దుర్గ గుడి, తుంగభద్ర డ్యాం సందర్శన :

మా తరువాత మజిలీ పంప సరోవరం వైపు అంజనాద్రి పక్కనుంచే సాగుతుంది, దూరం నుంచి చూస్తుంటే అంజనాద్రి కొండ ఒక వైపు ఆంజనేయ స్వామి లాగా ఉన్నట్లు చూపులకు వింత గొలిపే రీతిలో ఉంది. మోహన్ కి చూపిస్తే నిజమే తమ్ముడు నాకు అలాగే కనిపిస్తుంది అన్నాడు. పంప సరోవరం లో లక్ష్మీ దేవి ఆలయంలో దర్శనం చేసుకున్నాం. పక్కనే శబరీ ఆశ్రమం చూపించారు, శబరి ఆశ్రమం పైకి వెళ్ళి చుట్టూ ప్రదేశాలు చూడటానికి ఇనుప మెట్లు ఉన్నాయి. అక్కడ వ్యూ పాయింట్ నుంచి ఎర్రటి బండరాళ్లతో చుట్టూ ఉన్న కొండ గుట్టలను, కింద పంప సరోవరాన్ని చూడటం ఎంతో  బాగుంది. తిరిగి మేము విజయ దుర్గా దేవాలయానికి వెళ్ళాము. అక్కడ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరుగుతోంది. మధ్యాహ్నం హారతి ఇస్తున్నారు,దర్శనం చేసుకుని దుర్గ గుడి పక్కన వాలి గుహ చూడటానికి వెళ్ళాము . వాలి మార్గంలో కోటగోడలోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం వద్ద కోట నిర్మాణం బాగుంది. పాత సినిమాల్లో చూపించినట్లు కోటగోడ ఠీవీగా ఉంది. కొంత దూరం నడచి వెళ్ళి వాలి గుహని చూసాము. ప్రస్తుతం అక్కడ ఏమీ లేదు.అప్పట్లో ఇక్కడ వానరాలు ఎలా ఉండేవారు  అని ఊహించుకొంటూ పక్కనే ఒక చిన్న గుడిలో  హనుమంతుడు లేదా వాలి, శివుడు ఇద్దరు ఒకటే ఒకటే పీఠంపైన కొలువై పూజలు అందుకుంటున్నారు. వారి  దర్శనం చేసుకుని బయిటకు వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేసి తుంగభద్ర నది మీద ఉన్న తుంగభద్ర డ్యాం చూడటానికి బయిలుదేరాం. సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణం, దారిలో శిథిలమై అనాథలుగా మారిన కొన్ని పురాతన కట్టడాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పురాతన కట్టడాలు ఒకటి మా ఊరిలో  ఉంటే ఎలా ఉండేదో అనే ఊహ.. మోహన్ ఆటోలోంచి కొండలను గమనిస్తూ వాటి ఆకారాల్లో జంతువులను, వానరాలను ఊహించుకొంటూ నాకు తన ఊహను నా కళ్ళతో చూడమని చెబుతున్నాడు.చుట్టూ వరిపొలాల మధ్యనుండి మా ప్రయాణం తుంగభద్ర వైపు సాగుతుంది. దూరంగా పవన విద్యుత్తు గాలి మరల రెక్కలు తిరుగుతూ కనిపించాయి. మోహన్ నవ్వుతూ "ఈ ఊరంతా సరిపడా గాలికోసం పెద్ద ఫ్యాన్ లు పెట్టుకున్నారనమాట అంటూ ఆ గాలి మరల గమనాన్ని చూపించాడు", ఎక్కువగా అలసిపోయి ఉండటం వలన మోహన్ నిద్రలోకి వెళ్ళాడు. నేను ఆటో డ్రైవర్ ఇద్దరం కొంచెం సేపు మాట్లాడుకున్నాం. డ్రైవర్ "మేము తెలుగు సినిమాలు బాగా చూస్తాం అన్న, చాలా బాగుంటాయి అని  చెప్పాడు" . కాసేపటికి తుంగభద్ర డ్యాం ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాము. లోనికి టికెట్ తీసుకొని డ్యాం వద్దకు వెళ్లడానికి బస్ ఎక్కాము. ఐదు నిమిషాల్లో మమ్మల్ని డ్యాం వద్ద దింపారు , అందరూ ఉత్సాహంగా బస్ దిగి డ్యాం చూడటానికి వెళ్ళాము. కానీ సెక్యూరిటీ యాత్రికులను ఉద్దేశోంచి" డ్యాం వంతెన పైకి ప్రవేశం లేదు. బయిట నుంచే చూడాలని చెప్పారు". మేము కొంత నిరాశకు లోనయ్యాం, పక్కనే ఉన్న పార్కులోనికి ప్రవేశించి డ్యాం వద్ద నీటి మట్టాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఎటు చూసినా నీరే.. డ్యాం నిండు గర్భిణిలా ఉంది. ఆవైపు తీరం ఎక్కడ ఉందా అని చూస్తే ఆకాశం చివరే కనిపిస్తుంది.. ఇంత పెద్ద డ్యాం ని చూడటం జీవితంలో ఇదే మొదటిసారి, పార్కు లో కూర్చుని ఏమైనా తిందాం అంటే అక్కడ వానర సైన్యం చేస్తున్న అల్లరి చూసి కుదరదు అనుకున్నాం.చల్లని సాయంత్రాన ఒక షాపు వద్ద కప్పు టీ అందుకుని ఒక్కో గుక్కను ఆశ్వాదిస్తుంటే శరీరం తేలికైనట్లు కొత్త హుషారు వచ్చింది.  లైట్ హౌస్ కి దారి ఎటువైపు అని షాపు యజమానిని అడిగాం. ఆమె దారి చూపించారు. అక్కడికి ఇద్దరం బెయిలు దేరాం. కొండ పైన లైట్ హౌస్ చేరుకోవడానికి మెట్ల దారి చుట్టూ ఉన్న వాతావరణం చిన్నపాటి అడవిలో ప్రయాణం చేస్తున్నట్లు ఉంది . 





 పచ్చని చెట్ల మధ్య గుండా , సాయింత్రం పూట కొండ పైన పక్షులు చేసే కిలకిలరావాలతో అడుగు ఆనందంతో పడుతుంది. ఓ 10 నిమిషాల్లో పైకి చేరుకున్నాం. అక్కడ నుంచి చూస్తే డ్యాం అంతా చక్కగా కనిపిస్తుంది. డ్యాం లోంచి వచ్చే నీరు మరిలే దారులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఆకాశంలో అస్తమిస్తున్న సూరీడు కిరణాలు డ్యాం నీటి పైన పడి పరావర్తనం చెందడం వలన అద్దం మీద సూరీడు పడినట్టుగా ఉండి డ్యాం నీటిని నేరుగా చూడలేకపోయాము. లైట్ హౌస్ పక్కనే ఉన్న పార్కులో గడ్డి పైన నడుం వాల్చి పడుకొని ఆకాశం వైపు చూస్తుంటే శూన్యంలోకి తొంగి చూస్తున్నట్లు అనిపించింది. కొంత సేపటికి మోహన్ "చక్రి లే నువ్వు పడుకున్న చోట చీమలు ఎన్ని ఉన్నాయో చూడు" అంటూ లేపాడు . ఆ చీమలు నన్ను తమ ఇంటికొచ్చిన అతిథి అనుకున్నాయి కాబోలు. ఏ ఇబ్బంది కలిగించలేదు. తిరిగి కిందకి ప్రయాణం అయ్యాము. డ్యాం వద్ద కొన్ని ఫోటోలు దిగి వేరుశనక్కాలు కొనుక్కుని తింటూ నడుచుకుంటూ గేటు బయిటకు చేరుకొన్నాం. మమ్మల్ని ఆటో డ్రైవర్ Hotel Hampi International వద్ద దింపాడు. మేము 07:00 గంటలకే భోజనం చేసాము, ఆహారం రుచికరంగా ఉంది. తరువాత Reciption దగ్గరకు వెళ్ళి మా రైలు 11:30 గంటలకు, అప్పటి వరకు ఇక్కడ కూర్చోవచ్చా అంటే ఇబ్బంది ఏమిలేదు సార్ మీరు ఇక్కడ కూర్చుని తాపీగా రిలాక్స్ అవ్వండి అని నవ్వుతూ చెప్పారు. 12:00 గంటలకు హైదరాబాద్ కి రైలు ఎక్కాం. హంపి జ్ఞాపకాలు కొన్ని రోజుల వరకు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.



**************

హంపి యాత్రికులకు కొన్ని సూచనలు:

1.చాలా ప్రదేశాల్లో మనం కొండలు ఎక్కి దిగవలసి ఉంటుంది కాబట్టి మంచి షూ తీసుకుని వెళ్ళండి, చేతిలో ఒక నీటి బాటిల్ అందుబాటులో పెట్టుకోండి.


2.BSNL కాకుండా ఇతర నెట్వర్క్ సిగ్నల్స్ తక్కువ ఉంటాయి. GPay, Phone PE పనిచేయకపోవచ్చు. చేతిలో కొంత డబ్బులు పెట్టుకోండి. ఇంటి దగ్గర వాళ్ళకి ముందుగా చెప్పండి సిగ్నల్స్ తక్కువ ఉంటాయి అని. మీరు ఉండే రూం దగ్గర వైఫై సౌకర్యం తీసుకుని కాల్స్ కి ఉపయోగించండి.


3.విరూపాక్ష దేవాలయం కి ఎడమ చేతి పక్కన (Public Toilets పక్కన) చాలా తక్కువ ధరలో గదులు అద్దెకు దొరుకుతాయి. మాకు 600/- ఒక రోజుకు చొప్పున తీసుకున్నారు.


4.హంపి పరిసర ప్రాంతాల్లో వానరాలు (కోతులు) ఎక్కువ ఉంటాయి. అవి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టవు కాని ఒక వస్తువు మీ చేతిలో కాకుండా పక్కన పెట్టి మనం ఆదమరచి ఉన్నామంటే తీసుకుని వెళ్లే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త.


5.హంపిలో చాలా బాగం బహమనీ సుల్తానులు దాడికి మరియు ప్రకృతి వైపరీత్యాలకు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. మనం ఇప్పుడు కేవలం 10% వరకు చూడవచ్చు . మరీ ఎక్కువగా ఊహించుకొని వెళ్ళి నిరాశ చెందవద్దు.


6.విరూపాక్ష , విజయ విఠల దేవాలయం దగ్గర గైడును పెట్టుకోండి, చాలా తక్కువ ధరలో వస్తారు. ఒక మ్యాప్ లేదా గైడు పుస్తకం అన్ని భాషల్లో దొరుకుతున్నాయి. అది మన దగ్గర ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది.

7. హంపి లో సంచరించడానికి బైక్ అద్దెకు ఇస్తారు, మనకు ఆటోలు కూడా దొరుకుతాయి , ఎన్ని కిలోమీటర్లు ఎన్ని ప్రదేశాలు చూపిస్తారు అనే దానిమీద మీరు మాట్లాడుకోవల్సి ఉంటుంది. సైకిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ క్రింది పుస్తకాలు యాత్రకు, యాత్ర రచనకు సహకరించాయి 




 - సమాప్తం -



No comments:

Post a Comment