Thursday, 27 June 2019

పుస్తకాలు -మన ప్రియనేస్తాలు

ఒక్కో రకమైన పుస్తకం ఒక్కో పరిమళాన్ని వెదజల్లుతుంది.. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మన మనస్సు తెరమీద సన్నివేశాలు కదలుతూ ఉంటాయి.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.. ప్రతి పేజీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది..
నాకు నచ్చిన పుస్తకాలు కొన్ని మీతో పంచుకొంటాను.

1.భారత జాతికి నా హితవు- వివేకానంద:
ఈ చిన్ని పుస్తకంలో ప్రతీ అక్షరం చదువుతుంటే ఏదో తెలియని ఉత్సాహం మనలో వచ్చి చేరుతుంది.ఆత్మశక్తిని, దేశభక్తిని పెంపొందించే ఈ పుస్తకం ప్రతీ భారతీయ యువతీయువకులు తప్పక చదివి తీరాలి.

2.అమరావతి కథలు - సత్యం శంకరమంచి:
తియ్యనైన తెలుగు పదాలను తేనెలో ముంచి కథలుగా రాస్తే వాటికి అందమైన బాపు బొమ్మలు జతకలిస్తే అవే అమరావతి కథలు.. తెలుగులో మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఈ కథలు చదివి తీరాల్సిందే.

3.మిథునం -శ్రీరమణ:
భార్యాభర్తలు అనురాగానికి అందమైన వర్ణన.‌. ఏకబిగిన మన చేత చదివించే ఈ కథ మనస్సును హత్తుకుంటుంది,
మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.

4.సత్యశోధన లేదా ఆత్మకథ- గాంధీ:
సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన ఒక వ్యక్తి జీవితం ఇది  ఒక చరిత్ర.
నిజాయితీతో సాగిన ఈ జీవిత కథ వర్ణించిన విధానం అద్భుతం.చదువుతుంటే నిజంగానే గాంధీగారు మన పక్కన కూర్చుని కథని చెబుతున్నట్లు అనిపిస్తుంది..

5.నాకూ ఉంది ఓ కల - వర్గీస్ కురియన్:
పట్టుదలతో సాగే ఓ అధ్బుతమైన విజయగాధ. మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఎలా ఉన్నాం ,ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం అని ఈ ఆత్మకథ చెబుతుంది..మారుమూల గ్రామాన్ని (ఆనంద్) ప్రపంచ ప్రఖ్యాత గావించిన కురియన్ ఆత్మకథ ఎంతో ప్రేరణాత్మకం.

పుస్తకాలు నా జీవితంలో భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. మరి మీకు నచ్చిన పుస్తకాల పేర్లు కూడా నాతో పంచుకుంటారు కదూ.‌

చదవండి - చదివించండి
 శ్రీనివాస చక్రవర్తి
27/06/2019


Sunday, 16 June 2019

నాన్నతో నా బాల్యం ‌..


-ఇంటికి రానీరా చిన్నోడా:
 "హే నాన్న వస్తున్నాడు" అంటూ అప్పుడే ఊరి నుంచి వస్తున్న నాన్న దగ్గరికి ఇంటికి కొంత దూరం ఉందనగానే వాయువేగంతో పరుగులు తీస్తూ ఎదురు వెళ్ళా. చేతిలో ఉన్న సంచిలో ఏం తెస్తున్నాడో చూద్దాం అని, సంచిలోని అరటిపండ్లును, శంఖువు ఆకారంలో కట్టిన బూందీ పొట్లంని చూడగానే నా కళ్ళల్లో రెండు లైట్లు వెలిగేవి,
నోట్లో లాలాజలం గంగలా పొంగేది...
దారిలోనే వాటిని తీసుకుందామని ప్రయత్నిస్తుంటే ఇంటికి రానిరా చిన్నోడా తీసుకుందువు గానీ అని నవ్వుతూ అంటుంటే. దారిలోనే రెండు అరటి పండ్లను తెంచుకొని ఆనందంతో గెంతులు వేసిన చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.

*******

-లాంతరు వెలుగులో నాన్న:
ప్రతి ఒక్కరికీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎన్నో మధుర జ్ఞాపకాలు నింపుతుంది. నాకు అంతే..
నాకు 5 సంవత్సరాల వయస్సులో అనుకుంటా. అప్పుడే మారుమూల గ్రామాల్లోకి విద్యుత్ అడుగుల వేస్తుంది. వీధి దీపాలు ఉండేవి కాదు,అందరూ సాయంత్రం అవ్వగానే కిరోసిన్ లాంతర్లను సిద్దం చేసుకునేవారు.
అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను నేను.
నాన్న మా ఊరినుంచి మమ్మల్ని చూడటానికి సైకిల్ పైన వచ్చాడు.ఆనందంగా గడుస్తున్న ఆ సాయంత్రం మెల్లగా నాకు తెలియకుండానే  మా ఊరు బయలదేరాడు నాన్న. అప్పటికే చీకటి మసకలు కమ్ముకున్నాయి. చుట్టూ చీకటి ఆవరించింది.
 నాన్న వెళ్ళిన విషయం తెలిసి, ఏడుస్తూ "నాన్నోయ్... నాన్నోయ్.. నాన్నోయ్" అంటూ అప్పుడే వెలిగించిన లాంతరు చేత్తో పట్టుకుని కొంతం దూరం బజారు వేపు నాన్నను వెతుకుతూ మసక చీకటిలో పరుగులు తీసాను.
అమ్మమ్మ వాళ్ళు నేను ఇంటి దగ్గర కనిపించక హడావిడి పడితే,కొంతసమయం తరువాత నా జాడ తెలుసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి నాన్న మళ్ళీ వస్తాడు అని ఓదార్చి తాయిలం నా చేతికి అందించారు.
ఆ  చిన్ననాటి జ్ఞాపకాలు మసక మసకగా అప్పుడు అప్పుడు గుండెలపై కదులుతాయి.

**********

- నాన్న చూపిన అధ్బుతమైన విజయ సూత్రం  :
వేసవి సాయంత్రం నాన్న  కల్లుగీయడానికి తాడి ఎక్కే మోకును నడుముకు చుట్టూ చుట్టుకుని, కత్తులు పదును పెట్టే చెక్క బండకు రెండు కుండల తొడిగి నవ్వుతూ భుజంపైన పెట్టుకున్నాడు. నేనుకూడా బయలుదేరాను నాన్నతో ముంజికాయలు తినవచ్చు అని, నేను నాన్న ఇద్దరం పొలం వేపు అడుగులు వేసాం.‌ మా దారిలో జనుము చేను పసుపు పూలు సుగందాన్ని వెదజల్లుతుంటే అటువేపు నుంచి వీచే గాలి ఒక లాలన పాడినట్లు ఉండేది.
జనుము చేను మధ్య బాటలో గుండా అడుగులు వేస్తూ ముందుకు సాగాం.
మొదట ఒక తాటి చెట్టు దగ్గర నాన్న ఆగి ముందుగా తను ఎక్కబోయే తాడికి దణ్ణం పెడుతున్నాడు .
ఇదేంటి నాన్న దేవుడికి దండం పెట్టాలి కానీ తాడిచెట్టుకి , ఈ గీత పనిముట్లుకు పెడుతున్నావు.." అని అడిగాను..
అప్పుడు నాన్న "ఏదైతే మనకు కూడు పెడుతుందో అది దైవంతో సమానం చిన్నోడా.. అందుకే ఈ తాటిచెట్టుకీ, ఈ పనిముట్లుకు మొదటి నమస్కారం" అని చెప్పి నువ్వు గట్టుపైన కూర్చో నేను తాటిచెట్టు ఎక్కి వస్తాను అని చెప్పి భుజం పైన ఉన్న మోకుని తాడికి వేసి పైకి ఎక్కుతూ వెళ్ళాడు.
నాన్న చెప్పిన మాటలు బలంగా తాకాయి.
గట్టుమీద కూర్చుని పైకి చూసాను. ఆకాశంలో మెరుస్తున్న ఒక సూరీడు ఒక వేపు
"పనే దైవం" అని  చెప్పిన మరో సూరీడు తాడిపైన మరోవైపు. ఆ సూరీడు వెలుగు కిరణాలు నేరుగా నా కళ్ళను తాకేసరికి ఆ వెచ్చదనానికి నా కనుపాపలు తాలలేక తలదించుకున్నాను.

ఈ రోజు నేను కంప్యూటర్ ముందు ఉదయాన్నే కూర్చున్నప్పుడు ముందుగా మనస్సులో నమస్కారం చేసుకుంటా.
ఏదో తెలియని అంకితభావం నాలో ప్రవేశిస్తుంది ఆ రోజంతా భలే సాగుతుంది.

*********

- కొండలు ఎలా పుడతాయి నాన్న:
అప్పుడే ప్రపంచంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు లోకం ఎంతో అద్భుతంగా, విచిత్రంగా కనిపిస్తుంది.
వాళ్ళ మదిలో కుతూహలంతో జనించే ఎన్నో ప్రశ్నలు ఈ అద్భుతాలను తెలుసుకోవాలని, అలాగే నేను ఒకరోజు నాన్నతో ప్రయాణం చేస్తున్నా విజయవాడ వెళుతున్నాం. మొదటిసారి చాలా దూరం ప్రయాణం చేస్తున్నా.
బస్సు కిటికీలోంచి చూస్తూ, ఆనందిస్తూ దారి వెంట ఉన్న చెట్లు , కొట్లు వెనక్కి వెళుతుంటే భలే అనిపించేది. అప్పుడు ఓ వింతైన ఆకారం మొదటి సారి చూసాను.
నేను -" నాన్న అదేంటి..."
నాన్న- " అది కొండ"
నేను - " ఎంత ఎత్తు ఉందో.. అది ఎలా పుడుతుంది నాన్న"
నాన్న కొంచెం సేపు ఆలోచించి " అది కూడా నేలపైన ఏర్పడిన ఒక ప్రాంతం.. ఒక పెద్ద దిబ్బ లాంటిది. రాయితో ఏర్పడుతుంది.."
భలే అనిపించింది నాకు.. కంటికి కనిపించినంత సేపు దానినే కిటికీలోంచి వెనుకకు వెళ్ళిందాకా చూస్తూనే ఉన్నా.
ఎంతో ఓపికతో మన ప్రశ్నలకు అప్పట్లో గూగుల్ లేకపోయినా వారికి తెలిసిన మేర ఎన్నో విషయాలు మనతో పంచుకున్నా జ్ణాపకాలు ఇప్పుడు తలుచుకుంటే భలే అనిపిస్తుంది.

********

-నాన్నతో మొదటి సినిమా:
అప్పట్లో దూరదర్శన్, వీధి నాటకాలు ,ఆరుబయట కథలు, కబుర్లే వినోదం అంటే..

"నాన్న నాకు రేపల్లెలో సినిమా చూపించవూ." అన్నాను నేను నాన్నతో.
" ఆదివారం వెళ్దాం,అప్పుడు మీకు సెలవు ఉంటుంది కదా" అని నాన్న చెబితే  ఉత్సాహంతో ఊగిపోయాను. ఆదివారం కోసం ఎదురు చూస్తున్నా. కాలం నెమ్మదిగా గడుస్తుంది.

ఆలస్యం అయినా రేపల్లె వెళితే వచ్చే 3 ఆనందాలు తలుచుకుని మురిసిపోతున్నా.

1.బస్సుల్లో కిటికీ పక్కన కూర్చుని గాలిలో తేలుతూ బయటకు చూస్తూ ఆనందించవచ్చు.

2.మొదటి సారి సినిమా చూస్తున్నాం అనే ఆనందం.
మా ఫ్రెండ్ చెప్పాడు నాకు
"హాలులో సినిమా చూస్తే భలే ఉంటుంది రా
తెరమీద పెద్ద రంగురంగుల బొమ్మ మధ్యలో విరామం ఉంటుంది పాప్కార్న్ , ఉల్లి సమోసాలు తీసుకొని తింటూ ద్రాక్ష లేదా నిమ్మ గోలీసోడా తాగవచ్చురా... " అని

3.సినిమా ఐన తరువాత రేపల్లె హోటల్ లో
ఒక ఉల్లిమినపో లేది పూరీనో లాగించవచ్చు అని..
అప్పట్లో హోటల్ లో టిఫిన్ అంటే ఎందుకో అంత ఇష్టం..

ఆదివారం రానే వచ్చింది ఉదయాన్నే లేచి స్నానం చేస్తే అమ్మ ముఖానికి పౌడరు, తలకు నూనె రాసింది.
అన్నయ్య నేను వస్తాను నాన్న అని మాతో బయలుదేరాడు. అన్నయ్య వస్తే నేను అనుకొన్న సమోసాలు, గోలీసోడాలు, పూరీలు ,మినపట్టులు పూర్తిస్థాయిలో అందవనీ అన్నయ్య  రావద్దంటే రావద్దని నేను మారాం వేసాను. అన్నయ్య కొంత సేపు ప్రయత్నించి సర్లే తమ్ముడినే తీసుకెళ్ళు నాన్న అన్నాడు.
నేను నాన్న ఇద్దరం బస్సు ఎక్కి రేపల్లె వెళ్ళాం.
"నాకు రెండు సినిమాలు చూపించాలని అడిగాను".
సరే అని ముందుగా పెదరాయుడు సినిమా చూశాం. భలే చిత్రంగా అనిపించింది రంగురంగుల బొమ్మలు తెరమీద కనబడటం. విరామంలో తెర మీద నుంచి నా చూపు పక్కకు తిప్పాను, జనాలు అందరు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయాను.
తెర మీద  పెద్దగా ఉండటం వల్ల కింద ఉన్న వాళ్ళు చిన్న గా కనిపిస్తున్నారు అనిపించింది. అలా ఆ రోజు రెండు సినిమాలు చూశాను. హోటల్లో టిఫిన్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం.
ఆ రోజంతా నా కంటికి అందరూ చిన్నగా కనిపిస్తున్నారు. :)

ఇలా నాన్న మాది మధ్య తరగతి కుటుంబం అయినా తన పిల్లలకి ప్రతి తండ్రిలాగా సాధ్యమైనంత ఆనందం ఇవ్వాలని ఎంతో ప్రయత్నించారు..

********

మోకుకు పనిచెప్పిన నాన్న:
అప్పుడు నన్ను మా ఊరి స్కూల్ లో మొదటి సంవత్సరం  చేర్పించారు. నేను ఇంట్లో ఉన్న కల్లు తాగి స్కూల్కి వెళ్తున్నట్లు వెళ్లి దారి మధ్యలో ఉన్న ఒక ఇంటి అరుగు పైన పడుకుని నిద్రపోవడమో లేదా నాలాంటి పిల్లలతో ఆడుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చే వాడిని. ఈ విషయం తెలుసుకున్న నాన్న, ఒకసారి అప్పుడే తాడి చెట్టు ఎక్కి దిగి వస్తున్నాడు. కోపంతో పళ్లు పటపటా నములుతూ వచ్చే సరికి నేను పరుగు అందుకున్నాను నన్ను పట్టుకుని గట్టిగా మందలించి కాళ్ళ బంధం తో నా కాళ్లపైన 2 దెబ్బలు ఇచ్చుకున్నాడు.
ఆ కోపానికి నేను తట్టుకోలేక పోయాను. ఎప్పుడు కోపం రాని వారికి కోపం వస్తే భయంకరం గా ఉంటుందేమో.

  • ఆరోజుతో జీవితంలో కల్లు తాగడం మానివేశాను.

చదువులో నేను సగటు విద్యార్థినే అయినా 90% పైగా నా యొక్క హాజరును ఒకటవ తరగతి నుంచి ఎంసిఎ వరకు చూపించాను. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆ ఏడాది 95 శాతంపైగా హాజరు వచ్చినందుకు నాకు ఉత్తమ విద్యార్థి అవార్డు వస్తే , నాన్నకు అది చూపిస్తే ఎంతో మురిసిపోయాడు. మా పిల్లవాడు నామాలు లేకుండా బడికి వెళ్తాడని చాలా గర్వంగా తన మిత్రులకు చెప్పుకునేవాడు నాన్న.‌

నాన్న నీడలో సాగిన ఈ బాల్యం ఎంతో మధురజ్ఞాపకం...

- శ్రీనివాస చక్రవర్తి
16/06/2019