శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన చిన్ని కృష్ణుని గుడి, లక్ష్మి నరసింహ విగ్రహం, నీటిలోని శివలింగాల సందర్శన:
ఉదయం 06:00 గంటలకే లేచి సిద్దం అయ్యాం,విరూపాక్ష దేవాలయం పక్కనే టిఫిన్ చేసి హుషారుగా ఆటోలో బయలుదేరాం. ముందుగా బాలకృష్ణుని ఆలయం వద్దకు వెళ్ళాం . ఆటో డ్రైవర్ వినయ్ మాకు గైడుగా కొన్ని విశేషాలు చెప్పారు. అవి "ఈ గుడిలో చిన్ని క్రిష్ణుడుని కృష్ణ దేవరాయలు ఒరిస్సా నుంచి ఇక్కడికి తెచ్చారు, గాలి గోపురంలో దశావతారాలు మనం చూడవచ్చు". నేను మోహన్ ఇద్దరం దశావతారాలు చూసి ఏది ఏ అవతారమో చర్చించుకుని లోనికి ప్రవేశించాం. ఎంతో సుందరమైన గుడి చుట్టూ ఆహ్లాదకరమైన ఆవరణ, ప్రాకారం లోపల అందంగా చెక్కిన స్తంభాలు, కార్తీక మాసపు ఉదయం గుడిలో మనస్సు ప్రశాంతంగా అనిపించింది. గుడి లోపలికి వెళ్ళే మార్గంలో ఎడమ పక్కన మెట్లకు ఇరువైపులా ఏనుగులను చాలా చక్కగా చెక్కారు, ఆ ఏనుగుల పక్కనే రెండు నిమిషాలు కూర్చుని ఒక పక్కన చలి , మరోవైపు గోరు వెచ్చని సూర్యకిరణాల స్పర్శను హాయిగా ఆశ్వాదించాం, లోపల విగ్రహాలు లేవు. గుడి చుట్టూ ఒక ప్రదిక్షణ చేసి గాలి గోపురం దగ్గరకు వచ్చాము. ఇక్కడ గోపురం పైన రాజు(దేవరాయలు), యుద్దానికి బయిలుదేరిన సైనికులు,గుర్రాలను జీవ కళ ఉట్టిపడే విధంగా శిల్పులు మలిచారు, కాసేపు ఆ శిల్పాలలో ముఖ కవళికలు గమనించాం. ఈ ఆలయం ఎదురుగా పెద్ద బజారు ఉంది, ఇక్కడ సరుకుల విక్రయాలు చేసేవారట.
కృష్ణుడు గుడి దగ్గర ఆటో ఎక్కి ఒక్క మలుపు వచ్చామో లేదో ఆటో డ్రైవర్ మరో సందర్శన ప్రదేశం వచ్చింది సార్ అన్నాడు. ఎదురుగా యోగా ముద్రలో నాగశేషుని పై 21 అడుగుల ఏకశిలా లక్ష్మి నరసింహ స్వామి, స్వామి వద్దకు చేరే దారికి ఇరువైపులా పచ్చని గడ్డి పెంచారు. నరసింహ స్వామిని చూసి మోహన్ "అచ్చంగా శబిరమల అయ్యప్ప లా ఈ నరసింహ స్వామి కూడా చిన్ముద్రలో కూర్చుని ఉన్నాడు గమనించావా తమ్ముడు" అన్నాడు.లక్ష్మీ నరసింహ అన్నారు కదా కాని స్వామి ఒడి లో అమ్మవారి విగ్రహం లేదు, కేవలం అమ్మవారి చేయి కనిపిస్తుంది, ఆ విగ్రహం సుల్తానులు చేసిన దాడిలో వేరుచేసి ఉంటారు. పక్కనే పెద్ద శివలింగం ఈ లింగం కింద తుంగభద్ర నీరు 365 రోజులు ఉంటుందట, అక్కడ పూజారి గారు ఉన్నారు. మేము దర్శనం ముగించుకుని షూలు వేసుకుంటూ ఉండగా ఒక బస్సులో స్కూల్ విద్యార్థులు గుంపులుగా దిగారు, వాళ్ళకు మాష్టారు వివరంగా చెబుతుంటే ఆసక్తిగా వింటున్నారు. "శిలలపై శిల్పాలు చెక్కినారు పాటలో" మనం ఈ నరసింహ, శివలింగాల ను చూడవచ్చు.అక్కడ నుంచి రెండు నిమిషాలు ప్రయాణంలో ఉద్దాన వీరభద్ర స్వామి గుడి దగ్గరకు చేరుకున్నాము, 16 అడుగులు ఎత్తైన ఏకశిలా విగ్రహం భారీ ఆయుధాలు ధరించిన వీరభద్ర స్వామిని దర్శించుకుని బయిటకు వచ్చాం . డ్రైవర్ వినయ్ చండికేశ్వర టెంపుల్ దగ్గరకు మమ్మల్ని తీసుకొని వెళ్ళి గుడి స్థంబాలు పైన సంగీతం ఎలా వస్తుందో చేతులతో వాయించి చూపాడు. రాతి పైన పలికే సంగీతానికి, గంటలా మోగుతూ ఉంటే ఆ స్థంభాన్ని స్పర్శించి మేము ప్రయత్నించాం , మాకు మోగలేదు.
***************
రాణి వాసం వైపు ప్రయాణం:
ఆటోలో మా ప్రయాణం సాగుతుంది, డ్రైవర్ ఓచోట ఆపి అవే Sister Stones (అక్కచెల్లెళ్ళ రాళ్ళు) అని చూపించాడు. పెద్ద రాతి బండలు ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ ట్రెక్కింగ్ చేసేవారని ఆ రాతి బాగాలపైన ట్రెక్కింగ్ చేయడానికి అనువుగా ఉన్న గుర్తులు చూపించాడు, అక్కడ నుంచి భూగర్భ శివాలయం వైపు మా ప్రయాణం సాగింది. భూగర్భ శివాలయం ఎదురుగా ఒక పార్క్ లాగా యాత్రికులు కోసం ఏర్పాటు చేసారు. కిందికి దిగడానికి కొన్ని మెట్ల చుట్టూ గడ్డి చక్కగా పరుచుకుంది, కిందికి దిగి శివాలయం చూద్దామని వెళ్ళాము గుడి లోని స్థంబాలు వద్ద నీటి మట్టం కనిపించింది,లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ,బయటి నుంచే చూసాము. ఈ గుడి పునః నిర్మాణం జరుపుకుంది. తిరిగి ఆటో ఎక్కి ప్రయాణం సాగించాం, వెళ్ళే దారిలో పెద్ద, పెద్ద రాతి బావిలాగా తొట్టిలాంటి నిర్మాణాలు కనిపించాయి.అందులో ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారని వినయ్ చెప్పాడు. అప్పట్లో ఎన్నో గొప్ప యుద్దాలు చేసిన ఏనుగులు శిక్షణా ప్రదేశం ఇదేనా అని వింతగా చూసాము. కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపు నాణాలు ముద్రించే స్థలం ఇదే అంటూ చూపించాడు డ్రైవర్. నేరుగా మా ఆటో రాణివాసం దగ్గర్లో ఆగింది. వినయ్ "సార్ ఇక్కడ మీకు టికెట్ ఇస్తారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదే టికెట్ పైన మీరు ఏకశిలా రథం ఉన్న విఠల ఆలయం, కమలాపురం మ్యూజియం సందర్శించవచ్చు అని సూచించాడు.
***************
రాణి వాసం, అందమైన గజశాల, ఖజానా :
లోనికి ప్రవేశించాము, ఎడమ వైపు ఎత్తైన పీఠం లాగా ఓ ప్రాంతం కనిపించింది, అవే రాణివాసం పునాదులు. గోడలు ఏమీ లేవు ఆ పునాదులు నిర్మాణ శైలి గమనించాము.ఎదురుగా చిన్న స్నాన ఘట్టం ఉంది. కొంచెం ముందుకు వెళితే కుడివైపున ఓ కట్టడం ఎండకు బంగారు రంగులో మెరిసిపోతోంది అదే పద్మమహల్ , చుట్టూ పచ్చటి తివాచిలా పెంచిన గడ్డి మధ్యలో నిండుగా రెండు అంతస్తుల కట్టడం మా కళ్ళముందు నిలబడి ఉంది. దాని ఆర్చ్ ల పైన అందమైన శిల్పకళా నైపుణ్యం ఆభరణాలు పేర్చినట్లుగా మలిచారు.వివిధ రకాల డిజైన్ లను చూస్తూ కాసేపు ఉండిపోయాము. కొంచెం ముందుకు వెళితే ఓ చిన్న గోడ. గోడ దాటుకొని లోనికి ప్రవేశించి చూసాం, అద్భుతం కళ్ళముందు మాయ జరిగినట్లుగా విశాలమైన ప్రదేశంలో ఏనుగల భవన సముదాయం నిండుగా కనుల పండువగా ప్రత్యేక్షమైంది. వివిధ రకాలుగా సుందరమైన ఆకృతుల్లో రాతిగుండ్లు పైన పేర్చినట్లు వరుసగా 11 ఏనుగు శాలలు, ఆ నిర్మాణ శైలి మన కంటిని పక్కకు తిప్పనివ్వదు, పైన చెక్కిన ఆకారాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.దాని లోనికి ప్రవేశించాం ఒక దానిని నుంచి మరో దానిలోకి మనిషి వెళ్ళే దారి ఉంది. ఏనుగులకు నివాస యోగ్యంగా ఎలా నిర్మించారో చూసాం. పక్కనే సైనికుల భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. లోపల ప్రస్తుతం విగ్రహాలు ఏర్పాటు చేసారు. సైనికులు భవనం ఎదురుగా రంగ దేవాలయం అంటే అటువైపు వెళ్ళాం, అది శిథిలావస్థలో ఉంది , అక్కడ నాట్య సాధనలు జరిగేవట.అక్కడి నాట్య మండపంలో వివిధ రకాల నాట్య భంగిమలు ఉన్నాయి. తిరిగి వెనక్కి వెళుతూ మరోసారి గజశాలను దూరం నుంచి వీక్షించి , ఖజానా భవనంలోకి ప్రవేశించాము. ఇది ప్రస్తుతం ఒక చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేసారు. ఇందులో నాకు బాగా నచ్చినవి సూక్ష్మ విగ్రహలు , అప్పటి ఉంగరాలు మరియు మణులు. ఆ ఉంగరాలను చూసి ఏ రాజో ఏ రాణో పెట్టుకున్న ఉంగరమో కదా ఇది అని మనసులో అనుకున్నాను. తరువాత మధనిక అనే శిల్పం ఎంతో సౌందర్యంగా మన బాపుగారి బొమ్మలా ఉంది. ఆ చిన్న శిల్పం పైన సూక్ష్మంగా ఆభరణాలు భలే చెక్కారు. తిరిగి బయిటకు వచ్చాము, మిత్రుడు మోహన్ పైకి చూపిస్తూ "చూసావా ఖజానా చూరు అంచుల్లో పాము పడగలు విప్పినట్లు చెక్కారు , ఇది ఖజానా కదా ఇటు వైపు వస్తే ప్రమాదం జాగ్రత్త అని హెచ్చరికగా ఆ పాము పడగలు అలా చెక్కి ఉండవచ్చు" అన్నాడు.
*****************
హజారా రామాలయం: అద్భుతమైన శిల్ప కళా సృష్టి:
హంపి లో శిల్పకళకు ప్రధాన ఆకర్షణ ఈ హజార రామ మందిరం, "రాయలు కుటుంబ సభ్యుల కుటుంబ వేడుకలకు ఈ గుడి వేదిక అవుతుంది అంట ,అదిగో ఈ గుడికి ఎదురుగా పెద్ద మార్కెట్ ప్రాంతంలా ఉంది కదా ఇదే అప్పట్లో పాన్ సుపారి మార్కెట్" అని డ్రైవర్ వినయ్ చెప్పాడు. గుడి లోనికి ప్రవేశించాం ఎటువైపు చూసినా ప్రాకారాలు పైన శిల్పాలే శిల్పాలు.. ఆకలితో ఉన్నవాడికి విస్తరి నిండుగా నోరూరించే రకరకాల పిండివంటలతో విందు భోజనం వండించి తినమనట్టు ఉంది నా పరిస్తితి,ముందుగా ఎటు వైపునుండి మొదలు పెట్టాలి అని కొంచం తికమక పడ్డాను, తరువాత తేరుకొని ముందు ఆలయం గర్భగుడి వైపు అడుగేశాం . ఇక్కడ కూడా విగ్రహాలు లేవు. గర్భ గుడి తలుపులు వేసి ఉన్నాయి. దేవాలయం మధ్య భాగంలో కమనీయమైన నల్లటి నునుపైన 4 స్థంబాలు ఉన్నాయి. వాటి పైన శిల్పాలు అద్భుతంగా చెక్కారు. అవి దాడికి గురి అయ్యి కొంత పాక్షికంగా దెబ్బతిన్నాయి. మేము ఆలయం ఎడమ వైపు నుంచి ప్రాకారం పైన శిల్పాలు చూడటం ప్రారంభించాము. చూడగానే నాకు బాగా నచ్చింది బాల రాముడు/బాల కృష్ణుడుని అమ్మ ఎత్తుకుని ఉన్న సుందరమైన శిల్పం. కొంచెం ముందుకు వెళితే సీతమ్మను దశకంఠ రావణుడు ఆకాశ మార్గాన తీసుకొని వెళుతున్న దృశ్యం. మరికొంచెం ముందుకు వెళితే ఒక స్త్రీ మూర్తి ఒడిలో బాణంతో గాయపడిన భర్త, పక్కనే బాలుడును పెట్టుకొని ఎదురుగా ధనుర్దారి అయిన వ్యక్తితో సంభాషిస్తునట్లు ఉంది. మా ఫ్రెండ్ మోహన్ ని పిలిచి కిష్కింధ కాండలో ఈ ఘట్టం చెప్పగలవా అని అడిగాను, తను "తారా విలాపం" అని సరిగ్గా సమాధానం ఇచ్చాడు.ఇలా చూస్తూ ఒక్కో శిల్పాన్ని గమనిస్తూ ముందుకు సాగూతుంటే "రాతిని నాతిగ మలచిన రాముడివా" అనే పాట గుర్తు చేస్తూ అహల్యా ఉదంతం. మరోచోట రాముని బాణం దాటికి గాలిలో లేస్తున్న అసురుల తలలు ఇలా ఆలయ ప్రాకార గోడలపై ఎటు చూసినా సుందరమైన దృశ్య శిల్పకావ్యం 1000 శిల్పాలతో చెక్కారు కాబట్టే హాజరా రామాలయం. మోహన్ బయిట నుంచి తమ్ముడు అని కేక వేశాడు, వెళ్ళి చూసాను ఎడమ వైపు ఆలయ ప్రహరీ గోడ పైన పుత్ర కామేష్టి యాగం చేస్తున్న దశరథుడు. సాథన చేస్తున్న నలుగురు రాజకుమారులు శిల్పాలు అబ్బురపరిచాయి. ప్రహరీ బయిట గోడపై బారులగా కదిలి సాగుతున్నట్టు గుర్రాలు , ఏనుగులు , సైనికుల పరివారం,వాటి పైన నాట్యం చేస్తున్న వారిని చూసి మోహన్ నవ్వుతూ "అప్పట్లో వీళ్ళు సైనికులను ప్రేరేపించే చీర్ గాల్స్ ఏమో తమ్ముడు" అని సరదాగా అన్నాడు. ఈ ఆలయం శిల్పకళా నైపుణ్యం ఎంత సేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా తనివితీరదు. ఆసక్తి ఉంటే ఒకపూట పడుతుంది. కొంతమంది అలా వచ్చి రెండు ఫోటోలు దిగేసి అక్కడ నుంచి మాయమవుతున్నారు . శిల్పాలు అంటే ఇష్టం ఉన్నా వారికి మాత్రం మంచి ప్రదేశం. రామాయణం క్విజ్ లాగా ఏది ఏ ఘట్టమో చెప్పండి అని మనల్ని ప్రశ్నిస్తుంది. నేను మనసులో ఏ మూల మిస్ చేయలేదు కదా అనుకుంటూ ఓ మంచి ప్రదేశాన్ని వీడి వెళుతున్నందుకు భారంగా ఆటో ఎక్కాను.
**************
రాజుగారి దర్బారు, రహస్య సమావేశం మందిరం,మహానవమి దిబ్బ :
హజారా రామాలయం కుడివైపున కొంత దూరం వెళ్ళాక పునాదులతో ఉన్న ఒక ప్రాంతం దగ్గరకు చేరాము . నేను బోర్డు పైన వివరాలు చదువుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి సార్ ఇక్కడ అంతా శిధిలాలు, పునాదులే ఉన్నాయి, చూస్తే అర్థం కాదు మీకు నేను అర్థం అయ్యే విధంగా చెబుతాను ఒక 150 /- ఇవ్వండి చాలు అన్నాడు, నేను సరే అన్నాను. ఆయన వివరంగా చెబుతూ "ఇదే రాజుగారి దర్బారు జరిపే స్థలం , ఇక్కడ ఎత్తైన వేదిక పైన రాజు గారు కూర్చుని ప్రజల సమస్యల్ని తీరుస్తూ ఉంటారు. అదిగో ఆ కనిపించేదే రాజు గారి అంతఃపురం అప్పట్లో గంధపు చెక్కలు తో నిర్మితమై ఉండేదట. ఇక్కడ చూడండి ఇవి సామంత రాజుల కోసం ఏర్పాటు చేసిన భవనాలు (Guest houses). ఇవన్నీ తాను చెబుతుంటే ఆ పునాదులు పైన నా ఊహాజనిత సామ్రాజ్యాన్ని మనో ఫలకం పైన నిర్మించుకున్నా.. కొంచెం ముందుకు వెళ్ళాము, అక్కడ రాజు గారు మాట్లాడే రహస్య సమావేశ మందిరం అని భూమిలోనికి మెట్లు ద్వారా 10 అడుగులు పైగా లోనికి తీసుకుని వెళ్ళాడు. మధ్యాహ్నం 12:00 అవుతున్నా లోపల అంతా కటిక చీకటి గా ఉంది, ఓసారి ఈ రాతి స్తంభాన్ని తాకండి అని చూపించాడు. చల్లగా , నున్నగా ఉంది. అక్కడ మరో మలుపు తిప్పి రహస్య మందిరంలోకి తీసుకుని వెళ్లి ఇక్కడ రాజుగారు రహస్య సమావేశాలు నిర్వహించేవారు . దీని పైన ఒక నీటితొట్టి ఉంటుంది. ఇక్కడ మహామంత్రి తిమ్మరుసు, రాజుగారు ఇద్దరు కలిసి రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఎదురు ఎదురుగా కాకుండా వెనుకకు తిరిగి కూర్చుని మాట్లాడతారు అని చెబుతూ మరో మార్గం ద్వారా బయిటకు తీసుకుని వచ్చి నాట్య మండపం దగ్గర ఏనుగుల తొండాల పైన చేతితో మోగించి గంట శబ్దం పలికించాడు. మరి కొంచం ముందుకు వెళితే అక్కడ ఒక సుందరమైన మెట్లతో కోనేరు దానికి ఎదురుగా అమ్మవారి దేవాలయం ఉంటుంది అని చూపించాడు. నిజంగా ఆ కోనేరు ఎంతో బాగుంది, ఇది తవ్వకాలు లో బయిట పడింది అంటే. ఈ కోనేటి కి తుంగభద్ర నుంచి రాతి కాలువలు ఉంటాయని వాటిని చూపించాడు. వాటి పక్కనే సైనికులు భోజనాలు చేసే రాతి పళ్ళాలు వాటిలో కూరలు వేసుకోవడానికి గుంటలు కూడా ఉన్నాయి, వాటి పైన కూడా తన చేతితో మోగించి ఇవి కూడా సంగీతం పలికిస్తాయి సార్ అన్నాడు. మా నడక మహా నవమి దిబ్బ వైపు సాగుతుంది. గైడు దేవరాయలు కుటుంబం, ఆయన సంతానం గూర్చి చెబుతూ ఒక పెద్ద నీటి తొట్టె దగ్గర తీసుకెళ్ళి ఇది హోళీ ఉత్సవాలు జరిగే ప్రదేశం సార్. అప్పట్లో ఇక్కడ ఘనంగా హోళీ జరిగేదట. మేము ఎదురుగా ఓ పెద్ద రాతి దిబ్బలాంటి ప్రాంతం వద్దకు వచ్చాం ఇదే మహానవమి దిబ్బ . గైడు "ఇక్కడ దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి, అక్కడ శిల్పాలను గమనించండి విదేశీ వర్తకులను మేలిమి గుర్రాలతో చూడవచ్చు, అప్పట్లో వీళ్ళు ఈ గుర్రాలను మన రాజుగారికి ఇచ్చి మన దగ్గర మణులు, వజ్రాలు మారకం ద్వారా తీసుకుని వెళ్ళేవారట". ఆ మహానవమి దిబ్బ పైన నాలుగు వైపులా అద్భుతమైన శిల్ప కళ ఉంది. బారులుగా సాగుతున్న ఏనుగులు చూడముచ్చటగా ఉన్నాయి. మేము దిబ్బ పైకి చేరుకున్నాం లోకల్ గైడు మాకు వివరంగా చెబుతున్నారు "ఇదిగో సార్ ఇక్కడ రాయల వారు కూర్చుని దసరా ఉత్సవాలను వీక్షించే వారు.కింది రాతి నిర్మాణం ,పైన చెక్కతో చేసిన నిర్మాణం. మనం స్థంబాల గుర్తులను ఇప్పటికి చూడవచ్చు. మహానవమి దిబ్బ సమ్మోహనంగా ఉంది. సాయింకాలం వేళల్లో అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు. గైడు విషయాలు చెబుతూ మమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఇక్కడ చూడండి "ఇక్కడ రాతి తలుపులు ఉండేవి, వాటిని తెరవడం మనుషులు వల్ల కాదు, వాటిని ఏనుగులు తమ తొండంతో తెరిచేవి. మీరు ఇక్కడ రాతి తలుపులు అమర్చిన గుర్తులు చూడవచ్చు, అదిగో కనిపించేవే రాతి తలుపులు అని నేలమీద పరచినవాటిని చూపించాడు". మేము మా లోకల్ గైడుకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పి ఆటో ఎక్కి కమలాపురం వైపు ప్రయాణం మొదలు పెట్టాము.
*********************
రాణిగారి స్నానఘట్టం, కమలాపురం లో అద్భుతమైన మ్యూజియం:
ఆటోలో మరో రెండు నిమిషాలు ప్రయాణించాక రాణి గారి స్నాన ఘట్టం వచ్చింది. ఇది ఒక భవనం లాగా ఉంది. ఆర్చ్ పైన వివిధ రకాలుగా చక్కటి శిల్పాలు చెక్కారు , ప్రస్తుతం ఆ కొలనులో నీరు ఏమీ లేదు . దీనికి కూడా తుంగభద్ర నుంచి రాతి కాలవ మార్గం ఉంది. ఈ కొలను చూస్తున్నంతసేపు అప్పట్లో పెద్ద NTR సినిమాలలో ఈతలు వేస్తూ రాణులు పాటలు పాడతారు కదా ఆ సంఘటనలు కళ్ళముందు మెదిలాయి . కమలాపురం లో భోజనం చేసి మ్యూజియం కి వెళ్ళాము . ఈ మ్యూజియంలో అడుగు పెట్టగానే ఎదురుగా బంగారు రంగులో విగ్రహాలు రాజు శ్రీకృష్ణ దేవరాయలతో రాణులు తిరుమలా దేవి, చిన్నా దేవి ఇరువైపులా మనకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నారు. ఎన్నో పురాతన దేవతా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. నేను జీవితంలో మొదటిసారి తాళపత్రాలను, తామ్ర పత్రాలను ఇక్కడే చూసాను. వాటి పైన రాసింది కన్నడనో, పురాతన తెలుగో పోల్చుకోలేకపోయాను. ఇక్కడ కోంచెం ముందుకు వెళ్ళాక నాకో మంచి విషయం తెలిసింది ఒక బోర్డు పైన తెలుగు, కన్నడ భాషలు లిపి పుట్టుక , లిపిలో వచ్చిన మార్పులు ఒక పెద్ద చార్టులో పెట్టారు , దాని ప్రకారం మన తెలుగు క్రీ.శ 6వ శతాబ్దంలో విష్ణుకుండినులు పరిపాలన కాలంలో లిపిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. తరువాత విజయ నగర రాజుల పరిపాలన లో ఒక్కో రాజు కాలం నాటి నాణాలను చూడటం చాలా ఆనందంగా అనిపించింది, అవి బంగారు రంగులో దగ దగ మెరిసిపోతున్నాయి. మరో గదిలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపకముందు, తవ్వకాలు జరిపిన తరువాత తేడా చూపిస్తూ ఫోటోలను జత చేసారు. వాటిని చూడగానే పురావస్తు శాఖ వారికి నా మనస్సులో ధన్యవాదాలు చెప్పుకొన్నాను. మట్టిలో , రాళ్ళలో కూరుకుపోయిన ఎన్నో ప్రాంతాలను వెళికి తీసి వీటిని మనం అందరూ చూసే భాగ్యం కలిగించారు వారు . మ్యూజియం మధ్య భాగంలో విజయ నగర సామ్రాజ్యం నమూనా (Model View) చాలా అద్భుతంగా ఉంది. నాకు మోహన్ ఇద్దరికీ ఎంతో నచ్చింది. చాలా సేపు గమనించాం ఎక్కడ ఎక్కడ ఏ ప్రదేశం ఉందో ఈ నమూనాలో మనం చూడవచ్చు. ఒక పక్క ఆ నాటి విదేశీ యాత్రికులు విజయనగరం సందర్శించినప్పుడు రాసిన మాటలు కూడా మనం చదవవచ్చు. మ్యూజియం బయిట సందర్శకుల అభిప్రాయాలు రాయమని ఒక పుస్తకం పెట్టారు , నేను నా అభిప్రాయం ఆ పుస్తకంలో ఇలా రాసాను " నాకు హంపి చూడాలనే 20 ఏళ్ళ కల ఈనాడు నెరవేరింది. ఇక్కడ సుందరమైన శిల్పాలు ప్రాణం పోసుకున్నాయి. నాకు హజరా రామాలయం, విరూపాక్ష దేవాలయం, మాతంగ పర్వత అధిరోహణ సూర్యాస్తమయం చూడటం గొప్ప జ్ణాపకాలు ,ఇక్కడ ప్రజలు ఎంతో స్నేహభావంతో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఏకశిలా రథం చూడటానికి బయలుదేరబోతున్నాం"
(ఇంకా ఉంది)