Saturday, 13 March 2021

ఆంధ్రుల తొలి దైవం శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు సందర్శన

 ఒక ప్రదేశానికి చేరుకొని ఆ దృశ్యాలను కనుల నిండా మనసు నిండా నింపుకోవడం ఒక ఎత్తైతే ఆ ప్రదేశానికి చేరుకోవడానికి జరిగే ప్రయాణాన్ని ఆశ్వాదించడం మరో ఎత్తు.. సరిగ్గా మా ప్రయాణం అడుగు అడుగున అధ్బుతంగా సాగింది.


శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఈయన గూర్చి మా అన్నయ్య "ఆంధ్రుల తొలి దైవం" అని చెప్పినప్పుడు జీవితంలో ఓసారైనా సందర్శించాలని 4 సంవత్సరాల క్రిందట అనుకున్నది నేటికి కార్యరూపం దాల్చింది.


ఉదయాన్నే మంగళగిరి నుంచి మా ప్రయాణం మొదలు అయ్యింది. కొల్లూరు నుంచి కృష్ణా ఏరు మధ్యగా నేరుగా శ్రీకాకుళం చేరవచ్చని మా మామయ్య చెప్పారు. కొల్లూరు నుంచి గాజులలంక వైపు మా బండ్లను పరుగులు తీయిచాం, కృష్ణా నది ఒడ్డున ఉన్న  లంక గ్రామాల గుండా మా ప్రయాణం సాగుతోంది. వరదలు వచ్చినప్పుడు  ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారబ్బా, వారి తిండి,బట్ట ,పెంపుడు జంతువుల పరిస్థితుల ఏంటో ఈ ప్రశ్న మనసులో పుట్టింది, ఈ ప్రశ్నను బండి వెనుక ఉన్న శ్రీమతిని అడిగాను. "వరద వచ్చినప్పుడు అందరూ లంకల నుంచి బయిటకు వస్తారు, ఈ విపత్తులను తట్టుకోవడం కష్టమే అంది". ఈలోపుగా బండ్లు ఏటి ఒడ్డున ఆగాయి.కృష్ణా జిల్లా చేరడానికి మార్గం ఎటువైపా అని చేస్తున్నాం.





మమ్మల్ని గమనించిన  ఒక ఆమె "ఇక్కడ నుంచి దారి లేదు, కొంచెం వెనక్కు పోయి కుడి వైపుకు తిరగండి" అంది  తన పాపకు జడ వేస్తూ. ఆమె చెప్పిన ప్రకారం మొత్తానికి నదిలో గుండా కృష్ణా జిల్లా పోయే మార్గం కనిపించగానే మనసు నిండా ఆనందం వేసింది. ఫిబ్రవరి కావడం వలన ఏట్లో నీరు పూర్తిగా ఇంకిపోయింది,  అక్కడ అక్కడ నీటి చలమలు కనిపిస్తున్నాయి. ఏటి మధ్యలో గుండా తాత్కాలిక రహదారి వేశారు, చుట్టు ఇసుక తిన్నెలు ఎండకు వెండి కుప్పలు లా కనిపిస్తున్నాయి.ఏటి మధ్యలో ప్రయాణం భలే అనిపించింది. 10 నిమిషాల్లో ఆవలి తీరానికి శ్రీకాకుళం చేరుకున్నాం. గుడివైపు దారి అడుగుతూ దేవాలయ ప్రాంగణం చేరుకొన్నం.


---------

"గుడి దగ్గర జనం ఎవరు కనిపించడంలేదు , ప్రస్తుతం మూసివేసారేమో బావ" కోటేశ్వర రావు (శ్రీమతి తమ్ముడు) అన్నాడు. అరే స్వామిని దర్శించాలని చాలా ఆతృతగా వచ్చామే, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకున్నా.. గుడి పక్కన ఓ కారు పార్క్ చేసి ఉండటం గమనించి గుడి తెరిచే ఉంటుంది అని గుడి వైపు అడుగులు వేశాం.  లోపలికి ప్రవేశించగానే ప్రశాంతమైన వాతావరణం. మనసు నిండా ఆనందం , ఎన్నాళ్లకి స్వామి దగ్గరకు చేరుకున్నాం అని.



ఆలయ కట్టడాన్ని గమనిస్తూ లోనికి ప్రవేశించి ప్రసన్నంగా ఉన్న ఆంధ్రమహా విష్ణువు దర్శించుకున్నాం.  స్వామిని చూస్తూ అలా ఉండిపోయాం. బయటకు వచ్చి ఆలయప్రాంగణంలో కూర్చొని ఆలయ విశేషాలు చెప్పుకొన్నాం. ఇక్కడే శ్రీకృష్ణదేవరాయులు ఆముక్తమాల్యద రచనకి బీజం పడిందని దాని గుర్తుగా ఆముక్తమాల్యద మండపం నిర్మించారు. పక్కన కాసుల పురుషోత్తమ కవి ఈయన ఈ ఆంధ్రనాయకుని పైన ఆంధ్రనాయక శతకం రచించారు అని విశేషాలు చెప్పుకొని వారి స్మారకాలుగా నిర్మించిన విగ్రహాలు చూసాము. ఆలయ గోడలపైన క్రీ.శ 11 నుంచి 15 శతాబ్దకాలాలు నాటి శాసనాలు ఉన్నాయి. ఇలా గమనిస్తూ ఉండగా పక్కన పురాతన కాలం నాటి మండపం కనిపించింది, అది గమనించి అటు వైపు వెళ్ళాము,  అక్కడ కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన శివాలయం ఉంది, ఎంత నిండుగా ఉందో ఆ ఆలయ కట్టడం. ఈ ఆలయంలో దైవం ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి. ఆలయంలాగా శివలింగం కూడా నిండుగా , చూసే కనులకు కనుల పండుగగా ఉంది. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే పాపాలు తొలిగిపోతాయని అంటున్నారు. దర్శనం ముగించుకుని మనసులో కదిలిన భావాలను స్మరించుకుంటూ, శ్రీమతితో చర్చిస్తూ ఇంటికి చేరుకున్నాం.




ఈ శ్రీకాకుళం గ్రామం(కృష్ణా జిల్లా) ప్రతి తెలుగువారు దర్శించాలి. మన మూలాలను తెలుసుకోవాలి . విజయవాడ నుంచి 45 కి.మీ, మచిలీపట్నం నుంచి 35 దూరాన ఉంది.


- శ్రీనివాస చక్రవర్తి.