"నాన్న నేను మరో రెండు రోజుల్లో మన ఊరు వస్తున్నా" , విజయ్ ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్న రాఘవకు ఫోన్ చేసి చెబుతున్నాడు.
"ఎందుకు నాన్న, మొన్నే కదా నువ్వు హైదరాబాద్ వెళ్ళింది, అప్పుడే వస్తావా" రాఘవ కొడుకుతో.
విజయ్ మరింత ఉత్సాహంతో "నాన్న నాకు మొదటిసారి ఓటు హక్కు వచ్చింది, ఈ ఏడాది నేను కూడా మన దేశభవితను నిర్దేశించే నా ఓటు వేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది".
రాఘవ కొడుకుతో "నువ్వు అంతా దూరం నుంచి ప్రయాణం చేసి రావాల్సిన అవసరం లేదు, నీ ఒక్క ఓటుతో ఇక్కడ ఒనగూరేది ఏమీ లేదు. రానపోను 1500 రూపాయలు ఖర్చు దండగా".
పాపం విజయ్ ఏదో చెబుదామని అనుకున్నాడు, కానీ తండ్రి మాటను కాదనలేక మరేం మాట్లాడలేదు.
విజయ్ లో గోదారిలా ఉప్పొంగిన ఆనందం మొత్తం నురగ లాగా ఒక్క క్షణంలో కరిగి పోయింది.
రాఘవాది ఒక మధ్యతరగతి కుటుంబం,ఊర్లోనే చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు, కూతురులన బాగా చదివించాలని తన ఆశయం.
ఆ ఏడాది ఎలక్షన్స్ పూర్తి అయ్యాయి, విజయ్ తన మొదటి ఓటు వేయలేదని బాద వెన్నంటుతూ ఉంది..
******
(4 సంవత్సరాలతర్వాత)
రాఘవ MLA ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ తో "MLA గారిని కలవాలి, కొంచెం లోనికి పంపండి".
"ఆయన బిజీగా ఉన్నారు మరలా రావయ్యా పెద్ద మనిషి" అని సెక్యూరిటీ చెప్పాడు.
రాఘవ : "అయ్యా , నేను అత్యవసరంగా కలవాలి, దయచేసి ఒక 5 నిమిషాల సమయం అడగండి".
సెక్యూరిటీ తనలో తాను గొనుగుతూ " ప్రతి ఒక్కరూ అర్జెంటు పని అని వస్తారు, ఆయనేమో నన్ను విసుగు కుంటారు ఇటు వీళ్ళకి చెప్పలేక, ఆయనకి చెప్పలేక చస్తున్నాను మధ్యలో నేను" అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
సెక్యూరిటీ లోపలికి వెళ్ళి వచ్చి "MLA గారు రామంటున్నారు, వెళ్లి రండి"
MLA రామలింగం, నల్లటి కారుమబ్బులాంటి దేహం కలవాడు, ఎలక్షన్ సమయంలోనే తప్ప మరలా తన ప్రాంతంను సందర్శించిన సందర్భాలు చాలా తక్కువ,ఏపని చేసినా నాకేంటి అని ఆలోచిస్తాడు.
రాఘవ వెళ్ళేసరికి, రామలింగం ఒక చేత్తో చుట్టను పట్టుకొని ఏవే పేపర్లు చూస్తున్నాడు.
రాఘవ : " నమస్కారం సార్, నా పేరు రాఘవ అండి, మన ఊరి చివరన హైవే పక్కన ఉన్న కొంత స్థలం నాదే అండి, అది మీ అధీనంలోకి తీసుకుంటున్నట్లు విన్నాను. "
MLA రామలింగం చుట్టను పీల్చి గాలిలోకి ఉంగరాలు లాగా పొగను ఊదుతూ "ఎట్టెటా ఆ స్థలం మీదా.. ఐతే ఏంచేద్దాం అంటావ్"
రాఘవ :"దయచేసి మా స్థలం మాకు ఇచ్చేయండి, మధ్యతరగతి వాళ్ళమయ్య, దాని మీదే మేము ఎన్నో ఆశలు ప్రణాళికలు వేసుకున్నాం".
రామలింగం: " నేను ఎట్టా గనిపిస్తున్నానయ్యా నీకు, నీ నోటికాడ కూడు లాక్కునే వాడిని అనుకుంటివా ఏంది, ఇంద లచ్చ రూపాయలు ఇస్తాను, అది నాకు ఇచ్చేయ్".
రాఘవ : " సార్ అది నేను కొన్నప్పుడు రేటు లక్ష, ఇప్పుడు 50 లక్షలు విలువ చేస్తుంది,దయచేసి మాది మాకు ఇప్పించండి.దానిని అమ్మితే వచ్చిన డబ్బుతో మా కూతురు పెళ్లి ఘనంగా చేద్దాం అనుకుంటున్నా".
ఒక్కసారి రామలింగం కళ్ళు చింతనిప్పలు లాగా ఎర్రబడ్డాయి. ఒక ఉదుటున పైకి లేచి బీరువాలోంచి కొన్ని కాగీతాల కట్టలు తీసి రాఘవ ముందేశాడు "చూడరా చూడు నువ్వు ఒక ఎకరం పొలం గూర్చి నాకు చెబుతున్నావు మా తాత సంపాదించి మాకు ఇచ్చిన 40 ఎకరాల పొలంలో 30 ఎకరాలు అమ్మి మీ అందరికీ ఓటుకీ ఇంత డబ్బులు అనీ, వెంట తిరిగిన వాడికి బిర్యానీలనీ,తాగేవాడికి సారాలని ఇప్పిస్తే ఎంత ఖర్చు అయ్యిందో చూడు. అందరూ కలిసి కరిగించారు కాదరా, అదృష్టం బాగుండి కేవలం 3 ఓట్లు తేడాతో గెలిచాను, ఇక ఇప్పుడు 5 సంవత్సరాలు సంపాదించించుకోపోతే ఎలా"
రాఘవ " సార్ అమ్మాయి పెళ్ళి..." అని చెప్పకమందే రామలింగం గద్దించాడు"మర్యాదగా ఈ లచ్చ రూపాయలు తీసుకో, కాదూ కూడదని అన్నావంటే, ఆ పెళ్లి చేయడానికి నిన్ను లేకుండా చేస్తాను" జాగ్రత్త అని బెదిరించాడు.
చేసేదేమీలేక రాఘవ ఇంటి దారి పట్టాడు,
కారుమబ్బులు కమ్మిన సూరీడులా ఇంటికి చేరాడు.
*******
రాత్రి 10:00 గంటలవుతుంది,
రాఘవ ఆలోచనలో మునిగి పోయాడు
"ఏమండీ భోజనం చేయండి" అని రాఘవ భార్య జానకీ చెప్పింది.
రాఘవ :"ఆకలిగా లేదు" .
జానకి : "ఏం ఎందుకండీ మీరు ఆకలిని తట్టుకోలేరు కదా".
రాఘవ : "గుండెలు నిండా బాధల్ని నింపుకున్న మనిషికి, కడుపెలా నిండుతుంది".
జానకి :"ఏమైందండీ?"
రాఘవా కూతురు వేపు చేయి చూపిస్తూ. " ఒక్కసారి అటుచూడు, నా బంగారు తల్లి ఎంత ఆనందంగా ఉందో, మరో కొన్ని రోజుల్లో తన పెళ్ళి ఉందని ఎన్ని కలలు కంటుందో స్నేహితులు అందర్నీ పిలుస్తూ మురిసిపోతుంది. తండ్రిగా ఆడపిల్ల కన్యాదానం ఘనంగా చేద్దాం అనుకొన్నా.
కానీ ఆ రామలింగం ఎంతపని చేసాడో తెలుసా." అని జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు.
జానకి కట్టలు తెంచుకుని వచ్చిన భాదను అదిమి పెట్టి అయ్యో ఎంతపని జరిగిందండీ, "రామలింగం అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి,
మొన్నే మన పక్కింటి కుర్రాడుకు మంచి కాలేజీలో సీటు వస్తే ఈ రామలింగం రికమండేషన్ అని అది వేరేవాళ్ళకు ఇప్పించాడు.
అప్పుడు ఏముందిలే అనుకొన్నాం, పాపం కుర్రాడు అప్పుడు ఎంత బాధపడ్డాడు కదా. ఇప్పుడు ఆ బాధ మన ఇంటిని కూడా వరదలాగా తాకింది,
ఇప్పుడు మరికొన్ని రోజుల్లో పెళ్లి , ఇక మనకు దేవుడే దిక్కు కదా".
********
రాత్రి 01:00 గంట అయ్యింది రాఘవ ఆలోచనలలో రామలింగం మాటలే మెదిలుతున్నాయి "ఇంత ఖర్చు పెడితే నేను గెలిచింది 3 ఓట్లు తేడాతోనే..".
సరిగ్గా 4 సంవత్సరాల క్రితం రాఘవ చేసిన తప్పు గుర్తుకు వచ్చింది, అప్పుడు ఎలక్షన్స్ కి తొలిసారి ఓటు వేయడానికి వస్తాను అన్న కొడుకును ఆపడం, ఎలక్షన్ రోజు ఆఫీస్ సెలవు రోజు అని , వారాంతం అవ్వడం వల్ల రాఘవ కుటుంబ సభ్యులు అందరూ బయటకు విహార యాత్రకు 3 రోజులు వెళ్ళారు, మన 3 ఓటులు వేయకపోతే అయ్యేదేమీలేదని ఓటు వాళ్ళు వేయలేదు, ఇలాగే చాలా మంది ఓటు వేయడానికి రాకపోవడం వల్ల
కేవలం 45% పోలింగ్ నమోదు అయ్యింది.
అందులో 21% వరకు రామలింగం అనుచరులు వలన సాధించాడు.
అందువలన రామలింగం కేవలం 3 ఓట్లతో గట్టెక్కాడు..
రాఘవ నిట్టూరుస్తూ ఇలా అనుకున్నాడు
"ప్రతి దానిని హా ఏముందిలే అని (లైట్) తీసుకొనే స్వభావం మన రక్తంలో ఇంకిపోయింది,
ఏదైనా మన దాకా వస్తనే తెలుస్తుంది,
మనం చేసిన ఒక తప్పిదం , ఒక 5 నిమిషాల సమయం ఓటు వేయడానికి కేటాయించి ఉంటే 5 సంవత్సరాలు మనం ప్రాంతం భవిష్యత్తు బాగుండేది,మరలా ఇలాంటి తప్పు చేయకూడదు, నిజాయితీతో పోరాడే వాళ్ళకి మన ఓటు ఊపిరిగా నిలవాలి" అని ధృడంగా నిశ్చయించుకున్నాడు
***-------------------***
ధన్యవాదాలు.
శ్రీనివాస చక్రవర్తి
10/04/2019