"నాన్న బాగా దాహం వేస్తుంది" అని నేను నాన్నతో చెప్పాను.
"దగ్గర్లో బావి ఉంటుందేమో అక్కడ తాగుదాం" నాన్న చెప్పాడు..
మా ప్రయాణం ఎలా మొదలైందంటే
****
ప్రతి రోజూ మేత మేసి నేరుగా ఇంటికి వచ్చే ఆవు, దూడ ఆరోజు సాయంత్రం అయినా రాలేదు.
సూరీడు ఈరోజు కి ఇక్కడ సెలవంటూ మరోవైపు తన డ్యూటీ చేయటానికి పడమరకు వెళుతున్నాడు.
మసక చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి, నాన్న ఆవుదూడల కోసం పొలం వేపు వెళ్ళాడు.
జాడ దొరకలేదు అంటూ తిరిగి వచ్చాడు.
"అవి ఎక్కడకీ వెళ్ళవు రాత్రికైనా తిరిగి వస్తాయని అమ్మ దైర్యం చెబుతూ భోజనం చేద్దాం" అని అమ్మ చెప్పింది.
నేను "అమ్మ చీకట్లో వాటికి కళ్ళు కనిపిస్తాయా, దారి గుర్తు పడతాయా అని అడిగాను.. "వాటికి కనిపిస్తాయి గానీ ముందు నువ్వు భోజనం చేయి ఈ గాలికి కరెంట్ పోయిందంటే మనకు కళ్ళు కనిపించవు" అంటూ, అమ్మ కిరోసిన్ దీపాన్ని సిద్దం చేస్తుంది ఎందుకైనా మంచిదని.
*****"""
తెల్లారింది అవి ఇంకా రాలేదు,
నాన్న నేను ఇద్దరం తప్పిపోయిన మా ఆవు దూడను వెతకడానికి ఉదయాన్నే బయలుదేరాం. మా ఊరి దగ్గర ఉన్న రెండు రేవుల మధ్యలో గడ్డి మేస్తూ ఉంటాయేమో అని వెతికాం,
అక్కడ కనిపించలేదు, తాడి చెట్టుల వరుసలో ఉన్నాయేమో అని వెతుకుతూ వెళుతున్నాం. ఎక్కడ ఆవులు మంద కనిపించినా నేను పరుగులు తీస్తూ వెళ్ళి చూసేవాడిని అందులో మన ఆవు, దూడ ఉన్నాయేమో అని కానీ ఎడారిలో ఎండమావిని చూసిన వాడిలాగా నిరాశగా వెనుతిరిగే వాడిని అవి కనిపించక.
నాన్న కనిపించిన వాళ్ళకి ఆవు పోలికలు చెబుతున్నాడు,వాళ్ళు ఏమైనా జాడ చెబుతారేమో అని.
సమయం గడిచేకుందుకు ఎండ తీవ్రత పెరిగింది. సూరీడు నడి నెత్తిన నిప్పులు జల్లుతున్నట్లు ఉంది, ఎండకు చెంపలు మాడుతున్నాయి. నా నాలుక దాహంతో ఈ పిడచగట్టుకు పోయింది. అప్పుడు అడిగాను ఇలా "నాన్న దాహం వేస్తుంది" అని..
******
ఊరి చివర ఉన్న ఒక పూరింటి దగ్గర
అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్న ఒక పెద్దామెను నేను మోహమాట పడుతూ అమ్మ కొంచెం మంచినీళ్లు ఇవ్వమని అడిగాను, ఆ ఇళ్ళాలు మా గూర్చి అడిగింది, ఏఊరు ఏం పని మీద వెళుతున్నారు బాబు అని. ఆవు దూడ విషయం చెప్పాము. ఆ కరుణామూర్తి మీరు ఇంత ఎండలో చాలా దూరం తిరిగి నడుచుకుంటూ వచ్చారా ఉండండి అంటూ చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది," కొంచెం సేపు ఉండండి.. భోజనం చేద్దురు బాబు" అని ఆమె అన్నది.
"పర్లేదు అమ్మ మేము సెంటర్ వేపు వెళుతున్నాం అక్కడ టిఫిన్ తింటాం.. " అని నాన్న చెప్పాడు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది మా గూర్చి ముక్కూ మొహం తెలియని ఆమె కేవలం మంచినీళ్లు అడిగితేనే భోజనం చేయమని అంది అని..
వాళ్ళు పూరింట్లో ఉండే పేదవాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ మంచి మనసున్న ధనవంతులు అంటే వీళ్ళు కదా అనిపించింది, ఆమె చదువుకొని ఉండకపోవచ్చు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న సాయం చేద్దామని ఆ మహాతల్లి గొప్ప ఉద్దేశం అయ్యి ఉండొచ్చు..
చిన్ననాటి జ్ఞాపకం అవ్వడం వలన ఆ ఊరిలో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో గుర్తు రావడంలేదు కానీ ఇప్పటికీ ఆ ఊరు వేపు వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకాలు ఆత్మీయులులా వెన్నంటుతూ ఉంటాయి
సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి, నన్ను అడుగుతాయి మరి నువ్వు ఏం చేశావని?
- శ్రీనివాస చక్రవర్తి
31/03/2019