Saturday, 1 March 2025

పానగల్ పురాతన దేవాలయాల సందర్శన - part1



1.పురాతన కట్టడాలు - విజ్ఞాన భాండాగారాలు:

పురాతన కట్టడాలు మన పూర్వీకులు మనకోసం ఏర్పాటుచేసిన విజ్ఞాన భాండాగారాలు. కొన్ని వందల ఏళ్ళనాడు నిర్మించిన కట్టడాలను చూడబోతున్నామంటే నా మనస్సు ఉత్సాహంగా ఉవ్విళ్ళారుతూ ఉంటుంది. ఎన్నో ప్రకృతి విపత్తులను, ఎన్నో దాడులను తట్టుకొని ఈ రోజు కూడా తన ప్రత్యేకతను చాటుతూ మన ముందు ఇలా నిలబడ్డాయంటే ఆ ఆర్కిటెక్చర్ నిర్మించిన ఆ వ్యక్తులను అక్కడి విశేషాలు పొదిగిన శిల్పులను తలుచుకుంటే ఎంతో ప్రేరణగా అనిపిస్తుంది.


2.హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం:

నల్గొండ వద్ద పురాతన ఆలయాలను సందర్శించడానికి శనివారం ఉదయం ఎంతో ఉత్సాహంగా నేను మా మిత్రులు వీరు, వినయ్ మోహన్ మరియు వాళ్ళ మిత్రుడు దుర్గాప్రసాద్ బేగంపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. శనివారం కావడం వలన చాలామంది స్వస్థలాలు వెళ్లడానికి బేగంపేట స్టేషన్ ఆవరణకు చేరుకుని ఉన్నారు. మా అందరి ఎదురు చూపులుకు తెర దించుతూ రైలు పరుగులు తీసుకుంటూ వచ్చి మా ప్లాట్ఫారం మీద ఆగింది . రైలు కన్నా వేగంగా ప్రయాణికులందరూ సీట్ల కోసం భోగిల్లోకి పరుగులు తీశారు. రైలు బండి కిక్కిరిసిపోయింది. మేము నలుగురం ఓ భోగిలోకి చేరి మాటల్లోకి జారుకున్నాం, అంతకు ముందు సందర్శించిన ప్రదేశాలను, భవిష్యత్తులో సందర్శించబోయే ప్రదేశాలను గూర్చి మాట్లాడుకుంటూ ఉండగా మా రైలు నల్గొండకు 9 గంటల సమయంలో చేరుకుంది . రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు విశాలంగా ఉంది,  అది ఈ మధ్యే కొత్తగా వేసినట్లు తారు వాసన సూచిస్తుంది.  రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వెళ్లే దారిలో ఎక్కడైనా ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని నిర్ణయించుకున్నాం‌. అలా వెళ్లేదారిలో ఒకచోట జనం అందరూ తింటుంటే మేము కూడా ఆ జనంలో కలిసిపోయి మా టిఫిన్ లు మొదలుపెట్టాం. నేను ఓ ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుంటూ దుర్గా ప్రసాద్ ని "అసలు మంత్రాలయం యాత్ర ఎలా రెగ్యులర్ గా చేస్తావు , ఆ ప్రయాణం వివరాలు ఏంటి" అని అడిగాను.  తను మంత్రాలయంలో సేవ చేయడానికి  వెళ్తానని. హైదరాబాదులో రాత్రి ట్రైన్ ఎక్కి ఉదయాన్నే మంత్రాలయంలో దిగి ఒక తెప్ప పడవని మాట్లాడుకుని తుంగభద్రా నదిలో స్నానం చేసి, స్వామి వారి దర్శనం చేసుకుని సేవ చేస్తానని తాను చెప్పే విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా అనిపించాయి.


ఈ లోపు మా మిత్రుడు వీరాంజనేయులు ఒక ఆటోని పానగల్లు వెళ్లడానికి సన్నద్ధం చేశాడు. ఆటో నడిపే వ్యక్తి మాతో మాట్లాడుతూ "పానగల్ లో ఊర్లో గుడా  లేదా బయట గుడా ? " అన్నాడు మాకు ఏం అర్థం కాలేదు. "ఛాయా సోమేశ్వరాలయం" అని చెప్పాం "ఓహో బయట గుడా ఎక్కండి " అని మమ్మల్ని తన ఆటోలో ఐదు నిమిషాల్లో అక్కడ దింపాడు. పచ్చని పొలాల మధ్య ఒక ప్రాకారంలో మూడు దేవాలయాలు నిర్మాణం కనిపిస్తుంది .


3. దేవాలయ చరిత్ర - అందమైన కోనేరు: 

పెద్దగా సందర్శకులు తాకిడి లేదు బయట ఏర్పాటు చేసిన బోర్డులో ఆ గుడి యొక్క వివరాలు చదివాము "900 ఏళ్ల క్రితం పానగల్ రాజధానిగా చేసుకుని నల్గొండ ,మహబూబ్ నగర్ పరిపాలించిన కుందూరు చోళులు ఈ దేవాలయం నిర్మించారు" రాసి ఉంది . ఆలయం ఎదురుగా ఓ విశాలమైన కోనేరు అందర్నీ ఆకర్షిస్తుంది. కోనేరు చుట్టూ ఉన్న పచ్చని చెట్లు వరుసగా బారులు తీరు ఆ కోనేరు అందాలను చూస్తున్నట్లుగా ఉన్నాయి. రెండు పాదాలను నీటి లో ఉంచి మెట్లపైన కూర్చున్నాం. కోనేరులో చిన్న చిన్న చేపలు మన కాళ్ల దగ్గరగా వచ్చినట్లు వచ్చి వెళ్తున్నాయి , కొంచెం సేపు అలా కూర్చుని ఆ చేపలను ,కోనేటి నీటిని , చుట్టూ ఉన్న చెట్లను గమనిస్తూ ఆ ప్రశాంత వాతావరణంలో మనసులో మునకలేశాము.

 "ఇప్పుడు ఎండ బాగా ఉంది సాయంత్రం పూట అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అనుకుంటా" అని వీరు అన్నాడు.  


4.దేవాలయ సందర్శన - కనిపించన వింత నీడ :


కొంచెం సేపటికి దేవాలయం వైపు మా అడుగులు పడ్డాయి ప్రాకారం లోనికి ప్రవేశించాము. అక్కడ ఉన్న ఉపాలయాలు మీద పేర్లు రాసి ఉన్నాయి. "వీరభద్ర స్వామి",  "నటరాజ్ స్వామి" అని ఒక్కొక్క పేరు దుర్గాప్రసాద్, వినయ్ చదువుతున్నారు. ఆ గుళ్ళు లోపలికి వెళ్లి చూస్తే దేవత మూర్తులు లేరు . శివరాత్రి పండుగ దగ్గరగా ఉండటం వలన అక్కడ గుడి దగ్గర లైటింగ్ మరియు ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నారు దేవాలయం వారు.


మేము ఆలయంలోకి ప్రవేశించాం. దర్శనంకు వచ్చిన వారు చాలా తక్కువ ఉన్నారు. ఎంతో ఉత్కంఠంగా గర్భాలయంలోకి చూసాము. ముందుగా స్వామి వారిని చక్కగా చూసాము.

తరువాత స్థల విశేషం గుర్తు వచ్చింది. ఆశ్చర్యం!!  నీడ జాడ ఎక్కడ కనిపించడం లేదు.

ఛాయా సోమేశ్వర నీడ ఎక్కడ?

లోపల గర్భ గుడిలో నలుగురు అభిషేకం చేస్తున్నారు గర్భాలయంలో లింగం కిందికి ఉన్నట్లుగా కనిపించింది.  నేను గర్భగుడిలో గోడలను తీక్షణంగా చూస్తున్నాను నీడ ఎక్కడని.

వినయ్ "ఛాయ ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

నాకు కొంచం నిరాశ అనిపించింది, వీళ్ళని ఇంత దూరం ఈ గుడికి ప్రత్యేకత ఉందని తీసుకొచ్చాను,  తీరా చూస్తే ఆ ఛాయ కనిపించడం లేదు ఏమైందబ్బా, అంతకుముందు నా జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటి సినిమా రిల్ లాగా కళ్ళ ముందు క్షణాల్లో మెదిలాయి. 

1. బీదర్లో ఓ గుహలో నీటిలో నడుచుకుంటా వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చని మిత్రులను తీసుకెళ్లి అలాంటి దర్శనం ఆ సమయంలో లేదంటే ఎంతో నిరాశ చెందిన ఘటన.


2. హంపి వెళ్ళినప్పుడు "సంగీతం పలికించే స్తంభాలు ఇప్పుడు తాకనివ్వడం లేదు ,కేవలం దూరం నుంచి చూడడం వరకే , వినే భాగ్యం లేదు ‌. భావితరాల కోసం వాటిని ఇప్పుడు తాకనివ్వడం లేదు" అని గైడ్ చెప్పిన సందర్భం..

ఇలాంటి ఘటనలు గుర్తొచ్చి మరోసారి అలాంటిదేదో పునరావృతం కాబోతుందని మనసులో  నిరాశగా అనిపించింది .


5.చివరికి కనిపించిన నీడ - ఆనందానుభూతి:

అప్పుడు మనసులో ఒక ఆలోచన ఒక లైట్ లాగా వెలిగింది అదే గర్భగుడిలో లైట్ తీసేస్తే మనం నీడ చూడొచ్చు ఏమో అన్న చిన్న ఆశ. అభిషేకం అయ్యాక పూజ చేసే పూజారి గారిని అడుగుదాం అనుకున్నాము. ఆయన రాగానే అడిగాను చాయను చూడగలమా అని , ఆయన క్షణాల్లో గర్భాలయంలోని లైట్ ని ఆఫ్ చేశారు. అప్పుడు చూసాము ఆ అద్భుతాన్ని సరిగ్గా స్కేల్ తో కొలిసి మరీ కొట్టినట్లుగా ఉన్న నల్లటి స్తంభం నీడ స్థిరంగా శివలింగం మీద కనిపించింది . ఆ దృశ్యం చూడగానే మా కళ్ళల్లో ఆకాశంలో మెరుపు మెరిసినట్లుగా ఆనంద ఆశ్చర్యాలతో కాంతి వచ్చి చేరింది. 1000 సంవత్సరాలైనా నీడలో మార్పు లేదు ఇది ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనం అని అనుకుని ఆ శిల్పులకు మనసులో నమస్సులు అందించాము.


6.అందమైన సూక్ష్మ శిల్పాలు - విశేషాలు:



గర్భాలయం ఎదురుగా ఉన దర్వాజా మీద అందమైన శిల్పాలను చెక్కారు, ముఖ్యంగా లతా శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి . ఒక్కసారి తలపైకెత్తి చూశాను అక్కడ ఒక పుష్పం అందంగా వికసించినట్లుగా రేకులను సుకుమారంగా ఉన్నట్లు సీలింగ్ పైన చెక్కారు.


భక్తులు తక్కువగా ఉన్నారని మా మిత్రులు వినయ్ ,దుర్గాప్రసాద్ బయటికి వెళ్లి అభిషేకం సామాగ్రి తెచ్చారు . మేము కూడా మా చేతులతో ఆ స్వామిని అభిషేకించి విభూదిని నుదుటన ధరించి ఆయన ఆశీస్సులు పొందాము. 


గర్భాలయం ఎదురుగా ఉన్న ఒక మండపం మీద స్థంభాలు నల్లటి రాతి మీద చిన్న చిన్న శిల్పాలను చాలా చక్కగా చెక్కారు శిల్పులు. అందులో కొన్ని ఘట్టాలు సీతమ్మవారు అశోకవనంలో కూర్చుని ఉన్నట్లుగా, మరొక ఘట్టంలో రామయ్య మాయ లేడికి బాణం వేస్తున్నట్లుగా ఆ బాణం తగిలి అందులోంచి మరీచుడు బయటికి వస్తున్నట్లుగా చెక్కిన శిల్పాలు నన్ను విశేషంగా ఆకర్షించాయి. ఆలయంలో నెమ్మదిగా సందర్శకులు పెరిగారు దేవాలయ పూజారి ఆలయ విశిష్టతను చూడండి అని లైట్ ఆఫ్ చేసి సరిగ్గా లింగం వెనుక మీద పడుతున్న నీడని చూపిస్తున్నారు. ఒకప్పుడు అసలు ఈ నీడ ఏ స్తంభం నీడ అని చాలా ప్రయోగాలు జరిగాయి అట. సూర్యుని గమనం మారుతున్న ఈ నీడ స్థానం మాత్రం మారదు , సరిగ్గా లింగం పైనే స్థిరంగా నీడ ఉంటుంది అదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అందుకని ఈయన ఛాయా సోమేశ్వరుడు అయ్యారు. కొంచెం సేపు శిల్పాలని మరికొంత సేపు ఆ విశిష్టమైన నీడని చూస్తూ అలా ఒక ప్రపంచంలో ఉండగా. వీరు మాటలు వినపడ్డాయి "మనం ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి" అని. తేరుకుని ఈ లోకంలోకి వచ్చాను. 


7.ఆలయం బయిట - హృదయ విదారక దృశ్యం:

ఆలయం చుట్టూ గమనిద్దామని బయటకు వెళ్లాము. అక్కడ ఉన్న ఆత్మలింగానికి మరియు పక్కనే ఉన్న పుట్టకి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్తుంటే ఒక బాధాకరమైన దృశ్యం కనిపించింది, అవే పూర్తిగా శిథిలమై ధ్వంసం కావించబడినట్లుగా ఉన్న కొన్ని నందులు . "ఇవి దాడి గురి అయిన నందులు అనుకుంటా" అని నేను అన్నాను. మా మిత్రుడు వీరు "అవి శిల్పులు చెక్కేటప్పుడు కొన్ని అనుకున్న విధంగా రావు కదా ఆ నందులు"  అయ్యి ఉండొచ్చని చెప్పాడు. ఏమైనాప్పటికీ వాటిని ఆ స్థితిలో చూసినప్పుడు మనసు తరుక్కుపోయింది. 


8.ఆకర్షించే రెండు అంతస్తుల మండపం , బుజ్జి శివలింగం :



ముందుకు కదిలాము స్వాగత ద్వారాలు గాలిగోపురం బదులుగా ఇక్కడ మండపాలు లాంటి వాటిని ఏర్పాటు చేశారు. గుడి వెనుక ఏర్పాటు చేసిన రెండంతస్తుల మండప ప్రవేశ ద్వారం ప్రత్యేకంగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక బుజ్జి శివలింగం పచ్చని గడ్డి మధ్యలో అందరిని ఆకర్షిస్తూ కనిపించింది. ఓ పసిపాప లాగా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది ఆ చిన్ని శివలింగం.


మేము నలుగురం అ శివలింగం దగ్గర ధ్యానం చేస్తునట్లుగా కొన్ని ఫోటోలు దిగాము. అక్కడ పచ్చికలో కూర్చుని వినయ్ అందిస్తున్న కొబ్బరి ముక్కలు తింటూ దేవాలయం పైకప్పులను గమనించాము.  మూడు గోపుర శిఖరాలు పిరమిడ్ ఆకారాలలో ప్రత్యేకంగా మల్చినట్లు కనిపిస్తున్నాయి . గుడి చుట్టూ గోడల్ని గమనించాము ఏనుగులు బార్లు తీరినట్లుగా శిల్పాలను చెక్కారు. 


9.దేవలయ సందర్శన పూర్తి: 

మరోసారి ఛాయా సోమేశ్వర స్వామికి మనసులో నమస్కరించుకుని దేవాలయం బయట కోనేరు దగ్గరకు తిరిగి చేరుకున్నాం. ఒక వైపు ఎండ వేడిమికి బాతులు కోనేరులో చేరి ఈత కొడుతున్నాయి. మరోవైపు అప్పుడే పెళ్లి కాబోతున్న కొత్తజంట అనుకుంటా డ్రోన్ కెమెరాకి ఫోజులిస్తూ కోనేరు దగ్గర ఫోటోలు దిగుతున్నారు. దేవాలయం వారు ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయి వద్ద నీరు తాగి మరో దేవాలయం వైపు బయలుదేరాము. దుర్గాప్రసాద్ అన్నాడు "పచ్చని చేల మధ్య ఎంతో అందంగా ఉంది ఈ గుడి అని" వెను తిరిగి చూసాను మూడు తెల్లని ముద్దు కర్పూరాలు ఆ ఎండలో పచ్చని చేల మధ్య ప్రకాశిస్తున్నట్లుగా వాటి మీద ఓ కాషాయం రంగు జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ కనిపించింది.


ఇప్పుడు మా అడుగులు పచ్చల సోమేశ్వర దేవాలయం వైపు వేగంగా పడుతున్నాయి. 


ఆ ఛాయా సోమేశ్వర నీడని ఈ వీడియోలో చూడవచ్చు:


(ఇంకా ఉంది)