ఒక మంచి పుస్తకం.
ప్రయాణాలు చేయడం వల్ల హృదయాలు వికసిస్తాయి.
సాహిత్యంలో యాత్రా సాహిత్యానిది ఒక ప్రత్యేకమైన స్థానం, యాత్ర కథనాలు చదువుతున్నప్పుడు మనం కూడా ఆ రచయిత చేయి పట్టుకుని టైం మిషన్ లో ఆ దేశ, కాలానికి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. ఆనాటి ప్రజల యొక్క జీవన విధానం, ఈనాటితో పోల్చుకుంటే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
రచయిత జానకమ్మ గారు 1873 వ సంవత్సరంలో ఒక నెలరోజుల పాటు సముద్ర యానం చేసి ఇంగ్లాండ్ చేరుకుంటారు. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం అంటే ప్రజల్లో ఒక రకమైన భయం ఉండేది ,ఎందుకంటే సముద్ర యానం చేసిన వారికి కుల బహిష్కరణ జరగడం, సముద్రం పై ప్రయాణం చేయడం వల్ల సముద్రానికి కోపం వస్తే ఓడల్ని మింగేస్తుందని ఆరోజుల్లో నమ్మేవారు. దాని వలన చాలామంది ఇలాంటి ప్రయాణాలకి దూరంగా ఉండేవారు, సముద్ర ప్రయాణానికి జానకమ్మ గారు సిద్దమైనప్పుడు బంధువులు, మిత్రులు ప్రయాణం మానుకోమని ఎంత చెప్పినా గానీ ఆమె ధైర్యం చేసి భర్తతో పాటు ఇంగ్లాండ్ ప్రయాణం అవుతారు.
ఓడ ప్రయాణం ఎలా ఉంటుందో ఓడలో దూరాన్ని ఎలా లెక్కిస్తారు ,దిక్సూచి ఎలా పనిచేస్తుందో అందరికీ అర్థమయ్యే రీతిలో సులువుగా వివరించారు. నెలరోజుల సముద్ర ప్రయాణంలో వివిధ దేశాల మీదుగా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు ఓడలో ఇంధనం (బొగ్గు) అయిపోయినప్పుడు నింపుకోవడానికి ఓడ కొన్ని గంటల పాటు లంగరు వేస్తుంది, ఆ సమయంలో ఆగిన ప్రదేశంలో సందర్శించి అక్కడ విశేషాలను వింతలను వివరించారు.
1873 సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ చేరుకున్నాక అక్కడ ప్రజల యొక్క జీవన విధానాన్ని, ముఖ్యంగా ఆ దేశ స్త్రీలందరూ చదువుకొని ఉండటం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మన స్త్రీలు కూడా ఇలాగే చదువుకుని అభివృద్ధిలోకి రావాలని ఆశించారు. ఇంగ్లాండ్ లో ఉన్న వివిధ రకాల కట్టడాలు, అక్కడ శాస్త్ర విజ్ఞానం కళలు గూర్చి వివరిస్తూ, మన వాళ్లు కూడా విజ్ఞాన సంపాదించి పురోగతిని సాధించాలని ఆశించారు. ఈ యాత్రా కథనం అంతా కూడా ఒక కథలాగా ఆసక్తికరంగా సాగుతుంది.
ఆ కాలంలో లండన్ ప్రజలు యొక్క జీవన విధానాన్ని వివరిస్తూ వారి ఇల్లు యొక్క తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయని ఆశ్చర్యపోతూ చెబుతూ ఎవరైనా లోపలికి రావాల్సి వస్తే బెల్ కొట్టాల్సి ఉంటుందని రచయిత చెప్పారు. కానీ ఇప్పుడు అదే విధానం మనం కూడా అవలంబిస్తున్నాం.
అక్కడి భూగర్భ మార్గంలో రైల్లో ప్రయాణం , మేడమ్ టుస్సాడ్ మైనం బొమ్మల ప్రదర్శన, ఆరోజుల్లో విద్యుత్ లేదు కదా గ్యాస్ లైట్లు ఇళ్లల్లో, వీధుల్లో గొట్టాల ద్వారా కనెక్షన్ ఇచ్చేవారట, వాటికి మీటర్ బిగించి దాని ప్రకారం బిల్లు వసూలు చేసేవారని చెప్పారు. గుర్రాలు లాగే క్యాబ్ లు ,బస్సులు గూర్చి వివరిస్తూ అప్పటి రవాణా సౌకర్యాలు గూర్చి భలే చెప్పారు. రోజంతా కష్టించి పనిచేసిన ప్రజలు వినోదం కోసం సాయంత్రం నాటకాలకు వెళ్లేవారట, ఒకేసారి 5000 మంది కూర్చుని చూసి సామర్థ్యం ఉండే నాటక శాలలు ఆ రోజుల్లో ఉన్నాయని చెబుతుంటే చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగించింది.
సమయం, ధనం ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఇంగ్లాండ్ సందర్శించాలని అక్కడి విజ్ఞానం చూసి ప్రేరణ పొందాలని రచయిత విన్నవించుకున్నారు.