Thursday, 12 September 2019

ఒక ఊరు - ఒక గణపతి - 20 వసంతాలు

ఒక ఊరు - ఒక గణపతి - 20 వసంతాలు

గణేష్ నవరాత్రులు..
ఈ పేరు  వింటేనే  గుండెల్లో ఎంతో ఆనందం..

సరిగ్గా 20(1998-1999) సంవత్సరాల క్రితం మా ఊరిలో వినాయక చవితి ముందు రోజు అనుకుంటా తొలిసారి గణపతి విగ్రహం తెచ్చారు. పిల్లలం అందరం ఉరుకులు పరుగులు మీద  గుడి అరుగు దగ్గరకు చేరుకున్నాం. వినాయకుడి విగ్రహాన్ని కింద నుంచి పైవరకు ఎంతో వింతగా కొత్తగా చూసాం..

వినాయక చవితి ఉదయాన్నే ముందుగా నల్లమట్టితో  గణపతి బొమ్మని కొని,పిల్లలు ఊర్లో ఉన్న రకరకాల పువ్వులు, ఆకులు నిధుల వేటకు భయలుదేరేవాళ్ళం. ఎర్రటి కాగితం పూలు, పసుపు పచ్చని గన్నేరు పూలు , చెరువు గట్టుకు చేరుకుని తెల్లని కలువపూలు కొన్ని కోసుకొని, వీలైతే ఒక కలువ పువ్వుని ధండలాగా అల్లుకుని మెడలో వేసుకుని ,మామిడి చెట్లకు చేరుకొని మామిడి ఆకులు కోసుకొని, వచ్చే దారిలో గట్టుపైన గరికను తీసుకుని అరే గరిక అంటే వినాయకుడు ఎంత ఇష్టమో తెలుసా అని అనుకునే వాళ్ళం. నేనైతే ఆయనకు అన్నీటికన్నా కుడుములు అంటే ఎంతో ఇష్టం అనే వాడిని ( మా లాగు మిత్రులు అందరూ నన్ను నీకూ అంతేగా అనేవారు). ఇలా మాటలు చెప్పుకుంటూ రకరకాల పువ్వులు ఆకులు గోతాములో వేసుకుని ఇంటికి చేరుకునే వాళ్ళం.

ఇంట్లో వినాయకుడిని పూజకి సిద్ధం చేసి సంచిలోంచి కొన్ని పుస్తకాలు తీసి, పసుపు కుంకుమ రాసి " శుక్లాంబరధరం " చదివేసి , అమ్మ చేసిన కుడుములు , పాయీసం స్వామికి సమర్పించి‌‌.. తర్వాత మనంకూడా లాగించేసి‌‌. లాగు రెండు జేబుల్లో రెండేసి కుడుములు పెట్టుకుని , పక్కింటి వెళ్లి వాళ్ళకి టీవీ ఉంటే అక్కడి అరుగు మీద కూర్చుని ఒక చేత్తో కొబ్బరి మరో చేత్తో కుడుములు రెండింటినీ కలిపి ఆశ్వాదిస్తూ టీవీలో వేసే వినాయకుడు సినిమా చూస్తుంటే భలే ఉండేది.

సాయింత్రం చీకటి మసకలు కమ్ముకోగానే గుడి దగ్గరకు బయలుదేరుతుంటే అమ్మ " ఈ రోజు చందమామను చూడొదయ్య". అని చెప్పేది. పిల్లలం అందరం గుడి వద్ద గుమ్ముగూడేవాళ్ళం.  ముఖ్యంగా పెద్దవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఒకచోట చేరి ఆత్మీయంగా వరసలతో(అన్నయ్య, బావ) పిలుచుకుంటుంటే అది చూసే పిల్లలమైన మాకు మనది అందరిదీ ఒక ఊరే కాదు, మనది అందరిదీ ఒకటే కుటుంబం , మనస్సులో మనమంతా అన్నదమ్ములం అని కలిగే భావన భలే ఉండేది. ఆ భావం అందరి మనస్సులను ఒక్కటిగా చేసేది.

ఒక వైపు పెద్దలు అందరూ పోటాపోటీగా భజన పాటలు అందుకునేవారు. పిల్లలం అందరం కొంచెం సేపు భజన చేసి తరువాత అందరం కలిసి గుడికి అలంకరించిన రంగు రంగు దీపాల వెలుగులో దొంగా పోలీస్ అటలు ఆడుతూ ఉంటే, ఆ రెండు గంటల సమయం రెండు నిమిషాలులా గడిచేలోపు హారతి పాట మాకు హారన్ లా వినిపించే సరికి ప్రసాదాలు పెట్టే సమయం అయ్యింది అని, లేగదూడలలా అందరం గుడి ఆవరణలోకి ఒక ఉదుటున చేరుకునేవాళ్లం. చలిమిడి, కుడుములు, వడపప్పు, శనగలు రకరకాల ప్రసాదాలు కడుపారా ఆరగించి కాగితాలలో లేదా కొబ్బరి చిప్పలలో కొంత ఇంటికి తీసుకుని వెళ్ళేవాళ్ళం..

11 రోజులు గడిచిన తరువాత అసలు ఘట్టం వినాయకుడి నిమజ్జనం. ఎడ్లబండి పైన కొబ్బరి మట్టలతో చిన్న పందిరిలా అల్లి వినాయకుడుని పూల దండలతో అలంకరించి , పెట్రోమాక్స్ బల్బుల వెలుగులలో భజనతో ఊరేగింపు మొదలు అయ్యేది, ఇంటింటికి దేవుడిరాక.ఒక వైపు ప్రతి ఇంటి ముందు హారతి తీసుకుని గణపతి ఆశిస్సులు అందిస్తు ఉంటే,  మరోవైపు డప్పు కళాకారులు చేసే వైవిద్యమైన   ప్రదర్శనకు అందరం ఆడిపాడుతూ ఊరంతా ఉత్సవమై ఉత్సాహంగా ప్రదర్శన ముందుకు సాగుతుంది. ఉదయం అయ్యేసరికి ఊరేగింపు పూర్తి చేసుకుని తిరిగి గుడి దగ్గరకు గణపతి చేరుకునేవాడు..
సాయంత్రం అందరం కలిసి ట్రాక్టర్ లలో నిమజ్జనానికి పెనుమూడి కిష్ట(కృష్ణా) దగ్గరకు చేరుకుంటాం.. "ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి" అని మైకులో చెప్పేవాళ్ళు. కొంతసేపటికి "జైబోలో గణేష్ మహరాజ్ కి" అంటూ గణపయ్యను గుడి నుంచి తన తల్లి (గంగమ్మ) ఒడిలోకి చేర్చుతారు.. అందరూ కృష్ణమ్మకు నమస్కరించి స్నానాలు చేసాక,మైకులో నుంచి "ట్రాక్టర్ బయలుదేరుతుంది. అందరూ ఒడ్డుకు రావాలి".
ఎంతో ఉత్సాహంతో బయిలుదేరిన ట్రాక్టర్లు నిశబ్దంగా తిరిగి ఇంటికి చేరతాయి.
తర్వాత రోజు మా బడి పక్కన ఉన్న గుడిని చూసినప్పుడు చాలా బాధ వేసేది. గణపతి లేడు , ఊర్లో సందడి లేదు అని. ఇక మరలా 365 రోజులు లెక్కించే వాళ్ళం.

ఈ రోజుకు కూడా మేము ఆనందించే విషయం మా ఊర్లో ఏంటంటే . 20 సంవత్సరాలు అయ్యింది గణపతి మా ఊరులో అడుగు పెట్టి.
ఇప్పటికీ ఒకటే ఊరు - ఒకటే గణపతి .

ఇలా నవరాత్రులు పెద్దలకు, పిల్లలకు పండుగ తీసుకొని వచ్చేది, ఐక్యమత్యం విల్లివిరిసేది.

-శ్రీనివాస చక్రవర్తి
12/09/2019